[మత్స్యకారుల జీవన విధానాన్ని, వారి జీవితాలలోని ఒడిదుడుకులను పద్య కావ్యం రూపంలో అందిస్తున్నారు శ్రీ ఆవుల వెంకట రమణ.]
ప్రథమాశ్వాసము – రెండవ భాగము
ఉ.॥
చేపలు పట్టువారు సరి చెన్నలరారగ తూర్పు తీరమున్
కాపల యుందు రచ్చట సకాలము నందున తీవ్రవాదులన్
ఏపున మీరగ మొదట ఈ ధర యందున వార్త దెల్పగన్
రేవుల మాపులన్ బొగడ రెక్కలు ముక్కలు జేసి నిల్వరే. (16)
ఆ.వె.॥
చదువు సంధ్య లేదు సంస్కరించను గాదు
సాటివారితోడ సఖ్యతేది?
బ్రతికినంత మేర భక్తి గొల్చె గంగ
బ్రతుకుతున్నవారు బడుగులచట (17)
ఆ.వె.॥
శూద్రులంచు జగతి శోధన పాలయ్యె
హీనకులము చెంత నటుల నిలచె
చేపపట్టు కులము చెల్లెవారల కంత
చేప కన్న జగతి చెల్లెనెవరు? (18)
కం.॥
బడి లేదిక గుడి యున్నది
బడి జేర్చుక జదువు జెప్ప ఓరిమి తోడన్
బడి లేదని సుతులందురు
నడి సంద్రపు జాడ వైపు నలుగుచు పోరే. (19)
ఆ.వె.॥
చదువు సంస్కార చరితంబు సరిగలేదు
తోటి జనుల మైత్రి తోడు లేదు
పుట్టినంత నుండి పుడకల వరకును
కడలి చెంత బతుకు కాలిపోయె. (20)
కం.॥
పగలును జలధిలో మునుగుచు
సెగలును విడుచుచు జగాన సెల్లెదరంతన్
నిగనిగ లాడెడి దేహపు
వగలును పోదురు మగులును వాసిగ ధరలో. (21)
ఆ.వె.॥
తల్లిదండ్రి గురువు దైవంబు నీవంచు
ఎంచి చూడ ధరణి ఏది లేదు
అన్ని నీవెనంచు ఆర్తిగా ప్రార్థించు
మీన గ్రహం జాతి మేధి నందు. (22)
తే.గీ.॥
మంచు కడలిని మనసార నవని లోన
కొలచి కొలుపులు చేతురు కోర్కె దీర
మద్యపానంబు మరి కాస్త మానకుండ
తాగి చిందులు వేతురు తాండవముగ. (23)
కం.॥
అంతట వార్ధిని జొచ్చియు
వింతగ సాగిలపడుదురు విశ్వము లోనన్
ఎంతగ వేడుచునుందురో
మంతనమున గంగ నిల్పి మరువక వారున్. (24)
చం.॥
కడలియె నిన్ను సాకె సుమ! కాగల కార్యములన్ని దీర్చి; నా
కడలియె నీకు సర్వమగు కార్యము దీర్చెడి కన్నతల్లి; యా
కడలియె మత్స్యకారులకు కామితమిచ్చెడి కల్పశాఖి; యా
కడలిని మించి నీ ధరణి గావగలేరు మహీతలంబునన్. (25)
తే.గీ.॥
అట్టి కడలియె నొకసారి యాగ్రహమున
పట్టి మ్రింగును మనవారి ప్రాణములను
దయను తప్పును దెసమాలి దారుణముగ
శిరము వాల్తురు కడలిలో దరియు లేక. (26)
ఆ.వె.॥
ఎంత చిత్రమొ కద నేడు యిట్టి విధము
చేతులార బెంచి చెయ్యి పట్టి
లాగివేయునట్లు లక్షణమును గల్గి
కడలి మనసు నింత కక్ష మిగిలె. (27)
తే.గీ.॥
ఇట్టి గుణనదీనాథుండు ఈర్ష్య చేత
నోమరి దేని చేతనో ఓర్మి లేక
కడుపు నందున కుంపటి కలశముంచి
అప్పుడప్పుడు జనులపై యలుకుచుండె. (28)
చం.॥
అటుల సునామి ఘంటికలు ఆగమ మయ్యెను శబ్ద సంచయం
బటు రీతి మ్రోగ భువి ప్రాణములన్నియు గోలుపోవ; యీ
ఘటనను జూడలేదె యని గౌరవ పాలకుంత జేరి; సం
ఘటన దలంచి ఏడుపును గైకొని సాగరె వీధి వీధులున్. (29)
ఉ.॥
అంతటా దాపునుండగను అందరు సర్వము గోలుపోవగన్
ఎంతగ యంగలార్చినను ఏమిటి లాభమటంచు వారలు
న్నంతట సర్వకార్యముల నన్నిటు కూర్చు ప్రయత్నమందగన్
వింతగ జూచు నాగరిక విజ్ఞులు సైతము ఖిన్నులైతిరే. (30)
(సశేషం)