మేనల్లుడు-18

0
3

[సౌమ్య పరిస్థితి చూసి ఇంటికి వచ్చకా, అమృత, వివేక్ మాట్లాడుకుంటారు. అర్జంటుగా వేరే పెళ్ళి చేసుకోమని అమృత వివేక్‌ని అడుగుతుంది. సౌమ్య బిడ్డను గుర్తు చేసుకుంటూ, తను వివేక్‍ని పెళ్ళి చేసుకుంటే తమకూ అలాంటి లోపాలున్న బిడ్డ పుట్టే అవకాశం ఉందని భయపడుతుంది అమృత. అయితే వివేక్ అమృతకి ధైర్యం చెబుతాడు. తనకి అమృతని పెళ్ళి చేసుకునే ఉద్దేశం లేదని -చిన్నప్పటి నుంచి పెంచిన అభిమానం తనదని అంటాడు. మావయ్య కాస్త కోలుకున్నాకా ఆయనకి నచ్చజెప్పవచ్చు అంటాడు. దివ్య గుర్తుకు వస్తుంది వివేక్‌కి. ఆమెను తలచుకుంటాడు. సౌమ్య గురించి ఎక్కువగా ఆలోచిస్తూ, మనసుని  బాధ పెట్టుకుంటుంది అమృత. పిన్ని వాళ్లింట్లో ఎక్కువ రోజులు ఉండలేకపోతుంది దివ్య. వివేక్ తనని  మోసం చేయలేదని, మావయ్య అంటే ప్రాణం కాబట్టి, ఆయన మాట కాదనలేక దివ్యతో పెళ్ళికి ఒప్పుకున్నాడని అనుకుంటుంది. తనని మర్చిపోవడానికి ప్రయత్నించాలని అనుకుంటుంది. చిన్నప్పుడు తాతయ్య చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటుంది. పడిలేచిన కెరటంలా, తను మామూలు కావాలనుకుంటుంది. తాతయ్యకి ఫోన్ చేసి వచ్చేస్తున్నాను అని చెబుతుంది. – ఇక చదవండి.]

[dropcap]“వి[/dropcap]వేక్!.. నీతో కొంచెం మాట్లాడాలిరా!..” అన్నాడు సునీల్.

ఆశ్చర్యంగా చూసాడు వివేక్.

కొంచెం ఇబ్బందిగా అన్నాడు సునీల్.

“నీల్!.. ఏంటిరా!.. ఎప్పుడు లేనిది.. క్రొత్తగా మాట్లాడుతున్నావ్? పర్మిషన్ అడుగుతున్నావు ఏమిటిరా?..”

“ఎందుకా?.. నీ పర్సనల్ విషయంలో నేను.. ఇంటర్‌ఫియర్ అవుతున్నానందుకు! దివ్య.. దివ్య పాపం రా, మధ్యలో పి.హెడ్.డి వదిలేసి, తాతయ్యను కూడా వదిలేసి అందరికి దూరంగా వెళ్ళిపోయింది. నువ్వంటే దివ్యకి ప్రాణం రా.. మేమందరం.. వివేక్‌కి ప్రపోజ్ చెయ్యి.. ఎవరో ఒకరు ముందుడుగు వేయాలి.. ఇలా ఎన్నాళ్ళు అంటే.. లేదు.. లేదు.. నేనా పని చెయ్యను. ముందు పి.హెచ్.డి అయి, తన డ్రీమ్ నెరవేరాలి. ఎటువంటి disturbance వివేక్‌కి ఉండకూడదు.. అయినా వివేక్ నాకు ఎదురుగా ఉండగా, తను గుర్తు వచ్చినప్పుడల్లా ఫోను చేసి మాట్లాడుతున్నప్పుడు ప్రపోజ్ చేయనక్కరలేదు అంది. అందరం ఆశ్చర్యపోయాం!..

ఇదెక్కడి లవ్?.. ఇప్పటి దాక ఇలాంటి లవ్ మేమెక్కడా చూడలేదు.. ఒకరితో ఒకరు I love you అని చెప్పుకోరు, ప్రపోజ్ చేసుకోరు.. కాని మీ ఇద్దరూ ఒకరిని ఒకరు ఇష్టపడతున్నారు.. అఫ్‌కోర్స్ దాన్నే లవ్ అంటున్నారు..”

అని తనే మాట్లాడుతూ..

“After all.. ఫేస్‌బుక్‌లో పరిచయం.. ఆ అమ్మాయిని నేను ఎంతో ఇష్టపడ్డాను.. ఎంతో try చేస్తేగాని ఫ్రెండ్ రిక్వెష్ట్‌కి అంగీకరించలేదు ఎప్పుటికో తను అంగీకరించింది, నన్ను ఇష్టపడుతుంది.. అంటే నేను ఆ అమ్మాయని ప్రేమిస్తున్నట్లు తను నన్ను ప్రేమిస్తుందని పొంగిపోయాను.. ఇక మేము ఇద్దరం మాటాడుకోవచ్చు.. మా పెళ్ళి పెద్దవి నువ్వే.. ఎందుకంటే మా వాళ్ళు వచ్చి వాళ్ళతో మాట్లాడలేరు. మా పెళ్ళి అయ్యేలా చూడమని వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడమని నిన్ను అడుగుదామనుకున్న రోజునే.. ఇండియా నుండి ఫోను వచ్చిందని.. నువ్వు వెళ్ళిపోయావు.”

“ఈ సోదంతా ఎందుకు చెబుతున్నానంటే.. మేమిద్దరం ఒకరిని ఒకరు చూసుకోలేదు.. ఒకరి గురించి ఒకరికి ఏమీ తెలియదు.. ఆ అమ్మాయి ఫేస్‌బుక్ ఎకౌంట్ క్లోజ్ చేసింది.. తను ఏమయింది? ఏం జరిగింది?.. అన్న బాధలో పిచ్చివాడినవుతున్నాను.. మనసులో ఒకసారి ప్రేమ ఏర్పడ్డాక.. అది దూరం అయితే ఎంతో హెల్! అని నాకు అర్దమయింది.”

“నీతో ఇన్ని సంవత్సరాలు కలిసి తిరిగిన దివ్య, నిన్ను ప్రేమించిన దివ్య.. నీలా అంత త్వరగా.. వేరే అబ్బాయిని పెళ్ళి చేసుకోదురా” అన్నాడు.

సునీల్ చెంప చెళ్ళు మంది.. సునీల్ చెంపని కొట్టిన చేతి వైపు ఒక్క క్షణం చూసి గభాలున సునీల్‌ని కౌగిలించుకొని బాధగా కళ్ళు మూసుకున్నాడు వివేక్.

వెక్కిళ్ళు పెడసాగాడు.. కళ్ళ నుండి కన్నీళ్ళు.. జలజలా కారుతూ.. సునీల్ భుజం తడవడం చూసి..”వి.వీ!.. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ప్. సారీ రా! .. I am very sorry..” అని తిరిగి బలంగా వివేక్‌ని కౌగిలించుకొని..

“నీ బాధ అర్ధం చేసుకోగలనురా!.. ఎందుకంటే నేను.. ఆ బాధలోనే ఉన్నాను..” అన్నాడు సునీల్.

ఆడవాళ్ళు కన్నీరు పెట్టినంతగా.. ఏ మగాడు కన్నీళ్ళు పెట్టడు.. ఎంత బాధ అయినా భరించే శక్తి గుండెకి ఉంటుంది..

“నీల్!.. నేను.. ఒక్క అమ్మూ దగ్గర తప్ప.. మిగిలిన సమయం అంతా నరకం అనుభవిస్తున్నాను.. ఇప్పటికే అమ్ము డిప్రషన్‍లో ఉంది.. అమ్మూ నా ప్రాణం.. ఎందుకంటే అమ్ముని ఈ చేతులతో పెంచాను.. ఆకలేస్తే తినిపించాను.. ఏడిస్తే ఈ చేతులతో కన్నీళ్ళు తుడిచాను, ఆడించాను, జోకొట్టాను.. అలాంటి నేను.. ఈ చేతులతో ఆమె మెడలో తాళి ఎలా కట్టనురా? తప్పని పరిస్థితులలో మావయ్యని బ్రతికించడం కోసం నేను తలవంచాను.. అమ్మూ కూడా అంతే! ..”

“నాకు ఒకటి అర్థం అయిందిరా.. మన ప్రాణం దగ్గర నుండి.. ఏదీ కూడ మన చేతుల్లో లేదని నాకు అర్థం అయింది.”

“విధి ముందు అందరూ నిస్సహాయులం అని అర్థమయింది.”

“కాని మనిషిగా నాలో ఒక చిన్న ఆశ ఉంది.”

“మావయ్య చావుతో పోరాడుతున్నాడు.. ఏదైనా అద్భుతం జరిగి.. కొంచెం అయినా మావయ్య కోలుకుంటే, పరిస్థితిని అర్థం చేసుకునే సమయం వస్తుంది ఏమో అని ఆశపడుతున్నాను.. ఇలా అనుకోవడం ఆశే కావచ్చు.. మనిషి ఆశాజీవి కదా!” అన్నాడు బాధగా వివేక్..

గభాలున వివేక్‌ని గట్టిగా హగ్ చేసుకొని, “సారీ రా!.. ఇన్నాళ్ళ స్నేహంలో.. నిన్ను అపార్థం చేసుకున్నందుకు సిగ్గుపడుతున్నాను. నువ్వు చెప్పింది కరక్టే.. కొన్నిసార్లు.. మనిషి చేతిలో నుండి పరిస్థితులు చేజారిపోతాయి. మనం చూడడం, బాధపడడం తప్ప ఏం చేయలేం!” అన్నాడు సునీల్ .

***

‘మామూ ఇంకా రాలేదు ఏమిటి? బోరు కొట్టేస్తుంది.. ఎంతకని టి.వి చూడడం.. మామూ ఫ్రెష్ అయినాక.. ఏదైనా మాల్‌కి వెళ్ళాలి.. కాసేపు తిరిగి రావచ్చు..’ అని ఎదురు చూడసాగింది అమృత..

సమయం దొర్లుతున్నా.. వివేక్ రాకపోవడంతో ఏదో గుర్తు వచ్చిన దానిలా గభాలున ఫోను తీసి ‘పాపం సౌమ్య ఎలాగుందో?’ .. అని ఫోను చేసింది.

ఫోను ఎత్తిన పవన్ హాలో అన్నాడు..

“పవన్ గారూ!.. నేను.. అమృతని.. ఇప్పుడు సౌమ్య పరిస్థితి ఎలా ఉంది?.. ఏమైనా కొంచెం అయినా, మెరుగు పడిందా?.. నాకు దానిని చూడాలని ఉంది” అంది.

సమాధానం రాకపోవడంతో కంగారుగా అంది అమృత.

“మాట్లాడరేమిటండి? సౌమ్య బాగుంది కదా? మాట్లాడండి.. మీరు అలా మౌనంగా ఉంటే నాకు కంగారుగా ఉంది.. చెప్పండి పవన్ గారూ..” అంది అమృత..

“అదీ.. అదీ.. సౌమ్య.. నిన్ననే ఇండియా వెళ్ళిపోయింది.. వాళ్ళ పేరంట్స్ వచ్చి తీసుకువెళ్ళారు..” అన్నాడు.

“ఏంటి.. సౌమ్య ఇండియా వెళ్ళిపోయిందా? ఎప్పుడు వస్తుంది?” అంది.

“తన పరిస్థితి బాగుపడే వరకు ఒక్కదాన్ని ఒంటరిగా ఉంచడం చాలా ప్రమాదం.. ఏదైనా జరగవచ్చు అన్నారు డాక్టర్లు” అన్నాడు పవన్..

“ఏంటండి? మీరు చెబుతున్నది ఏమిటో నాకు అర్థం కావడం లేదు.. ప్రమాదం అంటున్నారు, ఏదైనా జరగవచ్చంటున్నారు..”

“ఏం చెప్పను అమృతగారూ!.. సౌమ్య పరిస్థితి ఘోరంగా తయారయింది.. మొన్న.. ఫ్యాన్‌కి హ్యాంగ్ చేసుకోవడానికి అన్ని రెడీ చేసి, ఆనక.. బాబుని చెంపేయాలని డిసైడ్ చేసినట్లుంది.. అర్ధరాత్రి బాబు పీక పట్టుకొని చంపబోయింది.. నాకు మెలుకవ వచ్చింది. కాబట్టి సరిపోయింది.. తన నుండి బాబుని కాపాడి.. బలవంతంగా గదిలో ఉంచుదామని తీసుకు వెళ్ళి.. ప్యానుకు వెళాడుతున్న చీర చూసి ఫాకైయ్యాను.. నేను అనుకోవడం.. బాబుని చంపి, తను సూసైడ్ చేసుకోవాలనుకుంది ఏమో అనిపించింది..”

పవన్ మాటలకి అమృత కళ్ళల్లో నుండి నీళ్ళు చెంపల మీదగా జారసాగాయి.

“ఇప్పుడు.. ఇప్పుడు సౌమ్య ఎలా ఉంది?” అంది కంగారుగా అమృత.

“తన మైండ్‌సెట్ ఏం బావుండలేదు.. ఏ నిమిషం.. తను ఎలా ఉంటుందో చెప్పలేం.. సైకియాట్రిస్ట్ వ్రాసే మందులు వాడుతూ.. తన దగ్గర ఎప్పుడూ ఒక మనిషి కనిపెట్టుకొని ఉండాలి అని.. డాక్టర్లు చెప్పారు.. ఈ పరిస్థితిలో నేను ఆఫీసుకి వెళితే.. సౌమ్య ఒక్కదానిని ఇంట్లో ఉంచడం ప్రమాదకరం అని వాళ్ళ పేరెంట్స్ వచ్చి తీసుకువెళ్ళారు.” అన్నాడు పవన్..

నోట మాట రాలేదు అమృతకి.. బలవంతంగా నోరు పెగిల్చి.. “సారీ.. సారీ.. పవన్ గారూ.. ఉంటాను” అని ఫోను పెట్టేసింది..

లాక్ ఓపెన్ చేసి లోపలికి వచ్చిన వివేక్‌ని చూసి గభాలున వెళ్ళి వివేక్ గుండె మీద వాలిపోయి వెక్కి వెక్కి ఏడ్వసాగింది అమృత..

“అమ్మూ!.. ఏం జరిగింది? ఎలా ఉంది? ఇండియా నుండి ఫోను వచ్చిందా?..” అన్నాడు కంగారుగా వివేక్.

ఏదో గుర్తు వచ్చిన దానిలా గభాలున భయంగా కంగారుగా వివేక్ మొఖం లోకి చూసి దూరంగా జరిగి.. గదిలోకి పరిగెత్తి రెండు చేతుల మధ్య మొఖం దాచుకొని ఏడ్వసాగింది..

కంగారుగా దగ్గరకు వెళ్లి “అమ్మూ!.. ఏమయింది? ప్లీజ్! చెప్పు” అని భుజం మీద చెయ్యి వేయగానే గభాలున విసురుగా చెయ్యి తీసి, గబగబా కప్‌బోర్డు దగ్గరకు నడిచి, పెట్టే తీసి డ్రస్‌లు, చీరలు సర్దుకోవడం చూసి ఏదో స్ఫురించిన వాడిలా “ఛ!.. ఫూల్‌ని..” అని గభాలున సెల్ తీసి ఇండియాకి ఫోను చేసి.. “అమ్మా!.. మావయ్యకి ఎలా ఉంది? నా ఫ్రెండ్ డాక్టర్ మురారిని ఏ అవసరం వచ్చినా మీరు ఫోను చేయగానే రమ్మని చెప్పాను కదా?.. మొన్నే మురారితో మాటాడాను.. మావయ్య బాగానే ఉన్నాడని చెప్పాడు.. సరే! నేను వస్తున్నాను..” అని వివేక్ అంటుండగానే..

కోపంగా అంది అమృత.. “మామూ!.. నువ్వెందుకు?.. నువ్వు రావద్దు. నేను ఒక్కదానినే వెళతాను..”

ఆశ్చర్యంగా అన్నాడు వివేక్.. “నేను రావద్దా?”

“అవును రావద్దు.. వాళ్ళు బుద్ధి లేకుండా నీతో వెళ్ళమంటే.. ప్రస్తుత పరిస్థితిలో నువ్వు నాతో రావడం బెటర్ అంటే.. ఆలోచించకుండా వచ్సాను.. మా వాళ్ళు.. ఎప్పుడు పడితే అప్పుడు.. పెళ్ళి.. పెళ్ళి అని మాట్లాడుకోవడం వినలేక వచ్చేశాను.. కాని.. ఇక్కడకు వచ్చాక.. మనం.. మన కోసం కాకుండా.. వాళ్ళ కోసం పెళ్ళి చేసుకోవడం.. చాలా పెద్ద mistake అని తెలిసింది.”

“మా నాన్న అంటే నాకు ప్రాణం అని అందరికి తెలుసు.. అలాగే మా నాన్నకి నాతోనే తన ప్రపంచం అని తెలుసు..”

“కాని ఒకరంటే ఒకరికి ప్రాణం అయినప్పుడు.. ఒకరు ప్రాణం పోయే స్థితిలో మృత్యువుతో పోరాడుతూ, మరొకరు మనసుని చంపుకొని.. ఆత్మీయుడు కన్నా ఎక్కువగా అభిమానించే మనిషిని పెళ్ళి చేసుకొని.. ప్రాణాలతో ఉండగలనా అని భయపడుతూ పెళ్ళి చేసుకునే బదులు.. నాన్నకి నిజాన్ని చెప్పేయాలని ఇండియా వెళుతున్నాను..”

“మావయ్యకి కృతజ్ఞత చూపెట్టాలంటే మన పెళ్లి పరిష్కారం కాదు వి.వీ.. ఈ రోజు పెళ్ళవుతంది. తరువాత first night అంటూరు.. కొద్ది రోజుల తరువాత.. ఎప్పుడిస్తావు పసిబిడ్డను?.. అని అంటారు.”

“వి.వీ!.. ఒక్కటి గుర్తు పెట్టుకో!.. ఒక్కసారి పరిస్థితులకు తల వంచితే.. ఇక బ్రతికినన్నాళ్లు అలా తల వంచవలసిందే!.. తల వంచుతూ బ్రతికితే ఏం జరుగుతుందో నాకు తెలుసు.. పరిస్థితిని ఊహించుకుంటే సౌమ్యలా నేను చేస్తాను ఏమో? అనిపిస్తుంది.”

“ఇంత సంఘర్షణని మనసులో ఉంచుకొని ఏం లేనట్టు నేను నటించలేను” అని అమృత అంటుండగా.. కోపంగా అన్నాడు..

“అమ్మూ!.. నిన్నటి వరకు.. ఇద్దరం.. సమస్యకి పరిష్కారం దొరుకుతుందా?.. మావయ్య ఆరోగ్యం కాస్తయినా బాగుపడుతుంది ఏమో.. అని అలోచిస్తున్నాం.. ఈ విషయం ఇప్పుడు చెబితే.. తన ప్రాణాలకే ముప్పు.. అయినా సౌమ్య అంటున్నావేంటి?.. అక్కడకు గాని వెళ్ళావా?.. “

“ప్చ్!.. వెళ్ళడం కాదు.. సౌమ్య పూర్తిగా మతిస్థిమితం కోల్పోయింది.. పిచ్చిదయిపోయింది..” అని జరిగినదంతా చెప్పి.. “సౌమ్య పరిస్థితిలోకి త్వరలోనే నేను వెళ్ళిపోతాను.. నేను ముందు అర్జంటుగా నీకు దూరంగా ఉండాలి.. నువ్వు చాలా మంచోడివని.. శ్రీరామచంద్రుడిలాంటి వాడివని తెలుసు.. కాని.. మనిద్దరి మధ్య ఉన్న ప్రేమని.. ఇష్టాన్ని.. వాళ్ళందరూ వివాహ బంధంగా మార్చి, ఎంగేజ్‌మెంట్ చేయడం, ఫోను చేస్తే చాలు ఎప్పుడు వస్తారు.. చెబితే పెళ్ళికి ముహుర్తం పెట్టిస్తాం అని అనడం భరించలేకపోతున్నాను.. ఇక్కడ ఒక్క నిమిషం ఉండాలని లేదు.. ప్లీజ్ నన్ను వెళ్ళనీ!..” అంది అమృత..

తను ఏం చెప్పినా వినే స్థితిలో లేదు..

అమ్మూ అన్నట్లు.. ఇక్కడ తను ఉండడం ఒక విధంగా ఆలోచిస్తే బాధకరమే!..

“ఏంటి మామూ!.. అంతలా ఆలోచిస్తున్నానవు. నేనేం అక్కడ.. పెళ్ళి ఇష్టం లేదని చెప్పను.. కాని నేను ఇక్కడ ఉండలేను.. ప్లీజ్ నన్ను పంపిచేయ్!..” అంది.

మొదటి సారిగా USAకి ప్రయాణం అయినప్పుడు.. ‘తిరిగి ఎప్పుడు వస్తావు మామూ!.. నేను ఎవరితో మాట్లాడాలి? ఎవరితో పోట్లాడాలి అంది. కాని.. ఇప్పుడు నీకు దూరంగా ఉండాలంటుంది. ఎంతలో ఎంత మార్పు?..’

“వి.వీ!.. ఆలోచించినది చాలులే! .. ప్రామిస్!.. వాళ్ళని బాధపెట్టేది ఏది చేయను.. నేను ఇక్కడ ఉండను.. నేను ఒక్కదాన్నే వెళతాను..” అంది మెండిగా..

ఫోను రింగ్ కావడంతో గభాలున ఫోను ఎత్తాడు వివేక్.

“ఏంటి ఇండియా వెళుతున్నావా?.. ఇంత అర్జంటుగా ప్రోగ్రాం పెట్టుకున్నావు ఏమిటి?..” అన్నాడు వివేక్.

“ఏం చెప్పమంటావురా?.. మా అమ్మ, నాన్నాలకి చాదస్తం ఇంకా పోలేదు.. నీకు చెప్పాను కదా నాన్మమ్మ బంగారమ్మకి సుస్తిగా ఉందట.. నన్ను ఒకటే పలవరిస్తుందట..” అన్నాడు సునీల్.

“ఏంటిరా అలా మాట్లాడుతున్నావు?”

“ఎన్ని జన్మలెత్తితే పెద్దవాళ్ళలాంటి స్వచ్ఛమయిన ప్రేమ దొరుకుతుంది?..”

“అక్కడే నేను పప్పులో కాలు వేసానురా?.. నా పెళ్ళి తన కళ్ళతో చూడాలని ఉందట.. నా పెళ్ళి చూసి సంతోషంగా ప్రాణాలు వదులుతుందట.. ఇదెక్కడి ఫిటింగ్ రా!.. నీకు తెలుసు కదా, నేనొక అమ్మాయిని ఎన్నో ఏళ్ళ బట్టి ప్రేమిస్తున్నాను.. తనని వెళ్ళి కలవాలనుకున్నాను.. నువ్వు ఇండియా వెళ్ళావు.. దివ్య వెళ్ళిపోయింది.. వర్క్ ఆగిపోతుందని ఆగాను.. ఇక నా వల్ల కాదు.. రేపు మార్నింగ్ ఫ్లైట్‌కి వెళుతున్నాను” అన్నాడు సునీల్.

“అయితే పెళ్ళి చేసుకొని తిరిగి అమెరికా వస్తావన్న మాట” అన్నాడు వివేక్.

“ఇంకా నువ్వెక్కడ ఉన్నావురా?.. పెళ్ళా? పాడా?.. మా నాయనమ్మ పెళ్ళి అన్నాదో.. సారీ!.. నీ కోరిక తీర్చలేను.. నేను ఇష్టపడిన అమ్మాయి దొరికినప్పుడు.. అప్పుడే నా పెళ్లి.. లేదు అంటే వెళ్ళాలనుకుంటే మా నాయనమ్మని వెళ్ళమంటాను”

“ఎక్కడికిరా!”

“ఇంకెక్కడికి?.. పెళ్ళి చూసి చచ్చిపోతానంటుంది కదా? ఆ పని జరగదని చెబుతాను.”

“నోరు ముయ్యరా.. అన్నట్టు అమ్మూ ఇండియా వెళతానంటుంది. నువ్వు వెళ్ళేది కాకినాడ కదా? తను వెళ్ళేది కడియం.. If you don’t mind తనని తీసుకువెళ్ళి వాళ్ళింటిలో డ్రాప్ చేసి అప్పుడు నువ్వు వెళ్ళరా?.. ఏమంటావు?” అన్నాడు.

“భలేవాడివే!.. సరే! నా ఫ్లైట్‌లో టికెట్టు దొరుకుతుందో లేదో తెలియదు.. ఒకసారి చెక్ చేసి చెబుతాను.. ఈలోగా తన పేరు అన్ని డిటేల్స్ పంపు..” అన్నాడు సునీల్.

“ఓ.కే.. ఇప్పుడే పంపిస్తాను” అన్నాడు వివేక్.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here