[dropcap]క[/dropcap]న్నుల ముందు కదులుతున్న అనురాగ దృశ్యం
నీ చిరునవ్వుల సంబరమే కదా!
నింగిని తాకేలా ఆనందాలని పరిచయం చేసే హర్షం
నీ తీయని పలకరింపుల కమ్మదనాలే కదా!
ఎద వీణలని మీటే సరిగమల గమకాల గమ్మత్తుల సమ్మోహనం
నీ కాలి అందియల చిరుసవ్వళ్ళ సుస్వరాల హాయిదనాలే కదా!
అలసటి ఎరుగని శ్రమతో కావ్యఖండికలకు రూపమివ్వగల సామర్థ్యం
నీ ప్రేరణల ఉల్లాస మధురోహలే కారణం కదా!
ఎదురై నిలిచిన వెన్నెల కాంతుల కమనీయమైన రూపం
నీ సుమ సోయగాల సుందరాకారమే కదా!
‘ప్రియా..’ అంటూ ప్రేమగా పిలుస్తుంటే..
చింతలు తీర్చేలా చెంత చేరుతూ
మంత్రమేదో వేస్తూ ఆకట్టుకునే మౌనం.. నువ్వే కదా!
..నా ప్రాణానికి ఆధారం నువ్వే కదా!
దివిలో వైభవమై వర్ధిల్లే పవిత్ర పరిణయ బంధం మనదే కదా!