వెంటాడే వేదన – ‘దేవుడమ్మ’

1
4

[dropcap]శ్రీ[/dropcap]మతి ఝాన్సీ పాపుదేశి రచించిన 11 కథలలో వెలువడిన పుస్తకం ‘దేవుడమ్మ – మరో పది కథలు’. “నా కళ్ళ ముందు నిలిచిన కొన్ని జీవితాలు కల్లోలపరిస్తే వెలికి వచ్చిన ఆవేదనకు రూపమే ఈ పుస్తకం లోని కథలు” అంటారు రచయిత్రి.

***

పెళ్ళి కాక ముందు ఆడుతూ పాడుతూ తిరిగిన యువతికి పెళ్ళయి అత్తారింటికి వచ్చాకా – ఒంటిమీద దేవుడు పూనే మహిళ అవుతుంది. అసమర్థుడైన భర్త, గయ్యాళి అత్తతో నిత్యం సమస్యలే ఆమెకు. అత్తకు హఠాత్తుగా దైవభీతి ఎక్కువై ఇంట్లో పూజలు చేయించడం మొదలుపెడ్తుంది. ఓ రోజు ఊర్లో అగ్నిప్రమాదం జరిగుతుంది, అదే సమయంలో తమ ఇంట్లో కూడా నిప్పు రగిలిస్తుంది కోడలు. గట్టి గట్టిగా నవ్వుతుంది. కోడలికి దెయ్యం పట్టిందేమో అని అత్త భూతవైద్యుడితో పూజ చేయిస్తుంది. ఇలా కొన్నిసార్లు జరిగాకా – తన మీదకి వచ్చింది దేవుడని, తాను అమ్మోరునని చెప్తుందామె. అప్పటినుంచి ఆమె దేవుడమ్మ అయిపోతుంది. ఆమె పట్ల కుటుంబ సభ్యుల ప్రవర్తన మారిపోతుంది. తాను దొంగ దేవుడమ్మ అని తనకి తెలిసినా, తన సమస్యలకి తనకి వీలైన పరిష్కారం తానే వెతుక్కునే క్రమంలో ఆమె ఇలా నటించక తప్పదు. “ఏదో ఒగ యాసమేసి దేవుడిచ్చిన బతుకుని ముగిసిపొయ్యేదాక ఈదల్ల” అంటుంది దేవుడమ్మ. అంతరంగంలోని వ్యథని వెల్లడించిన కథ ఇది.

చెరువులో నీటి లభ్యతని బట్టి, ఆ నీళ్ళు ఊర్లోని పొలాలకు ఎన్ని రోజులకు సరిపోతుందో చెప్పగలిగే సామర్థ్యం ఉన్న అతని పేరు చిన్నబ్బ అయినా.. ఊరందరికి అతను నీరుగట్టోడే. అలాంటిది చెరువులు ఎండిపోయి, బోరు బావులు వచ్చి పంటలు తగ్గాకా, అతని అవసరం తీరిపోతుంది జనాలకి. తప్పనిసరి పరిస్థితిలో నగరానికి కొడుకు దగ్గరికి వస్తాడు. కొడుకు ఒక పెద్ద కులం అమ్మాయిని ప్రేమిస్తాడు, ఆమెని పెళ్ళి చేసుకోడానికి తండ్రిని ఒప్పిస్తాడు. కొన్ని రోజులు బాగానే ఉన్నా, కోడలికి తన పొడ గిట్టడం లేదని అతనికి అర్థమవుతుంది. చెరువులలో నీరు ఆవిరైపోతున్నట్టే మనుషుల మధ్య బంధాలు కనుమరుగువుతున్నాయని గ్రహిస్తాడు. కొడుకుని కోడలిని పిలిచి తాను చెప్పదలచుకున్న నాలుగు మాటలు చెప్పి, తేమ ఉన్న తావుని వెతుక్కుంటూ వెళ్లిపోతాడు ‘నీరుగట్టోడు’ కథలో.

ఏకపర్ణిక’ చారిత్రక నేపథ్యంలో అల్లిన కథ. శ్రీకృష్ణదేవరాయల కాలంలోకి పాఠకులని తీసుకువెళ్తారు రచయిత్రి. కథా వాతావరణంలో భాగంగా విజయనగరం పరిసరాలని – కొండలని, కోనలని, చెట్లని – వర్ణిస్తూ.. అలనాటి మహాసామ్రాజ్యపు ప్రాకృతిక సౌందర్యాన్ని కళ్ళకి కడతారు. ఓ యువతి అన్వేషణకి రూపం ఈ కథ. ఏం అన్వేషిస్తోంది? రణంలో ప్రేమనా? చుట్టూ అందంగా కనిపించే ప్రకృతినా? తనకి నచ్చిన మాధవుడిని పెళ్ళి చేసుకోవాలనుకోవడం నేరమా? ఆమె కోరిక తీరిందా? అలనాటి రాచరికమైనా, ఈనాటి ప్రజాస్వామ్యమైనా – ప్రేమని పొందడంలో ఇబ్బందులు తప్పవా? ఒక యువతి వైయక్తిక గోడులా అనిపించిన – అలనాటి రాజ్యాల రాజనీతి, యుద్ధనీతిలను సందర్భోచితంగా వివరించే సామాజిక గాథ ఈ కథ.

పరుగులు తీయడం అలవాటయిన జీవితానికి కుదురుగా ఉండడం ఎంత కష్టమో హిమ పాత్ర చెబుతుంది ‘ఊర్ధ్వతలం’ కథలో. కెరీర్లు, సమాజంలో హోదా, డబ్బు వెంట పరుగులు.. వీటికి వెంపర్లాడే మనుషుల జీవితాలలో ప్రశాంతత కరువవుతుందని ఈ కథ చెబుతుంది. కథ భూటాన్‌ నేపథ్యంగా సాగడంతో స్థానికుల ప్రవర్తన, సాంకేతికత అందిపుచ్చుకోవడం వల్ల అక్కడ నిత్య జీవితంలో వస్తున్న కొత్తగా వస్తున్న ఇబ్బందులను రచయిత్రి ప్రస్తావిస్తారు. నిత్య సంతోషులు అని పేరున్న భూటాన్ ప్రజల గురించి కొన్ని కొత్త విషయాలు తెలుస్తాయి. “అవకాశాల కోసం ఆరాట పడడం, ఇంకా ఇంకా కావాలనుకోవడం.. వీటికి అంతమెక్కడ? ఉన్నదాంతో సంతృప్తి పడడం మనసుకి చాలా ప్రశాంతతని ఇస్తుంది. మనసు నిండే ఒక్క స్నేహం చాలదూ జీవితానికి” అంటాడు గైడ్ యాంగ్. అతని జీవన విధానాన్ని వెల్లడించే వాక్యాలివి. కథాక్రమంలో హిమ, యాంగ్‌ల స్వభావంలో, వైఖరులలోని వైవిధ్యాలని ప్రస్తావిస్తారు రచయిత్రి. ఎవరి జీవితం సరళమో పాఠకులనే తేల్చుకోమంటారు.

దైవాని చేసిన మొక్కు వల్ల దేవదాసీగా మారిన ఓ దీప కథ ‘మాతమ్మ ప్రశ్న’. కథ చదువుతుంటే వేదన, జుగుప్స, జలదరింపు.. వంటి భావనలు పాఠకులకు కలుగుతాయి. హృదయం బరువెక్కి పోగా, కనుల నీరు నిండి అక్షరాలు మసకవుతాయి. కూతురు దీపకి చిన్నప్పుడు ఓ అనారోగ్యం వస్తే, వైద్యం చేయించక, నయమైతే, ఆమెను మాతమ్మను చేస్తానని తల్లి మొక్కుకుంటుంది. మాతమ్మగా మారకముందు ఆవిడ పేరు గంగ. తన తండ్రికి జబ్బు చేస్తే, ఆయన కోలుకుంటే గంగని మాతమ్మని చేస్తానని వాళ్ళమ్మ మొక్కుకుని, మాతమ్మని చేస్తుంది. తన కూతురునీ అదే రకమైన మొక్కుతో మాతమ్మగా మారుస్తుంది గంగ. మాతమ్మగా నరకం అనుభవించిన దీప ఓ స్వచ్ఛంద సంస్థ సహాయంతో బయటపడుతుంది. మీటూ ఉద్యమం గురించి దినపత్రికలో చదివిన వార్తొకటి దీపలో ఆలోచనలు రేపుతుంది. ఓ సమావేశంలో మాట్లాడూతూ – దీప ఎన్నో ప్రశ్నలు వేస్తుంది. మరి వాటికి సమాధానాలు ఎవరు చెప్తారు? అసలు జవాబులు ఉంటాయా? జవాబులు తెలిస్తే మనుషుల్లోని స్వార్థాలు, వికృత ధోరణులు బహిరంగమైపోవూ?.

మద్యపానం సంసారాల్లో ఎన్ని సమస్యలు తెస్తుందో ప్రస్తావిస్తుంది ‘అనుమానం’ కథ. మల్లిక, రాజు అనే భార్యాభర్తల కథ ఇది. పెళ్ళయి, ఒక బిడ్ద పుట్టినా ఆమెను వేధిస్తూనే ఉంటాడు రాజు. లారీ పనిలో చేరిన రాజు రోజుల పాటు ఇంటికి దూరంగా ఉంటాడు. తాగుడికి బానిస అయి, ఇంటికి వచ్చినప్పుడల్లా మల్లికని సూటిపోటి మాటలంటూ – వేధిస్తాడు. బయట తిరిగిన రాజుకి రోగం అంటుకుంటుంది. జబ్బు చేసిన భర్తతో శారీరకంగా కలిసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలని మల్లికకి వైద్యుడు చెప్పినా, రాజు పట్టించుకోడు. మొదట్లో ఆమె నిస్సహాయురాలిగా ఉండిపోయినా, కొన్నాళ్ళకి తిరగబడుతుంది. మరణానికి చేరువవుతున్న రాజు భార్య మల్లికని అనుమానిస్తూనే ఉంటాడు.  కొత్తగా చేకూర్చుకున్న ధైర్యంతో బ్రతకు పోరు కొనసాగించాలని నిశ్చయించుకుంటుంది మల్లిక.

సమాజంలో ట్రాన్స్‌జెండర్లు ఎదుర్కునే అవహేళనలకు, వారి అంతరంగంలోని ఆవేదనకి అద్దం పట్టిన కథ ‘ద్వైతం’. అమ్మాయిగా మారిన అబ్బాయి తార. చంద్రిక అనే సామాజిక కార్యకర్త తారకి సాయం చేస్తుంది. తార పెళ్ళి చేసుకుంటుంది. కానీ ఆ వివాహం విఫలమవుతుంది. గౌరవంగా బ్రతకాలనుకున్న తారకి అడుగుగడుగునా అడ్డంకులు ఎదురవుతాయి. చంద్రిక కూడా సంపూర్ణంగా తోడ్పాటు అందివ్వలేదు. ఆమె కూడా తారని దూరం పెడుతుంది. చివర్లో తార వేసిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేక తనని తాను తరచి చూసుకుంటుంది చంద్రిక. తానూ సమాజానికి భిన్నం కాదని గ్రహిస్తుంది.

పారడాక్స్’ కథలో స్మిత, సమీర్‌లు ప్రేమించుకుని పెళ్ళి చేసుకుంటారు. ఎంతో గొప్ప జీవితం గడపాలన్న కలలు కన్న వారి జీవితాన్ని విధి దారి మళ్ళిస్తుంది. ఓ అరుదైన జబ్బు స్మితని బలి తీసుకుంటుంది. భార్యను మరిచిపోవడానికి ప్రయత్నిస్తాడు సమీర్. కానీ ఆమె జ్ఞాపకాలు అతన్ని వెంటాడుతాయి. ఓ హాస్పటల్లో హెచ్. ఆర్. గా పని చేసే సమీర్ – హాస్పిటల్ లో లీడ్ సైకో థెరపిస్ట్ పోస్టు కోసం అభ్యర్థులను ఇంటర్వ్యూ చేస్తుంటాడు. ఒక అభ్యర్థి తాను గతంలో డీల్ చేసిన ఒక కేసు గురించి చెబితే – సమీర్‍కి స్మిత జబ్బు గుర్తుస్తొంది. కొన్ని పోలికలు కనిపిస్తాయి. స్మిత కూడా తననుంచి నిజాలు దాచిందేమోనని భావిస్తాడు. అప్పటిదాక చదవకుండా ఉంచిన – స్మిత రాసిన ఓ ఉత్తరాన్ని చదువుతాడు. దాంట్లో తన జబ్బుని ప్రస్తావించి, సమీర్‌తో అందమైన జీవితం కొన్నాళ్ళయినా గడపాలన్న కోరిక తనని ఆ నిజాన్ని చెప్పకుండా ఆపిందని స్మిత రాస్తుంది. జీవితం ఓ విరోధాభాస అని అనిపిస్తుంది ఈ కథ చదివాకా.

బలవంతంగా వేశ్యావృత్తిలోకి నెట్టబడిన మహిళల వ్యథ ‘సావు’ కథ. మదనపల్లి దగ్గర  ఓ తండా నుండి పూనే వ్యభిచార గృహాలకి బలవంతంగా విసిరివేయబడ్డ ఓ మహిళ తన కథని చెబుతుంది. పేదరికం, అవిద్య ఈ దుర్మార్గానికి పై పై కారణాలుగా కనిపించినా, తమ కామానికి నిస్సహాయ స్త్రీల శరీరాలను వాడుకునే మగాళ్ళు  అసలైన కారణాలని ఈ కథ చెబుతుంది. బ్రతుకంతా చావే అయిన ఆమెని కొత్తగా మరణం భయపెట్టగలదా? ధైర్యంగా మృత్యువుని ఆహ్వానిస్తుంది.

దళితులు, మహిళలు ఎదుర్కునే దౌర్జన్యాలను కళ్ళకు కట్టిన కథ ‘తోలు’. వాడ లోని మనుషులు స్వంతంగా ఎదగడాన్ని భరించలేరు పెత్తందార్లు. వాళ్ళెప్పుడూ తమ కాళ్ళ దగ్గరే పడి ఉండాలని కోరుకుంటారు. స్వంత ఇంటి ఆడవాళ్ళని కూడా బలిచేయడానికి వెనుకాడరు. శారీరిక, మానసిక హింసలకి గురి చేసి – తమ ఆధిక్యాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నిస్తారు. అలా బలైపోయిన మనిషి సరస. సరస చనిపోయినప్పుడు ఆమె స్నేహితుడు పరదేశి కొట్టే డప్పులోని దుఃఖాన్ని ఊరు గమనించినా, ఏమీ ఎరుగనట్టు నిద్ర నటించింది అంటారు రచయిత్రి. కొన్ని నైచ్యాలను సమర్థించే సమాజపు పెడధోరణికి ఈ వ్యాఖ్య అక్షర రూపం.

నిజమైన ప్రేమని పొందాలనే తపనలో, రెండు సార్లు విఫలమయిన యువతి జీవితంలో వేసిన ముందడుగే ‘మూవ్ ఆన్’ . ప్రేమకి ముందు, ప్రేమించేసాకా – మగవాళ్ళలో వచ్చే మార్పుని – అభిమానం, ఆప్యాయత పేరిట – ఆడవాళ్లని తమ అదుపులో ఉంచుకోవాలని చూసే ధోరణిని ఈ కథ స్పష్టం చేస్తుంది. తన జీవితం మీద తనకి మాత్రమే పూర్తి అధికారం ఉండాలని కోరుకున్న యువతి కథ ఇది.

***

సమాజంలోని వైరుధ్యాలని, అణగారిన వర్గాల ఆవేదనని, తొక్కివేయబడ్డ మహిళల ఆర్తిని బహిర్గతం చేసి – కొత్త చైతన్యానికి మార్గం వేసిన కథలు ఇవి. బాధితుల పక్షాల నిలిచి వెలువరించిన కథలు ఇవి. పరాయికరణకి లోనవుతున్న జీవితాలలోని అశాంతిని కళ్ళకు కట్టిన కథలివి. ఉరుకుల పరుగుల జీవితాలలో కాస్తంత ఆగి తోటివారి గురించి కొద్దిగా అయినా ఆలోచించమనే కథలివి. చదవాల్సిన కథలు, అంతరంగాలలోకి తరచి చూసుకోవాల్సిన కథలు.

***

దేవుడమ్మ మరో 10 కథలు (కథా సంపుటి)
రచన: ఝాన్సీ పాపుదేశి
ప్రచురణ: నాన్న ప్రచురణ.
పేజీలు: 131
వెల: ₹ 150/-
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్. 040-24652387
ఇతర ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here