సామెత కథల ఆమెత-10

0
3

[తెలుగు సామెతల ఆధారంగా అల్లిన చిన్న కథల ఫీచర్ నిర్వహిస్తున్నారు శ్రీమతి మద్దూరి బిందుమాధవి.]

చూసిన పాముని కన్నాన పడనివ్వడు

[dropcap]పా[/dropcap]ముకి తన కన్నం (పుట్ట).. ఎలుకకి దాని కలుగు.. పక్షికి దాని గూడు రక్షణని ఇస్తాయి. అందులో ఉన్నంత వరకు వాటి జీవితానికి ప్రమాదం ఉండదు.

అలా కాకుండా ఆహారం కోసం బయటికి వచ్చిన పాముని, ఎలుకని చూసిన మనుషులు దానిని తిరిగి కన్నంలోకి వెళ్ళనివ్వకుండా వెంటాడి చంపే వరకు నిద్రపోరు.

అలాగే ఆడ గాలి తగిలితే చాలు.. తారతమ్యం చూడకుండా.. అవకాశం దొరకపుచ్చుకుని వారిని వదిలిపెట్టకుండా రొచ్చులోకి లాగే మగవారి విషయంలో ఈ సామెతని వాడతారు.

***

ఉసిరికాయలు కొందామని రైతు బజార్‌కి వెళ్ళాను. “సుశీ” అని ఎవరో పిలిచినట్టనిపించి వెనక్కి తిరిగి చూశాను.

ఎవరో నా వయస్సావిడే చెయ్యూపుతూ పిలుస్తోంది. ఎవరో పోల్చుకోలేక పోతున్నా! ఈ మధ్య కాలంలో చూసిన మొహం కాదు. ఎవరా అని నేనాలోచిస్తుండగా.. నవ్వుతూ దగ్గరకొచ్చి భుజం మీద చెయ్యేసి

“నన్ను గుర్తు పట్టలేదు కదూ! అవునులే మనం ఒకరినొకరం చూసుకుని దాదాపు పాతికేళ్ళు దాటింది. రెడ్డి కాలేజిలో మనం కలిసి చదివాం. ఇప్పుడు గుర్తొచ్చానా? నా పేరు నళిని. నల్లి.. నల్లి అని నన్నేడిపించేదానివి” అన్నది.

“అరే ఎంత మారిపోయావ్? బాగా లావయ్యావు. మొహం, చెంపలు కూడా బాగా ఉబ్బినట్టున్నాయ్. మొహంలో ఉండే భాగాలన్నీ చిన్నవై కూరుకుపోయినట్టున్నాయ్. నీ కళ్ళు ఎప్పుడూ చిన్నవే అయినా ఇప్పుడు ఇంకా లోతుకి పోయి.. చలిమిడి ముద్దలో నొక్కేసిన కొబ్బరి, పల్లీ ముక్కలల్లే ఉన్నాయ్. ఇప్పుడు నల్లి లాగా లేవు. చిన్న ఏనుగు పిల్ల లాగా బొద్దుగా, ఆరోగ్యంగా ఉన్నావు” అన్నాను.. ఏనుగులాగా అనేది రెండు చేతులు ఎత్తి యాక్షన్ చేసి చూపిస్తూ.. ఏమనుకుంటుందో అనైనా ఆలోచించకుండా!

“నువ్వేం మారలేదే! అదే పర్సనాలిటీ.. అందుకే గుర్తు పట్టగలిగాను. ముందు అవునా.. కాదా అని సందేహించాను. ఓ ప్రయత్నం చేస్తే పోలేదా అని సాహసించి పిలిచాను. అదే మాట తీరు.. అదే ధోరణి!” అంది నవ్వుతూ!

“ఏమనుకోకే. ఆరోగ్యం బానే ఉందా? ఈ మధ్య అందరికీ ఒబేసిటీ వచ్చేస్తోంది” అన్నాను.

“ఒళ్ళు తప్ప భగవంతుడి దయ వల్ల ఇతర రోగాలేం లేవు. సరే ఇంతకీ ఎక్కడుంటున్నావ్? నేను ఈ మధ్యనే ఇక్కడికి ట్రాన్స్‌ఫర్ అయి వచ్చాను. ఇక్కడే అమీర్‌పేట ‘దివ్య శక్తి’ అపార్ట్‌మెంట్స్‌లో ఉంటున్నాను. నువ్వెక్కడ ఉంటున్నావ్” అన్నది.

“బేగంపేటలో. ఇక్కడ పబ్లిక్ స్కూల్లో మ్యాథ్స్ టీచర్‌గా పని చేస్తున్నాను. మా వారు సికింద్రాబాద్‌లో బ్యాంక్‌లో పని చేస్తున్నారు” అన్నాను.

అలా చాలా కాలం తరువాత కలిసిన స్నేహితులం ఫోన్ నంబర్లు ఇచ్చి పుచ్చుకుని, సెలవు తీసుకుని ఎవరి ఇళ్ళకి వాళ్ళం వెళ్ళిపోయాం.

***

“సుశీ ఇంట్లో ఉన్నావా? అటు పని మీద వస్తున్నాను. ఒక్క అరగంటలో మీ ఇంట్లో ఉంటాను. మీ ఇల్లు ఒకసారి చూసి వెళితే ఇంకోసారి తీరుబడిగా రావచ్చు” అన్నది నళిని ఫోన్ చేసి.

అన్నట్టే అరగంటలో వచ్చింది.

కుశల ప్రశ్నలయ్యాక “ఇంట్లో ఎవరూ లేరా? నిశ్శబ్దంగా ఉంది” అన్నది.

“మా వారు, మా అబ్బాయి క్రికెట్ మ్యాచ్ చూట్టానికి స్టేడియంకి వెళ్ళారు. అమ్మాయి దీప తన రూంలో ఏదో చదువుకుంటున్నట్టుంది” అన్నాను.

కాఫీ తాగి ఇల్లంతా తిరిగి చూస్తూ.. గోడకి ఉన్న మా ఫ్యామిలీ ఫొటో చూస్తూ ఆగి పోయింది. నేను ఆలోచనలో పడ్డాను.

డ్రాయింగ్ రూమ్ లోకి వెళ్ళి కూర్చున్నాక “మీ ఫ్యామిలీ ఫొటో చూశాకే మీ ఆయన ఎవరో తెలిసింది.. ఇలా చెప్పచ్చో లేదో తెలియదు..” అంటూ నసుగుతోంది నల్లి ఉరఫ్ నళిని.

“ఏం ఫరవాలేదు చెప్పు” అన్నాను సాలోచనగా!

***

“నేను వైజాగ్‌లో పని చేసేటప్పుడు.. ఆ రోజు మా కొత్త మేనేజర్ జాయిన్ అవుతున్నాడని ఆఫీసులో అందరూ ఎదురుచూస్తుండగా.. మగవారయినా ఒకసారి చూపు నిలిపే ఒక ఆకర్షణీయమైన వ్యక్తి ఆఫీసులో అడుగు పెట్టాడు.”

“మేనేజర్ అంటే నలుపు-తెలుపు కలనేత జుట్టుతో మధ్య వయస్కుడెవరో వస్తారని ఎదురు చూస్తుంటే ఈయన దిగాడు. రూపమే కాదు బుద్ధుల్లో కూడా మన్మథుడే అని మాకు తెలియటానికి ఆట్టే సమయం పట్టలేదు.”

“ఒక రోజు నా కొలీగ్.. మాలతి గారు.. రూపం ఓ మోస్తరు బాగానే ఉంటుంది. బుద్ధిగా.. సంసార పక్షంగా ఉంటుంది. మగవాళ్ళతో ఎక్కువగా మాట్లాడదు. అలాంటి ఆవిడ.. మేనేజర్‌తో పని ఉండి ఆయన చేంబర్ లోకి వెళ్ళింది. ఏం జరిగిందో.. ఉన్నట్టుండి జేవురించిన మొహంతో తలొంచుకుని గబ గబా బాత్‌రూంలోకి దూరి మొహం కడుక్కొచ్చింది. కళ్ళు ఉబ్బి ఏడ్చినట్టున్నాయ్. ఏం జరిగిందని అడగ్గా.. అడగ్గా కాసేపటికి మేనేజర్ చెయ్యి పట్టుకుని అసభ్యంగా మాట్లాడాడని కళ్ళు తుడుచుకుంటూ చెప్పింది.”

“అలాగే ఇంకా ఒకరిద్దరు లేడీ స్టాఫ్‌తో.. వయసు తారతమ్యమైనా చూడకుండా అసభ్యంగా మాట్లాట్టం, మీద చెయ్యి వెయ్యటం చేశాడు. రాజకీయ నేపథ్యం ఉన్న ఒకావిడ.. ఆయన వెకిలిగా మాట్లాడాడని ఆయన మీద హెడ్డాఫీసులో కంప్లెయింట్ ఇచ్చింది. తరువాత ఆయన్ని ట్రాన్స్‌ఫర్ చేశారు. నేను ఎవరి గురించి చెప్పానో తెలుసుగా” అని ఆగింది.

తెలుసన్నట్టు మౌనంగా తలూపాను.

“నేను ఇలా చెప్పానని ఏమి అనుకోకే! నీ కూతురినయినా కూతురు లాగా చూస్తాడా.. లేక..” అని ఆగింది.

“అది మా అమ్మ దగ్గర కాకినాడలో ఉండి మెడిసిన్ చదువుకుంటోంది. ఇలాంటివి పైకి స్వంత వాళ్ళతో అయినా చెప్పుకోలేము. మా శైలు చిన్న పిల్లగా ఉండగా ఒకసారి ఇక్కడికొచ్చినప్పుడు మా అమ్మ గమనించిందనుకుంటా! చిన్నప్పటి నించి పిల్లని తన దగ్గరే ఉంచుకుని చదివిస్తోంది” అని ఆగాను.

ఆరు నెల్ల క్రితం జరిగిన సంఘటన కళ్ళ ముందు మెదిలింది.

***

మాకు పనిమనిషి చేసే బాగా నమ్మకస్థురాలు. రెండు మూడు ఇళ్ళల్లో పని ముగించుకుని.. ఆయన ఆఫీసుకి, నేను స్కూలుకి వెళ్ళాక వచ్చి పక్కింట్లో తాళం చెవి తీసుకుని పని చేసి వెళ్ళిపోతుంది.

ఆ అమ్మాయి పని చేసే ఒకింటి వాళ్ళు ఊళ్ళో లేరని ఈ వేళ ముందుగానే మా ఇంటికొచ్చింది.

“ఏమండీ కాఫీ చల్లారి పోతోంది. ఎక్కడున్నారు” అంటూ బెడ్ రూంలోకి వెళ్ళిన నాకు ఇల్లు చిమ్ముతున్న పనిమనిషి వంక తాగేసే కళ్ళతో చూస్తున్న శ్రీవారు కనిపించారు.

“ఏమండీ డిష్ వాషర్ కొందామండి. లింగమ్మకి ఈ మధ్య నాగాలెక్కువయ్యాయి. గిన్నెలు తోముకుని వంట చేసుకోవటం కష్టంగా ఉంది. రోజూ స్కూల్‌కి లేటవుతోంది” అన్నాను.

అలా ఇంట్లోకి లింగమ్మ స్థానంలో గిన్నెలు తోమటానికి డిష్ వాషర్, ఇల్లు చిమ్మి తడవటానికి రోబో, బట్టలుతకటానికి వాషింగ్ మిషన్ వచ్చి చేరాయి.

పది రోజులకొక సారి డస్టింగ్ చెయ్యటానికి వీరయ్య రావటం.. ఇలాంటి మార్పులతో ఇంట్లో పని కోసం ఆడవారిని పెట్టుకోవటం ఆగిపోయింది.

‘చూసిన పాముని (ఆడపిల్లని) కన్నాన పడనివ్వని (వదిలి పెట్టని)’ మొగుడిని (మగ వాడిని) కాపాడుకోవటానికి పెళ్ళాలు ఇలా ఎన్ని ట్రిక్కులు చెయ్యాలో? వారి బారి నించి ఎంత మంది ఆడవారిని కాపాడాలో? ఇంటి వరకు అయితే ఇల్లాలు ఏదో ఒకటి చేస్తుంది.

బయట ఎవరో ఒకరు దిమ్మతిరిగే నిర్ణయం తీసుకోకుండా వదిలేస్తారా? వాళ్ళ భరతం పట్టకుండా ఉంటారా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here