[వృత్తి రీత్యా వైద్యులైన డా. ఎచ్. ఎస్. అనుపమా కన్నడంలో రచించిన జీవితకథని శ్రీ చందకచర్ల రమేశ బాబు అనువదించి ‘నేను.. కస్తూర్‌ని’ అనే పేరుతో సరికొత్త ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నారు.]
~
[dropcap]ఇ[/dropcap]టు భారతదేశంలో, దక్షిణ ఆఫ్రికాలో జరిగిందంతా పెద్ద వార్త అయ్యేది. భాయిని వీరనాయకుడిగా, సమాజ సేవకుడిగా అనివాసి భారతీయుల ఆపద్బాంధవుడిగా భావించి రాసేవారు. ముందంతా పత్రికలు, వార్తలు, రాజకీయాల గురించి పట్టించుకోని నేను ఇప్పుడు ఆసక్తిగా పత్రికలను చదవసాగాను. ఉత్తరాలు రాయించేదాన్ని. పత్రికలలో వచ్చే భాయి గురించిన వార్తలను, అక్షరం అక్షరం కూడబలుక్కుని మళ్ళీ మళ్ళీ చదువేదాన్ని. పిల్లలకు చూపేదాన్ని. ఫోటోలలో తమ తండ్రిని చూసి పిల్లలు గర్వపడేవారు. మా ఇంటికి ఎవరు వచ్చినా మోకభాయి సాధన, ప్రసిద్ధి గురించే చర్చ జరిగేది. మొదటి తడవ భాయి లండన్‌కు వెళ్ళినప్పుడు మమ్మల్ని జాతి నుండి వెలివేశారు. జాతి భ్రష్టులమైన మా ఇంట్లో నీళ్ళు తాగడానికి కూడా వెనుకంజ వేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైంది.
భాయి తమ అనుయాయిలతో అక్కడ ఇండియన్ ఒపినియన్ పత్రికను ప్రారంభించారు. “డర్బాన్ నుండి 14 మైళ్ళ దూరం ఉన్న ఫీనిక్స్‌లో ఒక ఆశ్రమం లేదా ఫార్మ్ ప్రారంభమయ్యింది. పోరాటం జోరుగా సాగుతోంది. ఇంతలో హిందుస్తాన్ రావడం కుదరదు. అందుకే పిల్లల ఆరోగ్యం బాగానే ఉంటే వెంటనే వచ్చెయ్యి” అని ఉత్తరం రాసి, తగిన డబ్బు పంపారు. మొదటి సంచిక కూడా పంపారు.
రాణీవాసం నుండి ఫీనిక్స్ ఆశ్రమానికి
మేము 1904లో రెండవసారి దక్షిణ ఆఫ్రికాకు వెళ్ళాము. హరి ముంబైలో మెట్రిక్ పరీక్షకు కట్టాడు. అందుకే అక్కడే ఉన్నాడు. గోకులదాస్, ఛగన్ లాల్, మణి, రామదాస్, దేవదాస్ అందరూ బయలుదేరాము. పడవ ప్రయాణం ఈసారి అంత దడ పుట్టించలేదు. ఎందుకంటే ఇంతసేపటికి ప్రయాణాలకూ, అపరిచితులకూ అలవాటు పడ్డాను. భాయి ఇప్పుడు జొహాన్స్‌బర్గ్‌లో ఉన్నారు. చాలా ప్రసిద్ధిగాంచిన లాయరయ్యారు. కాబట్టి మేము జొహాన్స్‌బర్గ్ లో దిగాము. అక్కడిది పెద్ద ఇల్లు, రాణీవాసం అని భాయి హాస్యం చేసేవారు. ఏడెనిమిది గదులున్న ఇల్లు. అక్కడ భాయి మిత్రులైన హెన్రి పొలాక్, కలెన్ బాక్ ఎప్పుడూ మాతో ఉండేవారు. వీరిద్దరి గురించి చాలానే చెప్పాలి. తరువాత ఎప్పుడైనా చెప్తాను. చివరికి అందరి శ్రమతో ఆశ్రమం అనే పెద్ద కల నిజమయ్యింది. ఫీనిక్స్ ఫార్మ్ ప్రారంభమయ్యింది.
మేమున్నది జొహాన్స్‌బర్గ్‌లో. ఇండియన్ ఒపినియన్ పత్రిక ముద్రణాలయం డర్బాన్‌లో. ఆల్బర్ట్ వెస్ట్ అనే భాయి స్నేహితుడొకాయన ఉండేవాడు. ఆయన పత్రిక సంపాదకుడు. మా పిల్లలు పత్రిక పనులను చూసుకొనేవారు. పనివాళ్ల జీతాలు, కచేరి అద్దె, ముద్రణా యంత్రం మొదలైన ఖర్చులకు భాయి తమ ఆదాయాన్ని వెచ్చించేవారు. ఎప్పుడూ డబ్బుల్లేవు, డబ్బుల్లేవు అనేవారు. పత్రికను నడిపే కష్టాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పేవారు. ఫీనిక్స్ ఆశ్రమం స్థలానికి, ఇతర ఖర్చులకూ చాలానే ఖర్చయ్యింది. దాన్నుండి తిరిగి లాభం కానీ, శ్రమకు ఫలితం అని వచ్చేదేం లేదు. ఒక రోజు “బనియా అయ్యిండి ఇదెలాంటి నష్టపు వ్యాపారం చేస్తున్నారు మీరు?” అని అడిగేశాను.
నాకు ఆశ్రమ వాసమే ఒక కొత్త ఆలోచన. చాలా రోజుల వరకు ఆశ్రమం అంటూ ఇలా మేమంతా కలిసి ఎందుకుండాలి అనే అర్థం కాలేదు. మనం సామూహికంగా జీవించడాన్ని అలవాటు చేసుకోవాలి, గ్రామీణ భాగాల్లో నివసించాలి అనే ఆశ్రమాన్ని ప్రారంభించింది అని భాయి వివరించి చెప్పారు. భగవద్గీతలో అపరిగ్రహం, సమాభావం అని వస్తాయి కదా, వాటి ప్రకారంగా అలాగే తన ఇద్దరు గురువులు టాల్‌స్టాయ్, రస్కిన్ గార్ల ఆదర్శాల ప్రకారంగా జీవించడానికి ఆశ్రమవాసం అని చెప్పారు.
ఆయన ఇప్పటిదాకా ఒక్క రోజు కూడా గ్రామాల్లో బతికినవారు కారు. ఒక్క రాత్రి కూడా అక్కడ గడపలేదు. నేను కూడా అంతే. బనియాలు చాలా మట్టుకు నగరాల్లోనే ఉండేవారు. నగరాల్లోనే జీవితాలు, వ్యవహారాలు, కానీ ఎందుకో తను చదవడానికి, నివసించడానికి నగరవాసం అతకదు అని ఆయనకు అనిపించింది. పట్టణ జీవితానికి కొంచెం దూరంగా, పల్లె వాతావరణంలో వ్యవసాయ ప్రయోగం చెయ్యాలని ఉంది. డర్బాన్ బయట వలయాలలో చెరుకు తోటల్లో పనిచేసే భారతీయుల ఒక వాడ ఉంది, ఫీనిక్స్ సెటల్‌మెంట్ అని. దాని దగ్గరే ఒక వెయ్యి పౌండ్లకు వంద ఎకరాలు కొన్నారు. అప్పుడు గాంధీ భాయికి సంవత్సరానికి నాలుగైదు వేల పౌండ్ల ఆదాయం ఉండేది. మంచి ఆదాయం. ఇంట్లో ఖర్చులకు ఎక్కువ అడుగుతారని చెప్పేవారు కాదు.
ముద్రణాలయం, సత్యాగ్రహం, లాయరుగిరికి సహాయం అంటూ మాతో పాటు ఉన్నవాళ్ళకు ఫీనిక్స్ ఫార్మ్‌లో భూమిని పంచి ఇచ్చారు. కొన్నినియమాలకు కట్టుబడి అక్కడ ఉండాలి అని ఆశ్రమవాసులకు షరతు విధించారు. తమ భూమిలో తమకు కావలసింది తామే పెంచుకోవాలి, వాన నీళ్లను త్రాగేటందుకు వాడుకోవాలి, చేతులతో, జబ్బల బలం మీద నడిచే యంత్రాలనే వాడాలి మొదలైన షరతులుండేవి.
ఈ ఫార్మ్ నడవడానికి ఎనిమిది లక్ష్యాలు పెట్టుకున్నారు. సాధ్యమైనంత తమ జీవితానికి అవసరమైనవాటిని స్వంత శ్రమతో ఫార్మ్‌లో కష్టపడి సంపాదించాలి: నిజ జీవితంలో నిజాయితీగా ఉంటూ సార్వజనిక జీవితాలను దిద్దడానికి ప్రయత్నించడం: మానవ సేవ గురించిన శిక్షణ తీసుకోవడం: శుభ్రత, ఆరోగ్య సూత్రాలను ప్రచారం చెయ్యడం: భారతీయుల-యూరోపియన్‌ల మధ్య స్నేహ సంబంధాలు ఏర్పరచడం: టాల్ స్టాయి, రస్కిన్ గార్ల ఆదర్శాల ప్రకారం జీవిండం: ఇలాంటి ఆలోచనలను విస్తరించడానికి, వాటిని పిల్లల్లో అలవాటు చేయడానికి స్కూలు నడపడం, అలాగే వీటన్నిటినీ సమాజంలో ప్రచారం చెయ్యడానికి ఇండియన్ ఒపీనియన్ పత్రికను నడపడం అనే లక్ష్యాలున్నాయి.
పత్రిక సంపాదకుడైన ఆల్బర్ట్ వెస్ట్ సంతోషంగా ఫీనిక్స్ ఫార్మ్‌కు వచ్చారు. వారితో పాటు ముద్రణాలయంలో పని చెయ్యడానికి మా మగన్ లాల్ ఉన్నాడు. బావగారైన కుశలదాస్ గాంధీగారి పిల్లలు మగన్ లాల్, ఛగన్ లాల్. వాళ్ళు కూడా మాతో పాటు దక్షిణ ఆఫ్రికాకు వచ్చారు. రాజకోట్ యొక్క అత్యంత ధనవంత కుటుంబీకుడు జగన్నాథ్ జోషి అనే అబ్బాయి సమాజసేవ చెయ్యాలని, తనదంతా వదిలేసి మగన్‌తో పాటు దక్షిణ ఆఫ్రికాలో పని చేస్తున్నాడు. అతడికి నెలకు పన్నెండు రుపాయల గౌరవధనం అంతే. ఇండియన్ ఒపినియన్ పత్రికా కచేరి, ముద్రణాలయ సామాగ్రి, సరంజామా అంతా ఒక్కొక్కటిగా ఫార్మ్‌కు వచ్చాయి. ఒంటెద్దు బండి, రెండెద్దుల బండి అంటూ మొత్తం పదహారు ఎద్దులు లాగిన పదిబళ్ళలో ముద్రణా యంత్రాలు వచ్చాయి. ఒక క్లినిక్, ఒక పాఠశాల కూడా ప్రారంభమయ్యాయి. ముందుగా ఎనిమిది కుటుంబాలు మాత్రమే నివసించడానికి స్థలం చూసుకుని ఉండిపోయాయి. తమ తమ ఇళ్ళను వడ్రంగుల సహాయంతో ఆ ఇంటివాళ్ళే రచించుకుని కట్టుకున్నారు. ఇంటి చుట్టూ కూరగాయలు పెంచుకునేంత స్థలం ఉంది. ఆ భూమిలో అంతవరకూ ఏమీ పండించకుండా పాడుబడింది. దాన్ని సరిచేసుకోవాల్సి ఉండింది. పశువులు, గొర్రెలు, మేకలు, కుక్కలూ ఏవీ లేవు. చుట్టు పక్కల పొలాల నుండి వచ్చే నక్కలు, పాములు మాత్రం అన్ని చోట్లా కనబడేవి.
ఒక రెండు సంవత్సరాలు జొహాన్స్‌బర్గ్‌లో ఉన్నాక మేము కూడా ఫీనిక్స్ ఫార్ముకు వెళ్ళాము. నేనెప్పుడూ నా లోకంలో ఉండేదాన్ని. ఇంట్లో వాళ్ళతో కానీ, బంధువులతో కానీ చాలా తక్కువ మాట్లాడేదాన్ని. భాయితో మాట్లాడడానికి ఇష్ట పడేదాన్ని. కానీ ఆయన దొరికేవారే కాదు. ఈ కొత్త ప్రదేశంలో కొన్ని రోజులు ఒంటరి అనిపించి విసుగొచ్చింది. జొహాన్స్ బర్గ్ లో కొంత మంది పరిచయం కలిగి ఆ ప్రదేశానికి అలవాటు పడ్డాను అనుకునేంతలో ఇక్కడికి వచ్చాను. భాయికి ఆశ్రమంలో ఉండేందుకు తీరిక ఉండేది కాదు. ఆయన అటూ ఇటూ తిరుగుతూ ఉండేవారు. ఆశ్రమవాసుల అవసరాలను చూసుకునే బాధ్యత నాదిగా మారింది. మగన్ ముందునుండీ అక్కడే ఉంటూ గాంధీ భాయికి కళ్ళు, చెవులుగా ఉన్నాడు. ఇప్పుడు ఛగన్ కూడ వచ్చాడు. తను అక్కడ లేనప్పుడు వారిద్దరికీ ప్రతివారం భాయి తప్పకుండా ఉత్తరం రాసేవారు. ఆశ్రమంలో ఏం జరుగుతోంది అని సమాచారాన్నిసేకరించేవారు.
భాయి లేని సమయం చూసి ఆర్యసమాజం స్వామి శంకరానంద్ అనే ఆయన ఒక సారి ఆశ్రమానికి వచ్చారు. హిందుస్తాన్‌లో సాధు సంతులకు మనమెంతో గౌరవంగా చూసుకునే వాళ్లం. నేనైతే పాదాలకే పడేదాన్ని. కానీ ఈ స్వామిని చూస్తే అలా చెయ్యాలని అనిపించలేదు. ఎందుకో ఆయన మొహంలో అశాంతి కనిపించింది. ఆయనకంటే నా భర్తే ఎంతో సాధువుగా అనిపించారు. ఆయన ఆశ్రమాన్ని, ముద్రణాలయాన్ని ఒకసారి చూశారు. అక్కడ ఉన్నవాళ్ళకు వేరే వేరే ప్రశ్నలు వేశారు. అన్నిజాతుల వారు, మతాలవారు ఒకే చోట ఉండడం, ఒకే చోట తినడం, పని చెయ్యడం ఆయనకు నచ్చలేదు. భాయి లేనప్పుడు ఆశ్రమానికి వచ్చి అక్కడి తమిళులను, హిందుస్తానీ వాళ్ళను తమలోకి లాగే ప్రయత్నం ఆయనది. మగన్ లాల్‌కు “ఉచ్చజాతిలో జన్మించిన నువ్వు జంధ్యం వేసుకోవాలి” అంటూ అతడి మనసును గెలిచే ప్రయత్నం చేశారు. అతడు వెంటనే భాయికి ఉత్తరం రాశాడు. ఆయన మగన్ లాల్‌కు రాసిన ఉత్తరంలో “అలాంటి ధార్మిక గురువుల గురించి జాగ్రత్తగా ఉండాలి అని రాయచంద్ భాయి చెప్పిన మాట నిజమే. ఇప్పటికే ఉత్తమ జాతి, నీచజాతి అని మనుషుల మధ్య అనవసర గోడలు ఏర్పడ్డాయి. నేను సాధకుడ్ని కావాలి అని జ్ఞాపకం చెయ్యడానికి జంధ్యం వేసుకుంటే దానికో అర్థం ఉంది. కానీ అది ఉత్త జాతి, అహంకార సంకేతం కాబట్టి, జంధ్యం వేసుకోవడం మనుషులుగా మారడానికి అడ్డంకే కానీ దాన్నుండి ఏమీ ప్రయోజనం లేదు” అని రాశారు.
ఇవన్నీ జరిగేటప్పుడు 1906లో రెండు అనిరీక్షిత ప్రమాదాలు జరిగాయి. ఇండియన్ ఒపీనియన్ పత్రిక సంపాదకుల్లో ఒకరైన మనసుఖ్ లాల్ నజర్ అనే వారు అకస్మాత్తుగా చనిపోయారు. భాయి పైన పత్రిక బాధ్యత ఇంకా పెరిగింది.
మరొకటి! అది అలాంటిలాంటి దిగ్భ్రమ కాదు. భాయి ఒక రోజు చల్లగా “ఇక పైన మనిద్దరం వేరే వేరేగా పడుకుందామా కస్తూర్?” అని అడిగారు!!
ఒకవైపు భాయి సత్యాగ్రహం అంటూ మళ్ళీ మళ్ళీ జైలుకు వెళ్తూ, ఎంతో హింసను అనుభవిస్తూ, విడుదల అవగానే ఊళ్ళు తిరుగుతూ ప్రజలను సంఘటిస్తూ, మనవాళ్ళ కష్టాలను వింటూ, సహాయం చేస్తూనే ఉన్నారు. మరో వైపు ఆశ్రమంలో ఉన్న నాకు మళ్ళీ మళ్ళీ ఆరోగ్యం చెడుతోంది. ఏవేవో రోగాలు. ఒకసారైతే చాలా రక్తస్రావం జరిగి, లేవడానికి కూడా చేతకాకుండా పోయింది. చచ్చిపోయేంత నిశ్శక్తి ఆవరించింది. ఆ సారి జైలునుండి బయటకి రాగానే జైలరుకు ఒక పుస్తకం ఇచ్చి, నేరుగా నేనున్న చోటుకే వచ్చారు. డా. నాన్జి అని భారతీయ వైద్యులు, గాంధీభాయి మిత్రులు ఆయన. నన్ను ఫీనిక్స్ నుండి ఎత్తుకుని వచ్చి, ఆయన ఆస్పత్రిలో చికిత్సకని డర్బాన్ లో వదిలారు.
రెండు శస్త్రచికిత్సలయ్యాయి. తేరుకోవడానికి కొద్ది సమయం అవసరం. ఒంట్లో రక్తమే లేకుండా పాలిపోయాను. అదే సమయానికి భాయికి మళ్ళీ జైలు శిక్ష పడింది. ఈ సారి సంకెళ్ళు వేసి తీసుకు వెళ్ళారు. ఆయన మళ్ళీ విడుదలయ్యి వచ్చే వేళకి పర్నిషస్ అనీమియా వ్యాధితో పూర్తిగా పాలిపోయాను. దానికి గోమాంసపు సూప్ ఇవ్వడమే దారి అని నాన్జి డాక్టర్ చెప్పారు. నాకు తెలియకుండా ఇచ్చారేమో కూడా!
జైలు నుండి రాగానే భాయి, గోమాంసం సూప్ పేరు వినగానే ఎగిరి పడి నాన్జిగారి స్నేహం కూడా చూడకుండా నేరుగా నన్ను డర్బాన్ నుండి ఫీనిక్స్‌కు ఎత్తుకునే తీసుకొచ్చారు. “బ్రతికి బట్టకట్టడానికి మనమేం చేస్తున్నాము అనేదానికి ఒక మితి ఉండాలి. ఏ ప్రాణినయినా, ఎవరినైనా బలి ఇచ్చి బ్రతికుండడంలో అర్థం లేదు” అని జల చికిత్స, ప్రకృతి చికిత్స ప్రారంభించారు. ఆ సమయానికి భారతదేశానికి వెళ్ళి పెళ్ళి చేసుకున్న హరిలాల్ భార్య గులాబ్ లేదా చంచల్ అక్కడి నుండి వచ్చింది. నన్ను చూసుకునే బాధ్యతను భాయి ఆమె పైన వేశారు. ఆమెకు తగినన్ని సూచనలను ఇచ్చి అన్నీ వివరించారు. తరువాత మళ్ళీ జైలుకు వెళ్ళారు. జైలు నుండి వస్తున్న ఆయన ఉత్తరాల్లో చాలా వరకు నా ఆరోగ్యం గురించిన సలహాలు, సూచనలు, విచారణలే నిండి ఉండేవి.
సత్యాగ్రహం, బంధనలు, పత్రిక, సంతకాల సేకరణ ఇలా జరుగుతూ వేలకొలది జనాలు జైళ్ళకు వెళ్ళడం రావడం జరుగుతూ ఉన్నప్పుడు ఈయన నమ్మకమున్న ఒక ఋషి ఉన్నారు కదా, టాల్‌స్టాయిగారు. ఆయన ఒక ఉత్తరాన్ని రాశారు. అది వచ్చిన రోజు చూడాలి! భాయి ఆశ్రమవాసులందరికీ ఆ ఉత్తరం చూపుతూ కేరింతలు కొట్టారు. పెళ్ళి రోజు ఒక పసివాడిలా నా చెయ్యి పట్టుకుని మెహంది చూసిన మోక భాయి గుర్తొచ్చారు. ఎప్పుడూ గంభీరంగా ఉండే భాయి గంతులేసింది నేను చూడనేలేదు. కానీ ఆ రోజు దేవుడి నుండే ఉత్తరం వచ్చిందేమో అనేంత సంభ్రమం, అంత సంతోషం. భాయి స్నేహితుడు హెన్రి కలెన్ బాక్‌కూ అంతే. “భారతీయుల స్వాతంత్ర సమరం సమంజసమే. మీ సహాయ నిరాకరణ ఉద్యమం మీ దేశంలోనే కాదు, మొత్తం విశ్వానికే అవసరమైన నమూనాగా మారింది. సత్యాగ్రహులకు నా మద్దతు ఉంది. శుభం” అంటూ ఇంకా ఏమేమో పొగుడుతూ ఋషిగారు ఉత్తరం రాశారు. ఆ ఉత్తరం వచ్చాక భాయి మారినట్టు అనిపించింది. ఏవేవో పుస్తకాలు చదివారు. ఆలోచిస్తూ కూర్చునేవారు. ఇప్పుడు నా బాధ్యత పెరిగింది అనేవారు. ఇంతవరకూ నడచిన దారుల, ముందు వేయాల్సిన అడుగుల గురించి ధ్యానిస్తున్నాను అనేవారు. బహుశా కలెన్, ఈయన కలిసి తరువాత ప్రారంభించిన రెండవ ఆశ్రమం గురించిన కల ఆ రోజే కనుండాలి. ఆ ఆశ్రమానికి టాల్‌స్టాయి ఋషిగారి పేరే పెట్టారు.
సత్యాగ్రహం అంటే..
ఈ విషయం గురించి మీరు చాలా వినుంటారు. నాకైతే రోజూ ఉదయం మిక్కిలిగా చెవిన పడ్తున్న పదం అదే. అప్పటి దాకా గ్రహం తెలుసు. నవగ్రహాలు తెలుసు. సత్యాగ్రహం తెలీదు. సత్యాగ్రహం అనే కొత్త పదాన్ని నోట్లోనూ, మనసుల్లోనూ వచ్చేలా చేసిన కారణంగానే భాయికి చాలా మంది స్నేహితులు, శత్రువులు కలిగారు.
నేను చాలా తక్కువ మాట్లాడేదాన్ని. ఎవరి పైనైనా కోపం వస్తే లేదా వారిని నేనిష్టపడక పోతే ఏం చేసేదాన్నో తెలుసా? వాళ్ళు చెప్పేది ఒప్పుకోకుండా చల్లగా నాకు కావల్సిన విధంగా చేసేదాన్ని. దీన్ని మొండితనం అనేవారు, పంతం అనేవారు. అదేమో నాకు తెలియదు. కానీ మా నాన్న, అమ్మ, భర్త మొదలైనవారంతా నాకు ఇది ఇలాగ, ఇది అలాగ అని నియమాలు చెప్పడానికి వస్తే, వాళ్ళకు అసలు తెలిసిరాకుండా ఉల్టా కొట్టేదాన్ని. చీర కొంగు తల పైకి రావాలని చెపితే అది నా తలకాయ పైనుండి జారి పడేలా కొప్పు వేసుకునేదాన్ని. నడిచేటప్పుడు చప్పుడు చేయరాదు అంటే కాళ్ళకు ఘల్లుఘల్లుమనే గజ్జెలు కట్టుకునేదాన్ని. అరెరె! నీరు, నిప్పు,గాలి వీటికి లేని నియమాలు నాకు మాత్రం ఎందుకు అని నాకిష్టం వచ్చినట్టు ఉండేదాన్ని. ఇదే సత్యాగ్రహం అంటే. దీన్ని నా భార్యే నాకు నేర్పింది అని భాయి తరువాత ఎప్పుడో రాసుకున్నారట. నాకనిపించే విధంగానే అందరు ఆడవాళ్ళకు సత్యం కోసం, స్వాతంత్ర్యం కోసం ఆగ్రహించడం వాళ్ళ రక్తాల్లోనే వచ్చుంటుంది.
కానీ, మాదంతా ఇంట్లో చేసే సత్యాగ్రహం. దీన్నే కొద్దిగా సమాజాని కోసం చెయ్యడం అన్నది కొత్త విషయం. దాన్ని భాయి సాధ్యపరిచారు. ఆయన సహచరినై సత్యాగ్రహం అంటే ఏమిటి అని నేను అర్థం చేసుకున్నదాన్ని మీకు చెప్పాలి. దీన్ని అర్థం చేసుకుంటుంటే నాకు జీవితానికి సంబంధించిన అనేక సంగతులు అర్థమయ్యాయి అనాలి. సత్యాగ్రహం చేస్తూనే నేను కూడా చాలా మారాను. అందుకే ఏమేం జరిగింది అని నాకు తెలిసిన భాషలో మీకు చెప్పాలి. కాలావధి కాస్త అటూ ఇటూ అయినా కాని, ఏమేం జరిగింది అని అంతా గుర్తుంది. చెప్పడానికి ప్రయత్నిస్తాను.
అన్యాయం చేసేవాడు, అన్యాయానికి లోనైన వాడు వీరిద్దరి అనుమతి వలననే అన్యాయం ఒకే రకంగా జరగడానికి వీలవుతుంది. వీరిరువురిలో ఒకరికి ఉన్నతమైన ఆలోచన వస్తే చాలు, సత్యాన్ని వెలికి తీయవచ్చు. అన్యాయాన్ని ఆపొచ్చు అన్నది భాయి ఆలోచన. ఎవరైనా కానీ, నిరంతరం మోసం చెయ్యడానికి కుదరదు. ఎందుకంటే చివరి దశలో మోసగాళ్ళు తమను తామే మోసగించుకుంటారు అని భాయి నమ్మారు. సత్యం అంటే ఏమిటి? ప్రకృతి ఇచ్చిన హక్కు. దాన్ని ఏ మనిషైనా లాక్కోడానికి కుదరదు. సత్యాన్ని హక్కుగా అడిగేవారు, అన్యాయాన్ని అడ్డుకునేవారు సత్యాగ్రహులు. అలాంటి వారు అన్యాయమైన చట్టాన్ని అనుసరించడానికి ఒప్పుకోరు. వాళ్ళు హింసను సహిస్తారు. చెడు మాటలు మాట్లాడరు. బలం చూపరు. శత్రువుకు ఆపద వస్తే దాన్ని అవకాశంగా తీసుకోరు. గెలుపు, ఓటమి అనే ప్రశ్న అక్కడ ఉద్భవించదు. అన్యాయాన్ని సరిదిద్దాలి. అదే గురి. “ఐరోపాలో దీన్ని దుర్బలుల అస్త్రమని పిలిచారు. కానీ సత్యాగ్రహం దుర్బలుల అస్త్రం కాదు. సత్యాగ్రహులు సబలులు. నైతికంగా, మానసికంగా అతి బలమైనవారు. ప్రాణాలు పోయే స్థితిలోనైనా తలవంచరాదు. ఆత్మరక్షణ సాకుతో కూడా హింసకు దిగరాదు. ఇదే ధీరత్వం, ధైర్యం. నిర్భీతిగా ఉండడమే సత్యాగ్రహం వెన్నెముక” అనేవారు భాయి.
ఈ రకమైన పోరాటం ప్రారంభించేటప్పుడు దానికొక పేరు పెట్టండి అని భాయి అందరినీ అడిగారు. పత్రికలో, సహచరుల్లో చాలా చర్చ జరిగింది. మగన్, హరి, ఇతరులు చెప్పిన పేర్లనన్నీ గమనించి, చర్చించి, చివరికి సత్యాగ్రహం అనే పేరునే పెట్టారు. పేరు పెట్టడం జరిగింది, కానీ నిజమైన సత్యాగ్రహాన్ని అనుభవించే, దాన్ని ప్రయోగించే అవకాశాన్ని, అక్కడి ప్రభుత్వమే మనవాళ్లకు వ్యతిరేకంగా ఎన్నెన్నో చట్టాలు తెచ్చి కల్పించింది.
30 సంవత్సరాల క్రితం మొత్తం దక్షిణ ఆఫ్రికాలో భారతీయ కూలీల సంఖ్య 15 వేలట. ఇప్పుడు వాళ్ళ సంఖ్య ఒక లక్షా పాతికవేలకు పైగా ఉంది. ఇది అపాయకరం. దీన్ని నియంత్రించడానికి ఏదైనా చేసి తీరాలని బ్రిటీష్ వాళ్ల మనసులోకి వచ్చింది. దక్షిణ ఆఫ్రికాకు వెళ్ళిన ఆసియా వాసులు (భారతీయులు, చైనావారు) పర్మిట్ ఆఫీసుకు వెళ్ళి బొటనవేలు ముద్ర వేసి ఒక పర్మిట్ తీసుకోవాలి. వాళ్ళ పర్మిట్ నుంచి వారి భార్యా పిలలకు పర్మిట్ దొరుకుతుంది. అలాంటివారే ఇక్కడ ఉండాలి, పనులు చెయ్యాలి అని చట్టాన్ని తెచ్చారు.
1907వ సంవత్సరం అనుకుంటాను. 13 వేల భారతీయులు నటాల్‌లో ఉన్నారు. అందరూ కచేరిలో పేర్లు నమోదు చేసుకుని గుర్తు పత్రం పొందాలి అనే చట్టం వచ్చేసింది. గుర్తు పత్రం, దాఖాలా పత్రం, వివాహ ప్రమాణ పత్రం, ఒకే భార్యకు అవకాశం, గని కార్మికులకు తలకు మూడు పౌండ్ల పన్ను – ఇలా తలాతోక లేని కొత్త కొత్త చట్టాలను బ్రిటిష్ వారు ఒకటి తరువాత మరొకదాన్ని తెచ్చారు.
ఇప్పటికే వలస వచ్చిన భారతీయుల పట్ల చూపిన అవమానం ఇది: మనమెవ్వరమూ నమోదు చేసుకోనవసరం లేదు అని మూడు వేల మంది హాజరైన మనవాళ్ళ ఒక సభలో నిర్ణయం తీసుకోబడింది. సహాయ నిరాకరణ ధోరణిలో చట్టాన్ని వ్యతిరేకించే నిర్ణయం తీసుకోబడింది. గోధుమ రంగువాళ్ళు అంటూ భారతీయులకు చూపిన అన్యాయాన్ని విరోధిస్తూ సత్యాగ్రహం ప్రారంభమయ్యింది. తమిళులు, రోడ్డు పక్కన వ్యాపారాలు చేసుకునేవారు సహాయ నిరాకరణ చూపి సత్యాగ్రహులయ్యారు. “మా వద్ద కూలి పని చేయించడానికి, ఇతర పనులు చేయించడానికి, పడవలలో నింపుకొని తీసుకొచ్చేటప్పుడు ఏ రకమైన నియమాలు లేవు. ఇప్పుడెందుకు ఈ నియమాలు? దీన్ని వాళ్ళకు తెలిసేలా చెయ్యడానికి సత్యాగ్రహమే మనకు సరైన అస్త్రం. సత్యాగ్రహం అంటే ధార్మిక కార్యమంత పవిత్రం” అని గాంధీ భాయి అందర్లో ధైర్యాన్ని నింపారు. మెరుపు వేగంతో దక్షిణ ఆఫ్రికాలోని రెండు ప్రాంతాలకు తిరిగారు. భారత సంతతి కార్మికులు ఎక్కడ ఉన్నా అక్కడికే వెళ్ళి సభలు ఏర్పరిచి ధైర్యాన్నినింపి వచ్చారు. భారతదేశం యొక్క రక్త మాంసాలు నింపుకున్న మనం ఎప్పటికీ బ్రిటిష్ వారి సేవకులు కాము. వాళ్ళు మన యజమానులు కాదు. మనం వారితో కలిసి పనిచేసే శ్రామికులం” అని గర్వపడేలా చేశారు. ఏ మాటా చాటు కాదు, అంతా బహిరంగం. తనతో పాటు కొంతమంది తెల్లవారిని కూడా పెట్టుకున్నారు. పడవ రేవులు, గనులు, మార్కెట్, బేకరి, పాఠశాల, పిండిమర, పొలాలు – ఇలా ఎక్కడెక్కడ భారతీయులున్నారో అక్కడికంతా వెళ్ళి మాట్లాడారు. ఏ కారణానికి కూడా పేరు నమోదు చేసుకోవడానికి దరఖాస్తు పెట్టుకోరాదు అని మనవి చేశారు.
ఇలా ఒక వైపు సత్యాగ్రహపు వేడి పుంజుకుంటుంటే, మరో వైపు కొందరు భయపడి ఎవరికీ తెలియకుండా రాత్రిళ్ళు వెళ్ళి నమోదు దరఖాస్తు ఇచ్చి వచ్చారు. అలాంటివాళ్ళలో ఎక్కువ భాగం గుజరాతీ వ్యాపారులే. గుజరాతీలు కొంచెం అలాగే. వ్యాపారులకు వ్యవస్థను వ్యతిరేకించడం అపాయకరం కదా?
కానీ, భారతీయులలో నమోదు కొరకు దరఖాస్తు పెట్టుకున్నది 500 మాత్రమే. మిగిలిన 12,500 మంది నమోదు చేసుకోకుండా సత్యాగ్రహులయ్యారు. అలాంటివారిలో చాలా మంది జైలుకు వెళ్ళారు. సత్యాగ్రహం ఏకధాటీగా కొనసాగింది. పర్మిట్ కాల్చడం, రోడ్డు పక్కన పర్మిట్ లేకుండా వ్యాపారం చేసి జైలుకు వెళ్ళడం, గుంపుగా అనుమతి లేకుండా నటాల్ వైపునుండి ట్రాన్స్‌వాల్ వైపు ప్రయాణం చెయ్యడం, గని పనులకు సామూహికంగా సెలవు వెయ్యడం, నిర్బంధిత తెల్లవాళ్ళ వీధుల్లో సంచరించడం, నమోదు కచేరిని ముట్టడించడం కొనసాగింది. ఒక దాని తరువాత ఒక చట్టపు కత్తిని బ్రిటిష్ వాళ్ళు ఝళిపిస్తున్నారు. వారికి వ్యతిరేకంగా పోకుండా, బెదరకుండా సత్యాగ్రహులు తల ఎత్తుకుని ముందుకు వెళ్తున్నారు. సత్యాగ్రహుల ఎదుట బ్రిటిష్ వారి కత్తులు ఉత్త కడ్డీలయిపోయాయి. నిర్బంధిత వీధుల్లో సంచరించి జైలుకు వెళ్ళిన వాళ్ళను భాయి విడిపించేవారు. పర్మిట్, పాసు లేదు అని ఎవరిని జైలులో వేశారో, వారి పరంగా ఉచితంగా వాదించేవారు. తను సూచించినందుకే కక్షిదారు అలా చేశాడని, కాబట్టి అందరి శిక్షలను తనకు వెయ్యండి అని కోర్టులో వాదించేవారు. జైలుకు వెళ్ళిన పెళ్ళాం పిల్లలను సార్వత్రిక చందాలతో చూసుకునే ఏర్పాటు చేశారు. “జైలుకు వెళ్ళడం అవమానకరం కాదు, అది గర్వకారణం” అన్నారు.
బ్రిటిష్ వాళ్ళకు తల తిరిగిపోయింది.
(సశేషం)