[dropcap]అ[/dropcap]పుడే సూర్యుడు పడమటి వైపు చేరిపోవటానికి సిద్ధమవుతున్నాడు.
పక్షులు గూటికి చేరుకుంటున్నాయి. ఆఫీస్ నుంచి, స్కూల్ నుండి ఇంటికి వెళ్ళేవారి వెహికల్స్‌తో రోడ్లన్నీ ట్రాఫిక్‌తో నిండిపోయాయి.
ఆ సంధ్యా సమయంలో ఇంట్లో ఉన్న పెద్ద వాళ్ళు కూడా ఇంటినుంచి బయటకు వచ్చే సమయం. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకుని, ఆ నగరం మధ్యలో ఉన్న పార్క్‌కు చేరుకుంటారు.
ఆ పార్క్‌లో అందమైన గులాబీలు, మల్లెలు, చేమంతులు, బంతిపూలు.. ఇంకా ఎన్నో రకాల పూల చెట్లు, అక్కడక్కడా.. చల్లని నీడ కోసం వేప చెట్లు, జామ చెట్లు, మామిడి చెట్లు కూడా ఉన్నాయి.
ఆ గార్డెన్‌లో పిల్లలు ఆడుకోవడానికి.. ఆటలకు సంబంధించిన ఉయ్యాల, జారుడు బల్లలు ఇంకా ఎన్నో రకాల ఆటవస్తువులు ఉన్నాయి.
ప్రతిరోజూ సాయంత్రం అయ్యేసరికి పిల్లలు, పెద్దలతో ఆ పార్క్ కళకళ లాడుతూ ఉంటుంది. ఎగురుతూ, పరిగెత్తుతూ, ఒకరికొకరు పోటీ పడుతూ ఆడుకునే పిల్లలను చూసి.. మురిసిపోతూ ఉంటారు వయోవృద్ధులు.
ముఖ్యంగా ఇక్కడ శని, ఆదివారాలు, పండుగ శెలవులు, వేసవి సెలవుల్లో మరీ సందడిగా ఉంటుంది.
ఈ చిల్డ్రన్స్ పార్క్‌కి ఎక్కడెక్కడ నుంచో వచ్చే పెద్దలు, పిల్లలే కాకుండా, అదే పార్క్ లో ఉన్న ఒక ఉడుత కూడా.. ఆ చిన్నారుల సయ్యాటలు గమనిస్తూ ఉంటుంది. ఏ చెట్టు మీద ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా.. సంధ్యవేళ కాగానే పిల్లలుండే చోటుకు వచ్చి.. ఆ పక్కనే ఉన్న చెట్టు కొమ్మ మీద కూచుని చూస్తూ ఉంటుంది.
ఆ పసివారు ఆడుతూ, పాడుతూ, గెంతుతూ, తుళ్ళుతూ నవ్వుతూ ఉంటే వారితో పాటు.. తాను కూడా అటునుంచి ఇటు, ఇటు నుంచి అటు గంతులేస్తూ.. వారితో సంతోషంగా గడిపేది.
అక్కడికి వచ్చే వారిలో రవి అనే పిల్లాడు ప్రతీరోజూ.. ఆ ఉడుతను గమనించేవాడు. తాను తెచ్చుకొన్న బిస్కెట్లు ఉడుతకు పెట్టేవాడు. ఆ ఉడుత ఆనందంగా తోక ఊపుకుంటూ వెళ్ళి పోయేది.
***
వారం రోజుల నుంచి వర్షాలు కురవడంతో ఆ పార్క్ వైపు ఎవరూ రావటం లేదు. ఒక వైపు వాన పడుతున్నా ఆకుల చాటు నుండి పార్క్ లోకి ఎవరైనా వచ్చారేమోనని గమనిస్తూనే ఉంది ఉడుత.
ఎవ్వరూ అటువైపుగా రాక పోవడంతో బిక్క మొహం వేసుకుని చెట్టు తొర్రలోకి వెళ్ళిపోయింది ఉడుత.
మరో రెండు రోజుల తర్వాత వర్షం తగ్గి పోవటంతో.. గార్డెన్ అంతా బురదగా ఉంటుందని ఎవరూ రాలేదు.
ఆ రోజు సాయంత్రం రవి ఒక్కడే పార్క్‌కి వచ్చాడు. అయితే అక్కడ ఉన్న ఆట వస్తువులతో ఆడుకోకుండా.. ఒక బెంచీ మీద దిగులుగా కూర్చున్నాడు.
అప్పుడే బయటికి వచ్చిన ఉడుత..
రవిని చూడగానే గబగబా చెట్టు మీద నుంచి కిందకు దూకి, బెంచీ మీదకు వచ్చి, రవిని చూస్తూ.. కిచకిచమని శబ్దం చేసింది సంతోషంగా.
రవి తల ఎత్తి ఉడుత వైపు చూసి “ఉడుతమ్మా! ఎలా ఉన్నావు?” అని అడిగాడు.
“నా సంగతి సరే.. నువ్వు ఎలా ఉన్నావు? ఏదో దిగులుగా ఉన్నట్లు తెలుస్తోంది.. మిగతా పిల్లలంతా ఏరీ?” అడిగింది ఉడుత.
“ఇపుడు పరీక్షలు కదా.. చదువు కుంటున్నారు. అందుకే ఎవరూ రాలేదు.” అని చెప్పాడు రవి.
“మరి.. నువ్వు పరీక్షలు రాయటం లేదా?” అడిగింది ఆసక్తిగా ఉడుత.
“నాకు కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి. కానీ చదవాలనిపించలేదు. అమ్మనాన్నలపై, తాతయ్య, నానమ్మలపై దిగులు. నా సంగతి సరే, నువు ఎప్పుడూ ఒక్కదానినే కనిపిస్తావు. నీ వారు ఎవరూ లేరా?” అడిగాడు రవి.
“అమ్మ నాన్న ఉన్నారు. పెద్దవాళ్లై పోయారు. ఆహారానికి ఎక్కడా తిరుగలేరు. అందుకే సాయంత్రం పూట అందరూ ఇక్కడికి రాగానే.. వచ్చిన వారంతా తినగా పారేసిన తినుబండారాలన్నీ తీసుకుని.. మా అమ్మ నాన్నకు పెడతాను. నన్ను చిన్నప్పుడు ఎంతో ప్రేమగా చూసుకుని.. నన్ను కష్టపడి పెంచిన తల్లిదండ్రులను నేను చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. అందుకే ఆహారం కోసం అటూ ఇటూ తిరుగుతున్నా. నువ్వు ఇచ్చిన బిస్కెట్లు కూడా పెట్టేదాన్ని.” చెప్పింది ఉడుత ఆనందంగా.
“నువ్వు ఎంత మంచిదానివి ఉడుతమ్మా.. నీకున్న మంచితనం, ప్రేమ, మా మనుషుల్లో ఉంటే బాగుండేది. మా అమ్మ నాన్న.. మా తాతయ్యను, నానమ్మను వృద్ధులు ఉండే ఆశ్రమంలో వదిలి పెట్టి వచ్చారు. నేను స్కూల్ నుండి ఇంటికి రాగానే నానమ్మ నాకు స్నానం చేయించి, తినటానికి స్నాక్స్ పెట్టి కథలు, కబుర్లు చెప్పేది. నాకు ఇష్టమైన స్వీట్లు చేసి పెట్టేది. తాతయ్య నన్ను ఇలా పార్క్‌కి తీసుకొని వచ్చి ఆడించేవాడు.
ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళగానే.. అమ్మా నాన్న కోసం వెయిట్ చేయాలి. ఒక్కసారి వాళ్ళు ఆఫీసు నుండి ఇంటికి వచ్చేసరికి నేను నిద్ర పోతాను. అమ్మ నాన్నతో హ్యాపీగా గడపాలని, అమ్మ చేత ముద్దలు పెట్టించుకోవాలని, నాన్నతో అలా షికార్లు తిరగాలని ఎన్నో కోరికలు. కానీ.. నేను పెద్దయ్యాక.. అమ్మను, నాన్నను ఎక్కడికీ పంపించను. నా దగ్గరే ఉంచుకుంటాను. జాగ్రత్తగా చూసుకుంటాను.” చెప్పాడు రవి.
“నువ్వు కూడా మంచివాడివే, తల్లిదండ్రులను ఆప్యాయంగా చూసుకుంటావు, అలాగే చూసుకో.. దిగులు పడకు. నీకు బడి వదలగానే ఇక్కడికి రా.. మనం ఆడుకుందాం.” చెప్పింది ఉడుత.
“ఓ.. అలాగే నేస్తమా! ఈరోజు నుంచి మనం స్నేహితులం” అంటూ తన దగ్గర ఉన్న బిస్కెట్ ప్యాకెట్ మొత్తం ఉడుతకు ఇచ్చాడు రవి.
ఉడుత ఆ పాకెట్ తీసుకుని సంతోషంగా చెట్టు మీదకి వెళ్ళింది. తన అమ్మ నాన్న ఎదురు చూస్తుంటారని.
ఉడుతకు కన్నవారి పట్ల ఉన్న ప్రేమను చూసాక.. బంధాలు.. బాధ్యతలు మనుషులకే కాదు ప్రతి జీవికి ఉంటాయని తెలిసింది రవికి.