పెళ్లి సందడి, బాగానే వుంది.. మరి ఆ సంగతి ఏమిటీ..!?
[dropcap]పె[/dropcap]ళ్లి అనగానే, అదొక పెద్ద సందడి, ఒక పండగ వాతావరణం. తమకు బంధువులు, దగ్గర బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, ఒకరేమిటి పరిచయం వున్నఅందరినీ ప్రేమగా ఆత్మీయంగా తమ ఇంట్లో పెళ్ళికి రావాలని ఆహ్వానిస్తారు. పెళ్లి ఒక ఎత్తైతే పెళ్లి పిలుపు మరో ప్రత్యేక సందడి. ఈ పెండ్లి పిలుపుల ఆహ్వాన పత్రికల ముద్రణతో అసలు సందడి మొదలవుతుంది. ఈ ఆహ్వానాల పత్రికలు మళ్ళీ వారి వారి స్థాయిని బట్టి రకరకాలుగా ఉంటాయి. ఈ పెళ్లి పిలుపు కార్డుల కోసం, వందలు, వేలు, లక్షలు ఖర్చు పెట్టేవారున్నారు. మళ్ళీ ఇందులో అవతలి వారి స్థాయిని బట్టి కార్డుల విభజన ఇలా ఎన్నో – రకాలుగా సాగిపోతుంటుంది. ఒకప్పుడు పెళ్లి కబుర్లు చెప్పడానికి, దగ్గిర వ్యక్తిని ఎవరినో కాలినడకన గాని, సైకిలు మీదగాని పంపేవారు. ఇప్పటిలా అప్పుడు బంధువులు మరీ దూరప్రాంతాలలో ఉండేవారు కాదు, అందుచేత ఆ పద్ధతి సాధ్యమయ్యేది. తర్వాత పోస్టుకార్డులు రాసి ఆహ్వానించేవారు. టెలిఫోన్ కొందరికి అందుబాటులోనికి వచ్చిన తర్వా ఫోన్ చేసి ఆహ్వానించడంలో కొంత ఆత్మీయత తొంగి చూసేది. తరువాత రవాణా సౌకర్యాలు మెరుగు పడడంతో స్వయంగా వెళ్లడంగానీ, పెళ్లి కార్డులు పోస్ట్ చేయడం గానీ జరిగేది. పెళ్ళి కార్డు పంపినా స్వయంగా పిలిస్తేనే గానీ కొందరు వచ్చేవారు కాదు. ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలోకి అడుగు పెట్టిన తర్వాత, మొబైల్ ఆందుబాటు లోనికి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అలాగే పెళ్ళి ఖర్చు కూడా విపరీతంగా పెరిగిపోయింది. వీడియో వివాహ ఆహ్వానాల ప్రభంజనం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. ప్రపంచంలో ఎక్కడికైనా క్షణాల్లో విషయం అందజేసే పరిస్థితులు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ఒకప్పుడు పెళ్లి కూతురు ఇంటిదగ్గర గానీ, పెళ్ళికొడుకు ఇంటిదగ్గర కానీ పెళ్లి పందిళ్లు వేసి సహజమైన పద్ధతుల్లో అలంకరించి, పందిరి కింద పెళ్లిమండపం తయారు చేసేవారు. తాటాకులతో, కొబ్బరి ఆకులతో, మామిడి తోరణాలతో పెళ్లి పందిరి కళకళ లాడుతుండేది. ఎవరో పేదవాళ్ళు తప్ప ఇప్పుడు పెళ్ళికి పందిళ్లు వేయడం లేదు. తర్వాత పందిళ్ళకు బదులు టెంట్‌లు వెలుగులోకి వచ్చాయి వీటిల్లో కూడా వారి వారి ఆర్థిక పరిస్థితిని బట్టి రకరకాల షామియానాలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికీ కొంతమంది పెళ్లిళ్లకు షామియానాలు ఉపయోగిస్తున్నప్పటికీ, ఎక్కువమంది, ఎంత ఖరీదైన పెళ్ళిళ్ళకోసం ప్రత్యేకంగా నిర్మించిన ‘మేరేజ్ హాల్స్’ వైపే మొగ్గు చూపుతున్నారు. ఇవి అతి ఖర్చుతో కూడుకున్నవి. వీటికి అదనం అలంకరణ ఖర్చులు. అయినా వీటికి ఎవరూ వెనకాడడం లేదు. ఇంత అనవసరపు ఖర్చు దేనికీ వుండదనుకుంటాను.
గతంలో పెళ్ళి విందు బంతి భోజనాలు (క్రింద కూర్చోవడం) పద్ధతిలో పెళ్లి పందిరి క్రిందనో, ఇంట్లోనో, జరిగేది. భోజనానికి విధిగా విస్తరాకులు వాడేవారు. అవి కూడా ఖచ్చితంగా అరటి ఆకు విస్తళ్ళు మాత్రమే! వాటిని కూడా పెళ్ళివారు, కొనవలసిన అవసరం వచ్చేది కాదు. ఎవరో ఒక బంధువు వారి తోటలోని అరటి ఆకులు తెచ్చేవారు.
పెళ్ళి భోజనంలో ముఖ్యమైన వంటకం తప్పనిసరిగా కందిపప్పు ఉండేది. అదొక కమ్మని సువాసన వెదజల్లేది. దీనికి తోడు గుమ్మడికాయ దప్పళం. పెళ్లి అంటే ఇలాంటి భోజనమే మెదడులో స్థిరపడేది. భోజనం వడ్డించడం ఆత్మీయతతో కూడుకొని ఉండేది. వంటవాళ్లు చేత స్వయంగా వంట చేయించేవారు. అవన్నీఇప్పుడు క్రమంగా కనుమరుగవుతూ వస్తున్నాయి. పెళ్లిళ్లు విలాసవంతమైన వివాహమందిరాల్లో జరుగుతున్నాయి. భోజనం ‘కేటరింగ్’ వాళ్ళు సమకూర్చే సదుపాయాలూ వచ్చేసాయి. ఇప్పుడు పెళ్లి భోజనం అంటే, అందరూ వూహించుకునేది ‘బిర్యానీ’. ఇది ఎన్ని రకాలుగానైనా ఉండచ్చు. కొన్ని పెళ్లిళ్లలో అసలు శాకాహార వంటలకు ప్రాధాన్యమే ఉండదు. పప్పు వంటి ఐటెంల కోసం దుర్భిణి వేసి వెతుక్కోవలసిందే! ఇక శాకాహారుల పెళ్లిళ్లలో పూర్తిగా శాకాహారం ఉండడం అనేది అందరికీ తెలిసిందే! వారి వారి స్థాయిని బట్టి పదార్థాల జాబితా ఉంటుంది. వీటిలో వృథా అయ్యేవే ఎక్కువ!
డబ్బుంటే, ఈ రోజున ఎంత వైభవంగానైనా పెళ్లిళ్లు చేయొచ్చు. పెళ్లిళ్లు ఎంత వైభవంగా చేసినా, దాని కోసం డబ్బు ఎంత విల్లాసంగా ఖర్చు చేసినా, చిన్న చిన్న పొరపాట్లు పెళ్ళికి వచ్చిన అతిథులకు కాస్త చికాకు కలిగిస్తుంటాయి. ఎన్ని అనుభవాలు కళ్లెదుట కనిపించినా, అలాంటి సున్నితమైన విషయాలను నిర్వాహకులు పట్టించుకోక పోవడం బాధ అనిపిస్తుంది.
అందులో మొదటిది – పెళ్ళి ఘనంగా జరిగిపోతుంది, నూతన దంపతులను అక్షింతలు వేసి ఆశీర్వదించే ఘట్టం మొదలవుతుంది. ఇక వేదిక ఎడమవైపునుండి పెద్దలను ఆహ్వానించడం, ఒకేసారి పెద్ద క్యూ ఏర్పడి పోవవడం క్షణాల్లో జరిగిపోతుంది. ఇందులో నడివయస్సులో వున్నవాళ్ళ సంగతి అటుంచితే, వృద్దులు, కురువృద్దులు కూడా వుంటారు. అందరికీ త్వరగా ఆ పని పూర్తి చేసుకుని, భోజనం చేసి వెళ్లాలనే తొందరే! ఈలోపు ఎవరూ చెప్పకుండానే కుడివైపు నుండి గందరగోళం లైన్ మొదలవుతుంది.
వాళ్లకు కనీస జ్ఞానం, బుద్ధి ఉండదు. సజావుగా సాగుతున్న కార్యక్రమంలో గందరగోళం సృష్టిస్తారు. ఎడమ ప్రక్క నున్న వారి సంగతి అసలు ఆలోచించరు. అసలు క్యూ ఒక సెంటీమీటరు కూడా కదలదు. క్యూలో నిలబడ్డ వారికి అసహనం మొదలవుతుంది. దీని గురించి ఎవరు చెబుతారు? అందరూ విద్యావంతులూ, ఉన్నతస్థాయిలో వున్నవారు వుంటారు. ఇక భోజనశాల వ్యవహారం మరీ గమ్మత్తుగా ఉంటుంది. జనం ఎక్కువమంది ఒకేసారి వస్తారు, కౌంటర్లు తక్కువ ఉంటాయి. ఇక ఎప్పుడూ భోజనం సంగతే ఎరగనట్టు కొందరు, సమయం మించిపోయింది అని కొందరు పెద్దవాళ్ళు, ఒక పద్ధతి లేకుండా ఎగబడతారు, ఆధునిక బఫె సిస్టం కదా మరి! చూడ్డానికి ఈ సన్నివేశం కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. నిర్వాహకులు, సమయ పాలన చేయకపోవడం మూలాన, ఎక్కువ కౌంటర్లు ఏర్పాటు చేయకపోవడం వల్ల పెళ్లి వారికి సంబంధించి ప్రత్యేకంగా అజమాయిషీ చేసే పెద్దలు అక్కడ లేకపోవడం వల్ల కూడా ఇలాంటి ఇబ్బందులు ఏర్పడడానికి ముఖ్య కారణం.
పెళ్లి ఎంత ఘనంగా చేసినా, ఇలాంటి లోపాలు మొత్తం కార్యక్రమానికి మచ్చ తెస్తాయి. ఇలాంటి సమస్యల వల్ల పెళ్ళికి వెళ్ళి భోజనం చేయకుండా వెళ్ళిపోయేవారు చాలా మంది వుంటారు, అందులో నేనూ ఒకడిని!
ఇక్కడ నా అనుభవం ఒకటి ఉటంకించక తప్పదు. సుమారు పదేళ్ల క్రితం అనుకుంటాను, ఏలూరులో మా చిన్న మామగారు రిటైర్ అయిన సందర్భంగా, ఒక సన్మాన/అభినందన సభ ఏర్పాటు చేశారు. దానికి నేనే అధ్యక్షుడిని, ఆ తర్వాత యాంకర్‌ని కూడా! ఉపన్యాసాల సందడి ముగిసిన తర్వాత ఒక్కొక్కరు ఒక ప్రక్కనుండి క్యూలో వచ్చి, అభినందించి వెళుతున్నారు. ఈ లోగా మా చిన్న మామగారి కోడలు, పిల్లలు, ఇతర పరివారము మరో ప్రక్క నుండి రావడం మొదలు పెట్టారు. వాళ్ళు నిలబడలేని వృద్దులు కాదు. నా దృష్టిలో నిబంధనలు అందరికీ సమానమే. అందుచేత ఎలాంటి మొహమాటం లేకుండా, వారిని అలాకాకుండా అసలు క్యూలో రమ్మని ఆదేశించాను. వాళ్ళు లోపల నన్ను తిట్టుకున్నారేమో నాకు తెలీదుకానీ, మారుమాట మాట్లాడకుండా వెళ్లి అసలు క్యూలో నిలబడి వచ్చారు. బంధువులు, శ్రేయోభిలాషులు, ఇతరులు, సహకరించకుండా ఇలాంటి కార్యక్రమాలు, ముఖ్యంగా పెళ్లిళ్లు విజయవంతం కావు.
ఇకపోతే మంచి అనుభవాలు కూడా జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఈ మధ్యనే నా సహాధ్యాయిని (ప్రొఫెసర్) కొడుకు పెళ్లి రిసెప్షన్‌కు వెళ్లడం జరిగింది. విపరీతమైన జనంతో హాలంతా నిండిపోయింది. వాళ్ళను చూస్తే అసలు భోజనం చేసి వెళ్ళగమా? (ఇలాంటి అనుమానాలు నాకే వస్తాయి) అనిపించింది. రిసెప్షన్ ఎంత చక్కగా మొదలయిందో చెప్పలేను. ఒకే వరుసలో క్యూకట్టి చక్కగా వధూవరులను ఆశీర్వదించి వెళ్లిపోతుంటే ఎంతో సంతోషం అనిపించింది. భోజనం విషయానికివస్తే డైనింగ్ హాల్లో ఎక్కువ కౌంటర్లు పెట్టడమే కాదు, కూర్చుని తినడానికి రౌండ్ టేబిల్స్ కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడా ఇబ్బంది అనిపించలేదు. ‘ఆహా.. ఇలా ఉండాలి కదా!’ అనుకున్నాను. ఎవరికైనా అలానే అనిపిస్తుంది. ఒక శుభకార్యం శుభంగా ముగుస్తుంది. పెళ్ళివారు ఫంక్షన్ హడావిడిలోవున్నా, ఎవరో ఒకరు బాధ్యత తీసుకుని పర్యవేక్షకులుగా ఉంటే, ఎలాంటి సమస్యలూ వుండవు.
గొప్పలు చెప్పుకోవడం కాదు గానీ, నా ఇద్దరి పిల్లల పెళ్ళిళ్ళకి (నా దగ్గరే చేసాను) ఇలాంటి జాగ్రత్తలే తీసుకున్నాను. నా మిత్రులు కొందరు ఇప్పటికీ ఈ విషయంలో నన్ను ప్రశంసిస్తూనే వుంటారు, అవన్నీ మధుర జ్ఞాపకాలే మరి!
(మళ్ళీ కలుద్దాం)