అనంత పద్మనాభరావు దూరదర్శన్, ఆకాశవాణి వంటి సంస్థలలో ఉన్నత స్థాయి పదవీ బాధ్యతలు నిర్వహించారు. తన అపారమైన అనుభవాలను “ఆకాశవాణి పరిమళాలు” శీర్షికన పాఠకులతో పంచుకుంటున్నారు.
1980 జూన్‌లో ఉషశ్రీ కోరిక మేరకు నేను తిరిగి కడప కేంద్రానికి బదిలీ మీద వచ్చాను. కడపలోని నా అనుకుల శత్రువులకి అది రుచించలేదు. మా డైరక్టర్ జనరల్ కార్యాలయానికి టెలిగ్రాంమ్‌లు కొట్టారు. ‘ఆయన ఇక్కడికి రాకూడదు’ అని వాటి సారాంశం.
విజయవాడలో నేను 1978 నవంబరు నుండి 1980 జూన్ వరకు ప్రవచనశాఖ ప్రయోక్తగా పనిచేశాను. ఆ ఇరవై నెలల కాలం నాకు ఉజ్జ్వలమైనది. కోస్తా ప్రాంత కవి పండితుల సాన్నిధ్యం, సాన్నిహిత్యం, సామీప్యం కలిగాయి. పత్రికాధిపతులైన నండూరి రామ మోహనరావు, పురాణం సుబ్రహ్మణ్యశర్మ, తుర్లపాటి కుటుంబరావు, ఏటుకూరి బలరామమూర్తి, సి. రాఘవాచారి, స్వాతి బలరాం, కూచిమంచి సత్యసుబ్రహ్మణ్యం… ఇలా పలువురు నా సాహితీకృషికి దోహదం చేశారు.
నా వీడ్కోలు సభలో నగర మేయరు టి. వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. “పద్మనాభరావు ఆకాశవాణికి పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసరు” అని ఆయన తర్వాతి కాలంలో 1997లో అన్నారు. ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, విశాలాంధ్ర, ఆంధ్రజ్యోతి వారపత్రిక, స్వాతి వారపత్రికలలో నా రచనలు ప్రచురించారు. నగర ప్రముఖులైన జంధ్యాల శంకర్, జి. సమరం, చెన్నుపాటి విద్య, జి.యస్.రాజు తదితరులు నా అభిమానవర్గంలో చేరారు.
అప్పుడు ఆఫీసులో మాకు డైరక్టరు యం. శివప్రకాశం (తమిళులు). ఆఫీసులో నేను కూచున్న పెద్ద హాలులో నా పక్కనే వోలేటి వెంకటేశ్వర్లు సంగీతం ప్రొడ్యూసర్‌గా కూచొనేవారు. అటుపక్క చల్లా ప్రసాదరావు. యన్.సి.హెచ్. కృష్ణమాచార్యులు, జగన్నాథాచార్యులు, అన్నవరపు రామస్వామి, వి.బి. కనకదుర్గ, నండూరి సుబ్బారావు. సి. రామ మోహనరావు వంటి నిలయ కళాకారులు ఒక వెలుగు వెలుగుతున్నారు.
విజయవాడ వదిలిపెట్టడం నాకిష్టం లేకపోయినా ఉషశ్రీ కోరిక మేరకు కడపకు అకడెమిక్ సంవత్సరం ప్రారంభంలో సిద్ధపడ్డాను. పిల్లల అడ్మిషన్లకు అది అనుకూల సమయం. ఉషశ్రీ ఢిల్లీ వెళ్ళి ఆర్డర్లు తెచ్చుకొన్నారు. ప్రయాగ రామకృష్ణ, కొప్పుల సుబ్బారావులు ఆ సమయంలో వార్తావిభాగంలో న్యూస్ రీడర్లుగా చేరారు. కొప్పుల సుబ్బారావు వ్రాతపరీక్షకు పేపరు తయరు చేసిన బృందంలో నేనూ ఉన్నాను. తూమాటి దోణప్ప గారిని ఇంటర్వ్యూ బోర్డు మెంబరుగా నాగార్జున విశ్వవిద్యాలయానికి వెళ్ళి నేనే పిలుచుకొని వచ్చాను. యూనివర్సిటీలోని ఆకురాతి పున్నారావు, బొడ్డుపల్లి పురుషోత్తం, యార్లగడ్డ బాలగంగాధరరావు, టి. నిర్మల వంటి దిగ్దంతులు తెలుగు శాఖలో ఆచార్యులుగా పని చేస్తున్నారు. బి. సర్వేశ్వరరావు గారు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్. ఐఎఎస్ ఆఫీసరు డి. మురళీకృష్ణ రిజిస్ట్రారు. యూనివర్సిటీ ఆచార్యులను ప్రసంగాలకు ఆహ్వానించాను. అదొక సాంస్కృతిక వాతావరణంగా ప్రసారాలు పుష్టినందుకొన్నాయి.
బి.ఆర్. పంతులు, ఆర్. విశ్వనాథం వంటి మిత్రులు లోగడ నాతో కడపలో మైత్రి నెరపారు. ఇప్పుడు వారితో విజయవాడలో కలిసి పని చేస్తున్నాను. పున్నమ్మతోటలో పాత భవనాలలో డ్రామా రికార్డింగులు జరిగేవి. బయట ఓ పెద్ద బోధివృక్షం ఉండేది. దాని చుట్ట్టూ సిమెంటు తిన్నె ఉండేది. దాని మీద కూచొని డ్రామా రిహార్సల్సు జరిగేవి. నేను కూడా డ్రామా ఆడిషన్‌లో సెలెక్టు అయ్యాను. 1978లో ఎలాంటి ఆర్భాటం లేకుండా కొత్త భవనాలలోకి ప్రవేశించాము.
రెండో దఫా కడపలో (1980 జూన్ నుంచి 1982 అక్టోబరు వరకు): నేను 1980 జూన్‌లో కడప వచ్చేనాటికి డి. బాలకృష్ణ అసిస్టెంట్ స్టేషన్ డైరక్టరుగా ఉన్నారు. స్టేషన్ డైరక్టరుగా ఎవరినీ నియమించలేదు. నేను చేరిన మూడో రోజు ఆదివారం. బాలకృష్ణ ఇంట్లో యథాలాపంగా మాట్లాడుతున్నాం. ఇంతలో హైదరాబాదు స్టేషన్ డైరక్టరు నుండి ఫోన్. కొద్ది రోజుల క్రితం సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో ఢిల్లీలో చనిపోయారు. కర్నూలు జిల్లా నందికొట్కూరు సమీపంలోని ‘సంగం’ నదీ సంగమంలో ఆయన అస్థి నిమజ్జనం చేయబోతున్నారు. రేపు ఉదయం 11 గంటలకు అక్కడికి చేరుకొని ఒక రేడియో నివేదిక తయారుచేయమని బాలకృష్ణకు ఆదేశాలు వచ్చాయి.
ఎదురుగా నేను కూచున్నాను గాబట్టి ఆ ప్రయాణం నా మీద పడింది. ఒక పాత మెటాడార్ వ్యాన్‌లో రికార్డింగ్ ఇంజనీరుతో కలిసి బయలుదేరాను. మధ్యలో వ్యాన్ చెడిపోయింది. ఎలానో ‘సంగం’ చేరాను. అప్పటి రాష్ట్రమంత్రి దామోదరం మునుస్వామి అస్థికల కలశాన్ని నదీ సంగమం – మూడు పాయలు కలిసే చోట భక్తి శ్రద్ధలతో వేద మంత్రాల మధ్య నిమజ్జనం చేశారు. నేను ఆయనను, ఇతర ప్రముఖులను ఇంటర్వ్యూ చేశాను. నందికొట్కూరులో మా కజిన్ సీతారామారావు ద్వారా వ్యాన్ రిపేరు పూర్తి చేశాం. ఎలానో అర్ధరాత్రి కడప చేరాం.
కడపలో గొల్లపూడి మారుతీరావు:
1980 చివరలో గొల్లపూడి మారుతీరావు మదరాసు నుండి కడపకు బదిలీ మీద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్‌గా వచ్చారు. కొద్ది నెలల్లో ఆయనకు అక్కడే స్టేషన్ అసిస్టెంట్ డైరక్టరుగా పదోన్నతి కల్పించారు. నేను తెలుగుశాఖ ప్రొడ్యూసర్. అయన వారాంతాలలో మదరాసు వెళ్ళేవారు. బ్రహ్మచారిత్రయంగా అప్పట్లో కడపళో వోలేటి పార్వతీశం, కలగా కృష్ణమోహన్‌లు (డిప్యూటీ ఆఫీసర్లు గానూ), కపర్ది ఎనౌన్సరు గాను ఒకే రూమ్‌లో ఉండేవారు. వారి రూమ్‌లోనే గొల్లపూడి కలిసిమెలసి ఉండేవారు. కలిసి భోంచేసేవారు. ఆదివారాలు మదరాసు. అప్పట్లో 6 రోజుల పనిదినాలు. కోడి రామకృష్ణ గొల్లపూడితో చర్చలకు వచ్చినప్పుడు వారిద్దరూ హోటల్ రూములో దిగేవారు. ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ సినిమా ప్రారంభ దినాలవి.
‘ఆడది’ నాటకం:
పినిశెట్టి వ్రాసిన ఆడది (స్త్రీ పాత్ర లేని నాటకం)లో నేనూ, గొల్లపూడి, గోపి, ఆరవేటి పాల్గొన్నాం. గొల్లపూడి యజమాని. నేను వారింట్లో వంటవాణ్ణి. నాటకంలో నేను తయారు చేసి యిచ్చిన కాఫీ రుచి చూసి సరిగా లేదని గొల్లపూడి నన్ను చెంప మీద వాయించే సన్నివేశం వుంది. రిహార్సల్స్‌లో ఊరికే చేయి తగిలించేవారు. స్టేజి మీద ఆయన నా చెంప వాయించారు. “ఏంటి? ఇలా చేశారు?” అంటే, ‘మూడ్’ వచ్చిందన్నారు. అప్పట్నించి నేను ‘నాటకాలు’ మానేశాను.
మేం రిహార్సల్స్ చేసేటప్పుడు కోడి రామకృష్ణ కూడా ఆసక్తిగా చూశారు. ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ 1981లో విడుదలైంది. నేను, గొల్లపూడి కలిసి ఆ సినిమా చూశాము. మేమిద్దరం రేడియోలో వారం వారం ‘బావగారి కబుర్లు’ ఐదు నిముషాలు చేసేవారం.
“ఏవండోయ్! బావగారూ! రావాలి! రావాలి!” అని పిలుస్తూ సమకాలీన విషయాలమీద ఆశువుగా మాట్లాడేవాళ్ళం. విజయవాడ కేంద్రంలో నండూరి సుబ్బారావు, సి. రామ మోహనరావు రోజూ ఈ బావగారి కబుర్లు చేసేవారు. స్క్రిప్టు ఇంద్రగంటి శ్రీకాంతశర్మ రోజూ వ్రాసేవారు. ప్రొడ్యూసర్‌గా లాంఛనంగా నేనది చూసి ‘సరే’ననేవాణ్ణి.
ఒక వారం మారుతీరావు మదరాసు నుండి రాలేదు. ఆ వారం ‘బావగారి కబుర్లు’ మరొకరితో కలిసి చేయడం నాకిష్టం లేదు. ఒక తమాషా ఆలోచన కలిగింది. “ఏవండోయ్! బావగారూ!” అని నేను అనేశాను. బావగారికి కోపం వచ్చిందనీ, ఏమీ సమాధానం చెప్పడం లేదనీ సంభాషణని పొడిగిస్తూ, ఆ ఐదు నిముషాలు లాగించాను. గొల్లపూడి ఆ ఆలోచనను మెచ్చుకొన్నారు.
మరో విచిత్రమైన సన్నివేశాం చెప్పుకోవాలి. గొల్లపూడి వారాంతంలో కడప మీదుగా మదరాసు వెళ్ళే బొంబాయి మెయిల్‌లో రాత్రి పది గంటలకు కడపలో ఎక్కేవారు. ఒక్కొక్కసారి రిజర్వేషన్ దొరికేది కాదు. ఆయన సినీనటుడు గాబట్టి టీ.సీ.లు ఎలానో సర్దుబాటు చేసేవారు.
మేము నిత్య సంభాషణలో ఇప్పటికీ ‘బావగారూ’ అనే సంబోధించుకుంటాం. ఒకరోజు ఆయనకు రిజర్వేషన్ దొరకలేదు. అప్పట్లో చీఫ్ టి.టి.ఇ.గా గాజుల వీరయ్య ప్రసిద్ధులు. మంచి ఫోటోగ్రాఫరు. నా మిత్రులు. గొల్లపూడితో నేనిలా అన్నాను:
“బావగారూ, మిమ్మల్ని టి.సి. వచ్చి అడిగితే ‘వీరయ్య గారు నాకు బాగా తెలుసు’ అని మీరు చెప్పండి. అందరూ ఆయనను గౌరవిస్తారు” అని హితవు చెప్పాను. ఆ రాత్రి మెయిల్ ఎక్కిన గొల్లపూడి సరాసరి బెర్త్ మీద పడుకొన్నారు.
టి.సి. వచ్చి – ‘టికెట్ సార్!’ అన్నాడు.
“రిజర్వేషన్ లేదండీ! వీరయ్య నాకు బాగా ఫ్రెండ్” అన్నారు గొల్లపూడి.
“అలాగా సార్! వీరయ్య మీకు ఎలా ఫ్రెండ్?” అని తర్కించాడు.
“ఎలా ఏంటండీ…” అని ఏదో చెప్పబోయారు.
“నేనే వీరయ్యను మారుతీరావు గారూ!” అన్నాడు వీరయ్య.
హాస్యం పండించే ఈ సన్నివేశాన్ని గొల్లపూడి ఒక సినిమాలో వాడుకొన్నారు. సత్యనారాయణ ఒక సినిమాలో పెళ్ళిపందిట్లో అందరినీ పలకరిస్తూంటాడు. ఒక ప్రసిద్ధ వ్యక్తి తనకు తెలుసుసనీ, డాబుసరిగా మాట్లాడుతుంటాడు.
ఆ ప్రసిద్ధ వ్యక్తి – “నేనయ్యా! ఫలానా!” అంటాడు.
***
గొల్లపూడి నేనూ కలిసి ఓ సంవత్సరం కడపలో పనిచేశాం. ఆయన ‘అమ్మ కడుపు చల్లగా’ ఆత్మకథలో ముచ్చటించిన ఓ విషయం వివరాలు చెబుతాను. ఆ సంవత్సర కాలంలో మేమిద్దరం కలిసి రాయలసీమలో ఎన్నో దినోత్సవాలను రికార్డు చేశాము. మంత్రాలయంలో ఆరాధనోత్సవాలు, శ్రీశైలంలో శివరాత్రి కళ్యాణోత్సవాలు, తిరుమల బ్రహ్మోత్సవాలు – మూడూ మరపురాని సంఘటనలు.
శ్రీశైలానికి వెళుతూ మేమిద్దరం నంద్యాలలో ఒక హోటల్లో టిఫిన్ చేస్తున్నాం. అదే సమయంలో గొల్లపూడికి మదరాసులో బాగా సుపరిచితుడైన వ్యక్తి వచ్చి కలిసాడు.
“మారుతీరావు గారూ! నేను అన్నగారికి (యన్.టి.రామారావు) జోస్యం చెప్పాను. ఆయన త్వరలో (1982) రాజకీయాలలోకి రాబోతున్నారు. ఒక పెద్ద పదవి అధిష్ఠిస్తారు” అంటూ వివరాలు చెప్పారు. ఆ చెప్పిన వ్యక్తి బి.వి. మోహన్‌రెడ్డి.
ఆ క్షణంలో మేము, ఆయన మాటలు విశ్వసించకపోయినా, తర్వాత తర్వాత తెలుగుదేశం పార్టీ స్థాపన, 1983 జనవరి 9న ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం, మోహన్‌రెడ్డి మంత్రిగా చేరడం విశేషంగా జరిగిపోయాయి.
తొలి మంత్రివర్గంలో కడపతో మాటు పాటు కోఆపరేటివ్ కాలనీలో షటిల్ బ్యాడ్మింటన్ ఆడిన సింగిరెడ్డి రామమునిరెడ్డి రాష్ట్ర ఆరోగ్యశాఖామంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం మరొక హైలైట్.
కడపలో రెండో దఫా ప్రసార ప్రయాణంలోనే నేను ఢిల్లీలో యూ.పి.ఎస్.సి. నిర్వహించిన అసిస్టెంట్ స్టేషన్ డైరక్టర్ ఇంటర్వ్యూలకు 1981 చివరలో హాజరయ్యాను.
(వివరాలు మరో సంచికలో…).