యువభారతి వారి ‘తిక్కన కవితా వైభవం’ – పరిచయం

0
4

[తెలుగు సాహిత్యం పట్ల కొన్ని తరాలలో ఆసక్తి రగిలించి, ఆధునిక తరానికి వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్తూ, యువతకు ఉత్తమ సాహిత్యం ద్వారాఉత్తమ వ్యక్తిత్వాన్నివ్వాలని నిరంతరం తపించే యువభారతి సంస్థ స్థాపించి వచ్చే దసరాకు 60 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు సాహిత్యానికి, సమాజానికి యువభారతి చేసిన సేవను తెలుగు పాఠకులకు పరిచయం చేసే ఉద్దేశంతో ప్రతి ఆదివారం సంచికలో యువభారతి ప్రచురించిన పుస్తకాల పరిచయం వుంటుంది. ఈ శీర్షిక వచ్చే సంవత్సరం విజయదశమి వరకూ సాగుతుంది.]

తిక్కన కవితా వైభవం

[dropcap]మ[/dropcap]నీషులు, యుగకర్తలు సమాజాన్ని అర్థం చేసుకుని, అభ్యుదయపథంలో నడిపించడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళ ఆలోచనలకు, భావాలకు, నిరంతర ప్రసరణం జరుగుతూంటేనే, సమాజం సజీవంగా, చైతన్య స్ఫూర్తితో తన అనుభవాలకు రూపకల్పన చేసుకుని పయనిస్తుంది. మనీషుల ఆలోచనలే ఉత్తమ సాహిత్య రూపాన్ని ధరిస్తాయి. ఆ ఉత్తమ సాహిత్యాధ్యయనం మనిషి వ్యక్తిత్వాన్ని సుసంపన్నం చేయగలుగుతుంది.

ఈ యథార్థం పట్ల విశ్వాసం ఉన్న యువభారతి, సాహితీరంగాన్ని, సమాజాన్ని ప్రభావితం చేసిన మహితాత్ముల సాహిత్య వ్యక్తిత్వాలను గూర్చి వ్యాసాలను వ్రాయించి వాటిని ‘సాహితీ వైభవం’ శీర్షికన ప్రచురించింది. ఈ శీర్షిక క్రిందే – జగద్గురు శంకరాచార్య, కాళిదాసు, మాఘుడు, నన్నయ, పాల్కురికి సోమనాథుడు, నన్నె చోడుడు, తిక్కన, నంది తిమ్మన, ధూర్జటి, పింగళి సూరన, అయ్యలరాజు రామభద్రుడు, తులసీదాసు, అల్లసాని పెద్దన, సూరదాసు, చేమకూర వేంకట కవి, కంకంటి పాపరాజు, స్వామి వివేకానంద, చిలకమర్తి లక్ష్మీ నరసింహం, తిరుపతి వేంకట కవులు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, కుందుర్తి వంటి కవుల రచనలను విశ్లేషించి ప్రచురించింది. బహుశా ఇంతమంది కవుల కవితా వైభవాలను ప్రచురించిన ఘనత యువభారతిదే.

తిక్కన దేశి మార్గ పద్ధతులను, శైవ వైష్ణవ మతములను, సంస్కృతాంధ్ర భాషా రచనలను, కర్మ జ్ఞాన మార్గములను, చక్కగా పరిష్కరించి ఉభయతారకమైన మధ్యే మార్గమును నిర్దేశించాడు. పురాణమును కావ్యముగా తీర్చిదిద్దుట, ఆఖ్యాయికను నాటకీయముగా రచించుట, పాత్రలను విస్పష్ట రేఖలతో చిత్రించుట, మనస్తత్వమును నిశితముగా విశ్లేషించి నిరూపించుట, నానా రసములను పోషించుట – ఆయన సాహితీరంగంలో త్రొక్కిన కొత్త మార్గములు.

భారతమును రెండున్నర పర్వములను తెనిగించి నన్నయ దివంగతుడయ్యాడు. ఆ తరువాత రెండు వందల ఏళ్ళు, దాని జోలికి పోయిన కవి లేడు. కానీ ఆంధ్ర భారతము పూర్తికావలెనని దేశము ఆశించింది. తిక్కన ఆ పనికి పూనుకొన్నాడు. వ్యాస మహర్షి హృదయము తనకు అవగతమగునంత గాఢముగా మూల భారతమును మననము చేశాడు. లౌకిక వాసనాదూషితమైన చిత్తమును యజ్ఞముచే పరిశుద్ధము గావించుకొని సోమయాజిగా మారాడు. పంచమవేదమైన భారతమును “ఆంధ్రావళి మోదముం బొయునట్లుగ తుదిముట్ట రచింతు” నని సంకల్పించాడు – అలాగే రచించి సిద్ధ సంకల్పుడయ్యాడు.

తిక్కన భారతంలోని కొన్ని మంచి పద్యాలను పరిచయం చేసి, యువభారతికి అందించిన డాక్టర్ పాటిబండ మాధవశర్మ గారు సుప్రసిద్ధ సాహిత్యాచార్యులు. సంస్కృతాంధ్ర ఆంగ్ల భాషా పండితులు. ఉత్తమశ్రేణికి చెందిన అధ్యాపకులు. ఛందశ్శిల్పమును గూర్చి పరిశోధనచేసి అపూర్వ రహస్యాలను వెలికిదీసిన పరిశోధకులు.

తిక్కన సాహిత్యంతో పరిచయం – భారతాత్మతో పరిచయం. సజీవమైన తెలుగు భాషతో పరిచయం. తెలుగు పలుకుబడికి తిక్కన భారతం ఒక గుడి.

క్రింద ఇవ్వబడిన link ను క్లిక్ చేసి ఈ పుస్తకాన్ని ఉచితంగానే చదువుకోండి.

https://archive.org/details/YuvaBharathi/%E0%B0%A4%E0%B0%BF%E0%B0%95%E0%B1%8D%E0%B0%95%E0%B0%A8%20%E0%B0%95%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A4%E0%B0%BE%20%E0%B0%B5%E0%B1%88%E0%B0%AD%E0%B0%B5%E0%B0%82/

 లేదా క్రింద ఇవ్వబడిన QR code ను scan చేసినా ఆ పుస్తకాన్ని ఉచితంగా చదువుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here