[dropcap]“ఉం[/dropcap]టానమ్మా!” అంటూ ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ తల్లిని కౌగలించుకుంది సౌజన్య. అత్తగారింట్లో దించి వెళుతున్న తల్లితో.
“వదిన గారూ, అమ్మాయిని మీ చేతుల్లో పెడుతున్నాను జాగ్రత్తగా చూసుకోండి” అంది నిర్మల సౌజన్య అత్తగారు వర్ధనమ్మతో.
“అదేంటి వదినా, నాకు మీరు వేరే చెప్పాలా!, నేనూ ఓ ఆడపిల్లకి తల్లినే. మీరు, నేను ఒకప్పటి కోడళ్ళమే కదా! మన అనుభవాల్ని దృష్టిలో పెట్టుకుని పిల్లలు సంతోషంగా ఉండేట్లు చూడటం మన బాధ్యత. ఏ ఇంట్లో నయినా అత్తా కోడళ్ళు తల్లి కూతుళ్ళలాగా కలసిపోతే గొడవలెందుకు వస్తాయి. మీ అమ్మాయి కంట తడిపెట్టే ఏ ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాను” అంది నిర్మల చేయి పట్టుకుని.
“చాలు వదినా, అంతకంటే మాకేం కావాలి” అంది నిర్మల సంతోషంగా.
“బాబూ రోహిత్, అమ్మాయి జాగ్రత్త, వస్తాను బావగారూ!” అని అందరికీ చెప్పి, సౌజన్యని అత్తగారింటిలో దించి ఇంటికి బయలుదేరారు రాఘవరావు దంపతులు, కొడుకుతో సహా.
***
“అల్లారు ముద్దుగా పెరిగింది, పిచ్చిపిల్ల ఏమిచేస్తోందో అత్తవారింట్లో” – అంటూ వంటిల్లు సర్ది వచ్చి భర్త ప్రక్కన కూర్చుంటూ అంది నిర్మల. “మన పిల్లకేమే! బంగారు బొమ్మ, భగవంతుడు మంచి సంబంధం ఇచ్చాడు, నువ్వు చేసిన వ్రతాలు, దాని మంచితనమే దాన్ని కాపాడుతాయి, ఏమీ ఆలోచించక పడుకో” అన్నారు రాఘవరావు గారు.
“ ‘నీ పెళ్లయ్యాక నువ్వూ, వదిన ఎప్పుడు అమ్మ, నాన్నల దగ్గరే వుంటారు హాయిగా. వాళ్ళ ప్రేమని ఎప్పుడు మీకు పంచుతారు, నేను చూడు పెళ్లి చేసుకొని వెళుతూ మీ ప్రేమకి దూరమవుతున్నాను’ అని ప్రవీణ్‌తో అంటూ కళ్ళనీరు పెట్టుకుంది పిచ్చిపిల్ల” అంది నిర్మల కళ్ళు తుడుచుకుంటూ.
“దాని గురించి నివ్వు దిగులు పడకు, చాలా తెలివైన పిల్ల. ఓ నెల తరవాత అడుగు దాన్ని, నేను- మా ఆయన అని వాళ్ళ కుటుంబం గురించే చెబుతుంది” అన్నారు రాఘవరావు నవ్వుతూ.
“అమ్మాయి లేకపోతే నాలుగు రోజులకే ఇల్లు బోసి పోతోంది” అంది నిర్మల.
“ఓ ఆర్నెల్లు ఆగు, కోడలు వచ్చాక నీకు మంచి కాలక్షేపం. అందాకా నన్ను భరించు. సరే పొద్దు పోయింది పడుకో” అన్నారు రాఘవరావు ప్రక్కకు తిరిగి పడుకుంటూ.
ఓ సంవత్సరం తరువాత నిర్మల అత్తవారి తరఫు బంధువుల అమ్మాయితో ప్రవీణ్ పెళ్లి జరిగింది. ప్రవీణ్ భార్య సుమతి కూడా ఉద్యోగస్థురాలే.
“నిర్మలా! అబ్బాయీ, కోడలూ ఇంకా రాలేదేం, కనీసం ఫోను కూడా చెయ్యలేదు” అన్నాడు రాఘవ రావు.
“వస్తార్లెండి, తొమ్మిదిన్నరేగా ఐయ్యింది. అయినా వాళ్లేమయినా చిన్నపిల్లలా, వాళ్ళ గురుంచి అంత కంగారు పడతారు! ఇద్దరూ ఉద్యోగస్థులేగా, ఆఫీసులో లేటయి ఉంటుంది, లేక ఏదయినా షాపింగ్ వెళ్లారో, సరే వాళ్ళు వచ్చాక తింటారు కానీ, మీరు రండి మనం టిఫిన్ చేద్దాం” అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి నడిచింది నిర్మల.
రాఘవరావు టిఫిన్ తిని, చెయ్యి కడుక్కుని బాల్కనీలోకి వెళుతుండగా వచ్చాడు ప్రవీణ్, భార్య సుమతితో పాటు.
“ఏరా! ఇంత లేటయ్యింది, అయినా ఓ ఫోన్ చేయొచ్చుగా” అన్నారు రాఘవరావు.
“ఆఫీస్ నుండి బయలుదేరుతుండగా మా ఫ్రెండ్ ఫోన్ చేసాడు, వాళ్ళ అబ్బాయి బర్తడేకి రమ్మని. రెండు సార్లు మీకు ఫోన్ చేస్తే, కలవలేదు” అన్నాడు ప్రవీణ్.
“సరేలే, భోజనం చేద్దురుగాని రండి!” అంది నిర్మల మధ్యలో అందుకుంటూ.
“అసలు వెళ్లి కనపడి వచ్చేద్దామనుకున్నాం అత్తయ్య గారూ, వాళ్లు బలవంతం చేస్తే అక్కడే భోంచేశాం” అంది సుమతి.
“సరేలే! వెళ్లి పడుకోండి పొద్దు పోయింది” అని బెడ్రూమ్ లోకి వెళ్లారు రాఘవ రావు.
***
“ఏంటి నాన్నగారూ ఏదో లెక్కలు రాస్తున్నట్టున్నారు” – అంటూ బయటనుండి వచ్చిన ప్రవీణ్ హాల్లో కూర్చున్న రాఘవరావు ప్రక్కనున్న కుర్చీలో కూర్చున్నాడు, సుమతి గదిలోకి వెళ్లి పోయింది.
“ఆ ఏముంది, ఇంకో రెండు నెలల్లో రిటైర్ అవుతున్నారుగా, అందుకే, అప్పులూ ఆదాయము బాలన్స్ షీట్ వేసుకుంటున్నారు” అంటూ కాఫీ తేవడానికి లేచింది నిర్మల.
వాళ్లిద్దరూ మాట్లాడుకుంటుండగా నిర్మల లోనికి వెళ్లి అందరికీ కాఫీ తెచ్చింది, వస్తూ, “సుమతీ, కాఫీ తెచ్చాను, హాల్లోకి వస్తావా, అక్కడికి తెచ్చియ్యమంటావా” అంది నిర్మల.
“వస్తుంది లేమ్మా! నువ్వు కూర్చో” అంటూ, “సుమతీ” అంటూ పిలిచాడు ప్రవీణ్.
అందరూ కలసి కాఫీ తాగి కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు.
“ఏంటి ఆలోచిస్తున్నారు” అంటూ భర్త పక్కనే పడుకుంటూ అంది నిర్మల రాత్రి పని అంతా అయ్యాక.
“ఏమీ లేదు నిర్మలా” ముభావంగా అన్నాడు రాఘవరావు.
నిర్మల దగ్గరనుండి ఏ సమాధానం రాకపోవడంతో మళ్ళీ రాఘవరావు “నిర్మలా సాయంత్రం అబ్బాయి వాళ్లు బయటనుండి వచ్చినప్పుడు కోడలు ఏవో రెండు కవర్లు తెచ్చింది, సరాసరి బెడ్ రూమ్ లోకి వెళ్ళిపోయింది. అవేమిటో నీకు చెప్పిందా” అన్నాడు రాఘవరావు.
“లేదు, ఏమి తెచ్చారట?” ప్రశ్నించింది నిర్మల.
“నాకూ తెలియదు, అవి ఏమిటో కనీసం నీకయినా చెప్పొచ్చుగా” అన్నాడు రాఘవరావు.
“వాళ్ళ అవసరాలు వాళ్ళకుంటాయి, అన్నీ మనకి చెప్పి చెయ్యాలా?” అంది నిర్మల.
“పెద్ద వాళ్ళం ఇంట్లో వున్నాం కదా, బయటనుంచీ ఏమి తెచ్చినా చెబితే సంతోషిస్తాం కదా!”
“చూడండి! వాళ్ళ పెళ్లిళ్లయ్యాక వాళ్ళ ఇష్టం వాళ్ళది. ప్రతిదానికి వాళ్ళని నిలదియ్యడం, మనం బాధపడడం లాంటివి లేకుండా, మన దారిన మనం ఉంటే మంచిది.”
“అంటే వాళ్లు మనకేమీ చెప్పనవసరం లేదంటావా. ఇలాంటివి ఒకరికొకరు చెప్పుకుంటేనే కదా ప్రేమలు పెరిగేది.”
“ప్రేమని పెంచుకోవద్దు అనే చెబుతున్నాను. ప్రేమని పెంచుకోవడమంటే వాళ్ళు ఏదో చేస్తారని ఆశించడమే. పిల్లలు రెక్కలు వచ్చాక ఎవరి దారి వారు చూసుకుంటారు, అది వాళ్ళ తప్పు కూడా కాదు, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ సంసారాలు వాళ్లకి ముఖ్యం. అందుకే బంధాలను పెంచుకొని బందీలుగా మిగిలిపోయే కంటే, మన బాధ్యత మనం నిర్వర్తించి మిగతాది ఆ భగవంతునికి వదిలెయ్యడం మంచిది” అంది నిర్మల.
“ఇలా ఆలోచిస్తావు కాబట్టే నువ్వింత కూల్‌గా వుండగలుగుతున్నావు నిర్మలా”
“ఉండక ఏం చేస్తామండీ, అలోచించినా, ఆవేశపడినా మిగిలేది ఆయాసమే. మన జీవిత చరమాంకం ఆ భగవంతుని చేతుల్లేని వున్నది. అందుకే పిల్లల మీద ఆధారపడే కంటే ఆ భగవంతుణ్ణి నమ్ముకోవడం మంచిది” అంది నిర్మల.
“నిర్మలా అందుకే నువ్వంటే నాకెంతో ఇష్టం. నా ప్రతి ఆలోచనని గమనిస్తావ్, ప్రతి విషయంలోనూ నాకెంతో థైర్యాన్నిస్తావు.”
“పిల్లలది గలగలా పారే సెలయేటి లాటి జీవితం, వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళని ఉండనివ్వండి. కోరికల లాంటి అలలతో ఉద్వేగంతో ఎగసిపడే సముద్రంలాగా కాకుండా, నిశ్చలంగా ఉండే నదిలా మీ మనస్సుని ప్రశాంతంగా ఎటువంటి ఆలోచనలూ లేకండా ఉంచుకోండి” అంది నిర్మల.
“నిజమే నిర్మలా నువ్వు చెప్పేది. పిల్లలు, బంధాలు ఇవ్వన్నీ మనం కల్పించుకున్నవే. మధ్యలో వచ్చినవే. నువ్వన్నట్లు వాళ్ళ సంసారాలు, వాళ్ళ బాధ్యతలు వాళ్లవి. మనం వాళ్ళ మీది ఆధారపడడం మన తెలివి తక్కువతనం. పిల్లలు చూసినా చూడక పోయినా కడదాకా ఒకరికొకరు తోడుండేది భార్యాభర్తలు మాత్రమే. నువ్వు మాత్రం నన్ను వదలి ఎక్కడికి పోవద్దు” అంటూ భార్య గుండెల్లో తలదూర్చాడు రాఘవరావు.
“చ! ఊరుకోండి, మిమ్మల్ని వదిలి నేనెక్కడికి వెళతాను, మీతోనే నేను” అంటూ భర్త తల నిమిరింది ఆప్యాయంగా.
“అందుకే ఒక్కొక్కసారి అనిపిస్తుంది..” అంటూ ఆగిపోయారు రాఘవరావు.
“ఏమనిపిస్తుంది” అంది నిర్మల.
“ఇద్దరం ఒకేసారి చనిపోతే బాగుంటుంది అని!”
“ఆత్మహత్య చేసుకుందామా? రేపు తిథి మంచిదే” అంది నిర్మల సీరియస్‌గా.
“ఏంటి నిర్మలా అంత మాట అనేసావ్” అన్నాడు రాఘవరావు.
“లేకపోతే ఏమిటండీ, ఇదేమన్నా మిథునం సినిమానా?, ఒకళ్ళ ఒళ్ళో మరొకరు తలపెట్టి ఇద్దరూ ఒకేసారి చనిపోవడానికి – జీవితం అండీ ఇది. అంతా ఆ పైవాడి చేతుల్లోనే వుంది. ఇవన్నీ ఆలోచించక హాయిగా పడుకోండి” అంటూ ప్రక్కకి తిరిగి పడుకుంది నిర్మల.
రాఘవరావుకు నిద్ర రావడం లేదు, ఆలోచనలు ఒక్క సారిగా ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్లి పోయాయి.
***
“అమ్మా! ఈరోజు ఆదివారం కదా, సాయంత్రం నేనూ నిర్మలా ఆలా సినిమాకి వెళ్లి వస్తాం” అన్నాడు రాఘవరావు రేడియోలో పాటలు వింటున్న తల్లితో.
“వారమంతా ఇద్దరూ ఉద్యోగాలు చేసి అలిసిపోతారు, నేనా ఒక్కదాన్ని బిక్కు బిక్కుమంటూ ఇంట్లో కూర్చుంటా. హాయిగా ఆదివారం పూటైనా ఇంట్లో వుండొచ్చుగా, ఎప్పుడయినా రెండు మూడు రోజులు సెలవులు వచ్చినప్పుడు వెళ్ళొచ్చులే సినిమాకి” అంది తల్లి.
మారు మాట్లాడకుండా గదిలోకి వెళ్లి, “సినిమాకి వద్దులే నిర్మలా” అన్నాడు భార్యతో.
మరుసటి రోజు ఆఫీసులో పనిచేస్తున్న రాఘవరావు, ‘నిన్న సినిమాకు వద్దన్నందుకు నిర్మల ఎంత బాధపడిందో పాపం’ అనుకుంటూ, నిర్మల ఆఫీస్‌కి ఫోన్ చేసి, “నిర్మలా మధ్యాహ్నం ఆఫ్ డే సెలవు పెడతావా, సినిమాకి వెళదాం” అన్నాడు.
“అలాగే” అంది నిర్మల.
ఇలాంటివి తన జీవితంలోనూ చాలా జరిగాయి.
***
నిర్మల చెప్పింది నిజమే. పిల్లల ఆనందానికి తాము అడ్డం కాకూడదు. ప్రతి విషయమూ పిల్లలు తనకి చెప్పలేదని బాధపడకూడదు. అని ఏదో నిశ్చయానికి వచ్చిన వాడిలా నిద్రకి ఉపక్రమించాడు రాఘవరావు. .
హాల్లో కూర్చున్న నిర్మల ప్రక్కన కూర్చుంటూ, “ఒరేయ్ ప్రవీణ్, అమ్మా సుమతీ ఓసారి ఇలా రండి” అని పిలిచాడు రాఘవరావు.
“ఏంటి నాన్నగారు” అన్నాడు ప్రవీణ్ భార్య సుమతితోపాటు ప్రక్కన కూర్చుంటూ.
“ఏమి లేదు, కొండాపూర్‍లో మన అపార్టుమెంటు ఉంది కదా, అతన్ని ఓ నెలలో ఖాళీ చెయ్యమని చెప్పు”
“అలాగే నాన్నగారూ.. ఎందుకు, మీ ఫ్రెండ్ ఎవరికన్నా కావాలా?” అన్నాడు ప్రవీణ్.
“అబ్బే అదేమీ లేదు. నువ్వు సుమతి ఇద్దరూ అక్కడే వుందురుగాని” అన్నాడు రాఘవరావు.
ఉలిక్కిపడ్డ ప్రవీణ్, “అదేంటి నాన్నా! నేనూ సుమతి అక్కడ వుండడమేమిటి, అందరం ఇక్కడ కలిసి వున్నాం కదా” అన్నాడు ఏమీ అర్థం కాక, భార్య వైపు చూస్తూ.
“అవును అత్తయ్యా! అలాంటి డెసిషన్ ఎందుకు తీసుకున్నారు? నావలన ఏదయినా పొరపాటు జరిగిందా” అంటూ వచ్చి అత్తగారి ప్రక్కన కూర్చుంది సుమతి.
“అలాంటిదేమీ లేదమ్మా, మీ మామయ్యగారు ఏ నిర్ణయం తీసుకున్నా మీ మంచి కోసమే తీసుకుంటారు” అంది నిర్మల.
“ప్రవీణ్! మీరు కొత్తగా పెళ్లయిన వాళ్ళు, మీ సరదాలు, మీ ఆలోచనలు వేరుగా ఉంటాయి. మీ మీద కోపంతో ఈ విషయం చెప్పడం లేదు, కొన్నాళ్ళు ఆనందమయ జీవితం గడుపుతారని ఈ నిర్ణయానికి వచ్చాను. జీవితాన్ని అనుభవించవలసి వయసు మీది. భగవంతుని ఆరాధనలో గడపవలసి వయసు మాది. మేము ఏదన్నా అంటే అది మీకు చాదస్తం అనిపించవచ్చు. అది మా వయసు ప్రభావం, అంతే తప్ప మిమ్మల్ని విడిగా వెళ్లిపొమ్మనటానికి వేరే కారణాలేమీ లేవు. ఇద్దరూ ఉద్యోగస్థులే కదా, అక్కడకి మీ ఆఫీస్ కూడా దగ్గర కాబట్టి అక్కడ ఉంటే మీకు సదుపాయంగా ఉంటుంది. ఊళ్ళోనే ఉంటారు కాబట్టి హాలీడేస్ అప్పుడు వచ్చి వెళుతూ వుండండి. పిల్లలు పుట్టాక ఒకరికొకరి అవసరాలు ఎటూ తప్పవు. అప్పటిదాకా జీవితాన్ని కొన్నాళ్లు హాయిగా అనుభవించండి. మీరు ఆనందంగా జీవితం గడపాలనే ఈ నిర్ణయం తీసుకున్నాం కానీ, మరే ఉద్దేశమూ లేదు” అన్నాడు రాఘవరావు.
“మీ ఇష్టం నాన్నగారూ” అంటూ ప్రవీణ్ భార్యతోబాటు లోనికి వెళ్ళాడు.
ఎవరి జీవితాలు ఎలా వున్నా కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది. అలాగే రాఘవరావు గారి జీవితంలో నాలుగేళ్లు గడిచిపోయాయి..
సౌజన్యకి ఇద్దరు కూతుళ్లు, ప్రవీణ్‌కి ఓ బాబు ఓ పాపా. పిల్లలతో బాటు కొడుకు కోడలు, కూతురు అల్లుడు అప్పుడప్పుడు వచ్చి పోతుంటే, రాఘవరావుకి నిర్మలకి చాలా సంతోషంగా ఉంది. ప్రవీణ్ ఆఫీస్ పని మీద అప్పుడప్పుడు ఓ నెల, రెండు నెలల పాటు అమెరికా వెళ్లి వస్తుంటాడు. ఆ సమయంలో పిల్లలని తీసుకుని సుమతి వస్తూ ఉంటుంది. ఇక్కడి నుండే తను ఆఫీసుకి వెళుతుంది.
పండగలకి, ఫంక్షన్లకి, అప్పుడప్పుడు తీసుకుంటున్న పూజలకు, తమ కుంటుంబ సభ్యులే కాకుండా వచ్చిన వియ్యంకులు, వియ్యపురాళ్లు, వాళ్ళ పిల్లలతో ఆ ఇల్లు పెళ్లి ఇల్లు లాగా కళకళ లాడుతూ ఉంటుంది. వాళ్ళందరినీ చూస్తుంటే రాఘవరావుకి ‘స్వాతిముత్యం’ సినిమాలో కమల హాసన్ గుర్తుకు వచ్చి సంబరపడి పోయాడు. రెండు రోజుల తరువాత అందరు వెళ్లిపోతే కొంచం బాధ అనిపిస్తుంది కానీ, వెంటనే ఎవరి జీవితాలు వాళ్ళవి అనుకుంటూ, దేని మీదా మమకారాన్ని ఎక్కువ పెంచుకోవద్దన్న నిర్మల మాటలు గుర్తుకు గుర్తుకు తెచ్చుకుని కుదుట పడతాడు.
ఓ రోజు రాత్రి టిఫిన్ తిని, వంటిల్లు సర్ది “ఏం చేస్తున్నారూ?” అంటూ వచ్చింది నిర్మల హాల్లో కూర్చున్న రాఘవరావుగారి దగ్గరికి.
వస్తూనే, టీవీలో కనపడుతున్న వ్యక్తిని చూసి ఆశ్చర్యంగా “అదేంటి, అతను మీ స్నేహితుడు దక్షిణామూర్తి గారు కదూ, టీవిలో వస్తున్నారేంటి” అంది ఆశ్చర్యంగా రాఘవరావు ప్రక్కన కూర్చుంటూ .
“అవును నా ఫ్రెండే, కానీ అది టీవీ కాదు, వాడిచ్చిన వీడియో. వాడీ మధ్య అమెరికాలో ఉంటున్న కొడుకు దగ్గరికి వెళ్ళొచ్చాడట. అక్కడ రోడ్లు, బిల్డింగులు చాలా బాగుంటాయట. అమెరికాని భూలోక స్వర్గం అంటారట. వాళ్ళ అబ్బాయి అమెరికాలో ఐదు వందల గజాల్లో కట్టిన డూప్లెస్ హౌస్ కొన్నాడట.” అలా చెప్పుకుంటూ పోతున్న రాఘవరావు గారు “నాన్న గారూ ఏంచేస్తున్నారు” అన్న పిలుపుతో వెనక్కి తిరిగారు. వెనకనే ప్రవీణ్ నుంచుని వున్నాడు.
“నువ్వా ప్రవీణ్! ఎప్పుడొచ్చావు, మేము గమనించనేలేదు” అన్నారు రాఘవరావు.
“ఇంతకుముందే వచ్చాను” అన్నాడు ప్రవీణ్ సోఫాలో కూర్చుంటూ.
“ఈవేళప్పుడొచ్చావు, ఒక్కడివే వచ్చావా, సుమతి కూడా వచ్చిందా” గుమ్మం వైపు చూస్తూ అంది నిర్మల.
“ఈ దగ్గరలోనే కొద్దిగా ఆఫీస్ పనివుంటే వచ్చాను. ఇంతదూరం వచ్చాను గదా ఓ సారి చూసి వెళదాం అని వచ్చాను” అన్నాడు ప్రవీణ్ తల్లి ఇచ్చిన కాఫీ కప్ అందుకుంటూ.
“కోడలూ, పిల్లలూ బాగున్నారా”
“అంతా బాగానే ఉన్నారమ్మా, మీరిద్దరూ రెగ్యులర్‌గా మందులు వేసుకుంటున్నారా, డాక్టర్ దగ్గరికి చెకప్‌కి ఎప్పుడు వెళ్ళాలి, నాకు ముందుగా చెబితే నే వచ్చి తీసుకు వెళతాను” అన్నాడు ప్రవీణ్.
“ఫరవాలేదు లేరా, ఈ బి.పి, షుగర్ ఇవన్నీ పెద్ద రోగాలు కాదు ఈ రోజుల్లో”.
“పది అవుతోంది పోనీ రాత్రికి ఇక్కడే ఉండి పొరాదూ సుమతికి ఫోన్ చేసి” అంది నిర్మల.
“పది గంటలే కదమ్మా, మెట్రో ఎక్కితే నలభయ్ నిమిషాల్లో వెళ్లి పోతాను. సరే పొద్దు పోయింది, మీరు పడుకొండి” అని బయలుదేరాడు ప్రవీణ్.
మెట్రో ట్రైన్‌లో కూర్చున్న ప్రవీణ్‌కి ‘అమెరికాలో రోడ్లు విశాలంగా ఉంటాయట, అమెరికాని భూలోక స్వర్గం అంటారట’ అన్న తండ్రి మాటలు గుర్తుకు వచ్చాయి.
నాన్నకి అమెరికా చూడాలని ఉందా? ఆయన రిటైర్ అయి కూడా అయిదు సంవత్సరాలు దాటింది, నాన్న ఎప్పుడూ ఈ విషయం అనలేదు. పోనీ ఆఫీస్ పని మీది రెండు, మూడు సార్లు అమెరికా వెళ్లొచ్చిన తనకి కూడా , అమ్మా నాన్నలకి అమెరికా చూపిద్దాం అనే ఐడియా ఎందుకు రాలేదు అని ఆలోచిస్తూ, ఇంటికి వెళ్ళాక అదే విషయం భార్యకి చెప్పాడు ప్రవీణ్ .
“జరిగిపోయిన దాని గురుంచి ఆలోచించడం ఎందుకు. వచ్చే నవంబర్, డిసెంబర్లలో మీరు వెళ్లాల్సి ఉందిగా, అప్పుడు తీసుకువెళ్ళండి, ఈలోగా అక్కడున్న మీ ఫ్రెండ్‌తో మాట్లాడి, వీసా, పాసుపోర్టు సంగతి చూడండి” అన్నది సుమతి.
***
బంధువులంతా వీడ్కోలు చెబుతుండగా నిర్మల, రాఘవరావు, కొడుకుతో బాటు అమెరికా వెళ్ళడానికి విమానం ఎక్కారు.
“మీరు అమెరికా చూడాలని ఉందని ప్రవీణ్‌కి చెప్పారా” అని అడిగింది నిర్మల రాఘవరావు గారితో విమానంలో కూర్చోగానే, ప్రక్కనున్న ప్రవీణ్‌కి వినపడకండా.
“అబ్బే వాడితో నేనేమీ అనలేదు, వాడు వెళదామన్నా నేను ఎందుకులే అన్నాను, అయినా వాడు నే వెళుతున్నాను నాన్న గారూ, మీరూ, అమ్మా రండి అంటే సరే అన్నాను” అన్నాడు రాఘవరావు.
“ఎలాగైయితే నేమి మీ కోరిక తీరబోతోందిగా” అన్నది నిర్మల.
ఓ నెలరోజుల పాటు యు.ఎస్ లోని ముఖ్య నగరాలు, అందమైన ప్రదేశాలు చూసి ముచ్చటపడ్డారు రాఘవరావు దంపతులు.
“ఎలావుందీ నాన్నగారూ అమెరికా” అన్నాడు ప్రక్కన కూర్చుంటూ ప్రవీణ్.
“అంతా బాగానే ఉంది గానీ, రోడ్ల మీద తిరగడానికి, ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి ఇండియాలో ఉన్న స్వాతంత్య్రం లేదు, ఏదో ఒంటరితనం ఫీలవుతున్నట్లుంది” అన్నారు రాఘవరావు.
“ఇక్కడి వాతావరణం, ఇక్కడి పద్ధతులు అంతే. అది సరేగానీ, ఎల్లుండే ఇండియాకి మన ప్రయాణం, సాయంత్రం అలా షాపింగ్‌కి వెళదాం, చెల్లాయి వాళ్ళకీ, పిల్లలకీ ఏం కావాలో కొనుక్కుందాం” అని పని వుందని బయటకు వెళ్లి పోయాడు ప్రవీణ్.
మరుసటి రోజు సూట్ కేసులు సర్దుతున్న రాఘవరావు దగ్గరికి వచ్చి, “నాన్నా, చిన్న ఇబ్బంది వచ్చింది” అన్నాడు ప్రవీణ్.
“ఏంటిరా అది?”
“ఏమీ లేదు నాన్నా, ఓ ప్రాజెక్ట్‌లో పనిచేయడానికి మా కొలీగ్ రావలసి ఉంది. కానీ అతనికి ఏదో ఇబ్బంది వచ్చిందని నన్ను ఓ వారం పాటు ఆ పని చూడమన్నారు.” అన్నాడు.
“అంతే కదా, దానిదేముందీ, ఉండు” అన్నారు రాఘవరావు.
“పోనీ మీరు కూడా వుండిపోవచ్చుకదా, వచ్చేవారం అందరం కలసి వెళదాం” అన్నాడు ప్రవీణ్.
“వద్దులే బాబూ! ఎటూ రిజర్వేషన్ అయ్యింది కదా, క్యాన్సిలేషన్ అంటే బోలెడు డబ్బు వృథా, అయినా ఇక్కడ చూసే పని ఐపోయింది కదా. ఫ్లైటు ఎక్కించు, మేము వెళ్ళగలంలే” అన్నారు రాఘవరావు.
మరుసటి రోజు ప్రవీణ్ వచ్చి ఫ్లైటు ఎక్కించాడు. “ఇండియాలో ఇప్పుడు రాత్రి అవుతూ ఉంటుంది, పిల్లలు పడుకుంటారేమో, అమ్మాయితో పిల్లలతో ఓ సారి మాట్లాడదామండీ” అంది నిర్మల.
సరే అని ఫోన్ చేసి అందరితోనూ మాట్లాడి అందరికీ ‘బై’ చెప్పారు.
“చూసావా మన పిల్లలు ఎంత ప్రయోజకులయ్యారో, చివరికి మనకి అమెరికా కూడా చూపించారు. నాకు చాలా ఆనందంగా వుంది నిర్మలా” అంటూ నిర్మల చేతిని తన చేతిలోకి తీసుకున్నారు రాఘవరావు.
విమానం ఇండియా వైపు దూసుకు పోతోంది.
***
ఆఫీసులో పని చేసుకుంటున్న ప్రవీణ్, తన తల్లీ తండ్రి ఎక్కిన ఫ్లైట్‌కి ఆక్సిడెంట్ అయ్యిందని తెలిసి అవాక్కయ్యాడు. ఆఫీస్‌లో చెప్పి ఇండియాకి బయలుదేరాడు.
“అన్నయ్యా” అంటూ ఒక్కసారిగా అప్పుడే ఫ్లైటు దిగిన ప్రవీణ్‌ని కౌగలించుకుంది సౌజన్య.
“ఊరుకోమ్మా ఇదంతా నా వల్లనే జరిగింది” బాధపడుతూ అన్నాడు ప్రవీణ్.
“అమ్మా నాన్నలకి అమెరికా చూపించాలనుకున్నావ్, సంతోషంగా చూసారు, కానీ విధి మరోలా వుంది. ఫ్లైటు ఆక్సిడెంట్ జరగటం అందులో అమ్మా నాన్నా ఒక్కసారే చనిపోవడం జరిగింది. ఇందులో నీ తప్పేముంది” అంది సౌజన్య.
“నీ ప్రయాణం వాయిదా పడడంతో కనీసం నువ్వయినా మాకు దక్కావు” అన్నారు ప్రవీణ్ మామగారు, ప్రక్కనే ఉన్న సుమతిని దగ్గరకి తీసుకుంటూ.
“కనీసం బాడీస్ కూడా దొరకకుండా ఇంత ఆక్సిడెంట్ ఏంటి మామయ్యగారూ” బాధపడుతూ అన్నాడు ప్రవీణ్.
బాధపడుతున్న ప్రవీణ్, సౌజన్యలను కుంటుంబ సభ్యులు, బంధువులు ఓదార్చారు. విమానాశ్రయం అధికారులు ఇచ్చిన పత్రాలు తీసుకుని అందరూ ఇల్లు చేరారు.
రాఘవరావు, నిర్మల కలసి తీయించుకున్న ఫోటో ముందు నుంచుని వారికి నివాళులు అర్పించారు.
‘మా బంధం విడదీయరానిది – మేమిద్దరం ఒకేసారి చనిపోవాలన్న నా కోరిక తీరింది చూసారా’ అని తనలో తానే నవ్వుకుంటున్నట్లుగా వుంది రాఘవరావుగారి ముఖం ఆ ఫొటోలో.