డాక్టర్ అన్నా బి.యస్.యస్.-16

0
3

[ప్రముఖ రచయిత శ్రీ సిహెచ్. సియస్. శర్మ రచించిన ‘డాక్టర్ అన్నా బి.యస్.యస్.’ నవలని ధారావాహికంగా పాఠకులకు అందిస్తున్నాము.]

[పార్వతిని తన కోడలిగా చేసుకోవాలని ఉందని ధర్మతేజ నారాయణమూర్తితో అంటాడు. బదులుగా నారాయణమూర్తి విచారంగా నిట్టూరుస్తాడు. పార్వతి మరో రెండేళ్ళ వరకు పెళ్ళికి అంగీకరించదని, ఐఎఎస్ చేసి కలెక్టర్ అవ్వాలని తన కోరిక అని చెప్పి, మరి రెండేళ్ళు వివాహం వాయిదా వేయగలరా అని అడుగుతాడు నారాయణమూర్తి. ముందు పార్వతి అభిప్రాయం తెలుసుకోమంటాడు ధర్మతేజ. ఇంటికి చేరాకా, పార్వతి మీద అభిప్రాయమేంటని అన్నాని అడుగుతాడు ధర్మతేజ. మీ ఇష్టమని అంటాడు అన్నా. వివాహం విషయం పార్వతితో ప్రస్తావిస్తాడు నారాయణమూర్తి. ఆమె తన నిర్ణయాన్ని మరోసారి చెప్తుంది. అదే సమయంలో అక్కడి వచ్చిన ధర్మతేజ ఆమె మాటలని విని వెళ్ళిపోతాడు. తను విన్న మాటలని మాధవికి చెప్తాడు. తానూ ఇంద్రజని అడిగాననీ, ఆమె కూడా అదే మాట చెప్పిందని అంటుంది మాధవి. అన్నా తన ఆసుపత్రిలో పార్వతి నాట్య ప్రదర్శన ఏర్పాటు చేయిస్తాడు. ప్రదర్శన విజయవంతంగా ముగుస్తుంది. పార్వతికి కానుకలు, ప్రశంసలు లభిస్తాయి. మర్నాడు ధర్మతేజ.. మాధవీల మ్యారేజి డే. అన్నా, పార్వతితో మాట్లాడి ఆ కార్యక్రమాన్ని విభిన్నంగా జరిపేలా ప్రణాళిక వేస్తాడు.  ఇక చదవండి.]

[dropcap]అ[/dropcap]న్నా రాకముందు..

“ఏమండీ!..”

“చెప్పు మధూ!..”

“పార్వతి నిర్ణయంలో ఎలాంటి మార్పు వుండదు కదూ!..”

భార్య ముఖంలోకి క్షణం సేపు చూచి.. ప్రక్కన కూర్చొని..

“మధూ!.. పార్వతి మంచి ఆశయాలు కల అమ్మాయి. ‘తాను కలెక్టరు అయి మనదేశంలో.. మన రాష్ట్రంలో వుండే అవకతవకలను సరిచేయాలని.. మంచిని మానవత్వాన్ని పెంచాలని.. స్త్రీల సంక్షేమం కోసం పాటుపడాలని.. ఇలాంటి ఉత్తమ ఆశయాలను మనస్సున నింపుకొని వాటి సాధనకు తాను కలెక్టర్ కావాలి.. అనేది ఆమె నిర్ణయం’ నారాయణ నాకు చెప్పిన మాటలివి. మధూ!.. ఆమె ఆశయాలలో తన స్వార్థం లేదు.” ఎంతో అనునయంగా చెప్పాడు ధర్మతేజ.

“అవును.. పార్వతి నిర్ణయాలు చాలా మంచివి..” అంది మాధవి.

అన్నా క్రిందికి వచ్చాడు. ముగ్గురూ లక్ష్మికి చెప్పి.. తల్లి తనూ ఒక కారులో.. తండ్రిని మరొక కారులో రమ్మని చెప్పి.. అన్నా తన కారును స్టార్ట్ చేశాడు.

ధర్మతేజ తన కారులో వారిని అనుసరించారు.

అరగంటలో హోటల్ చేరి.. పార్కింగ్ ప్లేస్‌లో కార్లను విడిచి.. ఆ ముగ్గురూ లిఫ్ట్‌లో మూడవ అంతస్తుకు చేరారు. కారిడార్లో ముందు అన్నా నడుస్తూ..

“అమ్మా!.. నాన్నా!.. రండి..” చిరునవ్వుతో చెప్పాడు.

మాధవి ఆశ్చర్యంతో భర్త ముఖంలోకి చూచింది ‘ఏమిటిది’ అన్నట్టు..

పెదవుల కదలికతో చెప్పాడు.. ‘తెలియదు’ అన్నట్టు..

అన్నా రూమ్ నెంబర్ త్రీనాట్ ఫైవ్ ముందు నిలబడి కాలింగ్ బెల్ నొక్కాడు. పార్వతి తలుపు తెరచి నవ్వుతూ “ప్లీజ్ కమ్..” అంది.

ధర్మతేజ.. మాధవి అశ్యర్యపోయి ఒకరి ముఖాలు ఒకరు చూచుకొన్నారు.

నారాయణమూర్తి ముందుకు వచ్చి.. ధర్మతేజ కుడిచేతిని తన చేతిలోనికి తీసుకొని.. “మిత్రమా!.. సుస్వాగతం.. సుస్వాగతం.. మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ అఫ్ ది డే!..” నిర్మలమైన నవ్వుతో స్వాగతాన్ని.. ఆశీస్సులను తెలియచేశారు. ధర్మతేజ.. మాధవీలకు విషయం అర్థమయింది. నవ్వుతూ లోన ప్రవేశించారు.

కృతజ్ఞతా పూర్వకంగా అన్నా పార్వతి ముఖంలోకి చిరునవ్వుతో చూచాడు.. కొన్ని క్షణాలు అన్నా ముఖంలోకి సూటిగా చూచి పార్వతి సిగ్గుతో ముసి ముసి నవ్వులతో తల దించుకొంది.. ఇంద్రజ మాధవి చేతిని తన చేతిలోనికి తీసుకొని చెవిలో ఏదో చెప్పింది. మాధవి ముఖం వికసిత పద్మం అయింది. భర్త ముఖంలోకి ప్రీతిగా చూచింది.

ధర్మతేజ.. మాధవీలు.. అన్నా వారికోసం కొన్న వస్త్రాలను ధరించారు.

ఇంద్రజ మాధవిని పెండ్లికూతురు చేసింది. ధర్మతేజా అలంకారాన్ని నారాయణమూర్తి చూచుకొన్నాడు. ఇంద్రజకు సాయంగా పార్వతి.. నారాయణకు సాయంగా అన్నా, మాధవ్‌లు వ్యవహరించారు.

నారాయణమూర్తి మాట ప్రకారం.. ఆ వధూవరులు ఒకరి ప్రక్కన ఒకరు కూర్చున్నారు. దర్మతేజకు ముందు పురోహితుని వేషంలో వున్న నారాయణమూర్తి కూర్చున్నాడు.

‘శుక్లాంబరధరం విష్ణుం..’ తో ప్రారంభించి వివాహ మంత్రాలు చదివి ధర్మతేజ చేత మాధవికి మాంగల్య ధారణ చేయించాడు.

పార్వతి అన్నా ముఖంలోకి వాల్గంట చూచింది. అన్నా అమాయకంగా ఆనందంగా నవ్వాడు. పార్వతిని సమీపించి మెల్లగా..

“థ్యాంక్స్.. ఎ లాట్.. పార్వతి.. నేను వూహించిన దానికన్నా గొప్పగా చేశావ్.. ఈరోజునూ.. మిమ్మల్ని నేను జీవితాంతం మరచిపోలేను..” ఎంతో ఆనందంగా చెప్పాడు అన్నా…

“మనం స్నేహితులన్నమాట మరచిపోయి పరాయిదానిలా నన్ను మీరు చూస్తున్నారు..” చిరుకోపంతో ఓరకంట చూస్తూ చెప్పింది పార్వతి.

“నో.. నో..” చిరునవ్వు నవ్వాడు అన్నా..

ధర్మతేజ.. మాధవీలు లేచి నిలబడ్డారు. అన్నా వంగి వారి పాదాలను తాకి నమస్కరించాడు. ఆ తల్లిదండ్రులు అన్నాను మనసారా దీవించారు.

ఇంద్రజ పార్వతి ముఖంలోకి చూచింది.

అర్థాన్ని గ్రహించిన పార్వతి కూడ ధర్మతేజ మాధవీల పాదాలు తాకి నమస్కరించింది. మాధవ్ అక్క వెనకాలనే అదే పనిని చేశాడు. ఆ దంపతులు ఇరువురిని ఎంతో ప్రీతితో ఆశీర్వదించారు.

“మనస్సుకు నచ్చినవాడు.. మనస్సును ఎరిగి వర్తించేవాడు.. జీవిత భాగస్వామిగా వస్తాడు.. బంగారం లాంటి బిడ్డలతో నిండు నూరేళ్లు సర్వ సౌభాగ్యాలతో ఆనందంగా వర్థిల్లుతావు పారూ!..” ప్రేమతో పారూను తన హృదయానికి హత్తుకొంది మాధవి.. హృదయం.. ఆనందంతో నిండినా.. ఆవేదనతో కృంగినా.. వెల్లడి చేసేవి నయనాలు.. అశ్రువులు.. అందరూ మాధవి నయనాల్లో కన్నీటిని చూచారు.

నారాయణమూర్తికి ఇంద్రజకు.. పూర్తిగా, పార్వతికి.. మాధవి మనస్తత్వం అర్థమయింది.

అందరూ ప్రీతిగా మాధవి ముఖంలోకి చూచారు. ధర్మతేజ ప్రక్కకు వెళ్లి మెల్లగా మాధవి భుజాన్ని తాకాడు.. చిరునవ్వుతో…

చిరునవ్వుతో ధర్మతేజ ముఖంలోకి చూచింది మాధవి..

నారాయణ ఇంద్రజలు వారిని చూచి సంతోషించారు. ఆ గది సూట్ రూమ్.. మాధవి చేతిని తన చేతిలోకి తీసుకొని.. మూసివున్న పడక గది తలుపులు తెరచి..

“ఈ రాత్రి మీ దంపతుల శయనం ఇక్కడే వదినా!..” చిరునవ్వుతో చెప్పింది ఇంద్రజ.

“ఏంటి వదినా!.. ఇదంతా అవసరమా!..” ఆశ్చర్యంతో అంది మాధవి.

“ఇందులో నాదేం లేదు.. అంతా మీ అన్నయ్య గారి ఏర్పాటు తల్లీ!..” గలగలా నవ్వుతూ చెప్పింది ఇంద్రజ.

ఇరువురూ గది బయటకు వచ్చారు. రెస్టారెంటుకు వెళ్లడానికి..

“ఒరేయ్!.. నారాయణా!.. చాలా గొప్పగా చేశావురా!.. నీకు వివాహ మంత్రాలు కూడా వచ్చా!.. సూపర్ .. సూపర్!..” ఆనందంగా మిత్రుని భుజంపై చేయివేశాడు ధర్మతేజ.

“ప్రతి ఒక్కరూ వారి ధర్మాన్ని పాటించాలి. ఆచరించాలి. అప్పుడే సమాజంలో అందరూ బాగుంటారు. సంకరత సమాజ వ్యవస్థ.. చరిత్రను మారుస్తాయి. ప్రస్తుతంలో జరుగుతున్నదదే.. విదేశస్థులు కొందరు మన ఆచార వ్యవహారాలను.. పురాణాలను ఎంతో గౌరవించి నేర్చుకొని పాటిస్తూ పరమానందాన్ని పొందుతున్నారు. మన స్వజనం.. వీరి నాగరికత.. మోజులో.. వీరికంటే మించిపోయి.. మన ఉనికిని.. సాంప్రదాయాలను మరచిపోయి.. అంతులేని స్వార్థంతో కష్టాలపాలై ఆశాంతిగా బ్రతుకుతున్నారు. మారిన వారి తత్వాలకు తగినట్టు కమ్యూనికేషన్ వ్యవస్థ.. టీవీ.. సెల్.. ఇత్యాదుల వలన అగ్నిలో ఆజ్యం పోసిన ఫలితంతో సమాజం ముందుకు నడుస్తూ వుంది. ఎన్నో వింతలు విడ్డూరాలను వింటున్నాము. చూస్తున్నాము..” విరక్తిగా నవ్వాడు నారాయణమూర్తి.

అవునన్నట్టు తల ఆడించాడు ధర్మతేజ.

అందరూ డైనింగ్ హాల్‌కి వెళ్లి ఒకే టేబుల్ చుట్టూ కూర్చొని.. సరదాగా.. కబుర్లతో.. ఆనందంగా భోజనాలు ముగించారు.

“డియర్ ధర్మా!.. మీరు మీ సతీమణి.. ఆ పై అంతస్తు గదిలో హాల్టు.. ప్లీజ్ హ్యావ్.. నైస్ స్లీప్.. మేము ఇంటికి వెళతాము. గుడ్‌నైట్..” నారాయణ మూర్తి నవ్వుతూ అన్నా ముఖంలోకి చూచాడు.

“యస్.. అంకుల్..” అన్నాడు చిరునవ్వుతో పార్వతిని చూస్తూ.. అన్నా.

ధర్మతేజ మాధవిలు లిఫ్ట్ వైపుకు.. అన్నా తదితరులు కారు స్టాండు వైపుకు ఆనందంగా నడిచారు.

***

మరుదినం.. సాయంత్రం పార్వతి నాట్య ప్రోగ్రామ్ ధర్మతేజ గారి యూనివర్సిటీలో జరిగింది. ప్రేక్షకులు ఎంతో ఆనందించారు.

పార్వతికి బంగారు చైన్ బహూకరించారు.

నారాయణమూర్తి.. ఇంద్రజ.. పార్వతి.. మాధవ్ చాలా ఆనందించారు.

అందరూ ఇంటికి తిరిగి వచ్చాక..

“అంకుల్!.. మీ యూనివర్సిటీలో అరేంజ్‌మెంట్స్ చాలా బాగా చేశారు. దానికి కారణం మీరే!..” చేతులు జోడించి “ధన్యవాదాలు మామయ్యా..” సంతోషంగా నవ్వుతూ చెప్పింది పార్వతి.

అంకుల్‌తో ప్రారంభించి.. మామయ్యతో ముగించిన ఆమె మాటలకు అందరూ ఆనందంగా ఆమెను పరీక్షగా చూచారు. అన్నా చిరునవ్వుతో తన్ను చూడటంతో పార్వతి సిగ్గుతో ముసిముసి నవ్వుతో తలగించుకొంది.

“ధర్మా!.. నీ ఇంట నాకు నా ఇంట్లో వున్నట్లుగానే వుందిరా. మీ ముగ్గురి ఆదరాభిమానాలను ఈ జీవితంలో మరచిపోలేను.” అన్నాడు నారాయణమూర్తి ఆనందంగా..

“అవును అన్నయ్యా!.. మా ఈ అమెరికా యాత్ర మా మనస్సుల్లో ఓ మధురస్మృతిగా మిగిలి పోతుంది..” ఎంతో సంతోషంతో చెప్పింది ఇంద్రజ.

అందరూ కలసి ఆనందంగా భోజనం చేశారు.

“ధర్మా!.. రేపు మా ప్రయాణం..” చెప్పాడు నారాయణమూర్తి.

“ఆ.. ఆఆ.. అవును కదూ!..”

“వారం రోజులు ఏడు క్షణాలుగా గడచిపోయాయి..” అంది ఇంద్రజ.

అన్నా వారిరువురి ముఖాల్లోకి చూచి పార్వతి ముఖంలోకి చూచాడు.

“అంకుల్.. మీ అందరి సమక్షంలో వారం రోజులు చాలా ఫాస్ట్‌గా జరిగిపోయాయి..”

“నాకు మీరు అపుడే బయలుదేరబోతున్నారంటే.. విచారంగా వుంది..” అంది మాధవి.

“వెళ్లక తప్పదు కదా వదినా!..” విచారంగా అంది ఇంద్రజ.

“అవును కదా!..” భర్త ముఖంలోకి చూస్తూ సాలోచనగా అంది మాధవి.

ఆమె చూపుల్లోని బాధను గ్రహించారు అన్నా… ధర్మతేజ.

“అమ్మా!.. జనవరిలో మనం భారత్.. మన దేశానికి వెళదాంలే అమ్మా!..” అన్నాడు అన్నా.

“యస్!.. మధూ!..” చెప్పాడు ధర్మతేజ.

“మేము మీ రాకకు ఎదురు చూస్తుంటాము.. ఆ.. అత్తయ్యా!..” పార్వతి ఆంటీ అనబోయి.. మార్చి అత్తయ్యా..

“అవును.. అవును..” అన్నాడు మాధవ్ నవ్వుతూ.

అన్నా పార్వతి ముఖంలోకి చూస్తూ..

“తప్పకుండా వస్తాము..”

“అంటే.. తొమ్మిది నెలల తర్వాత అన్నమాట..” అంది మాధవి.

“అవును.. మధూ.. జస్ట్ నైన్ మంత్స్!..” చిరునవ్వుతో చెప్పాడు ధర్మతేజ.

అందరూ వారివారి గదులకు వెళ్లిపోయారు. శయనించారు..

నారాయణ.. ఇంద్రజ.. పార్వతి.. మాధవ్‌లు.. ధర్మతేజ.. మాధవి.. అన్నాలను.. వారి గొప్ప తత్వాన్ని గురించి ఆలోచిస్తూ నిద్రపోయారు.

ధర్మతేజ.. మాధవి.. ఒకే మంచంపై పడుకొని వారితో తాము గడపిన సమయాన్ని.. వారి మంచి గుణాలను గురించి తలచుకొంటూ.. పార్వతి అన్నాల వివాహం జరిగితే ఎంతో బాగుంటుందనుకొన్నారు.

అరుణోదయం అయింది. అందరూ లేచి తయారైనారు.. టిఫిన్.. కాఫీ.. సేవించిన తర్వాత నారాయణమూర్తి కుటుంబ సభ్యులు శాన్ ఫ్రాన్సిస్కో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు బయలుదేర సిద్ధం అయినారు.

మాధవి.. ఇంద్రజకు పార్వతి చీరలు రవికలతో తాంబూలాలు ఇచ్చింది.

పార్వతి మాధవి పాదాలను తాకింది.

“ఇష్ట కామ్యార్థ ఫల సిద్ధిరస్తు.. సమస్త సన్మంగళాని భవంతు.. ఇష్టమైనవారికి ఇల్లాలివై సర్వ సౌభాగ్యాలతో మామిడి పండంటి బిడ్డలకు తల్లివై.. కనీసం ముగ్గురుతో నిండు నూరేళ్లు దీర్ఘసుమంగళిగా.. వర్థిల్లు తల్లి.” భుజాలు పట్టుకొని లేవనెత్తి కుడిచేతిని పార్వతి తలపై వుంచి మనసారా దీవించింది మాధవి.

‘తండ్రీ!.. సర్వేశ్వరా!.. ఏనాటికైనా పార్వతి నా కోడలు కావాలి..’ అనుకొంది మనస్సున.

ఆ ఉదయం ఆపరేషన్ వుందని అన్నా ఆరుగంటలకల్లా హాస్పటల్‌కు వెళ్లిపోయాడు.

టాక్సీ వచ్చింది..

అందరూ వరండాలోకి వచ్చారు.

“నారాయణా!..”

“చెప్పరా ధర్మా!..”

ధర్మతేజా తన కుడిచేతిని సాచాడు చిరునవ్వుతో.. పార్వతి ముఖంలోకి చూచి నారాయణ ముఖంలోకి చూచాడు.

నారాయణమూర్తి భార్య ఇంద్రజ.. పార్వతుల ముఖంలోకి చూచాడు.

ఇరువురి ముఖాల్లో చిరునవ్వు..

“కాదనకండి.. అన్నయ్యా!..” మెల్లగా దీనంగా చెప్పింది మాధవి.

అందరూ ఆమె ముఖంలోకి చూచారు.

నారాయణమూర్తి చిరునవ్వుతో.. తన కుడిచేతిని ధర్మతేజ చేతిలో వుంచాడు..

“పార్వతి నీ కోడలేరా!..ఆమె ఐ.ఎ.ఎస్. ట్రైనింగ్ చెన్నై ఇండియన్ ఐ.ఎ.ఎస్. అకాడమీ కోచింగ్ సెంటర్లో.. ముగిసిన వెంటనే.. అన్నా పార్వతీల వివాహం జరిపిద్దాం.. సరేనా!..”

“చాలా సంతోషం రా!.. “ ధర్మతేజ నారాయణమూర్తిని తన హృదయానికి హత్తుకొన్నాడు.

“నిన్ను వియ్యంకుడిగా పొందాలంటే.. దానికి ఎంతో యోగం వుండాలిరా!..” పరవశంతో పలికాడు నారాయణమూర్తి.

లక్ష్మి మాధవ్‌లు సూటికేసులను టాక్సీలో ఎక్కించారు.

ధర్మతేజ సెల్ మ్రోగింది.

“హలో.. నాన్నా.. సెల్ అంకుల్‌కి ఇవ్వండి..” చెప్పాడు అన్నా.

ధర్మతేజ సెల్‌ని నారాయణమూర్తికి అందించాడు.

“హలో!.. అంకుల్!.. టేక్ కేర్!.. ఆల్ ది బెస్ట్.. హ్యావ్ నైస్ జర్నీ!..”

“థాంక్యూ అన్నా!..” స్పీకర్‌ని ఆన్ చేసిన కారణంగా అన్నా మాటలను అందరూ విన్నారు.

సెల్‌ని ధర్మతేజకు అందించాడు నారాయణ.

ముగ్గురూ టాక్సీలో కూర్చున్నారు.. టాక్సీ కదలి ముందుకు వెళ్లింది.

పైకెత్తి బై చెప్పిన చేతులతో ధర్మతేజ.. మాధవిలు ఒకరినొకరు చూచుకొన్నారు.

ఇరువురి ముఖాల్లో విచారం.. విరక్తితో కూడిన నవ్వు..

“పద మధూ!.. మనమూ మన డ్యూటీలకు బయలుదేరాలిగా!..” అన్నాడు ధర్మతేజ ఆమెను సమీపించి.

“అవును..”

“నారాయణ.. మాట తప్పడు..”

భార్య భుజంపై చేయి వేసి.. ఆమె ముఖంలోకి చూచి.. కళ్లనుండి కారిన కన్నీటిని తన చూపుడు వ్రేలితో తుడిచాడు

ఇరువురూ లోనికి నడిచారు.

నారాయణమూర్తి వాళ్ల టాక్సీ వెళుతూవుంది. ముందు సీట్లో వున్న నారాయణమూర్తి..

“ఇంద్రజా!..”

“ఏమండీ!..”

“అన్నా!..”

“గొప్ప సంస్కారవంతుడు!.. అతడు మా అల్లుడని చెప్పుకొనేదానికి గొప్ప యోగం వుండాలి..” పార్వతి ముఖంలోకి చూస్తూ చెప్పింది ఇంద్రజ.

“నిజం..” అన్నాడు నారాయణమూర్తి

“ధర్మతేజ అన్నయ్యా!.. వదిన మాధవి.. ఎంతో మంచివాళ్లు..”

“అవునమ్మా! చాలా మంచివారు. అన్నాగారు కూడా ఎంతో మంచివారు..” ఆనందంగా చెప్పాడు మాధవ్. “అమ్మా పార్వతీ!..”

“ఏం.. నాన్నా!”

“ఏమీ మాట్లాడవేం?..”

“నాకు మాట్లాడటానికి ఏముంది నాన్నా.. అమ్మా.. మీరూ మాట్లాడుకొంటున్నారుగా!..” ముక్తసరిగా చిరునవ్వుతో చెప్పింది పార్వతి.

ఇంద్రజ తీక్షణంగా పార్వతి ముఖంలోకి చూచింది. కారణం..”అన్నాతో పెండ్లి జరిపిస్తాము.. మంచి సంబంధం.. అవసరమైతే.. ఆ తర్వాత ఐ.ఎ.ఎస్. చదువుకో..” అన్న తల్లి మాటలకు జవాబుగా పార్వతి.. “అమ్మా!.. ఎన్నోసార్లు చెప్పాను. చివరిసారిగా చెపుతున్నాను.. నా చదువు పూర్తి అయేవరకు ఇకపై నా వివాహ ప్రసక్తిని ఎత్తకు..” ఖండితంగా చాలా ఆవేశంగా జవాబు చెప్పింది.

డ్రైవర్ నూట ఇరవై.. యాభైల మధ్య కారును నడుపుతున్నాడు.

నారాయణమూర్తి.. ఇంద్రజ.. పార్వతి.. బచ్చాగాడు మాధవ్ వారి వారి ఆలోచనల్లో వారున్నారు.

***

“బ్రో.. గుడ్ మార్నింగ్!..”

అన్నా వెనుతిరిగి డాక్టర్ శ్యామ్‌ని చూచి “యస్.. డియర్!.. గుడ్‌మార్నింగ్!..” నవ్వుతూ చెప్పాడు.

శ్యామ్ అన్నాను సమీపించాడు.

“లెటజ్ హ్యావ్ కాఫీ.. శ్యామ్!..”

“ఓకే అన్నా.. పదండి!..”

ఇరువురూ కాఫీ స్టాల్‌కు వెళ్లారు.

టోకెన్ తీసుకొని రెండు కాఫీ కప్పులతో మిత్రులు ఇరువురూ ఎదురెదురుగా కూర్చున్నారు.

శ్యామ్ యం.బి.బి.యస్. వైజాగ్‌లో ముగించి.. యం.యస్. అన్నా చదివిన అమెరికన్ కాలేజీలో ముగించి.. ప్రస్తుతం అన్నాకు జూనియర్‌గా పనిచేస్తున్నాడు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here