[ప్రసిద్ధ రచయిత్రి కలవల గిరిజారాణి గారు అందిస్తున్న ఫీచర్ ‘కలవల కబుర్లు’.]
[dropcap]చా[/dropcap]లా రోజులైంది ఇల్లు బూజులు దులిపి. ఈ రోజు వారాంతం.. పనికి ఆహార పథకంలో భాగంగా ఇంటిల్లిపాదినీ భాగస్వామ్యం చేసి, అక్కరలేని సామాను, అడ్డంగా ఉన్న సామాను సగానికి సగమైనా వదిలించేసుకోవాలని ధృఢనిశ్చయం చేసేసుకున్నాను.
టిఫిన్ చేసుకుని ఆ తర్వాత తిని స్టార్ట్ చేద్దామంటే దాదాపు గంట టైము వేస్టయిపోతుందని, గేటు బయట ‘గరమా గరమ్’ స్టాల్ వాడికి ఫోన్ చేసి ఐదు వడాపావులు, పావు గంటలో తెమ్మని ఆర్డర్ ఇచ్చాను. ఇదిగో దస్ మినిట్స్ అంటూ, రెండు గంటల తర్వాత తెచ్చి 100 రూపాయలు పట్టుకెళ్ళాడు. అరగంటలో ఇంత ఉప్మా కలియబెట్టుకుని తినేస్తే అయిపోయేదానికి.. 100 వదిలాయి.
సరే అసలు సంగతిలోకి వద్దాం.. అదే సర్దుకుపోదాం రండి అంటూ ఇంటిల్లిపాది సామూహికంగా చేపట్టిన కార్యక్రమంలో.. ముందుగా వంటింటి నుంచి మొదలెట్టాం.
కింద అరలో సామాను మొత్తం బయటకి లాగేసరికి, బూందీ దూసుకునే చట్రం బయటపడింది. ‘ఓసినీ, ఇక్కడుందా? మొన్న దీపావళికి బూందీ లడ్డూ చేద్దామనుకున్నాను. ఎంత వెతికినా కనపడకపోయేసరికి లడ్డూ కేన్సిల్ చేసి సున్నుండలు కట్టేసాను. ఇప్పుడు బయట పడింది’ అనుకున్నాను.
పోనీ, ఇప్పుడు బయట పెడదామనుకుని ఆ.. అయినా, ఇంక ఇప్పుడు దగ్గరలో పండగలేం లేవుగా! పండగొచ్చినపుడు గరిట లేదు. గరిటొచ్చినప్పుడు పండగ లేదు. మళ్లీ అక్కడే పెట్టేసి, వచ్చే దీపావళికి గుర్తుంచుకోవాలి. ఈ చట్రం గరిటె ఇక్కడుందని. అప్పుడు చేసుకుందాం. ఏంటో గరిటె కొని ఐదేళ్ళయింది. ఎప్పుడూ కూడా చేద్దామనుకున్నపుడు కనపడనే కనపడదు. ఎక్కడ పెట్టింది అప్పుడు గుర్తురాదు.. వెతికే ఓపికలూ, తీరికలూ ఉండి చావవు.
తర్వాత, కొన్ని ప్లాస్టిక్ డబ్బాలు పాతబడిపోయాయి.. పారేద్దామని పక్కగా సర్దిపెట్టానో లేదో.. అంతలోనే మారిపోయింది. ఏంటి మారిందంటున్నారా? ఇంకేం ఉంటుంది? నా మనసే.
‘ఇంకా నయమే, ఇరుగు పొరుగు ఎవరికైనా ఏదైనా పచ్చడో, పొడో, పెట్టివ్వడానికి ఉంటాయి. తిరిగి ఇవ్వకపోయినా ఫర్వాలేదు. ఉంచుంచు పారేయకు.’ అని గోలెట్టేసరికి అవి అలా మళ్లీ లోపలికి వెళ్ళిపోయాయి.
కానీ, అలా పెట్టిచ్చేటపుడు అప్పుడు మళ్లీ ఇవి కనపడవనీ తెలుసు.. మంచి డబ్బాల్లో పెట్టిస్తే అవి తిరిగి రావనీ తెలుసు.
ఇంతలో కనిపించింది.. ఏమిటీ? అప్పడెప్పుడో, పూర్వాశ్రమంలో పాత చీరలు వేసి స్టీలు సామాన్లు అమ్మేవాడి దగ్గర కొన్న టిఫిన్ కేరేజీ తాలూకు మూత.
ఆ మూత గతారునెలలుగా వెతికినా కనపడలేదు. హమ్మయ్య ఇప్పుడు మూత దొరికింది. ఔనూ! ఇంతకీ ఆ కేరేజీ ఎక్కడుందబ్బా? 🤔 మరోమాటు సర్దుళ్ళలో అది బయటపడుతుందిగా.. అందాకా దీన్ని దాచిపెట్టాలి. ఈ టిఫిన్ కేరేజీ మీదే ఇంటిల్లిపాది కన్నూ ఉంది. కనపడితే మూత పెడదామని కాదు, మూతతో సహా బయటకి విసిరేద్దామని చూస్తున్నారు. దీని వెనకాల శంకరాభరణంలో నిర్మలమ్మ మరచెంబు కథలాంటిదే ఉంది..
ఇప్పుడు చెప్పడం మొదలెడితే ఇల్లు సర్దుకునే యజ్ఞం ఆగిపోతుంది. మరోమాటు చెపుతా లెండి. అప్పటిదాకా ఈ మూతని మూడో అరలో ఇత్తడిగిన్నెలో దాచిపెట్టేసాను.
ఇత్తడి గిన్నె అంటే గుర్తొచ్చింది.. మానెడు ఉడికే అన్నం గిన్నె నుండీ సోలెడు పప్పు ఉడకపెట్టే గిన్నె దాకా వంశపారంపర్యంగా వచ్చిన సంపద.. పై అరలో బోర్లించబడివుంది. వాడము. పారేయము.. వాటిని తలచుకున్నప్పుడల్లా వీర బ్రహ్మం గారి కాలజ్ఞానంలో చెప్పిందే గుర్తొస్తుంది.
‘ఇత్తడి విలువ పెరిగి పుత్తడితో సమానంగా అవుతుందట’. బంగారం ఎలాగూ కొనలేకపోతున్నాము కదా అప్పుడు ఈ గిన్నెలన్నీ కరిగించి వడ్డాణం, కాసులపేరు, చంద్రహారాలు చేయించుకోవచ్చని, ఓసారి చింతపండుతో తళతళ తోమి మళ్లీ బోర్లించేసాను.
ఇక ఆ తర్వాత వదిలించేసుకుందామనుకున్న పాత కంచాలు, గిన్నెలు, కొన్ని సెంటిమెంట్లని జీర పోయిన గొంతుతో పలికించే సరికి, వదలలేక వాటినీ ఒకదాంట్లో ఒకటి పట్టకపోయినా పట్టించేసి పైకెక్కించేసాను.
స్టీలు బేసనూ, బిందె, గుంతల పళ్ళాలూ, అమితాబ్ బచ్చన్, జయాబాధురి డబ్బాలు.. నలభై ఏళ్ల క్రితం పెళ్లిలో, బహుమతిగా చదివింపులప్పుడు చదివించినవారి పేర్లు, తారీకుతో సహా ఎదుటపడేసరికి, వాళ్ళందరూ ఒక్కసారిగా కళ్ళముందు కనిపించి, పలకరించేసారు. వాళ్ళ ఆప్యాయతలకి తబ్బిబ్బైపోయి వాళ్ళు ఇప్పుడు ఎలాగూ లేరు.. కనీసం వాళ్ళ గుర్తుగా అయినా ఉంచుకుందాం అనుకుంటూ అటక మీద వారగా ఉంటే ఎవరికీ అడ్డం లేదులే అనుకుంటూ పైకి తోసేయడం జరిగింది.
ఆ ప్రకారంగా వంటయింటి సామాను ఓసారి బయట కొలువు తీరి మళ్లీ యథాస్ధానానికి చేరిపోయింది. ఇంతకీ వదిలించుకుందామన్న సామాను ఏదీ? ఏదీ లేదు.. మొత్తం అన్నీ కూడా, వదల బొమ్మాళీ అంటూ నన్ను, నా వంటింటిని వదలనంటున్నాయి.