పాపం కోటిగాడు

0
3

[సంచిక 2022 దీపావళి పోటీకి అందిన కథ.]

[dropcap]అ[/dropcap]టువైపుగా బీడీ తాగుతూ వెళుతున్న ఓబులేసు, ఒక్క సారే కొయ్యబొమ్మలా నిలబడిపోయి, ‘వీడు’ అనుకుంటూ ఓ వైపు ఆశ్చర్యంగా చూస్తూ, అటుగా నడిచి వెళ్ళి, “ఒరేయ్ కోటిగా, వంట గదిలోకి పిల్లిలా, నువ్వెప్పుడురా జైలు నుండి ఊళ్ళోకి దిగబడ్డావ్. అయినా, నువ్వు ఊళ్ళో కంటే జైల్లోనే ఎక్కువుంటున్నట్టున్నావ్. ఇదివరకంటే ఒంటరివాడివి. కానీ ఇప్పుడు నీకో పెళ్ళాం, బిడ్డానూ. కనుక ఇప్పటినుండైనా తిన్నగా ఉండరా. అవునూ, ఏవిటి ఇలా ఊరి పొలిమేరలో కాపు కాసావ్! ఏవిటి సంగతి? ఎవరైనా అమ్మాయి కోసవా. చెప్పు నేనెవరికీ చెప్పనులే. ఒక్క మీ ఆవిడకి తప్ప” అంటూ చిన్నగా నవ్వాడు.

“అదేం కాదురా ఓబూ, మా పాపారావ్ అయ్యగారి మీద పోటీ చేసి ఓడిపోయిన ఆ ప్రతిపక్ష నాయకుడు రాజారావ్‍నీ, అతని బావమరిదినీ ఓ చూపు చూడమని మా అయ్యగారు పంపారు. అందుకే వాళ్లెప్పుడు వస్తే అప్పుడు వాళ్ళని ఓ చూపు చూసి వెళ్లిపోదావని ఇక్కడ కాపు కాయడం” చెప్పాడు మీసం దువ్వుకుంటూ.

“ఓరినీ, నువ్వింకా ఆ పాపారావ్ దగ్గర పని మానలేదా? అయినా ఎందుకటా వాళ్ళని ఓ చూపు చూడటం”.

“ఎందుకేటెహే, పొద్దున లేచింది మొదలు, పాచి మొహాలతో మా అయ్యని టీవీలకి ఎక్కి మరీ ఆ రాజారావ్ ఒకటే తిడతన్నాడట. అతను సరే అనుకుంటే, అతని బావమరిది కూడా అలాగే నోరు పారేసుకుంటున్నాడట. నిన్నటికి నిన్న ఏదో అనకూడని మాట ఒకటి అన్నారట”.

అప్పటివరకూ మామూలుగా విన్న ఓబులేసు ఒక్కసారే కొంత ఆసక్తి ప్రదర్శిస్తూ, “ఏవిటది! కొంపదీసి అతను ఎం.ఎల్.ఏ. కాకముందు ఓ సారి, సారా తాగి ఓ ముసలి దాన్ని మానబంగం చేయబోయాడు అదా”.

“కాదురా ఓబూ”.

“పోనీ, ఆ ఉత్తరం దిక్కున శ్మశానం ఆక్రమించి రెండో భార్యకి చిన్నిల్లు కట్టిస్తే, ఆవిడకి ఒక సారి దెయ్యం పట్టి ఇతని చేయి చెడా, మడా కరిచేసింది. దాని గురించా”.

“అది కూడా కాదుగానీ, ఆ సంగతి వదిలై. ఇంకా వింటే అయ్యగారిపై గౌరవం పోయేట్టుంది”. చెప్పాడు బుర్ర గోక్కుంటూ.

“అది సరే గానీ, వాళ్ళు ఇక్కడికే వస్తారని నీకు తెలుసా” అడిగాడు ఓబులేసు

“రోజూ ఆ రాజారావ్ సాయంత్రం ఎవరికీ తెలియకుండా పేకాట మేడకి ఎల్తాడట. ఆడితో పాటు ఆడి బావమరిది కూడా. అందుకే ఇక్కడ కాపు కాసాను. ఈ గుంటూరు గొడ్డు కారం తీసి వాళ్ళ కళ్ళలో చల్లి, ఆ తర్వాత చితక్కొట్టి ఆ వైపు పొలాల్లోకి పారిపోతాను”. చెప్పాడు గొప్పగా.

“అమ్మో అవునా. సరేరా కోటిగా వస్తాను” అని వెళ్లబోతూ ఓ సారి ఆగి , “ఒరేయ్ మొన్నేగా జైలుకు వెళ్లావ్. ఏ నాయకుడూ నిన్ను పట్టించుకోలేదు. ఇప్పుడే వచ్చావ్. నీ పెళ్ళాం, బిడ్డతో హాయిగా ఉంటూ ఏ కూలి పనో చేసుకోక, ఎందుకురా పావు పడగ లాంటి ఆ నాయకుడి నీడలో” చెప్పాడు ఓబులేసు.

“నువ్వన్నదీ నిజవేరా ఓబూ, కానీ నాకూ చిన్న చిన్న అప్పులూ అవీ ఉన్నాయిరా. అందుకే ఈ పని చేస్తే నాకు ఆ పాపారావ్ ఓ లక్ష ఇస్తా అన్నాడు. సరే అని దీనికి తెగించాను” చెప్పాడు జేబులోంచి ఖైనీ తీసుకుని నోట్లో వేసుకుంటూ.

“ఒంటికి బురదంటితే, నీళ్ళని ఉపయోగిస్తాం. కానీ బుద్దికి బురదంటితే మాత్రం, బుర్రని ఉపయోగించాలి. నేను చెప్పాల్సింది చెప్పాను. ఇక నీ ఇష్టం రా కోటీ” అంటూ అక్కడి నుండి నడిచేశాడు ఓబులేసు.

ఇంతలో అటుగా ఓ బుల్లెట్టు బండి వస్తున్న శబ్దం రావడంతో, గుడ్లు మిటకరించి అటూ ఇటూ వంగి వంగి చూసి జేబులో కారం పొట్లం తీసి చేత్తో పట్టుకున్నాడు. అతనూ, అతని బావమరిదీ రావడం గమనించాడు. అంతే హోలీ రోజు రంగులు జల్లినట్టు వాళ్ళ మీదకి కారం జల్లేసాడు. తర్వాత కర్ర తీసుకుని చితక్కొట్టేసి పొలాల్లోకి పారిపోయాడు.. అలా పొలాల్లోకి వెళ్ళి చొక్కా మార్చుకుని, ఫోన్ తీసి చూసుకున్నాడు. అప్పటికే పాపారావ్ చేసిన మూడు మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ‘అరె అయ్యగారు పని అయిందా లేదా అని అడగడానికి ఫోన్ చేసినట్టున్నారు’ అనుకుంటూ వెంటనే పాపారావ్‌కి ఫోన్ చేశాడు.

అతను ఫోన్ ఎత్తి “ఒరే కోటీ” అని ఏదో చెప్పేంతలోనే, తనలో తానే విజయగర్వంతో మురిసిపోతూ, “అయ్యగారూ మీరేం కంగారు పడకండి. నేను మీరు చెప్పిన పని విజయవంతంగా పూర్తి చేశాను. ఆ ఇద్దరినీ చితక్కొట్టేశాను. ఒక్కొక్కడూ కోలుకోడానికి కనీసం ఆరు నెలలు పడుతుంది” అని ఓ క్షణం ఆగి “మరీ ఆ నా లక్ష” అని కోటి ఇంకా ఏదో చెప్పేంతలోనే,

“ఎంత పని చేశావురా కోటీ. వాళ్ళని కొట్టొద్దూ అని చెబుదావనే నీకు అన్ని సార్లు ఫోన్ చేసి చచ్చాను. కానీ నువ్వు తీసి చావలేదు. చివరికి ఇంత పెంట చేశావ్ చచ్చావ్ కదరా” అన్నాడు పాపారావ్ అసహనంగా నెత్తి బాదుకుంటూ.

అది వింటూనే తెల్ల మొహం వేస్తూ “అదేటండీ, మీరే కదా అతన్నీ అతని బావమరిదినీ చితకొట్టమన్నారు. లక్ష కూడా ఇస్తా అన్నారు” అడిగాడు అయోమయంగా.

“అవున్రా నిజమే, నేను చెప్పింది పొద్దున్న. కానీ ఇప్పుడు వాళ్ళూ మన వాళ్ళే. ఈ మధ్యాహ్నమే వాళ్ళు మన పకోడీ పార్టీలో జాయిన్ అయ్యారు. వాళ్ళ మద్దతు కూడా నాకే ప్రకటించారు. అలాంటిది ఇపుడు ఇలా అయితే అనుమానం నా మీదకి రాదూ?”.

“అందుకని ఇప్పుడు ఏవంటారు?”

“ఏవీ అనను. నీకూ నాకూ సంబంధం లేదు. పోలీసులు నిన్ను పట్టుకుంటారు. లొంగిపో. నా పేరు ఎత్తకు. ఎవరో అనుకుని వీళ్ళని కొట్టానని చెప్పు” చెప్పాడు.

“అప్పుడు అతని మనుషులు నా ప్రాణం తీసేస్తారు కదండీ” చెప్పాడు కళ్ళు తేలేస్తూ.

“అదంతా నాకు తెలీదు. నీ పేరు ఇన్‌స్పెక్టర్ గారికి చెప్పాను. లొంగిపోయి నే చెప్పినట్టు చేయి. లేకపోతే నేనే నిన్ను లాకప్ డెత్ చేయించేస్తాను దరిద్రుడా” అన్నాడు.

బిత్తరపోయాడు కోటిగాడు. “ఓబులేసు చెప్పింది నిజం. పావు పడగ కింద సేద తీరడం ప్రమాదకరం” అనుకుంటూ లుంగీతో కళ్ళు తుడుచుకున్నాడు. ఇందాక చేతులకయిన కారం లుంగీకి తుడుచుకున్నాడు.ఇప్పుడు అదే లుంగీతో కళ్ళు తుడుచుకోవడంతో కళ్ళు మండి బేరమన్నాడు. ఆ ఏడుపు ఫోన్లో విన్న పాపారావ్, “అలా ఆడదానిలా ఏడవకు, నువ్వు అందాక ఎక్కడికైనా అండర్‌గ్రౌండ్‍కి పో. ఆ ఇన్‌స్పెక్టర్‌కి ఏదోటి చెప్తాలే” అని ఫోన్ పెట్టేశాడు పాపారావ్.

అంత కళ్ల మంటలోనూ ఏదో తెలియని కొంత ఉపశమనం కలిగినట్టైంది కోటిగాడికి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here