[dropcap]జీ[/dropcap]వులలో నిర్జీవులలోని అంతరాత్మను దర్శించి ప్రదర్శించే జె. శ్యామల గారి ‘అన్నింట అంతరాత్మ’ శీర్షికలో ఈ వారం ‘మందు’ అంతరంగం తెలుసుకుందాం.
***
ఏదో ఆలోచిస్తూ ఏమరుపాటుగా ఉన్నానేమో బలరామయ్య నా మూతను గట్టిగా తిప్పి, తెరుస్తుంటే ఉలిక్కిపడ్డాను. రెండు మాత్రలు వేసుకుని నా మూత బిగించి యథా స్థానంలో ఉంచారు. తెల్లవారి లేస్తూనే ఆయనకు థైరాయిడ్ మాత్రలతోనే పని. ఎందుకంటే థైరాయిడ్ మాత్ర వేసుకుంటే కొద్దిసేపటి వరకు కాఫీ తాగకూడదు. అందుకే ఎంత త్వరగా థైరాయిడ్ మాత్ర వేసుకుంటే అంత త్వరగా కాఫీ తాగవచ్చని ఆశ. ఆయన భార్య ఆదిలక్ష్మి మాత్రం, భర్త ఆలస్యంగా థైరాయిడ్ మాత్ర వేసుకుంటే, తను కాఫీ ఆలస్యంగా అందించవచ్చు అనుకుంటుంది. కానీ అలా జరగదు గాక జరగదు.
నా చుట్టూ కూడా ఎన్నో మందులు, చుట్టూ ఏమిటి, ఈ షెల్ఫ్ అరలన్నిటా మేమే. ఇంకా చెప్పాలంటే డైనింగ్ టేబుల్‌కి ఓ మూల, బెడ్ రూమ్ లలో మంచాల పక్కన స్టూల్‌పై, ఫ్రిజ్‌లో, హ్యాండ్ బ్యాగుల్లో.. గోలీలు, టాబ్లెట్లు, గొట్టాలు (క్యాప్సుల్స్), సిరప్‌లు, టానిక్‌లు, సూదిమందులు ఇలా సర్వత్రా మా వాళ్ళే ఉన్నారు. సూదిమందుకు, మాకు అపుడప్పుడు సరదా వివాదాలు జరుగుతుంటాయి. ‘అబ్బ! సూది గుచ్చితే ఎంత నొప్పో కదా. పసి పిల్లలైతే గుక్క పట్టి ఏడుస్తారు, సూది గుచ్చిన చోట కదుం కట్టి రెండు, మూడు రోజుల దాకా నొప్పి తగ్గదు. అదే గోలీలయితే నోట్లో వేసుకుని మింగేస్తే చాలు’ అని గోలీలం అంటే, ‘ఓ చెంచాడు సిరప్ తాగితే చాలు, పైగా మేము అనేక పండ్ల రుచులలో ఉంటామేమో, పిల్లలు కూడా పేచీ పెట్టకుండా తాగేస్తారు. మమ్మల్ని సేవిస్తే అనారోగ్యం హాంఫట్’ అని సిరప్‌లు అంటాయి. అది విని, సూది మందు మా వంక సురుక్కున చూస్తూ, ‘సూదిని నేర్పుగా గుచ్చితే అంత నొప్పేమీ ఉండదు. సూది మందు నేరుగా రక్తంలో కలిసి, జబ్బు అతి త్వరగా తగ్గుతుంది. పరిస్థితి తీవ్రంగా ఉంటే వెంటనే ఇచ్చేది సూదిమందే. తెలుసుకోండి’ అంటూ క్లాస్ తీసుకుంటుంది. ‘నువ్వు నువ్వేలే.. సరదాగా కవ్వించాం, అంతే’ అంటూ మేం నవ్వేస్తాం. నేనిలా అనుకుంటుండగానే.. ఆదివారమైనా భర్త తొందరగా లేవడంతో ఆదిలక్ష్మి తప్పదనుకుంటూ లేచి బలరామయ్యకు కాఫీ చేసి అందించింది. ‘రాత్రి పట్టుకున్న తలనొప్పి ఇంకా తగ్గలేదు’ అంటూ, అమృతాంజనం కణతలకు రుద్దుకుంటూ, కాఫీ తాగసాగింది. ‘ఆడపిల్ల – అగ్గిపుల్ల, చిట్టెమ్మ కాపురంలో చిచ్చు బాబు, ఎండిన కాపురంలో పండిన ప్రేమ లాంటి సీరియల్స్ రోజంతా చూస్తుంటే తలనొప్పి రాక ఏమవుతుంది? ఇంకా ఆ తల ఉన్నందుకు సంతోషించు’ బలరామయ్య క్లాసు పీకాడు. ‘ఆ.. ఆ .. మీరు చూసే అరుపులు, కేకలతో దద్దరిల్లే రాజకీయ చర్చల కంటే నయమే. ముందు మీ పైత్యం తగ్గేలా చూసుకోండి’ అంది ఆదిలక్ష్మి. ‘బాగా గుర్తుచేశావు’ అంటూ మాదీఫల రసాయనం అందుకున్నాడు బలరామయ్య.
ఆ తర్వాత భక్తి పాటలు పెట్టాడు. ఎమ్.ఎస్. సుబ్బులక్ష్మి గానం చేసిన హనుమాన్ చాలీసా వింటూ తన్మయత్వంలో మునిగాడు బలరామయ్య.
‘..లాయ సంజీవన లఖన జియాయే
శ్రీ రఘువీర హరషి ఉర లాయే’ విని ‘అప్పుడు కూడా మందు అవసరం తప్పలేదు. లక్ష్మణుడు మూర్ఛపోతే, హనుమ వెళ్లి సంజీవని తీసుకు వచ్చి ప్రాణాలు రక్షించడం ఎంత గొప్ప విషయం. దాన్ని బట్టే ఆకు పసర్లు, వన మూలికలు వైద్యంలో ఎంత ప్రాచీన కాలం నుంచి వాడుకలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కూడా జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం అన్నాడు. అంటే అనివార్యమైన జననం, మరణం, వృద్ధాప్యం, రోగాల గురించి తెలుసుకుని, జాగ్రత్త పడడమే జ్ఞానమని చెప్పాడు’ అన్నాడు బలరామయ్య.
‘నిజమే. మనిషి బుద్ధిజీవి కాబట్టే తనకు ఎదురయ్యే సమస్యలన్నిటికీ, తన బుద్ధి కుశలతతోనే నివారణలు కనుగొంటున్నాడు. ప్రాచీన కాలంలో మందులకు వనరు ప్రకృతే కదా. మనిషి తన ఊహతో, రకరకాల ప్రయోగాలతో ఏవి వాడితే ఏ బాధ నివారణ అవుతుందో తెలుసుకోగలిగాడు. మనదేశంలో అలనాటి నుండి వాడుకలో ఉన్నది ఆయుర్వేదం.. ఆ తర్వాత కదా మిగిలినవి వచ్చింది. ఇంతకూ ఆయుర్వేదం ఎలా మొదలైందో’ ఆలోచనగా అంది ఆదిలక్ష్మి.
‘ఆయుర్వేద గ్రంథాలలో ఉన్న దాని ప్రకారం క్షీర సాగర మథనంలో ఒక చేత్తో అమృత భాండం, మరొక చేత్తో శంఖువు, మిగతా చేతులలో మూలికలు, చక్రం ధరించిన ధన్వంతరి ఉద్భవించాడు. ఆ ధన్వంతరి మహర్షియే, తనకు లక్ష శ్లోకాల ఆయుర్వేద శాస్త్రాన్ని ఉపదేశించాడని, ఆయనే ఆయుర్వేద శాస్త్రానికి మూల పురుషుడని సుశ్రుతుడు తన ‘సుశ్రుత సంహిత ‘లో పేర్కొన్నాడు. సుశ్రుతుడు తొలి శస్త్ర వైద్యుడు కూడా కావడం మన దేశానికే గర్వకారణం.
నమామి ధన్వంతరి మాది దేవం
సురాసురైర్వందిత పాద పద్మం
లోకే జరారుగ్భయ మృత్యు నాశం
ధాతార మీశం వివిధౌషధీనాం
అని ఓ శ్లోకం కూడా ఉంది’ చెప్పాడు బలరామయ్య.
‘అలాగా, ఆయుర్వేదం అనగానే చరకుడి పేరు కూడా వినిపిస్తుంది కదా’ అంది ఆదిలక్ష్మి.
‘సుశ్రుతుడి తర్వాత చరకుడి పేరే చెప్పుకోవాలి. సుశ్రుతుడు క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దానికి చెందితే, చరకుడు క్రీస్తు పూర్వం ఎనిమిదవ శతాబ్దానికి చెందినవాడు. ఆయుర్వేద శాస్త్రానికి పరిపూర్ణత సాధించింది చరకుడే. ‘చరక సంహిత’ పేరుతో గొప్ప ఆయుర్వేద శాస్త్ర గ్రంథం రాశాడు.’
ఆయుర్వేదం గురించి వారు మాట్లాడింది విని మాదీఫల రసాయనం, అశోకారిష్ట, వసంతకుసుమాకరం వగైరాలన్నీ మా అలోపతి గోలీలు, టాబ్లెట్ల వైపు గర్వంగా చూశాయి. నేను వెంటనే ‘అందుకే ఉదయానే ముందు నన్ను సేవించాడు’ అన్నాను నవ్వుతూ.
దాంతో అవి ముడుచుకున్నాయి.
ఇంతలో దినపత్రిక రావడంతో దాన్ని చదవడం మొదలు పెట్టాడు బలరామయ్య.
అతడి దృష్టిని ఓ మందులకు సంబంధించిన వార్త ఆకర్షించింది. దాంతో పైకే చదివాడు..
‘ఉజ్బెకిస్థాన్‌కు డబ్ల్యూ.హెచ్.ఓ. హెచ్చరిక.. ఆ రెండు దగ్గు సిరప్‌లు వాడొద్దు’
అది వినగానే ‘ఏమిటా మందులు.. ఏ కంపెనీ తయారుచేసింది?’ ఆత్రంగా అడిగింది ఆదిలక్ష్మి.
నేనూ ఉలిక్కిపడ్డాను. మా మందుల జాతి చెడు కూడా చేస్తుందా? అనుకున్నాను.
బలరామయ్య ‘విను’ అంటూ మళ్లీ చదవటం మొదలుపెట్టాడు. ‘భారత్ లోని నోయిడాకు చెందిన మారియన్ బయోటెక్ లిమిటెడ్ తయారు చేసిన దగ్గు సిరప్ లలో ఇథిలీన్ గ్లైకాల్ లేదా ఇథిలీన్ ఉందని నిర్థారించారు. ఈ మందుల వాడకం వల్ల ఉజ్బెకిస్ధాన్‌లో పద్దెనిమిది మంది చిన్నారులు మరణించారని తెలిసింది..’
‘అయ్యో పాపం. ఆ మందుల పేర్లేంటి?’ మళ్లీ అడిగింది ఆదిలక్ష్మి.
‘నన్ను పూర్తిగా చదవనీ.. ఆ సిరప్‌ల పేర్లు.. డాక్-1 మాక్స్ సిరప్, అంబ్రోనల్ సిరప్. సరేనా. ఇంకా విను. గతంలో కూడా భారత్ లోని హర్యానాకు చెందిన మైడెన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ తయారు చేసిన నాలుగు దగ్గు, జలుబు మందులు కూడా ఇదే బాపతుట. వాటిని వాడడం వల్ల ఆఫ్రికా లోని గాంబియాలో అరవై ఆరు మంది చిన్నారులు కన్నుమూశారట’ చెప్పాడు.
‘రోగాన్ని తగ్గించడం బదులు రోగినే హరించే మందులా? మా జాతికి ఎంత తలవంపు? ఇంతవరకు ఆరోగ్య ప్రదాతలం అని గర్వించానే..’ నేను అనుకుంటుండగానే, ‘ఆ కంపెనీలు ప్రమాదకర సిరప్ లను తయారు చేస్తుంటే డ్రగ్స్ కంట్రోల్ వారు ఏం చేస్తున్నట్లు.. పైగా విదేశాలకు కూడా ఎగుమతి చేయడమా? దీని మీద ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని, కట్టడి చేయాలి కదా?’ ఆవేశపడింది ఆదిలక్ష్మి.
‘తక్షణం ఆ మందు ఉత్పత్తి ఆపమని ఆదేశించింది. ఆ తర్వాత తనిఖీలు, నమూనాల పరీక్షలు జరుగుతాయి కానీ నష్టమైతే జరిగిపోయింది. మళ్లీ మళ్లీ ఇలా జరుగుతుంటే కఠిన చర్యలు తీసుకోవాలి కదా’ అన్నాడు బలరామయ్య.
‘ఏమిటో మందులను కూడా నమ్మలేని రోజులు. మందులే కలుషితమైతే దిక్కేమిటి’ బాధగా అంది ఆదిలక్ష్మి.
‘అమ్మా! నాకూ కాఫీ ఇవ్వు!’ అంటూ వచ్చాడు హరి.
‘ఆదివారం కదా, అప్పుడే లేచావేమిటి’ అంటూ కాఫీ తేవడానికి లేచింది ఆదిలక్ష్మి.
‘మీ మాటలతోనే నాకు మెలకువ వచ్చేసింది. మందుల గురించి మీ మాటలు విన్నాను. నకిలీ మందుల తయారీలో కూడా మనవాళ్లు ప్రవీణులే.. గతంలో టాబ్లెట్లకు బదులు సుద్దముక్కలు అమ్మిన వార్త కూడా వచ్చింది. డ్రగ్ ల్యాబ్‌లో పరిశీలిస్తే 500 ఎం.జి. అజిత్రోమైసిన్ టాబ్లెట్‌లో పది శాతం మందు కూడా లేదని తేలింది. బ్యాచ్ నంబర్లు, ప్యాకింగ్ అన్నీ పక్కాగా ఉండడంతో అంతా నమ్మారు. అలాగే సెల్ జి పేరు గల పెయిన్ కిల్లర్లు నకిలీవని తేల్చారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ఏటా మనదేశంలో ముప్ఫై ఐదు శాతం మందులు నకిలీవి’ అన్నాడు హరి.
‘మరి ప్రభుత్వం నకిలీ మందులకు చెక్ పెట్టే చర్యలు తీసుకోలేదా’ హరికి కాఫీ అందిస్తూ అడిగింది ఆదిలక్ష్మి.
‘ఎందుకు తీసుకోదూ, మందులపై క్యూ ఆర్ కోడ్ లేదా బార్ కోడ్ ఉండేలా కొత్త చట్టం చేయనుంది. ఆ కోడ్ ఆధారంగా ఆ మందు అసలుదా, నకిలీదా అనేది గుర్తించవచ్చు. అయితే కేంద్రం గుర్తించిన మూడొందల అత్యవసర మందులకే ఈ చట్టం వర్తిస్తుంది. ఎక్కువగా వాడే, ఖరీదైన మందులు ఈ జాబితాలో ఉంటాయి’ చెప్పాడు హరి.
అది విని ‘హమ్మయ్య! దీని ద్వారా అయినా, మందుల జాతికి చెడ్డ పేరు రాకుండా ఉండాలి’ అనుకున్నాను.
‘జలుబు, దగ్గు, తలనొప్పి, ఒంటి నొప్పులకు జిందా తిలిస్మాత్‌ను మించిన మందు లేదు’ అన్నాడు.
‘అవున్రా’ అంటూ ఆదిలక్ష్మి వెంటనే లేచి జిందా తిలిస్మాత్ ఓ చుక్క దూదిపై వంపుకుని నుదుటికి రుద్దుకుంటూ ‘ఇది యునాని మందు కదూ. ఈ పేరెలా వచ్చిందో’ అంది.
‘యునాని వైద్యం గ్రీకు దేశంలో పుట్టింది. దీన్ని ప్రచారంలోకి తెచ్చింది పారశీక వైద్యుడు హకీమ్ బిసీనా. హకీమ్ అంటే వైద్యుడు అని అర్థం. గ్రీకు దేశాన్ని, సెంట్రల్ ఆసియా లోని ప్రాంతాలన్నీ ‘యునాన్’ అని పిలిచేవి. అందుకే దీనికి ‘యునాని వైద్యం’ అని పేరు వచ్చింది. ప్రస్తుతం యునాని వైద్యం భారత్‌లో కూడా ఎంతో ప్రాచుర్యంలో ఉంది. ఇక అందరూ వాడే ‘జిందా తిలిస్మాత్’ తయారయ్యేది మన హైదరాబాదులోనే’ చెప్పాడు హరి.
జిందా తిలిస్మాత్ మా అందరివైపు ‘విన్నారా ‘అన్నట్లు చూసింది.
మేం కూడా దానికి ‘జిందాబాద్’ కొట్టాం.
అది ఆనందంతో మాకు ‘షుక్రియా ‘చెప్పింది.
‘మొన్న సుభద్రమ్మ గారు చూసుకోకుండా ఎక్స్‌పైరీ తేదీ దాటిన దగ్గు మందేదో రెండు సార్లు వేసుకుందట. అంతే.. రోజంతా ఒకటే నిద్ర. వాళ్లాయనకు కంగారు పుట్టి అంతా పరిశీలిస్తే అసలు విషయం బోధపడి, వెంటనే ఆ సీసా చెత్తబుట్టలో వేశాడట. సుభద్రమ్మ అదృష్టం బాగుండి ఇంకా ఎక్కువ ప్రమాదం ఏం జరగలేదు’ అంది ఆదిలక్ష్మి.
‘అందుకే మెడికల్ షాపు నుంచి మందుల్ని కొనేటప్పుడే వాటి పైని తయారీ తేదీ, గడువు తేదీ తప్పనిసరిగా చూడాలి. ఎక్స్‌పైరీ తేదీ దాటిన మందుల్ని అమ్మడం నేరం. చాలా మంది మందుల్ని ఎక్కువ సంఖ్యలో కొనడం, తర్వాత అనారోగ్యం తగ్గడం వల్ల, లేదంటే రోగి పరిస్థితిని బట్టి డాక్టర్ మందులు మార్చడం వల్ల కొన్న మందులు ఇంట్లో నిరుపయోగంగా ఉండిపోతాయి. గడువు ముగిసిన మందులు వాటి ప్రభావాన్ని కోల్పోతాయి. ఎక్కువ శాతం మందుల కంపెనీలు ఎక్స్‌పైరీ తేదీ కంటే ఆరునెలల మార్జిన్ వ్యవధిని ఉంచుతాయి’ అన్నాడు హరి.
‘అంటే, నాకర్థం కాలేదు’ అంది ఆదిలక్ష్మి.
‘ఏంలేదు, మందు అసలు ఎక్స్‌పైరీ తేదీ జులై అయి ఉంటే, జనవరి అని ముద్రిస్తాయి. దానివల్ల ఆ తర్వాత ఆరునెలల లోపు వాడినా ఎలాంటి హానీ కలగదు. ఆ కాల పరిమితి కూడా దాటిన తర్వాత వాడితే వాంతులు, తలనొప్పి వంటి సైడ్ ఎఫెక్ట్స్ కలిగే ప్రమాదం ఉంటుంది’ వివరించాడు.
‘మందులు కొందరి ఇళ్లలో వృథాగా పడి ఉంటే మరి కొందరు మందులు కొనుక్కునే శక్తి లేక అలమటిస్తుంటారు’ అంది ఆదిలక్ష్మి.
అప్పుడే కాఫీ కప్పుతో ప్రవేశించిన కోడలు స్నేహ ‘నిజం చెప్పారు. అందుకే కొంతమంది స్వచ్ఛంద సంఘ సేవకులు ఇళ్లలో వృథాగా ఉన్న మందులను సేకరించి, అవసరం ఉన్న వారికి అందజేస్తున్నారు. అలాంటి వారిలో ఒకరైన ఓంకార్ నాథ్ శర్మ గురించి ఇటీవల చదివాను. ఢిల్లీకి చెందిన ఎనభై ఐదు సంవత్సరాల వృద్ధుడైన ఓంకార్ నాథ్ శర్మ గత పద్నాలుగేళ్లుగా మందులు సేకరించి, అవసరమున్న రోగులకు అందిస్తున్నారు’ అంటుండగానే, ‘ఎంత మంచి పనో, ఆయనకు ఈ ఆలోచన ఎలా వచ్చిందో’ అంది ఆదిలక్ష్మి.
‘గతంలో ఢిల్లీలోని వికాస్ మార్గ్‌లో నిర్మాణంలో ఉన్న మెట్రో ఫ్లై ఓవర్ కూలింది. ఆ దుర్ఘటనలో కార్మికులు కొంతమంది మరణించగా, మరికొంత మంది గాయాల పాలయ్యారు. వారికి వైద్యం చేసిన డాక్టర్లు మందులు అందుబాటులో లేవన్నారు. ఖరీదైన మందులు కొనలేక ఎందరో ప్రాణాలు కోల్పోవడం చూసిన ఓంకార్ నాథ్ శర్మ చలించిపోయారు. ఈ సమస్య నివారణకు ఏదైనా చేయాలని తీవ్రంగా ఆలోచించి, ప్రతిరోజు ఉదయం నగరంలోని ఒక్కో ప్రాంతం తిరుగుతూ, ప్రతి ఇంటికి వెళ్లి, విషయం వివరించి వారింట్లో వృథాగా ఉన్న మందులను సేకరించడం మొదలుపెట్టారు. ఇంట్లో ఎవరికైనా, జ్వరమో, మరో జబ్బో వస్తే డాక్టర్ సలహా మేరకు మందులు కొంటారు. కొన్నిసార్లు మందులన్నీ వాడరు. పైగా డాక్టర్, రోగి పరిస్థితిని బట్టి మందులు మార్చినా కూడా ముందుకొన్న మందులు, టానిక్‌లు అలాగే ఉండిపోతాయి. అలాంటివి తనకు ఇస్తే, అవసరం ఉన్న పేద రోగులకు అందిస్తానని, అన్ని దానాల కంటే ఔషధ దానం గొప్పదని ఆయన ప్రచారం చేస్తున్నారు. సేకరించిన వాటిని పరిశీలించి, ఆ మందుల్లో కాలం చెల్లిన, తేదీలు సరిగా లేని ట్యాబ్లెట్లను పారేసి, సరైనవి మాత్రమే పంచుతారు. ఆయన దగ్గర తలనొప్పికి వాడే రూపాయి మాత్ర నుంచి వివిధ రకాల పెద్ద జబ్బులకు వాడే ఇరవై వేల రూపాయల ఖరీదు గల ట్యాబ్లెట్ల వరకు అన్నీ ఉచితంగా దొరుకుతాయి. అయితే డాక్టర్ రాసిచ్చిన చీటీ చూపించాకే ఓంకార్ నాథ్ శర్మ ఆ మందులను ఇస్తారు. ఎనలేని సేవ చేస్తున్న ఈయనను అంతా ‘మెడిసిన్ బాబా’ అని పిలుస్తారు’ చెప్పింది స్నేహ.
మా ప్రాధాన్యాన్ని, మా జాతిని పేద రోగులకు అందజేసి, వారి ఆరోగ్యానికి పాటుపడుతున్న ‘మెడిసిన్ బాబా’ గురించి విన్న నాకు ఎంతో ఆనందంగా అనిపించింది.
‘ఆయనను ‘మెడిసిన్ బాబా’ అనడం చాలా బాగుంది. అయినా ప్రజలందరికీ మందులు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ‘అంది ఆదిలక్ష్మి.
‘అందుకేగా తక్కువ ధరకు లభించే జెనరిక్ మందులు ప్రవేశపెట్టింది’ అన్నాడు బలరామయ్య.
‘జెనరిక్ మందులంటే?’ అడిగింది ఆదిలక్ష్మి.
‘మామూలు మందులే. కాకపోతే బ్రాండ్ పేరు ఉండదు. అంతే. జెనరిక్ మందుల్ని ప్రత్యేక షాపుల్లో అమ్ముతున్నారు’ చెప్పాడు బలరామయ్య.
‘అలాగా. నాకు మరో సందేహం. మందుల్లో ‘యాంటి బయాటిక్స్’ అంటుంటారు కదా.. అంటే ఏమిటి?’ అంది ఆదిలక్ష్మి.
వెంటనే బలరామయ్య బదులిస్తూ ‘బయట వాతావరణంలో కంటికి కనపడని రకరకాల చిన్న క్రిములు ఉంటాయి. వీటిని బ్యాక్టీరియా వైరస్ అంటారు. బ్యాక్టీరియాలలో ఆరోగ్యానికి మేలు చేసేవి, కీడు చేసేవి రెండు రకాలు ఉంటాయి. మనిషి శరీరంలో చెడు బ్యాక్టీరియా ప్రవేశించినట్లయితే ఎన్నో రకాల జబ్బులు, ఇన్ఫెక్షన్లు వస్తాయి. చెడు బ్యాక్టీరియాను చంపేందుకు వాడే మందులే యాంటి బయాటిక్స్. అయితే వీటిని డాక్టర్ సూచించినట్లు ఏ పరిమాణంలో, రోజుకు ఎన్ని సార్లు, ఎంత కాలం వాడాలో కచ్చితంగా అలాగే వాడాలి. అంతేకానీ ఇష్టంవచ్చినట్టు వాడకూడదు. అంతేకాదు, జ్వరానికి, ఒళ్లు నొప్పులకు వాడే మాత్రలు వైద్యుడిని సంప్రదించకుండా అదే పనిగా దీర్ఘ కాలం వాడితే కిడ్నీ వైఫల్యాలకు, ఇతర పెద్ద అనారోగ్యాలకు దారి తీస్తాయి’ అన్నాడు.
అలమారలోని యాంటి బయాటిక్స్ మాత్రలు ‘మేమెంత శక్తిమంతులమో విన్నావా’ అంటుంటే నేను నవ్వుతూ ‘విన్నాలే’ అన్నాను.
ఇంతలో ‘తాతయ్యా! నాకు జలుబుగా ఉంది. హోమియో మాత్రలు ఇవ్వు’ అంటూ ఏకంగా హోమియో మందుల పెట్టె అందించాడు నాని.
బలరామయ్య, మనవడి నోట్లో ఎకొనైట్ మాత్రలు వేసి ‘పిల్లలు హోమియో మందులయితే గొడవ చేయకుండా వేసుకుంటారు. హానిమన్ గారి పుణ్యమా అని మనకు తీయని వైద్యం అందుబాటులోకి వచ్చింది’ అన్నాడు.
‘హానిమన్ ఎవరు తాతయ్యా?’ అడిగాడు నాని.
‘హోమియోపతి వైద్య విధానాన్ని కనుగొన్నది ఆయనే’ చెప్పాడు.
‘హోమియోపతి మందులు ఎక్కువ ఖరీదు కూడా కావు. అందరికీ అందుబాటులో ఉంటాయి. వాటివల్ల వేరే ఆరోగ్య సమస్యలు రావు’ అంది ఆదిలక్ష్మి.
‘తాతయ్యా! మరి హోమియో మాత్రలు తియ్యవి కదా. సుగర్ ఉన్న వాళ్లు వేసుకోకూడదు కదా’ ప్రశ్నించాడు నాని.
‘మంచి ప్రశ్న వేశావు. కాని హోమియో మాత్రలలో ఉండేది లాక్టోజ్ మాత్రమే. గ్లూకోజ్ ఉండదు. చాలా తక్కువ మోతాదులో చక్కెర ఉంటుంది, అది శరీరంలోని సుగర్ స్థాయిలపై ప్రభావం చూపదు కాబట్టి సుగర్ ఉన్నవాళ్లు కూడా వేసుకోవచ్చు’ చెప్పాడు బలరామయ్య.
హోమియోపతి మాత్రలు ‘తీయతీయని హోమియో మాత్రలతో పోతాయి సుమా జబ్బులూ’ అని పాడటం విని, ‘మీ పాట కూడా తీయగా ఉంది’ అని మెచ్చుకున్నాను నేను.
మాలో మేం ఇలా వినోదిస్తుండగా, ఎప్పుడొచ్చిందో బేబీ ‘నాన్నా! మరి నువ్వు మొక్కలకు కూడా మందులు వేస్తావు కదా’ అంది.
‘అవునమ్మా. మొక్కలకు కూడా చీడ పీడలు చుట్టుకుంటే మందులు వేయాలి. అయితే వాటికి వేసే మందులు వేరే ఉంటాయి’ చెప్పాడు హరి.
‘నాన్నా! జంతువులకు కూడా మందులు వేస్తారుగా’ అడిగాడు నాని.
‘అవును. వెటర్నరీ డాక్టరును సంప్రదిస్తే ఆయనే మందులిస్తారు. పెంపుడు కుక్కలు, పిల్లులు, ఆవులు, బర్రెలు.. ఇలా అన్నిటికీ వైద్యం అవసరమే. జంతు ప్రదర్శన శాలలలో అక్కడి జంతువులను పరీక్షించి, వైద్యం చేసేందుకు ప్రత్యేక డాక్టర్లు ఉంటారు’ చెప్పాడు హరి.
‘మరి పక్షులకు?’ అడిగింది బేబీ.
‘వాటికి కూడా వెటర్నరీ డాక్టర్లు వైద్యం చేస్తారు. తమిళనాడులోని కోయంబత్తూరులో కేవలం పక్షుల కోసమే ఓ ఆసుపత్రి ఉంది.’
‘అయితే మా జాతి మనుషులకే కాక ఇతర జీవులకు కూడా సేవ చేస్తోందన్నమాట’ అనుకున్నాను నేను.
అంతలో అనంత్ ఆవులిస్తూ వచ్చి పేపర్ అందుకుని ‘ఎన్నికల వేళ పల్లెల్లో మందు విందులు చేస్తున్న రాజకీయ పార్టీలు.. మత్తులో ఓలలాడుతున్న ఓటర్లు’ పైకే చదివాడు.
‘మందు విందా?’ అయోమయంగా అడిగాడు నాని.
‘ఈ మందు వేరు లేరా. మద్యాన్ని మందు అనడం మామూలైపోయింది. ఇది మనిషి ఆరోగ్యానికి హానికరం. రాజకీయనాయకులు ఎన్నికల్లో గెలుపు కోసం ఇలాంటి పనులు చేయడానికి వెనుకాడరు. సినిమాల్లో కూడా –
‘మందు బాబులం మేము మందు బాబులం
మందు కొడితే మాకు మేమే మహా రాజులం’
అంటూ పాటలు.. వాటికి జనాలు చిందులు’ అన్నాడు తాతయ్య.
‘ఇంకో విషయం కూడా ఇక్కడ చెప్పుకోవాలి. డ్రగ్స్ అనే ఆంగ్ల పదానికి మందులు అనే అర్థం ఉన్నా జన సామాన్యం మాత్రం డ్రగ్స్ అంటే మాదక ద్రవ్యాలుగానే వ్యవహరిస్తున్నారు’ అన్నాడు హరి.
‘సరేలే. ఆ మధ్య మా మిత్రుడి అన్నయ్య పెళ్లి చూపులకు వెళ్ళాడుట. అమ్మాయితో విడిగా మాట్లాడే సందర్భంలో తాను డ్రగ్స్ తీసుకుంటానని చెప్పాడుట. అతని ఉద్దేశం మందులు. కానీ ఆ అమ్మాయి మాదక ద్రవ్యాలుగా అర్థం చేసుకుని అతడిని తిరస్కరించింది. ఆ తర్వాత అది కాదు మొర్రో అని ఎంత చెప్పినా ఆ అమ్మాయి నమ్మలేదు. అసలు నువ్వెందుకు ఆ పదం వాడావని అంతా అతడినే తప్పుపట్టారు’ నవ్వుతూ చెప్పాడు అనంత్.
‘అయ్యో పాపం’ ఆదిలక్ష్మి జాలి ప్రకటించడంతో అంతా నవ్వారు.
‘హూ.. ఇలా కూడా జరుగుతుందన్న మాట’ అనుకున్నాను నేను.
‘మందుల గురించి, వాటిని సూచించే వైద్యుల గురించి అనేక సామెతలు, సూక్తులు వాడుకలో ఉన్నాయి. ‘కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడింది’ అని ఒక సామెత. అలాగే ‘వైద్యో నారాయణో హరి’ అన్నారు పెద్దలు’ అంది ఆదిలక్ష్మి.
‘అంటే’ అన్నాడు నాని.
‘ప్రాణాలను కాపాడే వైద్యుడు హరి అంటే దేవుడితో సమానం అని. వైద్యుడి మీద నమ్మకం ఉంచి అతడు చెప్పే మందులు వాడితే అనారోగ్యం తగ్గుతుంది. మందుతో పాటు నమ్మకం కూడా పనిచేస్తుంది’ అంది ఆదిలక్ష్మి.
‘మా ఊళ్లో ఓ ఆర్.ఎం.పి. డాక్టర్ ఉండేవాడు. మా నాయనమ్మకు అతడి వైద్యంపై నమ్మకం తక్కువ. అందుకే ఆమె ‘అతడి చేతి మాత్ర వైకుఠ యాత్ర’ అనేది’ అన్నాడు బలరామయ్య.
‘సరేకానీ మందులు ఒక్కోసారి వికటించి ప్రాణాపాయం జరుగుతుంది. ఎందుకు?’ అడిగింది ఆదిలక్ష్మి.
‘వారి వారి శరీర తత్వాలను బట్టి కొన్ని మందులు వారికి పడవు. ఆ సంగతి రోగి చెప్పని సందర్భాల్లో, వైద్యుడికి ఆ విషయం తెలియక ఆ మందులు ఇస్తే వికటిస్తాయి. అందుకే మందులతో జాగ్రత్తగా ఉండాలి’ అన్నాడు హరి.
‘నిజమే. అయితే ఎన్నెన్నో వ్యాధులకు ఇప్పుడు మందులు ఉన్నాయి. మనో వ్యాధికి మాత్రం మందు లేదు’ అంది ఆదిలక్ష్మి.
‘మనోవ్యాధి అంటే?’ అడిగింది బేబి.
‘అంటే ఏదైనా ఒక విషయం గురించి మనసులో తీవ్రంగా బాధపడుతూ ఉండడం’ చెప్పింది ఆదిలక్ష్మి.
‘స్నేహా! టిఫిన్ ప్రయత్నం ఏమైనా ఉందా? నేను మాత్ర వేసుకోవాలి. తింటే కానీ మాత్రలు వేసుకోకూడదు కదా’ అన్నాడు హరి.
‘ఇప్పుడే చేస్తాను’ అంటూ లేచింది స్నేహ.
ఆ తర్వాత అంతా ఎవరి పనులలో వారు మునిగి పోయారు. నేను మాత్రం మా జాతి గురించిన ఆలోచనల నుంచి బయట పడలేదు.
మా జాతి గురించి అనేక అంశాలు టీవీలో అనేకం చూశాను. తెలియకుండా విరోచనాల మందు తిని, టాయ్‌లెట్ చుట్టూ తిరగడం చూసి సరదాగా నవ్వుకున్నాను. అలాగే పెళ్లయ్యాక కొడుకు తన మాటకు ఎదురు చెప్పడం చూసి విస్తుబోయిన సూర్యకాంతం ‘అమ్మో అమ్మో! ఈ నంగనాచి నా కొడుక్కి మందు పెట్టింది. లేకపోతే నా కొడుకు ఏనాడైనా నోరు విప్పి ఎరుగునా?’ అని గయ్ గయ్ మని అరిచి యాగీ చేయడం చూసి హాయిగా నవ్వుకున్నాను. కాని, నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నారన్న వార్తలు విన్నప్పుడు ఎంతగా వేదన చెందుతానో. ప్రాణాలు తీయడానికి నా జాతిని ఉపయోగించడం నన్నెంతో బాధిస్తుంది. అలాగే చిన్నపిల్లల ఆలన, పాలన చూసే కేర్ సెంటర్‌లో పసివారికి పాలల్లో నల్లమందు కలిపి పట్టి వారిని అతినిద్రకు గురిచేస్తున్నారని విని, నా మనసు విలవిలలాడింది. అలాగే సినిమాల్లో పాలల్లో విషం కలపడం, అన్నంలో విషం చల్లడం చూసినప్పుడు ప్రాణం తీసే పనులకు మా జాతిని వాడడం ఎంత దారుణం అనుకునేదాన్ని. ‘దయచేసి మా జాతిని ఉపయోగించుకుని ఆత్మహత్యలకు, హత్యలకు పాల్పడవద్దని ఈ మానవులకు చెప్పాలనుంది. నా మాట వారి చెవికెక్కేనా!’ అనుకుంటుంటే నాని గొంతు వినిపించింది ‘తాతయ్యా, తాతయ్యా’ అని.
‘ఏంటో చెప్పూ’ అన్నాడు తాతయ్య.
‘పెద్దయ్యాక ఏం చదువుతావు అని అడిగావుగా.. ఇప్పుడు చెప్తున్నా, నేను ఫార్మసీ.. అదే మందులకు సంబంధించిన కోర్స్ చేస్తా’ అన్నాడు నాని.
‘భేష్’ అని తాతయ్య మెచ్చుకుంటుంటే, మా జాతిని రూపొందించే కోర్స్ చేస్తాడన్న తలంపుతో నాలో ఆనందమే ఆనందం.