మేనల్లుడు-19

0
3

[వివేక్‌ని కలిసిన సునీల్ – వివేక్‌తో మాట్లాడాలి అంటాడు. కొత్తగా పర్మిషన్ అడుగుతున్నావేంటి అంటాడు వివేక్. అప్పుడు దివ్య ప్రస్తావన తెచ్చి, ఆమె వివేక్‌ని ఎలా ప్రేమించిందో చెప్పి, తను ఫేస్‌బుక్‌లో పరిచయమైన అమ్మాయిని ప్రేమించిన సంగతి చెప్పి, దివ్యని అంత తొందరగా మర్చిపోయావా అంటాడు. కోపంతో సునీల్ చెంప మీద కొడతాడు వివేక్. కన్నీళ్ళు పెడుతున్న సునీల్‌కి క్షమాపణలు చెప్తాడు. తన పరిస్థితిని వివరిస్తాడు. ఇద్దరూ ఒకరినొకరు ఓదార్చుకుంటారు. ఇంట్లో ఒక్కర్తే ఉండడంతో విసుగు చెందిన అమృత సౌమ్యతో మాట్లాడాలని ఆమెకి ఫోన్ చేస్తుంది. ఆమె భర్త పవన్ ఫోనెత్తి – సౌమ్య లేదని, ఇండియా వెళ్ళిపోయిందని చెప్తాడు. అమృత వివరాలు అడిగితే – క్రుంగుబాటుకి లోనయిన సౌమ్య ఆత్మహత్యకి ప్రయత్నించిందనీ, సకాలంలో తాను చూసి కాపాడగలిగాని చెప్తాడు. ఆమెను ఒంటరిగా ఉంచవద్దని డాక్టర్లు చెప్పినందున ఆమె తల్లిదండ్రులు వచ్చి ఇండియాకి తీసుకువెళ్ళారని చెప్తాడు. ఈ వార్త అమ్మూని బాగా నొప్పిస్తుంది. వెంటనే ఇండియాకి వెళ్ళిపోవాలనుకుంటుంది. అప్పుడే లోపలికి వచ్చిన వివేక్ గుండెల మీద వాలిపోయి ఏడుస్తుంది. తాను వెళ్ళిపోవాలనుకున్న సంగతి చెప్పి – టికెట్స్ బుక్ చేయమంటుంది. వివేక్ వారించినా వినదు. అప్పుడే సునీల్ ఫోన్ చేసి తాను ఇండియా వెళ్తున్నట్టు చెప్తాడు. అమ్మూని కూడా తనతో పాటు తీసుకువెళ్లమని అడుగుతాడు వివేక్. వివరాలు పంపమంటాడు సునీల్. – ఇక చదవండి.]

[dropcap]మౌ[/dropcap]నంగా బట్టలు సర్దుకోసాగింది అమృత..

“అమ్మూ!.. నా మీద నమ్మకం లేదా? ఎందుకిలా వెళ్ళిపోతున్నావు?.. మావయ్య ఏమనుకుంటాడో? ఈ సమయంలో మావయ్య ప్రశాంతంగా ఉండాలి!.. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు మావయ్యకి ఉన్నది ఒకే ఒక్క కోరిక.. మనిద్దరి పెళ్ళి చూడాలన్న కోరిక తప్ప మరేం లేదు..”

“మామూ!.. ప్లీజ్!.. ఇంకేం మాట్లాడకు.. నువ్వు చాలా మంచివాడివి, మావయ్య కోసం చివరికి ప్రాణం ఇవ్వమన్నా ఇచ్చేస్తావని తెలుసు.. రేపు.. పెళ్ళి అయిపోయింది అనుకో!.. మనిద్దరికి ఎంగేజ్‌మెంట్ అయింది అన్న విషయం భరించలేకపోతున్నాను.. పరిస్థితులు మనిద్దరికి ఎంగేజ్‌మెంట్ చేసాయి. తరువాత పెళ్ళి చేస్తాయి.. మామూ!.. నువ్వు.. నువ్వు భరించగలవేమో గాని..” అని అమృత అంటుండగానే..

“అమ్మూ!.. ఇక నువ్వేం మాటడకు.. ఇప్పుడు నేను ఏం చెప్పినా నువ్వు అర్థం చేసుకునే స్థితిలో లేవు.. మావయ్య ఆరోగ్యం ఏ మాత్రం మెరుగు పడినా.. నా థీసిస్ last లో ఉంది.. డీన్ నాకు లీవు ఇవ్వలేదని.. నమ్మే విధంగా, మనసు చంపుకొని పెళ్ళి ఆపడం కోసం.. చెప్పాలనుకుంటున్నాను.. పెళ్ళి ఆపడం కోసం.. ఎన్నో రకాలుగా ఆలోచిస్తున్నాను.. మావయ్యకి అనుమానం రాకుండా ఏ పనైనా చేయాలి. అంతే కాని.. నీలా.. ఏదో ఒకటి.. చేసి మావయ్య ఆరోగ్యం దెబ్బ తినేలా చేయకూడదు..”

గభాలున కళ్ళెత్తి వివేక్ వైపు చూసింది.

సౌమ్యంగా, మంచిగా, మృదువుగా మాటాడే వివేక్ కాస్త కోపంగా, విసుగ్గా, బాధగా మాటాడటం చూసి ఒక్క నిమిషం ఆశ్చర్యపోయింది అమృత..

“సారీ మామూ!.. నీకున్న సహనం ఓర్పు నాకు లేవు.. సౌమ్య సూసైడ్ చేసుకోబోయింది అని పవన్ చెప్పిన దగ్గర నుండి నా మనసులో భయంకరమైన ఆలోచనలు..”

“నిజం!మామూ!”

“నువ్వంటే చెప్పలేని ఇష్టం!.. ప్రాణం! .. కాని.. నీకు నాకు పెళ్ళి అన్న మాట గుర్తు వస్తే పిచ్చెక్కుతుంది.”

“నాన్న అంటే ప్రాణం.. ఎన్ని జన్మలకైనా నాన్న కూతురుగానే పుట్టాలనుకుంటాను.. అయినా మనిద్దరం చిన్నప్పటి నుండి ఒకే చోట కలిసి పెరిగాం! జలుబు చేస్తే.. నీ చొక్కాతో ముక్కు తుడిచేవాడివి. నాకు గౌను తొడిగేవాడివి.. స్కూలు బూటులు లేసు ఊడిపోతే లేసు ముడివేసేవాడివి.. అన్నం తిననని మారం చేస్తే.. బ్రతిమిలాడి తినిపించి మూతి తుడిచేవాడివి.. నిజం చెప్పాలంటే అన్నకి చెల్లెలుగా పుడితే అన్న ప్రేమతో చేసే పనులు.. అలాంటిది మన ఇద్దరి మధ్య ఉన్న ప్రేమని, ఇష్టాన్ని.. వివాహ బంధంతో ముడి పెట్టడం ఏమిటి?.. అమ్మ, నాన్న, అత్తయ్య.. ఎవరు కూడా ఎందుకు ఆలోచించడం లేదు.. అసలు వాళ్ళని ఏమనుకోవాలి” అంది కోపంగా అమృత..

ఒక్క నిముషం బాధగా అమృత వైపు చూసి, “సాధారణంగా ఆడ, మగ కలిసి వెళితే.. వాళ్లు అన్నా చెల్లెలుయినా, లవర్స్ అనో, wife and husband అనో.. లేక ఫ్రెండ్స్ అనో.. ఏవో ఒకటి అనుకుంటారు. అలా అనుకోవడం వాళ్ళ ఇష్టం! ..”

“కాని మనవాళ్ళు.. పరిస్థితుల దృష్ట్యా.. కళ్ళ ముందు పులిలాంటి మనిషి పిల్లిలా అయిపోయి ఇంటికి పెద్ద.. తను చనిపోతే!.. కుటుంబం అల్లకల్లోలం అవుతుందన్న భయంతో మావయ్య అలా ఆలోచించాడు..”

“పాపం! మావయ్య.. తను ఏ వేళప్పుడు పోతాడో తెలియదు.. తనకు వచ్చింది మాములు జబ్బు కాదు కాన్సర్.. తను పోయినా తన కుటుంబం.. సుఖసంతోషాలతో ఉండాలనుకున్నాడు, కాని మనిద్దరి మధ్య ఉన్నది  ఆత్మీయుల మధ్య ఉండే సంబంధం లాంటిది అని ఆలోచించలేకపోయాడు..  ఈ విషయంలో మావయ్యని మనం నిందిచకూడదు.. పాపం మావయ్య” అన్నాడు బాధగా వివేక్.

“యూ ఆర్ గ్రేట్ మామూ!.. నీలా నేను ఆలోచించలేకపోతున్నాను..” అంది అమృత.

***

కారులో ఎయిర్‌పోర్టుకి బయలుదేరారు వివేక్, అమృత..

కారు డ్రైవ్ చేస్తున్నాడే గాని వివేక్ మనసులో ఏదో తెలియని అలజడి.. ఆందోళన.. తనలా అమ్మూ ఆలోచించలేదు.. తన కళ్ల మందు పుట్టింది. చిన్నతనం. ఏ ఆడపిల్లయినా, వయసొచ్చినాక, పెళ్ళి అన్నప్పుడు.. సిగ్గు పడడమో, లేక కాబోయే అబ్బాయి గురించి వివరాలు తెలుసుకోవాడమో.. లేక వివాహం గురించి తీయని కలలు కనడమో ఏవో ఒకటి చేస్తారు.. కాని పాపం అమ్మూ.. తనతో పెళ్ళి అన్న దగ్గర నుండి ఆందోళన పడుతుంది.. కంగారు పడుతుంది.. సౌమ్య పరిస్థితి చూసిన దగ్గర నుండి భయపడిపోతుంది.. తన పరిస్థితిలో ఉంటే ఎవరైనా ఇలాగే ఆలోచిస్తారు.

“మామూ!.. ఆలోచించింది ఇక చాలు.. నువ్వేం కంగారు, భయం పడక్కరలేదు.. నాన్న దగ్గర.. మన పెళ్ళి గురించి.. అదే.. మా ఇద్దరికి అస్సలు పెళ్ళి చేసుకోవాలన్న ఆలోచన గాని.. అలాంటి.. ఉద్దేశం గాని లేదు.. అని చెప్పను.. ఏం జరుగుతుందో ఆ భారం విధి మీద వదిలేస్తాను. నాన్నని సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తాను.. సరేనా” అంది నవ్వుతూ..

డ్రైవ్ చేస్తూ వివేక్ గభాలున చెయ్యి చాచి.. అభిమానంగా అమ్ము చెయ్యి మీద తన చెయ్యి వేసి “థాంక్యూ!.. అమ్మూ!.. నువ్వు ఇలా ఆలోచించడం నీ గొప్పతనం..” అన్నాడు.

“ఎప్పుడు ఏ నిమిషంలో ఏం జరుగుతుందో ఎన్ని రీసెర్చ్‌లు చేసిన, నోబుల్ బహుమతులు సాధించిన సైంటిస్టులు కూడా చెప్పలేరు.. ఒక్క విధికే సాధ్యం..”

“పరిస్థితులను బట్టి.. సమస్యకి పరిష్కారం  దొరకవచ్చు లేదా?.. దొరకకపోవచ్చు.. అంత వరకు ఏ మనిషైనా సహనం పాట్టించవలసిందే!..”

“అబ్బబ్బ.. వి.వీ!.. ఇక ఆ మేటర్ వదిలేయ్. నీకిష్టమని అత్తయ్యని అడిగి మరీ పీతల ఇగురు రసం చేసాను.. తినడం మరిచిపోకు.. రెండు రోజులు కూర వస్తుంది. ఫ్రిజ్‌లో ఉంది. అన్నట్లు క్యారెట్టు హల్వా చేసాను.. బాక్స్‌లో ఉంది.. వేడి చేసుకొని తిను” అంది అమృత..

పకపకా నవ్వి అన్నాడు..

“ఇండియా వెళ్ళినాక అయినా చెప్పొచ్చు కదా? అమ్మూ..”

ఆశ్చర్యంగా అంది.. “ఇండియా వెళ్ళినాక ఎలా?”

“మరచిపోయావా?.. నేను  USA వచ్చినప్పుడు మామూ! నేతి సున్నుండలు తింటున్నావా?.. బూందీ లడ్డు చాలా బాగా చేసింది అమ్మ.. చాలా పెట్టింది.. రోజుకి రెండు తిను. అన్నట్లు రొయ్యలు, చికెన్, పికిల్స్ ఉన్నాయి. మధ్యాహ్నం మాత్రమే పెరుగు అన్నంలోకి వాడు.. అబ్బో.. ఇంకా ఏవెవో పెట్టేసారు.. ఆ లిస్టు అలా గుర్తు చేస్తూనే ఉండేదానివి..”

“మామూ!” అంది కోపంగా..

“నీకు అలానే ఉంటుంది.. అయిన వాళ్ళు దూరంగా ఉంటే.. మనసు ఎలా ఉంటుందో తెలుసా? ఈ పెళ్ళి అన్నది రాకుండా ఉంటే.. ఇక్కడ నుండి.. వెళ్ళే దానిని కాదు.. సరదాగా.. రోజుకో ప్లేస్‌కి వెళ్ళి enjoy చేసే దానిని.. ఛ!..  ఛ!.. ఇప్పుడా.. టాపిక్ ఎత్తకూడదు.. నువ్వు మాత్రం సమస్యని దీర్ఘంగా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకు.. నువ్వన్నట్లు సమస్యకి పరిష్కారం దొరుకుతుందనే అనుకుంటాను.. ఒకవేళ.. దురదృష్టం కొద్ది సమస్యకి పరిష్కారం దొరకలేదే అనుకుందాం.. అందరి దృష్టిలో మనం.. అలా ఉన్నా.. మనం మాత్రం రక్త సంబంధం పంచుకు పుట్టిన వాళ్ళలా ఉందాం..”

“పెళ్ళి ఒక్కటే మనిషి జీవితానికి పరమార్థం కాదు.. ఎందరో వివాహ బంధాలకి దూరంగా ఉండి.. ఎన్నో గొప్ప పనులు చేసారు. మహామనుషులుగా సమాజంలో గుర్తించబడ్డారు..” అని అమృత అంటుండగానే.. “అమ్మూ!.. చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు. కొంచెం సేపటి క్రితమే.. ఎంతో హుషారుగా, సంతోషంగా మాట్లాడావే!.. అన్నట్లు నీల్ గురించి నీకు చెప్పాలి!.. వాడొక లవ్ ఫెయిల్ అయినవాడు. గుడ్డిగా ఎవరినో ప్రేమంచాడు.. కాని ఆ అమ్మాయి కాలక్షేపానికో, మరి దేనికో వీడితో లాంగ్ ఫ్రెండ్‌షిప్ చేసింది.. తరువాత డ్రాప్ అయిందట.. వీడు.. ఆ లవ్‌ని మరిచిపోలేకపోతున్నాడు.. సమస్యలు లేని వాళ్ళు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు.. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే.. వాడు మూడీగా ఉంటున్నాడు.. నీకు కంపెనీ ఇవ్వకపోతే ఏమనుకోకు” అని మాట్లాడుతుండగానే ఎయిర్‌పోర్టు రావడం.. వీళ్లకి కాస్త దూరంలో బ్యాగ్ తీసుకొని ఒక వ్యక్తి ఎదురవడం చూసి “అమ్మూ!.. వాడే నీల్.. నేను కారు పార్క్ చేసి వస్తాను.. ఒకేనా” అని అమృతను, లగేజి దించి, కారు పార్కింగ్ చేయడానికి కారు పోనిచ్చాడు వివేక్.

ట్రాలీలో బాక్స్ లాగుతూ.. ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళిన అమృత, ఆ వ్యక్తి ముందుకి తిరగడంతో షాకయ్యింది.

కలా? నిజమా!.. ఎదురు గుండా ఉన్న వ్యక్తి సునీలా?.. నమ్మలేకపోతుంది.. మళ్ళీ చూసి కంగారుగా అంది..

“సునీల్!.. మీరా!.. ఇక్కడ ఉన్నారు ఏమిటి?”

అమృత కన్నా రెట్టింపు ఆశ్చర్యంతో.. “అమృత! మీరు.. మీరు.. ఇక్కడ ఉన్నారు ఏమిటి?” అని.. “ఇక్కడ.. ఇక్కడ..” అని ఆశ్చర్యంగా సునీల్ అంటుండగానే..

“మామూ..” అని ఏదో గుర్తు వచ్చిన దానిలా.. “వివేక్.. అదే మామూ మావయ్య దగ్గరకు వచ్చాను.”

కంగారుగా అన్నాడు.. “వివేక్‌తో ఉన్నది మీరా!”

“అవును నేనే!..”

“కలా? నిజమా!.. నమ్మలేకపోతున్నాను.. నేను ఇండియాకి వెళుతున్నది.. మిమ్ములను జల్లెడ పెట్టి వెతకడానికి.. సారీ!.. ఈ మాట నేను అనకూడదు. ఇప్పుడర్ధమయింది.. మీరు ఫేస్‌బుక్‍లో Profile ఎందుకు డిలీట్ చేసారో? అసలు ఏం జరిగిందో అని భయంతో ఇండియా బయలుదేరాను..”

“అవన్నీ!.. మాట్లడడం అనవసరం.. అటు చూడండి మామూ వస్తున్నాడు.. ప్లీజ్! ఎంత మాత్రం మనిద్దరి మధ్య ఐదేళ్ళ బట్టి ఉన్న పరిచయం మాముకి తెలియకూడదు.. అసలు నేను తెలియనట్లే ఉండండి ప్లీజ్” అంది అమృత..

ఒక్క నిమిషం ఏం మాట్లాడలేదు సునీల్..

‘తను ఇండియా బయలుదేరిందే అమృత కోసం. తను చదివిన కాలేజీ పేరు చెప్పింది మాటల్లో.. ఒకరి గురించి ఒకరు ఎన్నో షేర్ చేసుకోవాలని.. ఎన్నో మాట్లాడుకోవాలనుకున్న సమయంలో అమృత దూరం అయింది.’

“ఏంటి అలా ఉండిపోయారు.. అదిగో మాము వచ్చేస్తున్నాడు.. ప్లీజ్” అంది.

కంగారుగా అన్నాడు సునీల్.. “మీరు అనవసరంగా టెన్షన్ ఫీలవ్వకండి..”

“ఏంటి నీల్!.. ఏమంటుంది అమ్మూ.. ఇండియా వెళ్ళే వరకు నువ్వు తనకి మంచి కంపెనీ ఇవ్వాలి.. అన్నట్లు నీ ఐదేళ్ళ ప్రేమ కథ.. సారీ.. ముందు ఫ్రెండ్‌షిప్, ఆ తరువాత.. లవ్ లోకి మారడం; తరువాత ఆ అమ్మాయి అదృశ్యం కావడం అన్నీ చెప్పేయ్. నీ మనసులో బాధ కాస్తయినా తగ్గుతుంది. అలా అని మరీ మా అమ్మూకి బోరుకొట్టించకు. ఒక మనిషి ఉన్నత స్థానంలోకి రావడానికి ఎంత శ్రమించాలో ప్రేమ సక్సెస్ కావడానికి అంతే!  కష్టం.. ప్రేమ సక్సెస్ కావడం అంత ఈజీ కాదు. ప్రేమ సక్సెస్ అయిన వాళ్ళు అదృష్టవంతులు.

“కరక్ట్ గా చెప్పావు వివేక్!..” అని “అదిగో అనౌన్స్‌మెంట్ వినిపిస్తుంది. ఇంకా చెకింగ్ ఉంది” అని గబగబా అడుగులు వేసాడు సునీల్..

వెనకాల అమృత వివేక్ నడవసాగారు.

“అమ్మూ!.. వాడు.. నీల్.. ఈ మధ్యన మూడీగా ఉంటున్నాడు.. వాడు కంపెనీ ఇవ్వకపోయినా.. నీకు నవల్స్ చదవడం ఇష్టం అని.. ఇదిగో క్రిందటి నెలలోనే రిలీజ్ అయింది ‘జానేదేవ్’. చదువు. Online లో తెప్పించాను.. కారులోనే ఉండిపోయింది.” అని చేతిలో ‘జానేదేవ్’ నవల పెట్టాడు వివేక్..

ఒక్క నిమిషం వివేక్ కళ్ళలోకి చూసింది అమృత.

వివేక్ కళ్ళ నిండా తన పట్ల ఉన్న ప్రేమ కనిపించిసాగింది..

‘జీవితంలో ఎన్నో రకాల ప్రేమలుండగా చాలా మంది లవ్ ఫెయిల్ అయిందని సూసైడ్‌లు ఎందుకు చేసుకుంటారో నాకైతే అర్థం కావడం లేదు’ అని మనసులో అనుకంది అమృత.

నడుస్తున్న సునీల్ గభాలున వెనక్కి తిరిగి దూరంలో ఉన్న అమృత, వివేక్ లని చూస్తూ.. “తొందరగా రండి.. చెకప్‌ల చోట మనుషులు తక్కువగా ఉన్నారు” అని గట్టిగా అన్నాడు.

వివేక్, అమృత.. గబగబా నడవసాగారు. లగేజ్ చెక్ అయిన తరువాత ఎవరికి వారే మౌనంగా ఉన్నారు.. అనౌన్స్‌మెంట్ రావడంతో సునీల్, అమృత లగేజ్‍లు పట్టుకున్నారు.

“బై! వివేక్!” అన్నాడు సునీల్..

“బై!.. నీల్!.. కాస్త మాములు అవ్వరా?.. అలా మూడీగా ఉండకు.. అలా అయితే మేమిద్దరం.. ఏం కావాలి? ఎలా ఉండాలి?” అన్నాడు..

“మీరా?.. మీకేం అయింది” అన్నాడు సునీల్.

ఏం చెప్పాలో తెలియని వాడిలా కంగారు పడ్డాడు వివేక్..

ఫైనల్ అనౌన్స్‌మెంట్ వినిపించడంతో.. గభాలున వివేక్ దగ్గరకు వెళ్ళి గుండె మీద తల పెట్టి “మామూ!.. నిన్ను చాలా బాధ పెట్టాను. సారీ!.. ఈ అమ్ముని ఎప్పటిలాగే క్షమిస్తావు కదా?” అంది అమృత.. అప్పటికి కళ్ళనిండా నీళ్ళు నిండాయి..

“అమ్మూ!.. మనిద్దరి మధ్యా క్షమార్పణలు ఏమిటి?.. ఒక్క మాట ఇవ్వు చాలు.. తొందరపడో, కోపం గాని, బాధగాని వచ్చో.. మావయ్య దగ్గర మన గురించి బయటపడకు. మావయ్య ఆరోగ్యం బాగుపడడం ముఖ్యం” అన్నాడు వివేక్..

“ష్యూర్!.. మామూ!..” అంది..

వాళ్ళిద్దరి మాటలు అర్థం కాక.. నడుస్తూనే ఆలోచించసాగాడు సునీల్.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here