[వృత్తి రీత్యా వైద్యులైన డా. ఎచ్. ఎస్. అనుపమా కన్నడంలో రచించిన జీవితకథని శ్రీ చందకచర్ల రమేశ బాబు అనువదించి ‘నేను.. కస్తూర్‌ని’ అనే పేరుతో సరికొత్త ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నారు.]
~
భీతావహ స్వాగతం
[dropcap]“మీ[/dropcap]రు దిగండి. భాయి తరువాత వస్తారు” అంటూ మమ్మల్ని దింపారు. కానీ, పడవలోనే కొంతమంది తెల్లజాతివారు ఆయన పైన చేయి చేసుకున్నారు. దిగినాక కూడా గలభా జరిగింది. ఇది నాకు అనుకోనిది. నా భర్త అన్నిమంచి పనులనే చేస్తున్నారు, అందుకే తెల్లవాళ్ళతోపాటు అందరూ ఆయనకు మద్దతుగా ఉన్నారు అనే నా అభిప్రాయం ఉండింది. బుద్ధిమంతులైన తెల్లవాళ్ళు ఎందుకు మీ పైన దాడి చేశారు అని భాయినే అడిగాను. తెల్లగా ఉన్నవాళ్లంతా బుద్ధిమంతులని నీకు ఎవరు చెప్పారు అని నన్నే ప్రశ్నించారు. చెయ్యి చేసుకున్నవాళ్ల పైన పోలీసులకు ఫిర్యాదు చేయడానికి కూడా ఆయన ఒప్పుకోలేదు. ఎవరో ఒత్తిడివల్ల తప్పుగా అర్థం చేసుకుని ఇలా చేశారు, నిజం తెలుసుకున్నాక తప్పకుండా మారిపోయి తమతో వస్తారు అని వాదించారు.
డర్బానులో భాయి ఇంటిని తీసుకున్నారు. పెళ్ళయి 15 ఏళ్ళయినా మేమిద్దరమే ఒక ఇంట్లో ఇంతవరకూ ఉండలేదు. రాజకోట్ లోని ‘కాబా గాంధీ లో దేలో’ లో అందరూ కలిసున్నాము. ఒకే వంటిల్లు, పిల్లలను నేను కాకపోతే వాళ్ళ పెద్దమ్మలో, పిన్నమ్మలో లేదా ఇతర ఇంటి సభ్యులెవరో చూసుకునేవారు. వంటిల్లూ అంతే. కానీ ఇక్కడ అలా కాదు. అంతా మాదే బాధ్యత. బయటినుండి సామాను, ఇతర వస్తువులు తీసుకుని రావడానికి ఒకడుండేవాడు. కానీ, వాడికి మా భాష తెలియదు. మేమున్నది భారతీయులుంటున్న వీధి కాదు. సముద్రతీరంలోని బ్రిటిష్ వాళ్ల కాలనీలో. బ్యారిష్టర్ ఇంటివాళ్ళు కదా! అందుకే అక్కడ. మోక భాయి క్లయింట్లలో ఎక్కువ భాగం ముసల్మానులే. భాయికి ముసల్మానులు చాలా మంది దోస్తులవసాగారు. వారికి మా భాష అర్థమయ్యేది. కానీ వాళ్ళ ఆడవాళ్ళు బయటికి రావడం అతి తక్కువ కావడం వల్లనేమో వాళ్ళకు దగ్గరవడం చాలా కష్టమయ్యింది.
భూమిపైకి చేరామో లేదో నొప్పులు ప్రారంభమయ్యాయి. ఇంట్లో ఆడవాళ్ళు ఎవరూ లేరు. కానీ గాంధీ భాయి ఇసుమంతైనా భయపడలేదు. ఆయనకు వైద్యుల పరిచయం ఉండింది. ఆస్పత్రికి వెళ్ళారు. ఎవరినో తీసుకొచ్చారు. నేను భయపడినట్టుగా కాన్పు కష్టమేమీ కాలేదు. తరువాత కొన్ని మందులు తీసుకొచ్చి ఇచ్చారు. బిడ్డను వాడి తండ్రే ఎత్తుకుని. దించి, పడుకోబెట్టి చాకిరి చెయ్యసాగారు. “పురుటి మైలను అక్కడి నుండి వచ్చేటప్పుడే వదలి వచ్చావు. గుర్తుందిగా” అంటూ నవ్వించారు. అవును. ఈ దూరదేశంలో ఎవరికి వృద్ధి, ఎక్కడి మైల? పోరాదనడానికి ఏ దేవుడి గుడి ఉంది? నేను తెచ్చుకున్న ఒకట్రెండు దేవుడు పటాలు తప్ప, ఈ ఇంట్లో దేవుడిని పెట్టడానికి గూడు కూడా లేదు. దేవుడి మూల కూడా లేదు. తులసి మొక్క కూడా లేదు.
మొదటి రెండు వారాలు బిడ్డను స్నానం చేయించడానికి ఒక ఆయా ఉండేది. తరువాత హరి నాన్న అన్నిటినీ తామే స్వయంగా చేసేవారు. నాకు సరళమైన ఆహారం వేడి వేడిగా వండి పెట్టేవారు. పిల్లలికి వంట చెయ్యడం, వాళ్ళకు తినిపించడం, గుడ్డలు ఉతకడం, చదివించడం అన్నిటినీ చేసేవారు. అందరి మలం కుండలనూ ఆయనే ఖాళీ చేసి, కడిగి పెట్టేవారు. వీటన్నిటినీ నా పిల్లల తండ్రి నేర్చుకున్నదెప్పుడు? మధ్య మధ్యలో ఆయన స్నేహితుల భార్యలు వచ్చి వెళ్తున్నా కూడా నా సేవలు మాత్రం ఆయనే. ఇంట్లో ఉన్నప్పుడు ఒక సారి కూడా నాతో పాటు ఉండని ఈయన ఎంత ధైర్యంగా బాలింతరాలిని, బిడ్డను నిభాయించారు తెలుసా? బిడ్డ – బాలింతరాల గురించి జాగ్రత్తల గురించి తను చదివిన పుస్తకాన్ని నాకు తీసుకొచ్చి చూపించారు. కానీ ఉత్త పుస్తకం మాత్రమే చదివి అంత ధైర్యం వస్తుందా, మనసుండాలి కదా? ఆయన నాకు సేవలు చేసేటప్పుడు నాకు కళ్ళ నీళ్ళు వచ్చేవి. కూరగాయలు తరుగుతూ, కడుగుతూ అత్తగారికి సహాయం చేసే మామగారి గుర్తు వచ్చేది. భర్త మీది గౌరవం, ప్రేమ పెరిగాయి. “ఇలాంటి భర్త ఎన్నటికీ తప్పుచెయ్యరు” అనిపించింది అప్పుడే. నేను, నా బిడ్డ మంచం పైన పడుకున్నప్పుడు గొంతుక్కూర్చుని నేల తుడిచే ఆయన బింబం చివరిదాకా నా మనసులో ఉండిపోయింది.
మూడు నెలల తరువాత నేను లేచి కూర్చుని, అన్ని పనులు చేయసాగాను. “ఇక మీరు మీ కోర్టు కచేరి చూసుకోండి. నేనింక పూర్వం మాదిరిగా అయ్యాను” అన్నాను. కానీ భాయి తన గుడ్డలు తామే ఉతుక్కోసాగారు. నేను లోపలికి వచ్చినా ఇదేం ఖర్మ అనిపించింది. డబ్బులు మిగిలించడానికి, స్వయం పరిపూర్ణులవడానికి తమ క్షవరం తామే చేసుకునేవారు. అయితే మేమంతా వచ్చి ఖర్చు పెంచామా? కష్టంగా ఉందా? అని అడిగాను. “అలా అనకు కస్తూర్. నా ఆదాయంలో నీ వంతు, పిల్లల వంతూ ఉండనే ఉంది” అన్నారు.
అదేమైనా ఇలా మారిన భాయి మాత్రం నన్ను ఇబ్బంది పెట్టింది మాత్రం నిజం.
అక్కడి ఇంటికి, అక్కడి పనులకు కుదురుకోవడానికి కొంత సమయం పట్టింది. అక్కడికంటే కొన్ని సౌకర్యాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ వస్తువులు, ఉపకరణాలు, పనులు వేరుగా ఉన్నాయి. మొత్తానికి చెప్పాలంటే అక్కడి ఆడవాళ్ళ పని సులువు. కానీ, రాజకోట్ ఇంట్లో బావగారి పిల్లలు, తోడికోడళ్ళు, పనివాళ్ళు అంతా ఉండేవారు. పిల్లలకు ఆడడానికి, మాట్లాడుకోవడానికి ఉండేది. ఇక్కడ పిల్లలకు బయటి పిల్లలతో జతగా వెళ్ళడానికి భాష రాకపోవడం వల్ల కొంత సమస్యగా మారింది. నాకూ అంతే. భాషదే సమస్య. గుజరాతీ తెలిసిన భర్త, పిల్లలు, తెలిసినవాళ్ళతో మాత్రమే నా సంభాషణ.
ఇంటికి ఎవరెవరో వచ్చేవారు. వారికంతా భాయి నన్ను పరిచయం చేసేవారు. వాళ్ళకు ఏమివ్వాలో అని నేను కంగారు పడుతుంటే భాయి తామే చాయ్ చేసేవారు. తిండిపోతు గుజరాతీలకు సింపుల్ ఆహరం ఎప్పుడూ స్ఫురించదు. ఇంట్లో డబ్బాలలో ఎప్పుడూ ఒకటని కాదు, నాలుగు రకాల చిరుతిళ్ళు నింపి పెట్టడం ఇంటి ఆడవాళ్ళ పని. కానీ ఇక్కడ “ఏముందో అదే ఇచ్చెయ్యి. లేకున్నా ఫరవాలేదు” అనేవారు భాయి. ఆయన ఆహారం ఎలా సరళంగా ఉండేదో, ఇతరులకు తయారు చేసి ఇచ్చేది కూడా అంతే సరళంగా ఉండేది. నోటి నిండా మాటలు, చర్చలు వాళ్ళ తిండిని లాగేసుకున్నాయి. కానీ మా ఆహార సరళతను పిల్లలకు అలవాటు చెయ్యడం మాత్రం కొంచెం కష్టమయ్యింది.
ఆ సమయానికి ఒక యుద్ధం వచ్చేసిందమ్మా! జులు అనే ఆదివాసీ తెగ వాళ్ళకు బ్రిటిషర్లకు మధ్య. భాయి నాకు చెప్పిన ప్రకారం ఆ దేశం వాస్తవానికి జులువాళ్ళదే. మన దేశానికి వచ్చినట్లే బ్రిటిష్ వాళ్ళు ఆ దేశానికి వెళ్ళి పాతుకుని పోయి అంతా తమదే అనేశారు. కానీ, బ్రిటిష్ వాళ్ళను ఎదురించి, అందరూ కలిసి, సంఘీభావంతో, వాళ్ళ భాష నేర్చుకుని పోరాడడానికి జులు తెగ వాళ్ళకు చేతకాలేదట. వారి మాదిరిగానే ఇంకా కొన్నిఆదివాసీ గుంపులు అక్కడున్నాయట. బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ నేలలో ఉన్నారు కాబట్టి వారికి పరిపాలించడం నేర్పాలి, అంతవరకూ వారిని సరిగ్గా చూసుకోవాలి అనేది భాయి అభిమతం.
ఈ యుద్ధంలో భారతీయులు ఎవరి పక్షం వహించాలి అనే విషయం పై ఒకింత చర్చ జరిగింది. చివరికి ఏ బ్రిటిష్ వారి నుండి మనం మన హక్కులను అడుగుతున్నామో, వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి సహాయపడి మన కర్తవ్యాన్ని నిర్వహించాలి అని తీర్మానం జరిగింది. యుద్ధభూమిలో గాయపడ్డవారికి సేవ చెయ్యడానికి వెయ్యిన్ని నూరుగురు మన వాళ్ళను తీసుకుని బయలుదేరారు భాయి. వీరశూరత్వపు పనులకు భారతీయ హిందువులు పనికి రారు అనే భావన బ్రిటిష్ వారికుండింది. దాన్ని మార్చేలా మనం పని చెయ్యాలి అనేవారు భాయి. మైళ్ళ కొలది పరుపుల పైన మోసుకుని గాయపడినవాళ్ళను సాగించారు.
రామదాస్ పుట్టిన తరువాత, 1899 కాబోలు, డర్బాన్ పొలిమేరల్లో ఉన్న ఒక క్రైస్తవ మఠానికి లేదా ఆశ్రమానికి వెళ్ళాము మేము. లండన్ శాకాహర సంఘం వాళ్ళ ద్వారా వాళ్ళ పరిచయం జరిగింది. వేల కొలది విస్తీర్ణమున్న ప్రదేశం. నాకైతే చాలా నచ్చింది ఆ ప్రదేశం. అరవై మంది సన్యాసినులు, నూట ఇరవై బ్రదర్లు, వెయ్యికి పైగా ఆఫ్రికా నల్ల జాతివాళ్ళు అక్కడ ఉన్నారు. కూరగాయలు, పళ్ళు, ధాన్యాలు ఇలా తమకు కావలసిన ధాన్యం, పప్పులు వాళ్ళే పండించుకుంటున్నారు. అందరూ శాకాహారులే. ప్రవహించే నీటినుండి నూనె, పిండిమరలు నడుస్తున్నాయి. వ్యవసాయం, శుభ్రత, కట్టడాల పని, పశుపోషణ, పాల ఉత్పత్తి, కడగడం, మేతకు తీసుకెళ్ళడం మొదలైన అన్ని పనులను తామే చేసుకునేవారు. వాళ్ళదే ముద్రణాలయం కూడ ఉంది. ఎవరూ ఎక్కువ కాదు, ఎవరూ తక్కువ కాదు, ఆడా మగ, నల్లవాళ్ళు, తెల్లవాళ్ళు అనే భేదభావన లేదు. అన్ని పనులు, అన్ని దైహిక శ్రమలు పంచబడ్డాయి. అక్కడికి వెళ్ళొచ్చిన తరువాత ఎన్నో రోజుల వరకూ భాయి నోట దాని గురించే మాట. “మన వేదకాల ఋషుల ఆశ్రమాలు ఇలాగే ఉండేవా? మనమూ ఒక ఆశ్రమం నిర్మించాలి. మనం కూడా ఇలాంటి ఆశ్రమం ఏర్పాటు చెయ్యాలి” అనే ఒక గట్టి కలను పట్టుకున్నారు.
అప్పుడే జరిగిన మరొక్క సంఘటన గురించి చెప్పాలి. ఇప్పుడు తలచుకుంటే నా గురించి నాకే సిగ్గుగా అనిపిస్తుంది. అలాగని చెప్పక పోవడం కూడా తప్పే. తమిళం మాట్లాడే గుజరాతి వంటాయన, ఆయన పేరు విన్సెంట్ లారెన్స్ అని. ఆయన మా ఇంట్లోనే ఉండేవారు. భాయి స్నేహితులు, సత్యాగ్రహి. మా ఇంటి పద్ధతి ఎలాంటిది అంటే ఇంట్లోని వారంతా వంతు ప్రకారం అన్నిపనులు, అందరి పనులు చెయ్యాలి. మలం కుండ ఖాళీ చేసే పని కూడా అందరికీ పంచబడింది. కానీ, నాకెందుకో అతడి మలం కుండ కడగడం చాలా కష్టం అనిపించింది. కారణం ఆయన క్రైస్తవుడవడానికి ముందు పంచముడు. అస్పృశ్యత యొక్క కష్టాలు, బాధలు నాకు తెలిసినా ఆయనతో పాటు బ్రతకడం నాకు ఇబ్బందిగా తోచింది. అలా నేను ఆయనది కడగనని చెప్పాను. నేను కానీ, భాయి కానీ పంచముల మలం కుండను ఖాళీ చెయ్యడం నాకు నచ్చలేదు. అలా భాయితో చెప్పేశాను. గాంధీ భాయికి ఎలాంటి కోపం వచ్చింది అంటే నన్ను బరాబరా లాక్కుంటూ వెళ్ళారు. నేను ఏడుస్తున్నా లెక్క చెయ్యక “ఇంట్లో ఇలాంటి వ్యతిరేకతను నేను ఎన్నడూ సహించను. ఉండాలనుకుంటే ఉండు, లేకుంటే బయల్దేరు” అంటూ అరిచారు. అప్పుడు నేను దేవదాసును కడుపులో మోస్తున్నాను. “నా పుట్టింటివాళ్ళు, బంధువులు, నావాళ్ళు అంటూ వేరే ఎవ్వరూ లేని దేశానికి, ఇంత వరకూ చూడని దేశానికి, తెలియని ఊరికి తీసుకొచ్చి వెళ్ళమని అనడానికి మీకు సిగ్గుగా అనిపించడం లేదా?” అని మెల్లగా అడిగాను. కోపంతో బుసకొట్తున్న భాయి ఒక్కసారిగా మౌనం దాల్చారు. చివరికి మా ఇద్దరికీ మా తప్పులు తెలిసొచ్చాయి. లోపలికి వెళ్ళాము. ఇద్దరం పరస్పరం క్షమాపణలు చెప్పుకున్నాము.
కొట్టిన దెబ్బల గాయాలు మానవచ్చు, పడి లేచిన గాయాలు మానవచ్చు, కానీ నాలుక చేసిన గాయం మాత్రం సులభంగా మానదు. ఆరోజు మేమిద్దరమూ గాయపడ్డాము. బహుశా అదే చివరిది. తరువాత ఎప్పుడూ భాయి నా పైన కోపగించుకోలేదు. ఆయన, నేను ఇద్దరూ తప్పు చేశాము. రెండు వైపులనుండీ జరిగిన పాపానికి భాయి ఎన్నెన్నో ప్రాయశ్చిత్తాలు చేసుకున్నారు. మళ్ళీ మా మధ్య ఇలాంటి సంఘటనలు జరగలేదు.
ఇలా భాయి పోరాట వీరుడుగా కొత్త కొత్త ప్రయోగాలతో తయారవుతూ, కొత్త కలలను కంటూ ఉన్నప్పుడు, రామదాసుకు మూడు సంవత్సరాలుగా ఉన్నప్పుడు దేవదాస్ పుట్టాడు. అప్పుడూ అలాగే. బాలింతను చూసుకుంది నా పిల్లల నాన్నే.
1901, దేవదాసుకు సంవత్సరం నిండుతున్నప్పుడు భాయి భారతదేశానికి వెళ్ళాలన్నారు. ఇక్కడ అదెంత కీర్తి సంపాదించారంటే ఇక్కడే ఉంటే ఉత్త డబ్బులు ముద్రించే యంత్రంగా మారతాను అని ఆయనకు భయం వేసింది. భారతదేశంలో లాయరుగిరి నడుపుతూ, అక్కడి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనే ఆకాంక్ష కూడా ఉండవచ్చు. చివరికి అవసరం వచ్చినప్పుడు వస్తానని తమ మిత్రులకు మాట ఇచ్చి తిరిగి వెళ్ళే సిద్ధతలో పడ్డారు. మమ్మల్ని పంపడానికి ముందు, మిత్రులు, బంధువులు వాళ్ళిళ్ళకు, సంస్థకు భోజనానికి పిలిచిందే పిలిచింది. వెళ్ళిన చోటల్లా కానుకలిచ్చారు. తిరిగి వెళ్ళేటప్పుడు వాటినన్నిటినీ భాయి భారతీయ ట్రస్ట్‌కు ఇచ్చేశారు.
దక్షిణ ఆఫ్రికా నుండి భారతానికి బయలుదేరాము. దార్లో మారిషస్ ద్వీపం కనిపించింది. అక్కడ దిగి సుమారు ఒక నెల అక్కడ ఉన్నాము. చాలా సుందరమైన ద్వీపం అది. అన్నివైపులా సముద్రం. పోరుబందర్ కంటే నీరు తేటగా కనిపించింది. నేను పిల్లలను చూసుకుంటూ ఉంటే భాయి చర్చల్లో మునిగేవారు. అక్కడ చాలా మంది భారతీయులున్నారు. వాళ్ళంతా భాయితో మాట్లాడడానికి, సలహా అడగడానికి, చర్చలు చెయ్యడానికి కాచుకున్నారు. తరువాత అక్కడ నుండి బయలుదేరి పోరుబందర్ చేరుకున్నాము. నా బంధువులను, కాబా మామగారి ఇంటివాళ్ళను ఒకసారి చూసి మాట్లాడి మళ్ళీ రాజకోట్‌కు వెళ్ళాము. భాయి ఎక్కడా ఎక్కువ రోజులు ఉండలేదు.
మమ్మల్ని అక్కడ వదిలేసి భాయి కలకత్తాకు వెళ్ళారు. అక్కడినుండి రంగూన్ కూడా వెళ్ళివచ్చారట. కలకత్తాకు వచ్చి గోపాలకృష్ణ గోఖలే గారిని కలిశారు. గోఖలేగారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. భాయికి గురుతుల్యులు. వారిద్దరికీ ఒకరంటే ఇంకొకరికి చాలా గౌరవం, విశ్వాసం. భాయి ఒక నెల ఆయనతో ఉన్నారు. దక్షిణ ఆఫ్రికాలోని భారతీయుల పరిస్థితి ఏమిటి అని అందరితో చర్చించారు. బనారస్, ఆగ్రా, జైపుర్, పాలంపుర్ తరువాత మరేవో ఊళ్ళకు వెళ్ళి అక్కడ నుండి ఉత్తరాలు రాసేవారు. చివరికి మూడవ క్లాసులో రైలులో ప్రయాణించి రాజకోట్ వచ్చారు.
రాజకోట్‌లో లాయరుగిరి ప్రారంభించారు. నాలుగైదు నెలలు గడచుండాలి అంతే, ముంబైలోనూ ఒక కచేరి తెరవమని సలహాలు వచ్చాయి. అలాగే అని భాయి ముంబైలోనూ ఒక కచేరి తీసి రెంటి మధ్యా తిరుగుతూ వచ్చారు. ఐదారు నెలలయ్యాయేమో ! కేసులు వస్తున్నాయి. నిదానంగా భాయి మన నేలలో నిలదొక్కుకుంటున్న సూచనలు కనిపించసాగాయి. అంతలో 1902 డిసెంబర్‌లో మళ్ళీ దక్షిణ ఆఫ్రికానుండి వెంటనే రమ్మని కాల్ వచ్చింది. రోజూ ఇరవైనాలుగు గంటలూ పట్టుపట్టి, వదలకుండా పోరాడి, పోరాటం గురించే ఆలోచించేవాళ్లు అక్కడ ఎవరూ లేరు. కాబట్టి భాయి అవసరం అక్కడి వాళ్ళకు కలిగింది. భాయి డర్బాన్‌కు వెళ్ళారు. పిల్లలకు ఆరోగ్యం బాగుండలేదు. కాబట్టి వెంటనే వెంట వెళ్ళలేమని మేమంతా ఇక్కడే ఉండిపొయ్యాము.
ఆయన అక్కడ, మేము ఇక్కడ రాజకోట్‌లో. మళ్ళీ నా ముందు మాదిరి జీవితం కొనసాగింది. అక్కడి ఇల్లు, పనులు, జనాలకు ఐదు సంవత్సరాలు కుదురుకున్న నాకు ఇక్కడి జీవితం కొంచెం కష్టమనిపించింది. అన్నిటి కంటే ముఖ్యంగా శుభ్రత వైపు మనవాళ్ల లక్ష్యం తక్కువ అనే అంశం ఇబ్బంది అనిపించసాగింది. మన శరీరం, మన పరిసరాల శుభ్రత బాగుంటే మాత్రమే మన వ్యక్తిత్వంలో కూడా నిజాయితీ కనిపిస్తుంది అని భాయి నమ్మేవారు. సత్యం, అహింస సాధించడానికి శుభ్రత కూడా ఒక సాధనం అని ఆయన భావించారు. నాకూ అదే అలవాటయ్యింది. కానీ మన ఇళ్ళల్లో మడే శుచి అనుకున్నారు. మనుషులను ముట్టకుండా ఉండడం, తాకించుకోకుండా ఉండడమే శుభ్రత అనుకున్నారు.
నాలో ఇంకో మార్పు కలిగింది. ఆఫ్రికాకు వెళ్ళివచ్చే వరకు, వ్రతాలు, పండుగల రోజులతో నేను రోజులను లెక్కించుకునేదాన్ని. సంవత్సరం పేరుతో చెప్పేదాన్ని. ఇప్పుడు క్యాలెండర్, తేదీలు చూడడం నేర్చుకున్నాను. ఇంటి ఆడవాళ్ళు ఎప్పుడూ చీరలు, నగలు, వంటలు, పూజల తయారీలు, తిళ్ళు, మడి, సూతకం ఇలాంటి విషయాలే మాట్లాడుతుంటే నాకు ఆ విషయాలలో ఆసక్తి ఉండేది కాదు. తలాడిస్తూ కూర్చునేదాన్ని. వాళ్ళ మాటల్లో వినిపించే విషయాలైనే ఏవి? ఇళ్ళల్లోని జగడాలు, మొగుడూ పెళ్ళాల మధ్య విరసాలు, అత్తమామల ఆరళ్ళు, ఎవరెవరి వ్యాపార రహస్యాలు, రహస్య సంబంధాలు, విరసాలు, స్నేహాలు ఇలా. ఆడవాళ్లలో ఎవరికీ తమ జాతి, ఊరు, వ్యాపారాల నుండి ఆవల, మా సముద్రానికవతల ఏం జరుగుతోందని కాని, దాన్నిండి మన పైన జరిగే పరిణామాన్ని గురించి కానీ ఏమీ తెలియదు. నేను చెప్పడానికి ప్రయత్నించినా వాళ్ళకు ఆసక్తి కలిగేది కాదు. కళ్ళు ఇంతింత చేసుకుని చూడడమే తప్ప వాళ్ళకు అర్థమయ్యేదే కాదు. రాజకీయాలన్నీ మగవాళ్ళకి, మనకెందుకు ఆ తలనొప్పి అనేవారు. నేను కూడా భాయి చెప్పిన పాఠం వినుండకపోతే అలాగే ఉండేదాన్ని.
ఇలాగే ఆలోచించేటప్పుడు అమ్మాయ్! భాయి లేకుండా ఏర్పడిన ఒంటరితనం నన్ను బాధపెట్టేది. నలుగురు పిల్లలతో మన దేశంలోనే ఉన్నా ఒంటరిగా ఉన్నట్టు అనిపించేది. ప్రతి విషయానికి భాయి ఉండుంటే దీనికి ఏమనేవారు అనే ఆలోచన వచ్చేది. అందులోనూ ఇంట్లో ఆచరించే మడి, మైల, అంట్లు లాంటి విషయాలు అర్థంలేనివి అనిపించేవి. ఇంటి పనులకు వచ్చేవాళ్ళ పైన చూపే తాత్సార భావన చూడడానికే అయ్యేది కాదు. మా ఇంటి మలం కుండలను తీయడానికి వచ్చే భంగిలను ముట్టుకోవడం అటుంచి, ఎవరూ మాట్లాడించేవాళ్ళే కారు. భజనలలో అన్నీ మంచి మంచి సూత్రాలనే పాడేవారు. కానీ ఎవరూ ఆచరించేవారు కాదు. పంచముల మలాన్ని ఎత్తే తను, భాయి ఎక్కడ? మడి మడి అంటూ తనవాళ్ళనూ ముట్టుకోని రాజకోట్ వాళ్ళెక్కడ? రోజులు గడిచేకొద్దీ, భాయి ఎందుకు గొప్పవాడో మనసుకు నాటుకోసాగింది. నాకు ఆయన అర్థమవుతున్నారే తప్ప ఆయనలా మారడం ఎంత కష్టమో అర్థమవసాగింది. ఆయన వద్దకు వెళ్ళాలని ఆతురపడసాగాను.
ప్రతి వారం భాయి నుండి దీర్ఘమైన ఉత్తరం వచ్చేది. నాకు ఆఫ్రికా రాజకీయాలు, పోరాటాలు అంతో ఇంతో తెలిసిన కారణంగా ప్రతి ఉత్తరంలో వచ్చే తాజా తాజా వార్తల గురించి కుతూహలం ఉండేది. ట్రాన్స్‌వాల్‌లో ఆంగ్లేయులు మన వాళ్ళ పైన అనేక చట్టాలను తీసుకురావాలనుకున్నందున గాంధీ భాయి ఈ సారి ప్రిటోరియా, జొహాన్స్‌బర్గ్ వాళ్ళకి అవసరమయ్యారు. అందుకోసం, డర్బాన్ వదిలేసి జొహాన్స్‌బర్గ్ కోర్ట్‌లో లాయరుగా నమోదు చేసుకున్నారు. అక్కడే ఎనిమిది గదులున్న ఒక పెద్ద ఇంట నివాసమున్నారు. అంత సేపటికి మళ్ళీ జులు అల్లర్లు మొదలయ్యాయి. గాయపడ్డ బ్రిటిష్ వారిని చూసుకుంటూనే మానవతా దృక్పథంతో జలువాళ్ళనూ ఆస్పత్రికి చేర్చేవారు. పక్కపక్కన, ఇరుకైన ఇళ్ళలో వాసిస్తున్న భారతీయుల కాలనీలలో ఆరోగ్య సమస్యలు కలగవచ్చని, వెంటనే ఆరోగ్య సదుపాయాలను సమకూర్చాలని ఆరోగ్య శాఖకు ఉత్తరం రాశారు. అంతలో ప్లేగ్ వచ్చింది. భారత దేశంలోనూ ప్లేగ్ మహమ్మారి అక్కడక్కడ బలిగొంటున్నా దక్షిణ ఆఫ్రికాలో మాత్రం అది భారతీయులనే ఎక్కువగా బాధించింది. దీనికి ఇలా ఇరుకిరుకు వసతులు, శుభ్రత వ్యవస్థ సరిగా లేకపోవడమే కారణం అని భాయి వాదన. సరైన చికిత్స లేక, ఆస్పత్రుల్లో స్థలం లేక చాలా ప్రాణ నష్టాలు సంభవించాయి. స్వయం సేవకుల సహాయంతో భాయి ప్లేగ్ రోగ చికిత్సా కేంద్రాన్ని ప్రారంభించారు. రోగుల బాగోగులు, శుభ్రతల పనులను తనే స్వయంగా చేయసాగారు. చీపురు పట్టుకుని చిమ్ముతున్న బ్యారిస్టర్‌కు చాలా మంది తెల్లవాళ్ళు మద్దతు పలికారు.
(సశేషం)