[dropcap]సం[/dropcap]వత్సర శ్రమ
చెట్టు శ్రమ
పిందె పండు అవుతుంది.
చెట్టు రుణం
పండు తీర్చుకుంటుంది.
ప్రాణికోటి
ఆకలి తీర్చి
మరో పది కాయలు
కాచే చెట్టు
అవుతుంది.
ప్రకృతిలో..
చెట్లు..
చెట్ల ఫలాలు
పలు విధాలైనా
ప్రతిఫలం
మాత్రం ఒక్కటే
ఆశించడం కాదు
ఆకలి తీర్చడం
మరి..
రాజకీయ
చెట్టు అయితే..
తాను..
మొక్కని
మొగ్గ తొడగాలని
మంచి మాటలతో
మాయజేసి
రహదారుల్లా వాగ్దానాల్ని
పొడగిస్తూ..
ప్రజల
మనసుల్లో
తన వేర్లను
తెలివిగా నాటుతోంది.
కరెన్సీ నోట్లను
కాంటాక్టు లెన్సులా
చేసుకొని
లెక్కలేసుకొని
ఓట్లు కొంటుంది
ఫలితాలు తనకు
అనుకూలంగా వచ్చాయా!
ఒక్కసారిగా మొక్క
మానై నిలుస్తుంది.
మొగ్గ తొడగకుండానే
పిందె పుడుతుంది
పండు అవుతుంది.
చెట్టుకు..
రాజకీయ చెట్టుకు
పాముకు – పుట్టకు
ఉన్నంత తేడా వుంది.
చీమలు..
ఈ తేడాను
గమనించండి.
పుట్టల్ని కట్టి
పాములను సాకడం కాదు
చీమల్ని
చెట్లెక్కించాలి.