[వాల్మీకి రామాయణం ఆధారంగా శ్రీ వేదాంతం శ్రీపతిశర్మ రచించిన ‘ఆదికావ్యంలోని ఆణిముత్యాలు’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]
ఆదికావ్యంలోని ఆణిముత్యాలు
153. శ్లో.
స్వయం కార్యాణి యః కాలే నానుతిష్ఠతి పార్థివః।
స తు వై సహ రాజ్యేన తైశ్చ కార్యైర్వినశ్యతి॥
అయుక్తచారం దుర్దర్శమ్ అస్వాధీనం నరాధిపమ్।
వర్జయంతి నరా దూరాత్ నదీపంకమివ ద్విపాః॥
యే న రక్షంతి విషయమ్ అస్వాధీనా నరాధిపాః।
తే న వృద్ధ్యా ప్రకాశంతే గిరయః సాగరే యథా॥
ఆత్మవద్భిర్విగృహ్య త్వం దేవగంధర్వదానవైః।
అయుక్తచారశ్చపలః కథం రాజా భవిష్యసి?॥
(అరణ్యకాండ, 33. 4, 5, 6, 7)
శూర్పణఖ రావణునితో:
రాజు స్వయంగా రాజ్యపాలనా విషయాలను పట్టించుకోనప్పుడు అన్ని కార్యాలు నశిస్తాయి. గూఢచారులను నియమింపనప్పుడు, స్వాధీనంలో లేని రాజును ఏనుగులు బురదతో ఉన్న నదీతీరాన్ని వదిలివేసినట్లు ప్రజలు దూరమవుతారు. విషయసుఖములలో ఉండి రాజ్య పాలన, ప్రజా రక్షణను విస్మరించిన రాజులు తమ దేశంపై పట్టు కోల్పోతారు. అంతే కాదు, సముద్రంలో మునిగియున్న పర్వతముల వలె అభివృద్ధికి నోచుకోరు. దేవ గంధర్వ దానవులు ఎంతో ధైర్యసాహసాలు గలవారు. వారు నిన్ను ఓ కంట కనిపెడుతూ ఉంటారు (ప్రతీకారం కోసం). నీవు సరైన గూఢచారులను నియమింపనప్పుడు చపలచిత్తుడవై రాజుగా ఎలా మనగలవు?
154. శ్లో.
ఋషీణామ్ అభయం దత్తం కృతక్షేమాశ్చ దండకాః।
ధర్మితం చ జనస్థానం రామేణాక్లిష్టకర్మణా॥
త్వంతు లుబ్ధః ప్రమత్తశ్చ పరాధీనశ్చ రావణ।
విషయే స్వే సముత్పన్నం భయం యో నావబుధ్యసే॥
తీక్ష్ణమల్పప్రదాతారం ప్రమత్తం గర్వితం శఠమ్।
వ్యసనే సర్వభూతాని నాభిధావంతి పార్థివమ్॥
అతిమానినమగ్రాహ్యమ్ ఆత్మసంభావితం నరమ్।
క్రోధినం వ్యసనే హంతి స్వజనోపి మహీపతిమ్॥
నానుతిష్ఠతి కార్యాణి భయేషు న బిభేతి చ।
క్షిప్రం రాజ్యాచ్యుతో దీనః తృణైస్తుల్యో భవిష్యతి॥
(అరణ్యకాండ, 33. 13, 14, 15, 16, 17)
శ్రీరాముడు ఋషులకు అభయమిచ్చి దండకారణ్యమును తన వశంలో పెట్టుకున్నాడు (ఇది కీలకం – ఆ ‘అభయం’ అనునది నీకు ముప్పు కాదా?). నీవు గూఢచారుల మాటలను వినక భోగలాలసుడవై మత్తిల్లి యున్నావు! అహంకారికి కష్టకాలంలో ఎవరూ తోడుగా ఉండరు. అంతులేని గర్వం కలవాడు, సత్పురుషులను దగ్గరికి రానివ్వని వాడు, అనవసరంగా క్రోధాన్ని ప్రకటించేవాడు స్వజనులకు దూరం అవుతాడు!
సకాలంలో కర్తవ్యాన్ని విస్మరించినవాడు, ధీమాగా ఉన్నవాడు ఐన రాజు త్వరలో రాజ్యభ్రష్టుడవుతాడు. చివరకు దీనుడై గడ్దిపోచ కంటే హీనంగా తయారవుతాడు!
ఈ మాటలు కైకకు మంధర చెప్పిన మాటలతో పోలిస్తే విషయం ఆసక్తికరమవుతుంది. కైకకు ఎన్నో చెప్పినా వినలేదు. కానీ ఒక్క మాట దగ్గర ఆమె మనసు తీవ్రంగా ప్రభావితమైనది – ‘నీవు గతంలో కౌసల్యను తూలనాడుతూ, హేళన చేస్తూ వచ్చావు. ఇప్పుడు ఆమె కుమారుడు యువరాజు కాబోతున్నాడు, ఆమె పట్టమహిషి! భవిష్యత్తులో నీ మీద ప్రతీకారం తీసుకోదా?’
ఇక్కడ గమనించండి – స్వయంగా శ్రీరాముడు నీ జోలికి రాకపోవచ్చు; కానీ ఋషులకు అభయం ఇచ్చాడు. జనస్థానం రాక్షసుల బాధ నుండి విముక్తి పొందినది. మరి ఋషులు నీ బాధ తొలగించమని కోరినప్పుడు జరుగునది ఏది?
మహర్షి అందుచేత శూర్పణఖ రావణుని కొలువులోకి ప్రవేశిస్తున్నప్పుడు రావణుడు ఎటువంటివాడు? అన్న అంశం మీద ‘యజ్ఞములను ధ్వంసం చేసేవాడు, బ్రహ్మహత్యలు చేసేవాడు, దుష్ట చరిత్ర గలవాడు’ అని ముందుగానే అభివర్ణించి యున్నాడు. ఇది గమనార్హం.
ఇప్పుడు శూర్పణఖ పలికిన మాటల వలన కించిత్ అభద్రతా భావం, తన రాజ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం అనే భావన తన దృష్కృత్యాల వలన శ్రీరాముని భవిష్యత్ ప్రణాళిక పట్ల ఒక విధమైన దిగులు చోటు చేసుకోవటం సహజంగానే జరిగినట్లు అర్థమగుచున్నది!
155. శ్లో.
ఇతి స్వదోషాన్ పరికీర్తితాం స్తయా
సమీక్ష్య బుద్ధ్యా క్షణదాచరేశ్వరః।
ధనేన దర్పేణ బలేన చాన్వితో
విచింతయామాస చిరం స రావణః॥
(అరణ్యకాండ, 33. 24)
క్షణకాలం రావణుడు తన లోపముల గురించి సమీక్షించుకున్నాడు. మారీచుని మాట, శూర్పణఖ మాట – రెండింటినీ బేరీజు వేసుకున్నాడు.
156. శ్లో.
యస్య సీతా భవేద్భార్యా యం చ హృష్టా పరిష్వజేత్।
అతిజీవేత్ స సర్వేషు లోకేష్వపి పురందరాత్॥
సా సుశీలా వపుః శ్లాఘ్యా రూపేణాప్రతిమా భువి।
తవానురూపా భార్యా స్యాత్ త్వం చ తస్యాస్తథా పతిః॥
తాం తు విస్తీర్ణజఘనాం పీనశ్రోణిపయోధరామ్।
భార్యార్థే చ తవానేతుమ్ ఉద్యతాహం వరాననామ్॥
విరూపితాస్మి క్రూరేణ లక్ష్మణేన మహాభుజ।
(అరణ్యకాండ, 34. 18,19, 20)
శూర్పణఖ రావణునితో:
ఆ జానకిని భార్యగా పొందినవాని అదృష్టమే అదృష్టము. ఆమె కౌగిలి సుఖములను అనుభవించివాని భాగ్యమే భాగ్యము. అట్టి పురుషుడు అన్ని లోకముల వారిలోను సర్వశ్రేష్ఠుడై ఇంద్రుని మించి ఖ్యాతికెక్కును.
ఆమె సౌశీల్యవతి. చక్కని శరీర సౌందర్యము గలది. సాటిలేని రూపం గలది. నీకు భార్య కాదగినది. ఆమెకు భర్త కాదగినవాడవు నీవే.
చక్కని వక్షః స్థలము, జఘన సౌందర్యము గల ఆ సుందరిని నీకు భార్యను చేయుటకై ఇక్కడికి తీసుకొని రావాలని పూనుకున్నాను. కానీ క్రూరుడైన ఆ లక్ష్మణుడు నన్నిట్లు వికృత రూపురాలిగా చేసాడు!
157. శ్లో.
మారీచ! శ్రూయాతాం తాత! వచనం మమ భాషతః।
ఆర్తోస్మి మమ చార్తస్య భవాన్ హి పరమా గతిః॥
***
తతః పశ్చాత్ సుఖం రామే భార్యాహరణకర్శితే।
విస్రబ్ధః ప్రహరిష్యామి కృతార్థేనాంతరాత్మనా॥
(అరణ్యకాండ, 36. 1, 21)
మారీచుని వద్దకు మరల వచ్చాడు రావణుడు. ఈసారి మారీచునితో అన్న మొదటి మాట:
ఓ మారీచా! నేను చెప్పే మాట విను. నేను ఆపదలో చిక్కుకొని యున్నాను. ఇక నీవే నాకు దిక్కు!
(అనంతరం బంగారు జింక వ్యూహం గురించి ప్రస్తావించి ఇలా అన్నాడు..)
అంతట రాముడు భార్యా వియోగ కారణమున క్రుంగి కృశించిపోవును. అప్పుడు నేను తిరుగులేని మనోబలంతో అతనిని దెబ్బతీయగలను.
158. శ్లో.
సులభాః పురుషా రాజన్! సతతం ప్రియవాదినః।
అప్రియస్య తు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః॥
రామో విగ్రహవాన్ ధర్మః సాధుః సత్యపరాక్రమః।
రాజా సర్వస్య లోకస్య దేవానాం మఘవానివ॥
కథం త్వం తస్య వైదేహీం రక్షితాం స్వేన తేజసా।
ఇచ్ఛసి ప్రసభం హర్తుం ప్రభామివ వివస్వతః॥
(అరణ్యకాండ, 37. 2, 13, 14)
మారీచుడు రావణునితో: స్వంత లాభం కోసం ఎందరో ప్రియవాదినులుంటారు. హితం చేసేది అప్రియమైనది. కావున చెప్పేవారు, వినేవారు దుర్లభులు! (ఈ మాట భారతంలో కూడా కనిపిస్తుంది).
రాముని గూర్చి నీవు విన్నవి, చెప్పినవి అసత్యములు. ఆయన ధర్మస్వరూపుడు నిరుపమాన పరాక్రమశాలి. పరమ సాధువు. కఠినుడు కాదు. ఇంద్రియ నిగ్రహం కలవాడు. దేవతలలో ఇంద్రునివలె ఆయన సమస్త లోకములకు ప్రభువు!
ఆయన భార్య యగు సీతాదేవి యొక్క ప్రాతివ్రత్యమే ఆమెకు భద్రకవచము. సూర్యుని, సూర్యుని కాంతి ఎలాగైతే వేరు చేయలేమో, ఆమెను శ్రీరాముని వద్ద నుండి అపహరించుట అసాధ్యము. అటువంటి సీతను బలవంతముగా గొని వచ్చుటకు ఎలా సాహసించుచున్నావు?
159. శ్లో.
అకుర్వంతోపి పాపాని శుచయః పాపసంశ్రయాత్।
పరపాపైర్వినశ్యంతి మత్స్యా నాగహ్రదే యథా॥
పరదారాభిమర్శాత్ తు నాన్యత్ పాపతరం మహత్।
ప్రమదానాం సహస్రాణి తవ రాజన్ పరిగ్రహః॥
నివార్యమాణః సుహృదా మయా భృశం
ప్రసహ్య సీతాం యది ధర్షయిష్యసి।
గమిష్యసి క్షీణబలః సబాంధవో
యమక్షయం రామశరాత్తజీవితః॥
(అరణ్యకాండ, 38. 26, 30, 33)
మారీచుడు రావణునితో:
పాపాలను ఏ మాత్రం చేయని పవిత్రులు కూడా పాపులను ఆశ్రయించి యున్నచో ఇతరుల పాపాల కారణంగా సర్పములతో నిండి యున్న మడుగులో గల చేపల వలె నశిస్తారు.
పరసతులను ఆశించుట కంటే మించిన పాపం మరొకటి లేదు. నీ ఆధీనంలో నున్న వేలాది స్త్రీలతో సుఖించు.
ఓ రావణా! నీ మేలు కోరి చెబుతున్నాను. నేను ఇంతగా నివారిస్తున్నా, సీతాదేవిని బలవంతంగా అపహరించినచో నీ చతురంగ బలములన్నియు క్షీణించును. నీ ఆత్మీయులందరు నశిస్తారు. చివరకు శ్రీరాముని బాణములకు ఆహుతియై మృత్యువాత బడతావు.
(ఇంకా ఉంది)