[box type=’note’ fontsize=’16’] సంచిక విశ్వవేదిక శీర్షికలో భాగంగా ఓ విశిష్టమైన వ్యక్తిని పరిచయం చేస్తున్నారు శ్రీమతి వి. శాంతి ప్రబోధ. శీర్షిక నిర్వహణ శ్రీ సారధి మోటమఱ్ఱి. [/box]
వైవిధ్యమైన హాబీ
[dropcap]వి[/dropcap]శ్వవీధుల సంచారంలో 2018లో నాకు పరిచయమైన ఓ విశిష్టమైన వ్యక్తిని మీకు పరిచయం చేయాలని నా అభిలాష.
ఆస్తి, అంతస్తు, డబ్బుకి ప్రాధాన్యత ఇస్తున్న ప్రస్తుత సమాజంలో ఆయనొక భిన్నమైన వ్యక్తి. ఆయనదొక వైవిధ్యమైన హాబీ.
ఆయనకు డబ్బు యావ లేదు. రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ని, విశ్రాంతి సమయాన్ని మరో దగ్గర ఇన్వెస్ట్ చేసి సంపాదించాలన్న ఆశ లేదు.
తన కోసం, తన కుటుంబం కోసం మాత్రమే కాకుండా తన పిల్లల పిల్లల కోసం తపన పడుతూ హైరానా పడి ప్రతి పైసా కూడబెట్టే తరంలోని వ్యక్తి, కానీ ఆయన వ్యక్తిత్వం అది కాదు. తన బాధ్యతలు పూర్తి చేశాక తన సమయం తన కోసం తన హాబీల కోసం వెచ్చిస్తూ సంతృప్తిగా సంపూర్ణంగా జీవించడం.
ఆయనే ఊటుకూరి వెంకట సత్యనారాయణ.
ఆస్ట్రేలియా వచ్చిన తెలుగు వాళ్ళలో మొదటి తరం వ్యక్తిగా పరిచయం అయ్యారు ఊటుకూరి సత్యనారాయణ గారు.
ఆయనతో పరిచయం యాదృచ్ఛికంగా జరిగింది.
అది 2018 నవంబర్ 3, 4 తేదీల్లో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభలకు ప్రయాణిస్తున్న సందర్భం. సారథి మోటమర్రి గారు వెంకట్ అంకుల్‌గా పరిచయం చేశారు.
అప్పటి నుంచి ఊటుకూరి వారి గురించి తెలుసుకోవాలని అనుకుంటూనే కాలం కదిలిపోయింది. కానీ అనుకున్న పని జరగలేదు.
2022 ఫిబ్రవరిలో నేను సిడ్నీలో ఉన్న సమయంలో సారధి మోటమర్రి గారితో నా ఆలోచన పంచుకున్నాను.
ఊటుకూరి వెంకట సత్యనారాయణ గారితో మాట్లాడటానికి ఆయన మొబైల్ నెంబర్ ఇచ్చారు. అలా ఊటుకూరి సత్యనారాయణ గారితో ముచ్చటించే అరుదైన అవకాశం వచ్చింది. ఇప్పుడు వారిని మీకు పరిచయం చేసే సమయం వచ్చింది.
1960లలో మాతృదేశం నుంచి ఆస్ట్రేలియా వెళ్లిన ఊటుకూరి సత్యనారాయణ గారు న్యూ సౌత్ వేల్స్ యూనివర్సిటీలో మైనింగ్ ఇంజనీరింగ్ ఆచార్యులుగా పని చేసి విశ్రాంత జీవితం గడుపుతున్నారు. సిడ్నీ నగరంలో ఆయన నివాసం.
మాతృభాషపై అభిమానం, తెలుగు సినిమాలపై మక్కువ గల ఊటుకూరి వారు తీరిక సమయాన్ని అర్థవంతంగా గడపడం విశేషం. అదే నన్ను ఆకట్టుకుని మీతో పంచుకునేలా చేసింది.
ఇరవై ఏళ్లకు పూర్వం అంటే ఉద్యోగంలో ఉన్న సమయంలోనే కొత్త హాబీకి ఆయనలో బీజం పడింది. అది దిన దిన ప్రవర్ధమానమైంది.
అందుకు కారణం ఒక పుస్తకం అంటే నమ్ముతారా.. అవును, ఒక పుస్తకం.
ఆ పుస్తకం పేరు ‘వెయ్యిన్నొక్క సినిమాలు’. అది ఊటుకూరి సత్యనారాయణ గారిని విపరీతంగా ఆకర్షించింది. వెంటనే ఆ పుస్తకాన్ని కొనేశారు.
ఆ పుస్తకం ఆయనలో కొత్త ఆలోచనలు తెచ్చింది. ఇంతకీ ఆ పుస్తకంలో ఏముంది?
పేరును బట్టి అది సినిమాలకు సంబంధించినది అని తెలుస్తుంది కదా.. నిజమే, సినిమాలకు సంబంధించినదే. అందులో ఎంపిక చేసిన వెయ్యిన్నొక్క సినిమాలకు చెందిన వివరాలు ఉన్నాయి.
ఆ వివరాలు ఏంటంటే ఆ సినిమా ప్రొడ్యూసర్, డైరెక్టర్, యాక్టర్స్, కథ, అవార్డులు, కొన్ని ఫోటోలు మొదలైనవి.
ఆ పుస్తకాన్ని ఆయన చూసింది అమెరికాలో. తర్వాత ఆస్ట్రేలియా వెళ్లిపోయారు. కానీ ఆయనలో పుస్తకం ఇచ్చిన ఆలోచనలు కొనసాగుతూనే ఉన్నాయి.
అప్పటి నుంచి ఇటు వంటి పుస్తకం తెలుగులో ఉన్నదా అని వెతికారు. లేదని తెలుసుకున్నారు. తెలుగులో కూడా ఇలా ఉంటే బాగుంటుంది అనుకున్నారు. అలా చేయాలంటే తెలుగు సినిమాలు సేకరించాలి. ఎలా? ఉన్నదేమో తెలుగు నేలకు వేల మైళ్ల దూరంలోని ఆస్ట్రేలియాలో.
కాబట్టి ముందు ఇంగ్లీషు సినిమాలతో పని మొదలు పెట్టాలని అనుకున్నారు. వెయ్యి సినిమాల సేకరణ లక్ష్యంగా పని మొదలు పెట్టారు.
సినిమా, సినిమా పాటల మీద మక్కువతో అప్పుడప్పుడు సినిమా వీడియోలు, క్యాసెట్లు కొనే అలవాటు ముందునుంచీ ఉన్నది. అందువల్ల అప్పటికి ఆయన వద్ద కొద్ది సినిమాలు ఉన్నాయి.
సినిమాల ఎంపికలో భాగంగా ఎన్నో వీడియో క్యాసెట్‌లు అమ్మే షాపులు తిరిగారు. వీడియో క్యాసెట్లు కొన్నారు.
అప్పట్లో పే టీవీ అని ప్రైవేట్ ఛానెల్ సిడ్నీలో ఉండేది. అందులో సినిమాలు వేసేవారు. 24 గంటలు వచ్చేవి. వాళ్ళు ఇచ్చిన కేటలాగ్ ప్రకారం ఇంగ్లీష్ సినిమాలు వచ్చేవి. దీనికి సబ్స్క్రయిబ్ చేసి ఆ ఛానెల్ పెట్టించుకున్నారు. తన దగ్గర లేని సినిమాలు పే టి వి ఛానెల్ లో వస్తే రికార్డు చేయడం మొదలు పెట్టారు.
అర్థం చేసుకోండి. ఎన్ని క్యాసెట్లు కొన్నారో.. ఎన్ని కాసెట్స్ రికార్డు చేశారో..
ఆ తర్వాత డీవీడీలు రావడం మొదలైంది. చాలా డీవీడీలు కొన్నారు. చాలా డబ్బు ఖర్చు చేశారు.
ఒక ఒరిజినల్ క్యాసెట్ కావాలంటే కనీసం పది డాలర్లు ఖర్చు చేయాలి. డీవీడీలు వచ్చిన కొత్తలో ఒకదానికి 30 డాలర్స్ ఉండేది. రికార్డు చేసుకోవడానికి కొత్త క్యాసెట్ కావాలి దానికి మూడు డాలర్లు ఉండేది.
అలా వాటికోసం చాలా డబ్బు ఖర్చు చేశారు. మొత్తానికి చాలా సినిమాలు సేకరించారు.
కొన్నాళ్ళకి కాసెట్స్ అన్ని డిజిటల్ చేశారు. అందుకోసం డబ్బు మాత్రమే కాదు గంటల కొలది సమయం వెచ్చించారు.
ఆయన హాబీ సజీవం చేసుకున్నారు.
తెలుగు సినిమాల విషయానికి వద్దాం.
అప్పట్లో తెలుగు సినిమా వీడియో క్యాసెట్లు వచ్చేవి. కానీ అవి ఆస్ట్రేలియా లో ఎక్కడ నుంచీ వస్తాయి?
మొదట్లో ఇండియా వచ్చినప్పుడు క్యాసెట్ షాపుల చుట్టూ తిరిగి తీసుకెళ్లేవారు. అప్పటికే మాతృ దేశం నుంచి కొందరు తెలుగు కేసెట్లు తెప్పించేవారు. అవి అక్కడ ఉన్న తెలుగు మిత్రులు అందరూ కలిసి పంచుకునే వారు. అలా మిత్రుల దగ్గర ఉన్న కేసెట్లను కూడా రికార్డు చేసి పెట్టుకునేవారు సత్యనారాయణ గారు.
వీడియోలు అద్దెకు ఇచ్చే షాపులు ఉండేవి. కానీ తెలుగు వీడియోలు దొరకడం కష్టం. కొద్దికాలానికి ఇండియన్ షాప్స్‌లో తెలుగు వీడియో అద్దెకు ఇవ్వడం మొదలైంది.
కొన్నాళ్ళకి ఇండియాలో ఒక వీడియో షాప్ మూసేస్తుంటే ఆస్ట్రేలియాలోని ఇండియన్ షాప్ అతను కొన్నాడు. ఆ వీడియోలన్నీ సిడ్నీ తీసుకెళ్ళాడు. అతని దగ్గర సత్యనారాయణ గారు అద్దెకు తెచ్చుకుని ఎన్నో రికార్డు చేశారు. ఆ క్రమంలోనే లైలా మజ్ను వంటి అనేక క్లాసిక్ సినిమాలు అయన చేతికి వచ్చాయి.
వీడియో పోయి డివిడిలు వచ్చినట్లే తర్వాత కాలంలో ఇంటర్నెట్ వచ్చింది. జెమిని వాళ్ళు ఇంటర్నెట్ ఛానల్ పెట్టారు.
జెమిని వాళ్ళు బోలెడు సినిమాలు వేసేవారు. వాళ్ళ దగ్గర ఏడాదికి 200 డాలర్లు కట్టి సబ్స్క్రయిబ్ చేసుకున్నారు ఊటుకూరి. వాళ్ళు వేసిన సినిమాల్లో తన దగ్గర లేనివి రికార్డు చేసుకునేవారు. ఇంటర్నెట్ నుండి ప్రత్యేక పద్ధతిలో రికార్డు చేసుకొనేవారు. ఏడాది సబ్‌స్క్రిప్షన్ పూర్తయిన తర్వాత రెండు నెలలు ఉచితంగా ఇస్తానని చెప్పి మరో ఏడాదికి సబ్స్క్రైబ్ చేయించుకున్నారు నిర్వాహకులు. 200 డాలర్లు కట్టారు. కానీ కొద్ది సమయంలోనే మూసేసాడు. దీంతో ఊటుకూరి వారు 200 డాలర్లు నష్టపోయారు.
తర్వాత తెలుగు వన్‌కి సబ్స్క్రయిబ్ చేశారు. వాళ్ళ దగ్గర చాలా సినిమాలు ఉన్నాయి. వాళ్లు వేసిన సినిమాలు రికార్డు చేసేవారు. చివరికి వాళ్ళు దుకాణం మూసేసారు.
తర్వాత ఎం టీవీ వచ్చింది. ఎం టీవీ అన్ని భాషల ఛానల్స్ వచ్చేవి. అందులో తెలుగు చానళ్ళు ఈటీవీ, జెమినీ, మా టీవీ, విస్సా వంటివి ఉండేవి. వాళ్ళు ఏ సినిమా వేస్తే అది తన దగ్గర ఉందో లేదో చూసి లేకపోతే రికార్డు చేసేవారు.
అలా చాలా కలెక్ట్ చేశారు. తర్వాతి కాలంలో ఎం టీవీ లేదు. యూట్యూబ్ వచ్చింది. కలెక్ట్ చేసి యూ ట్యూబ్‌లో పెట్టేస్తున్నారు
ఊటుకూరి సత్యనారాయణ గారు సేకరించడం మొదలు పెట్టిన ఆ రోజుల్లో యూట్యూబ్ లేకపోవడం వల్ల రికార్డు చేసేవారు. యూట్యూబ్ వచ్చాక అందులో వెతికి రికార్డు చేసేవారు. అలా దాదాపు మూడు వేల పైగా తెలుగు సినిమాలకు సంబంధించిన సమాచారం ఆయన లైబ్రరీలో ఉంది.
తెలుగు సినిమాలు ఇంగ్లీష్ సినిమాలు మాత్రమే కాదు తమిళ సినిమాలు కూడా సేకరించారు. అందులో ముఖ్యమైనవి సావిత్రి సినిమాలు.
కొన్ని తమిళ సినిమాలకి మలేషియా వాళ్ళు కాపీ రైట్ తీసుకున్నారు. అవి ఇండియాలో దొరకవు. కానీ మలేషియాలో దొరుకుతాయి. ఇండియాలో దొరకనివి మలేషియా నుంచి తెప్పించుకున్నారు.
అలా తన దగ్గర లేని సినిమాలు ఎంత దూరం నుంచైనా సేకరించడం ఆయన పాషన్‌ని తెలుపుతుంది.
ఆ తర్వాత కాలంలో కొన్ని ఏళ్ల సమయం వెచ్చించి అన్నిటినీ డిజిటలైజ్ చేశారు.
ఇప్పుడు యూట్యూబ్‌లో పెట్టే సినిమాలు అసహజంగా అనిపిస్తాయి. వెడల్పు ఎక్కువగా. ఎత్తు తక్కువగా పిక్చర్ సరిగా ఉండదు. కానీ సత్యనారాయణ గారి కలెక్షన్ యూనిక్. ఎందుకంటే ఒరిజినల్ సినిమా ఉన్నట్లే ఉంటుంది.
తాను సేకరించిన సినిమాలకు సంబంధించిన సమాచారం అంతా డేటా బేస్‌లో పెట్టారు. తన వద్ద ఉన్న సినిమాల సమాచారం పిడిఎఫ్ చాలా మందికి ఉచితంగా ఇచ్చారు.
తెలుగు సినిమా టకీలా యుగం ప్రారంభం నుంచి వచ్చిన తెలుగు పాటల పుస్తకాలు సేకరించారు. ఆ పాటల పుస్తకాలను ఐదు సంపుటాలుగా భారతదేశంలో రిలీజ్ చేశారు.
ఊటుకూరి వారి సినిమా సమాచారం సేకరణ గురించి అమెరికాలో ఉన్న ఒక పబ్లిషర్‌ను చేరింది. అతను ఉత్తరాదికి చెందిన హిందీ వ్యక్తి. అతను ప్రింట్ చేస్తాను అన్నాడు. ఆసక్తి ఉన్న చాలా మందికి ఉచితంగా ఇచ్చి ఉన్న సత్యనారాయణ గారు ఆ విషయం అతనికి చెప్పారు. అయినా అతను వినలేదు. ఊటుకూరి వారి వెంటపడి 800 పేజీలు రెండు వాల్యూంలుగా సినిమా సమాచారం ప్రింట్ చేసాడు. అది అమెజాన్‌లో ఉంది. ఈ బుక్ కావాలన్న వాళ్ళకి ఈ బుక్, అచ్చులో కావాలన్న వాళ్లకు అచ్చులో అమెజాన్ వాళ్ళు అందిస్తున్నారు.
మనలో ఎందరో సినిమాలు చూస్తారు. సినిమా పాటలు వింటారు. ఇష్టపడతారు. ఏవో కొద్దిగా సేకరిస్తారు. కానీ ఊటుకూరి సత్యనారాయణ గారిలా కొన్ని సంవత్సరాల సమయం ఖర్చు చేయరు.
1932 నుంచి ఇప్పటివరకు వచ్చిన తెలుగు సినిమాల పేర్లు, వాటి నిర్మాత, దర్శకుడు, ఛాయాగ్రహణం, ఏ బ్యానర్ వంటి సమాచారంతో పాటు సంక్షిప్త కథ, సినిమా పాటలు మనకి అందుబాటులో ఉన్నాయి.
నిజానికి ఇటువంటి పని విశ్వవిద్యాలయాలు, అకాడెమీలు లేదా సినిమా ఇండస్ట్రీ చేయాల్సి ఉంటుంది. కానీ ఒక వ్యక్తి చేయడం గొప్ప విషయం.
అమూల్యమైన ఈ కృషికి ఎన్ని డాక్టరేట్ లైనా ఇవ్వొచ్చేమో..
ఇప్పుడు సత్యనారాయణ గారి డేటాబేస్ సినిమాలపై పరిశోధన చేయాలనుకునే పరిశోధక విద్యార్థులకు గొప్ప వనరు.
సత్యనారాయణ గారు చేసింది ఆయన మనసుకు నచ్చిన పనే కావచ్చు. చాలా ఇష్టపడి చేసి ఉండొచ్చు. ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చి చేసి ఉండొచ్చు. ఇప్పుడదంతా ఆయన ఒక్కరిదే కాదు తెలుగు ప్రజానీకానిది.
ఆయన ఏర్పాటు చేసిన డిజిటల్ లైబ్రరీ ప్రపంచానికి ఒక్క మీట దూరంలోనే ఉంది. ప్రపంచం నలుమూలల ఉన్న 15 కోట్ల తెలుగు వారు అందుకోవచ్చు. రేపటి గమనానికి కొత్త ఆలోచనలు అందించవచ్చు.
ఊటుకూరి సత్యనారాయణ గారి ఇన్నేళ్ల శ్రమని అభినందించడం మాత్రమే కాదు మనం చేయాల్సింది, ఈ విలువైన కృషి కాలగర్భంలో కలసిపోకుండా కాపాడుకోవలసిన బాధ్యత సినిమా ఇండస్ట్రీతో పాటు సినీ ప్రేమికులందరిదీ.
మీకు తెలుగు సినిమాల సమాచారం కావాలంటే ఇంటర్నెట్ ఆర్కైవ్ (archive.org), catalogue.nla.gov.au లో పొందవచ్చు.
వి. శాంతి ప్రబోధ
వి. శాంతి ప్రబోధ గారు పుట్టింది పెరిగింది ఉత్తర తెలంగాణా జిల్లాల్లో. ప్రస్తుత నివాసం హైదరాబాద్.
తరతరాల దురాచారంపై జోగిని (నవల), అమర్ సాహసయాత్ర (బాలల నవల), కాంపింగ్ (బాలల బొమ్మల కథ), గడ్డిపువ్వు గుండె సందుక, ఆలోచనలో.. ఆమె (కథా సంకలనాలు) ప్రచురణ. బతుకుసేద్యం, నిష్కల, నీలాకాశంలో నిధి (బాలల నవల), కథలు, కవితలు త్వరలో ప్రచురణకు సిద్ధమవుతున్నాయి.