[dropcap]సి[/dropcap]నీ దర్శకులు కె విశ్వనాథ్ గారు ఎందరెందరో నటులను వెండితెరకు పరిచయం చేసే క్రమంలో వారిని తీర్చిదిద్ది, వారిలోని అసమాన నటనా వైదుష్యాన్ని వెలికితీసి, వారిలో చాలా మంది సినీ ప్రగతికి ప్రత్యక్షంగానూ, వాళ్ళ జీవన పురోగతికి పరోక్షంగానూ దోహద పడ్డారు. ఆయన ఆద్యంతం అనేక తారలను సినీ వినీలాకాశంలో వెలిగింపజేసి, తన చివరి మజిలీలో నింగికెగసి తారా మండలాన్ని చేరుకొని అభిమానుల గుండెల్లో ధ్రువ తారగా ఎప్పటికీ నిలిచి ఉంటారని చెప్పడం అతిశయోక్తి కాదు.
ఉదాత్తమైన కథలను ఎంచుకోవడమే కాక ఆయా కథల్లోని పాత్రలకు తీరైన పాత్రధారులను కూడా ఎంపిక చేసి వారిని ఆ పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేయింపచేసి ప్రేక్షకులను మెప్పించి, ఔరా ఏమి ఈ విశ్వనాథ సినీ మాయ అని సినీ పండితులను సైతం ఒప్పించేవారు.
ఆయన సినీ రంగ ప్రవేశం చేసింది మొదలు, తారలు, తరాలు, దశకాలు మారుతున్న కొద్దీ ఆయన మధ్యాహ్న మార్తాండుడి లాగా అంతకంతకూ విజృంభిస్తూ, ఒక దాన్ని మించినదై ఉన్న ఒక్కో కథ ఎంచుకోవటం ఆలస్యం వాటిని తెరకెక్కించి, ఒకటి వెంట ఒకటి వరుస విజయాలందుకున్న సినిమాలను అందించి అటు ప్రేక్షకులకి బ్రహ్మానందాన్ని ఇటు నిర్మాతలకు కాసుల పంటని పంచారు. శంకరాభరణం, స్వర్ణకమలం, స్వాతిముత్యం, ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన తీసిన సినిమాలన్నీ ఆణిముత్యాలే.
ఆయన భౌతికంగా మన మధ్యన లేకపోయినా ఆయన సినిమాలు ప్రజల మనసుల్ని మాత్రమే కాక రాబోయే అన్ని తరాల వారిని కూడా అజరామరంగా అలరించి, కళల పట్ల కళాకారుల పట్ల సద్భావనని తట్టి లేపుతూనే ఉంటాయి.