అలనాటి అపురూపాలు-154

0
3

సినిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

భారతీయ సినిమాకి తొలి దర్శకురాలు ఫాతిమా బేగం:

[dropcap]ఫా[/dropcap]తిమా బేగం భారతదేశంలో, ఉర్దూ మాట్లాడే ఓ ముస్లిం కుటుంబంలో 1892లో జన్మించారు. ఆమె నాటక రంగంలో శిక్షణ పొంది, ఉర్దూ నాటకాలలో నటించారు. నైట్ గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది ఇండియన్ ఎంపైర్ అని పిలవబడిన మూడవ నవాబ్ సిది ఇబ్రహీమ్ ముహమ్మద్ యాకుత్ ఖాన్‌ని ఫాతిమా వివాహం చేసుకున్నారని పుకార్లు వినవచ్చాయి. అయితే అందుకు చట్టపరమైన ఆధారాలు లేవు. నవాబ్ ఫాతిమాని గాని, ఆవిడ కుమార్తెలను గాను గుర్తించలేదు.

ఫాతిమా తనకి 30 ఏళ్ళ వయస్సులో సినీరంగంలోకి అడుగుపెట్టారు. 1922లో ఆర్దేషిర్ ఇరానీ దర్శకత్వంలో వచ్చిన ‘వీర్ అభిమన్యు’ అనే మూకీ సినిమా ద్వారా నటిగా తన ప్రయాణం ప్రారంభించారు.

ఫాతిమా సినీరంగంలో ప్రవేశించినప్పుడు, ఆ రంగం అప్పటికి మగవారికే పరిమితమైంది. మహిళా పాత్రలు కూడా పురుషులే పోషించేవారు. పైగా ఆడవాళ్ళకి నటన అనేది గౌరవప్రదమైన వృత్తి కాదని భావించేవారు.

‘సీతా సర్దాబా’, ‘పృథ్వీ వల్లభ్’, ‘కాలనాగ్’, ‘గులే బకావళి’ (ఇవన్నీ 1924లో విడుదలయ్యాయి) ఆమె నటించిన తొలినాటి చిత్రాలు. ఆ మరుసటి ఏడాది 1925లో ‘ముంబై ని మోహిని’ విడుదలయింది

మన దేశంలో సొంత నిర్మాణ సంస్థని స్థాపించిన తొలి మహిళ ఫాతిమా. ఆమె 1926లో బొంబాయిలో ‘ఫాతిమా ఫిల్మ్స్’ స్థాపించారు. 1928లో ఈ సంస్థ పేరు ‘విక్టోరియా ఫాతిమా ఫిల్మ్స్’గా మారింది. ఆమె స్క్రీన్ రైటర్‌గా, నటిగా, నిర్మాతగా వ్యవహరించారు.

పర్షియా కథ ఆధారంగా తీసిన ‘బుల్‌బుల్-ఏ-పరిస్తాన్’ ఆమె దర్శకత్వం వహించిన తొలి చిత్రం. ఓ అద్భుతలోకం జరిగే ఈ కథలో రాణి మాయాజాలంతో తన రాజ్యాన్ని అదుపాజ్ఞలలో ఉంచుతుంది. ఈ సినిమాని భారీ బడ్జెట్‍తో, ట్రిక్ ఫోటోగ్రఫీ ఉపయోగించి స్పెషల్ ఎఫెక్ట్స్‌తో తీశారు. అయితే ఆవిడ దర్శకత్వం వహించిన సినిమాల ప్రింట్స్ ఏవీ ఇప్పుడు లభ్యం కాకపోవడం దురదృష్టం. అయితే ఈ సినిమా నటనాపరంగా, వాణిజ్యపరంగా విజయవంతం కావడంతో ఆర్దేషిర్ ఇరానీ ఆ బాటలో సాగి – ‘అలాదీన్ అండ్ ది వండర్‌ఫుల్ లాంప్’ (1931) వంటి సినిమాలు తీశారు.

ఈ కాలంలో ఆవిడ మరికొన్ని సినిమాలకు దర్శకత్వం వహించారు. వీటిలో స్త్రీలవే ప్రధాన పాత్రలు. 1927లో ఆవిడ ‘గాడెస్ ఆఫ్ లవ్’ చిత్రాన్ని అందించారు. 1928లో ‘హీర్ రాంఝా’, ‘చంద్రావళి’ అనే సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇంకా పట్టుదలతో పనిచేసి – 1929లో ‘కనకతార’,  ‘మిలన్ దీనార్’, ‘నసీబ్ ని దేవి’, ఇంకా, ‘శకుంతల’ చిత్రాలను విడుదల చేశారు. 1929 వారి స్టూడియోకి చాలా అధిక ఫలప్రదమైన సంవత్సరం. ఆ ఏదాది అధికంగా సినిమాలు తీశారు. దురదృష్టం ఏంటంటే, ఆర్థిక ఇబ్బందులలో చిక్కుకుని ఆ ఏడాదే ఆ సంస్థ మూత పడింది. దర్శకురాలిగా ‘గాడెస్ ఆఫ్ లక్’ (1929) ఆమె చివరి సినిమా.

తను స్వయంగా సొంత నిర్మాణ సంస్థ నడుపుతున్నప్పటికీ (రచన, దర్శకత్వం, నిర్మాణం) ఫాతిమా ఒక నటిగా కోహినూర్ స్టూడియోస్ వారి చిత్రాలలోనూ, ఇంపీరియల్ స్టూడియోస్ చిత్రాలలోను నటించారు.

ఫాతిమా తన కుమార్తెల నటనా కెరీర్లకు మార్గదర్శనం చేశారు. ఆమె కుమార్తెలు జుబేదా, సుల్తానా, షెహజాదీ పలు మూకీ సినిమాల్లో నటించారు. జుబేదా మరికొంత పురోగమించి, భారతదేశపు తొలి టాకీ సినిమా ఆలమ్ ఆరా (1931)లో నటించిన తొలి భారతీయ మహిళ అయ్యారు.

జి.పి. పవార్ దర్శకత్వంలో 1937లో వచ్చిన ‘దునియా క్యా హై’ ఫాతిమా నటించిన చివరి సినిమా. ఈ సినిమా తర్వాత ఆమె స్వచ్ఛందంగా విరమించుకున్నారు. 91 ఏళ్ళ వయసులో 1983లో ఫాతిమా మృతి చెందారు.

15 ఏళ్ళ పాటు సినిమాల్లో కొనసాగి సినీ రంగంలో సాధించిన ఎన్నో ఘనతలను సాధించారామె. నటన, స్క్రీన్ రైటింగ్, దర్శకత్వం, నిర్మాత – ఇలా బహుముఖీన ప్రతిభ కనబరిచారు. భారతీయ సినిమాల కథా విధానాన్ని ప్రభావితం చేయడమే కాకుండా, మహిళల అనుభవాలను సినిమాలలో ఉపయోగించుకునే ప్రోత్సహించి – భవిష్యత్తులో ఎందరో స్త్రీలు దర్శకనిర్మాతలు అయ్యేందుకు మార్గం సుగమం చేశారు.

అయితే ఆమె సినిమాలను భద్రపరచాలన్న ఆలోచన కొరవడడం శోచనీయం. ఆవిడ సినిమాలేవీ ఇప్పుడు అందుబాటులో లేవు. ఇది ఆవిడ వారసత్వానికి పెద్ద లోటు.

భారతీయ సినిమాలకి తొలి మహిళ పథగామి అయిన ఫాతిమా బేగంకి వందనాలు.


‘లక్స్’ సబ్బు ప్రకటనలో (1941) నటించిన తొలి భారతీయ నటి – లీలా చిట్నిస్:

అర్ధశతాబ్దం పాటు 40 సినిమాలలో నటించిన లీలా చిట్నిస్ నట ప్రస్థానం రొమాంటిక్ పాత్రల నుంచి తల్లి పాత్రల వరకు సాగింది.

పలు పాత్రలు పోషించిన ఈవిడని గొప్పగా గుర్తుంచుకుంటారు. మహిళలు సినీరంగంలో నటించడాన్ని వ్యతిరేకించే కాలంలో లీల సినిమాల్లో నటించారు. ఆ రోజుల్లో సినిమాలో నటించిన ఆడవాళ్లని వేశ్యలతో సమానంగా పరిగణించేవారని ఆమె కుమారుడు మానవేంద్ర చిట్నిస్ గుర్తు చేసుకున్నారు. అందుకని బ్రాహ్మణ కులం నుంచి అమ్మని వెలివేశారని ఆయన చెప్పారు.

అయినా ఆమె పట్టించుకోలేదు. ఈ తప్పుడు అభిప్రాయాన్ని లెక్కజేయలేదు. 1931లో బొంబాయి చేరి, నేడు బాలీవుడ్ అని పిలవబడుతున్న సినీరంగంలోకి ప్రవేశించారు. రొమాంటిక్ పాత్రలు ధరించడం ప్రారంభించి, అప్పట్లో దేశంలోని ప్రసిద్ధ హీరోయిన్‌లలో ఒకరయ్యారు.

1948 నుంచి 1980ల వరకు ఆవిడ సహాయ నటిగా కొనసాగారు. ముఖ్యంగా 1950, 60 దశకాలలో తల్లి పాత్రలకు ప్రసిద్ధి చెందారు. ఈ పాత్రలలో ఆమె తెలివి, పెద్దమనిషితనం గల వ్యక్తిగా తెల్లని చీరలలో గోల్డ్-రిమ్ కళ్ళద్దాలతో దర్శనమిచ్చేవారు.

9 సెప్టెంబరు 1909 నాడు ఆమె ఓ చిన్న పట్టణంలో జన్మించారు. ఆమె తండ్రి ఒక ఇంగ్లీష్ ప్రొఫెసర్. ఆయన బ్రహ్మసమాజ అనుయాయి. ఆ సంస్థ కులాన్ని తిరస్కరించింది.

తనకి 15 లేదా 16 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు – తనకన్నా వయసులో ఎంతో పెద్దయిన వ్యక్తితో వివాహం జరిగింది. ఈ దంపతులకు నలుగురు పిల్లలు పుట్టారు. ఈ దంపతులు భారత స్వతంత్ర్య పోరాటానికి మద్దతు తెలిపారు. మార్క్సిస్ట్ స్వాతంత్ర్య యోధుడు మానవేంద్ర నాథ్‌కి ఆశ్రయం ఇచ్చినందుకు ఈ దంపతులు అరెస్ట్ అయ్యే ప్రమాదం నుంచి కొద్దిలో తప్పించుకున్నారు.

భర్త నుంచి విడాకులు తీసుకున్నాకా ఆమె ఉపాధ్యాయిని పని చేశారు. రంగస్థలంపై నాటకాలలో నటించారు. తరువాత పలు సినిమాలలో నటించారు. ఆ కాలంలోని ప్రసిద్ధ స్టూడియో ‘బాంబే టాకీస్’ – కాలేజ్ గ్రాడ్యుయేట్లకి మాత్రమే అవకాశాలిస్తుందని తెలుసుకుని బాంబే యూనివర్సిటీ ద్వారా ఆ సంస్థలో అవకాశం పొందారు.

ఆమె బాలీవుడ్ అగ్ర కథానాయకుడైన అశోక్‌కుమార్‌తో హీరోయిన్‌గా జతకట్టి – ‘కంగన్’, ‘బంధన్’, ‘ఝూలా’ అనే మూడు సూపర్ హిట్ చిత్రాలలో నటించారు.

‘కంగన్’ (1939)లో ఒక దృశ్యం బాగా గుర్తుండిపోయింది. తాను ప్రేమించే నాటకకర్త – మరో స్త్రీకి తన ప్రేమని వెల్లడి చేస్తున్నట్లు ఆమె భావించడం! కానీ ఆయన  తన  తాజా నాటకంలోని సంభాషణలను పైకి చదువుతుంటాడప్పుడు. ఆమె సంతాప ప్రకటనలో ది హిందూస్థాన్ టైమ్స్ – “ప్రధాన స్రవంతి హిందీ సినిమాలో ఆమె గ్రామీణ సౌందర్యానికి నిదర్శనంగా నిలిచారు” అంటూ ఆమెని ఘనంగా కీర్తించింది.

1948 నుంచి ఆమె తల్లి పాత్రలు ధరించడం మొదలుపెట్టారు. దేశభక్తి చిత్రం ‘షహీద్’ తల్లి పాత్రలో ఆమె మొదటి సినిమా. అయితే ‘ఆవారా’ (1951) చిత్రంలో ఆమె పోషించిన తల్లి పాత్ర అన్నింటికన్నా గొప్పదని ది హిందూస్థాన్ టైమ్స్ పేర్కొంది. ఆ సినిమాలో ఆమెని అనుమానించి భర్త వదిలివేస్తాడు.

1985లో విడుదలైన ‘దిల్‌ తుజ్‌కో దియా’ ఆమె చివరి సినిమా.

పాత తరం భారతీయులకు, ప్రముఖ సోప్ బ్రాండ్ ‘లక్స్‌’కి -మోడ‌ల్‌గా వ్యవహరించిన తొలి భారతీయ నటిగా చిట్నిస్ గుర్తుంటారు. అప్పటి వరకూ ఈ సబ్బు, ఇతర ఉత్పాదనల ప్రకటనలలో హాలీవుడ్ హీరోయిన్‌లు మాత్రమే నటించేవారు.

నటన విరమించుకున్నాకా ఆమె అమెరికా వెళ్ళిపోయారు. 2003లో 93 ఏళ్ళ వయసులో కనెక్టికట్ లోని డాన్‌బరీలోని ఓ ఆసుపత్రిలో మరణించారు చిట్నిస్.

ఆవిడకి మానవేంద్ర కాకుండా బినయ్, రాజ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here