[dropcap]నా[/dropcap] శోక తప్త హృదయంలో
ఎన్నెన్నో విషాదాలు..
మరెన్నో వ్యథలు..
నిరంతరం కలవర పెడుతున్నాయి!
నా గుండెకు నువ్వు చేసిన
గాయాల ఆనవాళ్ళన్నీ..
దశాబ్దాల నీ వియోగ విరహానికి
ప్రతిబింబలై వెక్కిరిస్తున్నాయి!
నా అంతరంగంలో
కొడిగడుతున్న జ్ఞాపకాల దివ్వెలు
నీతో పంచుకున్న అనుభూతులకు
మధుర స్మృతులుగా
ఇంకా..
మినుకు మినుకుమంటున్నాయి!
నీ సమ్మోహిత ప్రేమ చూపులతో
జీవితమంతా తోడై నిలుస్తానని..
నీ అధరాలు పలికిన
ప్రేమ ప్రమాణం..
ఇంకా నా చెవుల్లో
ప్రతిధ్వనిస్తూనే వుంది!
భావోద్వేగ హృదయంతో
కడదాకా కలిసి వుంటానటూ..
చూపులతోనే వాగ్దానం చేశావు!
అయినా.. చెలీ..!
జీవితాలు వేరై పోయాయి గానీ..
మన హృదయాలు మాత్రం
ఏకమై వున్నాయి కదా!
ఈ భావన తోనే..
ఒక్కోసారి..
నియమాలను, సంప్రదాయలను
పక్కన పెట్టేసి
బ్రతుకుబాటలో
నీతో కలిసి నడవాలన్న పిచ్చి కోరిక
మదిలో చేరి అలజడి చేస్తూ వుంటుంది!
మరుక్షణమే వివేకం హెచ్చరిస్తోంది ఇలా..!
జీవితం చరమాంకంలో
నీ సౌందర్యంతో నా కలయిక
ఓ తోపి గుర్తుగా మిగిలిపోతుందే గానీ..
ఒకప్పటిలా రసార్ద్రంగా వుండదు కదా!?
అందుకే..
నువ్వు పంచి ఇచ్చిన
ఆనాటి మధురానుభూతుల
ఊయలలో ఊగుర్తూ
ఆనందాన్ని అనుభూతిస్తాను!