సరస్వతీ! నమస్తుభ్యం

0
3

(బాలబాలికల కోసం భువన విజయం సభలోని అష్టదిగ్గజ కవులు సరస్వతిని స్తుతించిన పద్యాలను అందిస్తున్నారు శ్రీమతి దాసరి శివకుమారి.)

[dropcap]‘సా[/dropcap]హితీ సమరాంగణ సార్వభౌమా
భువన విజయ ప్రతిభా విభాసిత ధామా
జయీభవ, దిగ్విజయీభవ’

అంటూ వందిమాగధులు శ్రీకృష్ణ దేవరాయ చక్రవర్తిని కీర్తిస్తున్నారు.

భువన విజయ మంటపంలో కృష్ణదేవరాయలు, అష్టదిగ్గజ కవులు ఆశీనులై ఉన్నారు. వారందరి మధ్య సాహితీ చర్చలే జరుగుచున్నవి. మిగతా సభాసదులు కూడా వీరి చర్చలు వింటూ సంతోషపరవశులై తమ ఆనందన్ని ప్రకటిస్తున్నారు. రాయలవారు ఏదో మాట్లాడుతున్నారు. విందాం.

“అష్టదిగ్గజ మహాకవులారా! ప్రస్తుతం మన విజయనగర సామ్రాజ్యం ఎంతో వైభవంగా వున్నది. అన్ని విధాలా ఉన్నత స్థితిలో అలరారుతున్నది. శత్రుభయం లేదు. దారిద్ర్య బాధలూ లేవు. మన రాజ్యం లోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు. ఈ ప్రశాంత సమయాన మా మనసు ఎంతో ఉల్లాసంగా వున్నది. మీరందరూ మా భువన విజయ మంటపానికి మణిదీపాలు. మీ కవిత్వపు వెలుగులలో నడయాడి మేమెంతో ధన్యులమగుచున్నాము. తెలుగు భాషామతల్లికి క్రొత్త క్రొతా అలంకారాలు చేద్దాం. ఉత్తమ సాహిత్యాన్ని ఆవిష్కరిద్దాం. ఎన్నో కృతులను వెలయిద్దాం.

ఈనాటి మన కవితా గోష్ఠిని ప్రారంభిద్దాం. తొలుదొల్త సరస్వతిని స్తుతిస్తూ ఆ తల్లితో మన కోర్కెలు విన్నవించుకుందాం. ఆంధ్ర కవితా పితామహా! అల్లసాని పెద్దనామాత్యా! మునుముందు మీరు ఆ నలువరాణిని స్తుతించిన విధం తెల్పండి.”

“అలాగే కృష్ణరాయప్రభూ! మీ ఆదేశాన్ని శిరసావహిస్తాను. నా పలుకుల్ని వినిపిస్తాను.

‘చేర్చుక్కగా నిడ్డ చిన్నిజాబిల్లిచే
సిందూరతిలకంబు చెమ్మగిల్ల
నవ వతంస కుసుమంబు నందున్న యెలదేఁటి
రుతి కించిదంచిత శ్రుతుల నీన
ఘనమైన రారాపు చనుదోయి రాయిడి
దుంబీ ఫలంబు తుందుడుకు సెంద
దరుణాంగుళిచ్ఛాయ దంతపు సరకట్టు
లింగిలీకపు వింతరంగు లీన
నుపనిషత్తులు బోటులై యోలగింప
బుండరీ కాసనమున గూర్చుండి మదికి
నించుక వేడుక వీణ వాయించు చెలువ
నలువరాణి మదాత్మలో వెలయుఁగాత!’

“సెభాష్ పెద్దనార్యా! సరస్వతీ దేవి యొక్క స్వరూపం మా కనుల ముందు చక్కగా రూపుకట్టించారు. ఆ తల్లిని  మీ ఆత్మలోనే కాదు, ప్రభువులమైన మా ఆత్మలోనూ, ఈ సభాసదులందరి ఆత్మల్లోనూ వెలయింప చేస్తున్నారు. ధన్యవాదములు మహాకవీ.

నంది తిమ్మనా! మీరు ప్రారంభించండి. మీ వర్ణనలో సరస్వతీ ప్రాభవాన్ని వివరించండి.”
“అవశ్యం మహాప్రభూ! ఆలకించండి.”

‘తన మృదు గీతికా పరిణత ధ్వని వైఖరిఁ బల్కు మంచు నిం
చిన రహిఁ జేతివీణియకుఁ జెక్కులు గీఁటుచు నేర్పు లీలనా
యన నఖరాంకురంబుల నయమ్మున దంత్రులు మీటి గాన మిం
పొనరగ జేయు వాణి ప్రతిభోన్నతు జేయుతఁ గృష్ణరాయనిన్‌’

“సరస్వతీ సంగీత ప్రియత్వాన్నీ, తన వీణాపుత్రిపైన వున్న ప్రేమనూ చక్కగా వర్ణించారు తిమ్మనార్యా! ధన్యవాదములు.

రామరాజభూషణా! వాణిని మీరూ కీర్తించండి. మాకు వీనుల విందు గావించండి”

“తప్పక కీర్తిస్తాను కృష్ణరాయప్రభూ! ఆస్వాదించండి.”

‘రమణీ యాక్షసరా కృతిం బొలుచు వర్ణశ్రేణి వీణానులా
పము చేతం గరఁగించి యందు నిజబింబము బొప్ప నచ్ఛామృత
త్వము నాత్మప్రతిపాదకత్వమును దద్వర్ణాళియం దెల్లఁ బూ
ర్ణము గావించిన వాణి తిర్మల మహారాయోక్తి బొల్చుం గృపన్’

“మీ వేడికోలు అత్యంత మనోజ్ఞంగా వుంది రామరాజ భూషణా! ధన్యోస్మి. ఆ తల్లి దయ అనుకంపలు మన పట్ల పరిపూర్ణంగా వుంటాయనే ఆశిద్దాం.

మౌనంగా వున్నారేమి రామకృష్ణ కవీ! శారదను మీరెలా కీర్తిస్తున్నాను? వినిపించండి. మాకందరికీ ఆనందం చేకూర్చండి.”

“అవశ్యం రాజేంద్రా! ఇప్పుడే వినిపిస్తాను. ఆలించండి. నా కవిత్వాన్ని ఆదరించండి.”

‘కద్రూజాంగదు తోడబుట్టువు శరత్కాదంబినీ చంద్రికా
జిద్రూపాంచిత పద్మగర్భ ముఖ రాజీవావళీహంసి వ
ర్ణద్రాక్షా ఫలకీరి శారద కృపన్ రామానుజామాత్యు వే
దాద్రిస్వామికి నిచ్చు నిచ్చలును విద్యాబుద్ధివాక్సిద్ధులన్!’

“విరూరి వేదాద్రి మంత్రికి విద్యాబుద్ధులు సిద్ధింప చేయాలని మీరు శారదాదేవిని కోరిన కోరిక బాగున్నది రామకృష్ణా! తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది. మీకునూ ధన్యవాదములు రామకృష్ణా.

మల్లన కవీ! ఇపుడు మీ వంతు. వీణాపాణిని మీరెలా స్తుతిస్తున్నారు? వినిపించి మమ్మల్ని కృతార్థులను చెయ్యండి.”

“సాహితీ సమరాంగణ సార్వభౌమా! వీణాపాణిని అందరమూ ప్రార్థించవలసినదే గదా! నా ప్రార్థన వినండి ప్రభూ!”

‘ఏదేనొక్క పురంధ్రి గాన సుధచే హేలా కరాంభోజ వీ
ణా దండం చిగురుంచెనా నఖరుచుల్ నర్తింప మ్రోయించున
య్యెది బ్రహ్మ ముఖాగ్ర రంగనటి విద్యాబుద్ధి సంసిద్ధి మా
నా దిండ్ల్పప్పని కిచ్చుగాత హృదయానందంబు సంధిల్లగన్.’

“సరస్వతీ దేవి వీణనే కాదు, మ్రోళ్ళ వంటి మనసుల్ని కూడా మీ పద్యం చిగురింప చేయకలదు మల్లన కవీ. మీ కవిత్వం మా మనసును ఎంతగానో రంజింప చేసింది. ధన్యవాదాలు కవిశేఖరా!

మీరు కానివ్వండి రామభద్ర కవీంద్రా! కావ్య రచన ఆరంభించినట్లు విన్నాం. ప్రస్తుతం శారదా స్తుతిని కావించండి. విని తరిస్తాం.”

“నా కావ్యారంబంలో శారదను ఇలా కీర్తించాను ప్రభూ! నాయందు ఆదరంతో ఆలకించండి. నేనూ ధన్యుణ్ణవుతాను.”

‘పాలును నీరు నేరుపరు పం గలమావుల వేదవీధి వా
హ్యాలి యొనర్చు నేయలికులాలక్ తా సిత వర్ణ యయ్యు నే
బాల సువర్ణ రూపమున భాసిలు నానలు మోము వేల్పు ప్రో
యాలు ప్రవీణ మామకమహాకృతినాథుఁ గృతార్థుఁ జేయుతన్.’

“మా అళియ రామరాయల మేనల్లుడగు గొబ్బూరి నారసింహుని కృతిభర్తగా చేస్తూ మీరు సల్పిన సరస్వతీ సంకీర్తన చాలా బాగున్నది. తప్పక మీ కృతిభర్త కృతార్థులవుతారు. ధన్యుణ్ణి రామభద్రా!

మీరు నివేదిస్తారా! పింగళి సూరన్న కవిగారూ! మీ నివేదనలో మమేకం కావలని కుతూహల పడుతున్నాం. కానివ్వండి కవిశ్రేష్ఠా!”

“మీ ఆదరానికి ధన్యుణ్ణి కృష్ణరాజేంద్రా. మీ సాహిత్యాభిలాష ఎంతగానో కొనియాడ తగినది. నా సరస్వతీ నివేదన ఆలించండి ప్రభూ!”

‘ఎమ్మెయి బ్రజ్ఞ మీఱ వచియించెద నన్ను వచింపలేనయ
క్కొమ్మ బెడంగులోన నొక కోటి తమాంశములైన నంత, మా
త్రమ్మ మదుక్తి శక్తి యన రాదతి వాఙ్మతి మాధ్య నేను మా
యమ్మ, సరస్వతీ సతి తనంతటి దానిగ నన్ను దిద్దుటన్.’

“మీ పలుకులలో సరస్వతీ వాక్కులే వినిపించాలన్న మీ ఆకాంక్ష బాగున్నది సూరన్న కవి గారూ! ధన్యజీవులు మీరు. ‘కళాపూర్ణోదయం’ లాంటి మరెన్నో కావ్యాలు మీరు వెలయించాలని మేము మనసారా కోరుకుంటున్నాము. మా కోరిక తీర్చండి. ధన్యోస్మి.

ధూర్జటి మహాకవీ! చిట్టచివరగా మీ కవితా మాధుర్యాన్ని, కాళహస్తీశ్వరునిపై మీకున్న భక్తినీ కలిపి ఒక చక్కని పద్యాన్ని వినిపించి మాకానందం కలిగించండి. మమ్మల్ని ధన్యుల్ని చెయ్యండి కవీంద్రా.”

“మీ కానందం కలిగించడానికి ప్రయత్నిస్తాను కృష్ణరాయ ప్రభూ! నాకున్న భక్తిని ఇలా తెల్పుకుంటున్నాను.”

‘శ్రీవిద్యుత్కలితా జవంజవ మహాజీమూత పాపాంబు ధా
రా వేగంబున మన్మనోబ్జ సముదీర్ణత్వంబు గోల్పోయితిన్‌
దేవా! నీ కరుణా శరత్సమయమింతే జాలు సద్భావనా
సేవం దామరతంపరై మనియెదన్‌ శ్రీకాళహస్తీశ్వరా!’

“మీ వర్ణనా, మీ భక్తీ ఎంతైనా ప్రశంసనీయములు. ధూర్జటి మహాకవీ! మీ కవిత్వంతో మమ్మల్ని భక్తి పరవశుల్ని చేశారు. ధన్యుణ్ణి. మీకెన్నో కృతజ్ఞతలు.

అష్టదిగ్గజ మహాకవులారా! భువన విజయ ప్రకాశకులారా! ఆమని వేళ కోయిల గళమెత్తి పాడిన కూతలా మీ అందరి కవిత్వమూ ఎంతో మృదుమధురంగా వున్నది. మీ కవితా గోష్ఠులు జరుపు వేళ నాలోనూ కవితావేశం పెల్లుబుకుతూ వుంటుంది. మీకందరకూ మరొక పర్యాయం ధన్యవాదములు. ఈ భువన విజయంలో ఎన్నో కవితా గోష్ఠులు జరగాలి. ఎన్నెన్నో మహా కావ్యాలు మీ చేత వెలయింపబడాలని ఆకాంక్షిస్తున్నాను. మరొక కవితా గోష్ఠిలో కలుద్దాం” అంటూ సెలవు తీసుకున్నారు రాయలవారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here