[dropcap]“ఈ[/dropcap] రోజు ఆ తిరుపతమ్మ ఆదాయం నాలుగు లక్షలు, మరి మా యమ్మ ఆదాయం నలబై ఏడు రూపాయలు” అని సూరిగాడు వాళ్ళమ్మ బొచ్చలో పడ్డ చిల్లర డబ్బులు లెక్కబెడుతున్నాడు. బడికి వెళ్ళింది ఒక సంవత్సరమే అయినా లెక్కల్లో మిక్కిలి ఘనుడు సూరిగాడు. వాడి వయసిప్పుడు పన్నెండు సంవత్సరాలు.
“అమ్మా..! మనకి ఈ రోజు ఇంక చిల్లర వచ్చేటట్లు లేదే, పద ఇంటికి పోదాం” అని సూరిగాడు వాళ్ళమ్మ నీలమ్మని తొందర పెడుతుంటే ‘మనకి ఇల్లు ఎక్కడుంది రా’ అని ఆ నీలమ్మ మనసులోనే అనుకుంది.
వర్షం వచ్చినా, చీకటి పడినా ఆ తిరుపతమ్మ తల్లి దేవాలయం చుట్టూ ఏ కులానికాకులం వేర్వేరుగా కట్టుకున్న ఏదో ఒక సత్రంలో తల దాచుకునే వాళ్ళు నీలమ్మ, సూరిగాడు.. అక్కడున్న ఇంకా చాలామంది బిచ్చగాళ్లతో పాటు సాధువులతో పాటు.
రోజురోజుకీ ఆ గుడికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతూ ఉంది, వాళ్ళు ఇచ్చే కానుకలతో ఆ గుడి ఆదాయం పెరుగుతుంది. పూజారుల జీతాలు పెరుగుతున్నాయి. కానీ నీలమ్మ సంపాదన మాత్రం రోజురోజుకీ క్షీణించిపోతుంది ఆమె ఆరోగ్యం లాగా. నీలమ్మ ఆ గుడికి వచ్చి ఎనిమిది సంవత్సరాలు అయ్యింది. అప్పుడు సూరిగాడి వయసు నాలుగు సంవత్సరాలు. చాలా పుష్టిగా కళగా ఉండేది వాడి మొఖం, అందుకే మొదట్లో నీలమ్మ ఆదాయం చాలా తక్కువగా ఉండేది. నీలమ్మ వచ్చిన కొత్తలో గుడి దగ్గర బిచ్చగాళ్లు ఐదుగురి కంటే ఎక్కువ ఉండేవారు కాదు. కానీ ఇప్పుడు ఇరవై మంది దాకా ఉన్నారు. అందుకే నీలమ్మ ఆదాయం ఆ కోనేటిలో నీళ్లలాగా తగ్గుతూ వచ్చింది. అడుక్కోవడం మొదలుపెట్టిన కొత్తల్లో ఒకరి ముందుకు వెళ్లి చేయి చాచడం నీలమ్మకి చాలా సిగ్గు అనిపించింది. ఎక్కువ మంది చీదరించుకునే వాళ్ళు, విసుక్కునేవాళ్లు చాలా అవమానంగా ఫీలయ్యేది. ‘మనసు చంపుకుని, నోరు తెరిచి, చేయి చాచి అడుక్కుంటున్నా.. రూపాయి వేయడం లేదు, ఏమీ అడగకపోయినా దండం పెట్టి మరీ ఆ తిరుపతమ్మ తల్లికి వేలకు వేలు కానుకలు సమర్పిస్తున్నారు. ఎలాంటి మనుషులున్నారు ఈ లోకంలో’ అని నీలమ్మ మనసులోనే అనుకుంటూ.. తన కొడుకుతో సహా కోనేటిలో దూకి చనిపోవాలనుకుంది ఆ రాత్రి!
ఆ మరునాటి నుండి సూరిగాడే చిన్నగా మనుషుల దగ్గరికి వెళ్లి అడుక్కోవడం నేర్చుకున్నాడు. చాలా దీనంగా, హీనంగా పెట్టేవాడు ముఖం. వాడి ముఖం చూసి డబ్బులు వెయ్యనోడు లేడు ఇప్పటి వరకు. చాలా పట్టుదల గల పిల్లోడు. ఇప్పుడు సూరిగాడు అడుక్కోవడంలో ఆరితేరిపోయాడు. వాళ్ళమ్మని మించిపోయాడు. ఇంకా చెప్పాలంటే అక్కడున్న వాళ్ళందరి కంటే సూరిగాడే ఎక్కువ సంపాదిస్తున్నాడు. అక్కడున్న అడుక్కునే వాళ్ళందరికీ వాడే సెలబ్రిటీ. సూరిగాడికి వచ్చిన ఈ కీర్తిని చూసి జాలిపడాలో, ఆనందపడాలో, బాధపడాలో నీలమ్మకి అర్థం కావడం లేదు.
ఒకరోజు ఎవరో మంత్రిగారు వస్తున్నారని ఆ గుడి ప్రాంగణంలో ఉన్న బిచ్చగాళ్ళని ఖాళీ చేయిస్తున్నాడు.. ఆ ఊరికి కొత్తగా వచ్చిన కుర్ర ఎస్సై వీరాంజనేయులు గారు.
“అన్నా మేము ఈ రోజు అడుక్కోకపోతే మాకు అన్నం ఎట్లా వస్తదన్నా..?” అని సూరిగాడు అక్కడున్న కానిస్టేబుల్‌కి ఎదురు తిరిగాడు.
“ఈ ఒక్కరోజు తినకపోతే ఏం చస్తారా? పస్తులు ఉండండి” అని కుర్ర ఎస్సై గారు వాళ్లను చీదరించుకుంటుంటే.. “ఆస్తులు ఉన్నోళ్లు పస్తులు ఉంటారు సార్. మాకేం కర్మ? పస్తులు ఉండటానికి “అని సూరిగాడు వాగేసరికి ఆ కుర్ర ఎస్సై కోపం కర్రలోకి వచ్చి లాఠీతో వాడి పిర్ర మీద ఒక్కటి చరిచాడు. సూరిగాడు ఏడ్చుకుంటూ పరిగెత్తుకు వచ్చి వాళ్ళమ్మ ఒడిలో పడ్డాడు. అక్కడున్న ముసలి ముతకనంతా బలవంతంగా ఖాళీ చేయించారు పోలీసులు .
ఏదో సమాజంలో ఉన్న కుళ్ళుని కడిగేసినట్టు ఆ ఎస్ఐ వీరాంజనేయులు చాటుగా వచ్చి సిగరెట్ తాగుతున్నాడు. గుడిలో నుండి వచ్చిన ధూపం, ఈ సిగరెట్ పొగా.. రెండు గాలిలో కలిసి పోట్లాడుకుంటున్నాయి.
“ఈడి జిమ్మడి పోను, ఈడికేం పోయేకాలం? ఆ మంత్రి ముండాకొడుకు ఇప్పుడే ఎందుకు రావాలా..?మనం ఎప్పుడు ఈడనే ఉంటాం, ఆ మంత్రి ఎప్పుడో ఒకసారి వస్తాడు, వాడి కోసం మనం ఎందుకు ఖాళీ చేయాల..?”
“మనం ప్రజల దగ్గర చేయి చాచి డబ్బులు అడుక్కుంటాం, ఆళ్ళు చేతులు ఎత్తి మరీ ఓట్లు అడుక్కుంటారు. గెలిచాక ప్రజలకి చేయి చూపిస్తారు. మామూలు చేయి కాదు, మొండి చెయ్యి. మనం కాదు అసలు సిసలైన బిచ్చగాళ్లు.. వాళ్లు”.
“గెలిచేది ఒకడే, కానీ గెలిపించేది ఎంతమంది? ఎవరికి ఎక్కువ బలం ఉండాలి? అమాయకమైన ప్రజలు ఉన్నంతకాలం వాళ్ళ ఆటలు సాగుతూనే ఉంటాయి. అన్యాయం అందలమెక్కితే.. అవినీతి రాజ్యమేలుతుంది. అధర్మం.. ధర్మాన్ని నడిపిస్తుంది.” అని అక్కడున్న ముసలి వాళ్ళందరూ మాట్లాడుకుంటుంటే ఇదంతా విన్న సూరిగాడికి ఏమీ అర్థం కావట్లేదు.
“మా..! మనం ఈ ఒక్కరోజు ఊళ్లోకి వెళ్లి అడుక్కుందాం” అంటూ సూరిగాడు పౌరుషంతో లేచి నిలబడ్డాడు. “అంత దూరం నేను రాలేను రా.. అయినా ఈ గుడి తలుపులన్నా భక్తుల కోసం తీసి ఉంచుతారు, ఊళ్లోకి వెళ్లి ఏ ఇంటి మందన్నా నిలుచుంటే అన్నీ తలుపులు మూసేసి ఉంటాయి. బయటికి వెళ్ళేటప్పుడు కదా తలుపులు మూసుకోవాల్సింది!?. కొంతమంది అయితే ఇంట్లోనే ఉండి బయట తాళం వేసుకుంటారు. ఎంత పిలిచినా పలకరు. కొంతమంది అయితే మన అరుపు వినగానే టీవీలో సౌండ్ పెంచుతారు. పోనీ.. బజారుకు వెళ్లి షాపుల దగ్గరన్నా అడుక్కుందామా.. అంటే చప్పట్లు కొట్టే బాపతు ఎక్కువయ్యారు. వాళ్ళు చేసే దౌర్జన్యాలకి భయపడి, ఆ షాపుల వాళ్లు మనల్ని దగ్గరకు కూడా రానివ్వరు. ఊళ్లో మనం బ్రతకలేం రా… సూరి. మన మెతుకులు ఈ గుడిలోనే పుడతాయి. మన బతుకులు ఈ గుళ్లోనే తెల్లవారుతాయి” అని నీలమ్మ నీరసంగా పైట చెంగుతో ముఖానికి పట్టిన చెమటను చెరిపేసింది.
“ఇంకా ఎన్నాళ్ళు ఈ గుడినే నమ్ముకొని ఇక్కడ ఉంటాం. మా.. ఎక్కడికైనా వెళదాం, ఏదైనా పని చేసుకుందాం, మన కాళ్ళ మీద మనం నిలబడదాం” అని సూరిగాడు పౌరుషంగా మాట్లాడుతుంటే వాడి కాళ్ళ వైపు చూసిన నీలమ్మ కంట్లో నుండి నీరు బయటకు రాకుండా జాగ్రత్తపడి చాలా సేపు ఏడ్చింది.
“ఏ దిక్కు లేని వాళ్ళకి ఆ దేవుడే దిక్కు. మనం ఇప్పుడు ఆ దేవుడి దగ్గరే ఉన్నాం. ఇంక ఏ దిక్కుకి వెళ్లాల్సిన అవసరం లేదు. అయినా.. నాకు ఒక మొక్కు ఉంది. అది ఈ తిరుపతమ్మ తల్లి తీర్చేదాకా, నేను ఇక్కడే ఉంటానని ఈ తల్లికే మొక్కుకున్నా! నేను ఎక్కడికీ రాను. కావాలంటే నీ వెళ్ళిపో, ఎక్కడికైనా పోయి హాయిగా బ్రతుకు” అని నీలమ్మ పైట కొంగులో మూట కట్టిన మూడు వేల రూపాయల చిల్లరని సూరిగాడికి ఇవ్వబోతుంటే.. సూరిగాడు నేలమ్మని గట్టిగా పట్టుకొని ఏడ్చేసినాడు.
చాలాసేపు ఏడ్చి ఏడ్చి ఆదమరిచి అక్కడే నిద్రపోయాడు .
వాళ్ళమ్మ నీలమ్మ అక్కడ జరిగే తంతునంత గమనిస్తా ఉంది.
మంత్రిగారు వచ్చారు. ఆయన వెనకాలే పది జీపులు వచ్చాయి. పోలీసులు దిగారు. హడావుడి చేస్తున్నారు. గుడిలో ఉన్న పూజారులు.. వాళ్ళ రెండో పెళ్ళాంతో పాటు దిగిన మంత్రిగారికి ఎదురెళ్లి మరీ నమస్కరించి, మెడలో పూలమాలలు వేసి, వంగి వంగి దండాలు పెడుతున్నారు. ఆ మంత్రి గారి వెనకాలే ఒక నలుగురు మనుషులు ఒక పెద్ద మూట తీసుకొచ్చి అమ్మవారి ముందు ఉంచారు. అక్కడున్న పెద్ద పూజారి, మంత్రి గారి చేత టెంకాయ కొట్టించి, నుదుటిన కుంకం పెట్టి, హారతి ఇచ్చి, ప్రసాదం మాత్రం మంత్రి గారి రెండో భార్య అయిన వసుంధరా దేవికి ఇచ్చారు.
అక్కడున్న భక్తులందరూ ఒక పక్కన నిలుచున్నారు. అందరూ ఆ మూట వైపే ఆసక్తిగా చూస్తున్నారు. మంత్రి గారు మూట విప్పమని తన సిబ్బందికి సైగ చేశారు. వాళ్లు మూటను విప్పటం ఆరంభించారు. ఒక్కసారిగా అప్పటిదాకా కిక్కిరిసిపోయి, ఊపిరాడక, ఇరుకు ఇరుకుగా ఉన్న నోట్ల కట్టలు చమటలు కక్కుతూ బయటపడ్డాయి బతుకు జీవుడా అంటూ. “పూజారిగారూ.. ఈ డబ్బు మొత్తం పది కోట్లు, ఈ డబ్బుతో అమ్మవారిని అలంకరించండి” అని మంత్రి చెప్పడంతో.. ‘ఒక అరగంట సమయం పడుతుంద’ని పూజారి చెప్పారు.
“సరే అయిన తర్వాత పిలవండి” అని మంత్రి గారు, ఆయన రెండో ఆవిడ వసుంధరతో కలిసి ఆలయ సిబ్బందికి ఉండే ఆఫీస్ రూంలోకి వెళ్లిపోయారు. వసుంధర గారు అన్ని తాను ఇక్కడ ఉండి జాగ్రత్తగా చూసుకుంటాను డబ్బుతో పని కదా! అని ఆవిడ అన్నా కూడా వినకుండా ఆఫీసు రూమ్‌లోకి వెళ్లిన మంత్రిగారు మొబైల్లో వీడియో గేమ్ ఆడుకుంటుంటే..! వసుంధర దేవి మనసు మొత్తం ఆ డబ్బు చుట్టే తిరుగుతుంది.
ఆలయ సిబ్బంది అలంకరణ ప్రారంభించారు. అక్కడున్న భక్తులందరూ నోరెళ్ళ బెట్టి ఆసక్తిగా తిలకిస్తున్నారు ఆ ఘట్టాన్ని. ఎప్పుడు వచ్చాడో తెలియదు కానీ సూరిగాడు ఇదంతా చూస్తూ అలాగే ఉండిపోయాడు కళ్ళు పెద్దవి చేసి.
అలంకరణ పూర్తయిందని ఆలయ సిబ్బంది చెప్పడంతో వీడియో గేమ్‌ను మధ్యలోనే ఆపేసి వసుంధరా దేవితో కలిసి అమ్మవారి దగ్గరికి వచ్చి సెల్ఫీలు తీసుకోవడం ప్రారంభించారు సదరు మంత్రిగారు.
మీడియా ప్రతినిధులు ఇదంతా కవర్ చేస్తున్నారు. గుడి బయటకు వచ్చిన మంత్రి గారు మీడియా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా అక్కడి నుండి వెళ్లిపోయారు. తుఫాను వచ్చి వెళ్లినట్టుంది. ఆ ఆలయ ప్రాంగణం చాలా ప్రశాంతంగా, విశాలంగా ఉంది ఇప్పుడు.
ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమయ్యారు.
బిచ్చగాళ్ళందరూ ఆకలితో సేద తీరుతున్న ఆ సత్రం ముందుకి ఒక వ్యాన్ వచ్చి ఆగింది. ఆ వ్యానులో నుండి ముగ్గురు పోలీసులు దిగారు. వాళ్ళ వెనకాలే కుర్ర ఎస్సై వీరాంజనేయులు దిగి మైకు పట్టుకొని “దయచేసి అందరూ ఇక్కడికి రండి, ఈరోజు మీకు షడ్రుచులతో భోజనం పెడుతున్నాం” అని అరుస్తున్నాడు. అక్కడున్న బిచ్చగాళ్ళందరూ పొద్దున్న లాఠీలతో తరిమిన ఆ ఎస్ఐ గారేనా ఇప్పుడు మనల్ని పిలుస్తుంది? అని ఆశ్చర్యపోయి ఆలోచిస్తూ.., అడుగులో అడుగు వేస్తూ.., నెమ్మదిగా తమ బొచ్చెలు తీసుకొని లైన్‌లో నిలబడ్డారు. కానిస్టేబుల్లందరూ అన్నం గిన్నెలు క్రిందకి దించి వాళ్ళు అడిగినంత పెడుతున్నారు. అదే లైన్లో సూరిగాడు, నేలమ్మ కూడా నిలబడ్డారు. సూరిగాడిని చూసిన ఎస్ఐ వాడి బుగ్గ మీద గిల్లాడు. బుగ్గ ఎర్రగా కందిపోయింది. పొద్దున పిర్ర ఎంత ఎర్రగా కందిందో ఇప్పుడు అంత ఎర్రగా కందింది వాడి బుగ్గ.
అప్పటికే చీకటి పడింది. చాలా రోజుల తర్వాత సంతృప్తిగా భోజనం చేశారేమో! అందరూ ఆదమరచి నిద్రపోతున్నారు. అమావాస్య వెళ్లి ఐదు రోజులైంది. చంద్రుడు ఇప్పుడిప్పుడే లావెక్కుతున్నాడు. అప్పుడే సగం దూరం వచ్చాడు ఆకాశంలో.. త్వరగా ఇంటికెళ్లాలనే హడావుడితో. ఇంతలో సూరిగాడికి మెలకువ వచ్చింది. చుట్టూ చూసాడు, వాళ్ళమ్మని లేపాడు. చిన్నగా చేయి పట్టుకొని లాక్కొచ్చి గుడి దగ్గరికి తీసుకువచ్చాడు. “మా.. చూడమ్మా! ఆ తిరుపతమ్మ తల్లి నోట్ల కట్టలు అలంకరించుకొని ఎట్టా వెలిగిపోతుందో.. మా డబ్బంటే దేవతలకి కూడాను ఇష్టమేనా? ఎందుకంటే పొద్దున్నుండి ఈ తిరుపతమ్మ తల్లి నవ్వుతానే ఉన్నది” అని సూరిగాడు వాళ్ళ అమ్మ వైపు చూశాడు. నీలమ్మ తలదించుకుంది. “ఏందమ్మా.. ఈడ దాకా వచ్చి ఆ తల్లిని చూడకుండా తలదించుకుంటావు? తలెత్తి పైకి చూడమ్మా” అని వాళ్ళమ్మ తలపైకె త్తాడు. నీలమ్మ కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి. ఆ తిరుపతమ్మ తల్లి వైభవాన్ని చూడలేని నీలమ్మ కళ్ళు నీలి మేఘాలు వర్షించినట్టు కుండపోతగా వర్షిస్తున్నాయి.
“అమ్మా.. నాకు ఒక ఆలోచన వచ్చిందే!” చెప్పు అన్నట్టుగా నీలమ్మ సూరిగాడి వైపు చూసింది. “మనం ఇంకా ఎన్ని రోజులు ఈ గుడి బయట అడుక్కుంటాం? ఎప్పటికీ ఇలాగే ఉండిపోతామా? మనం చేయి చాచి అడుక్కుంటున్నా గానీ మన బొచ్చెలో ఒక రూపాయి రాల్చరు. ఏమీ అడగకుండానే మరెందుకు ఆ తిరుపతమ్మ తల్లికి కోట్లకి కోట్లు కానుకలు ఇస్తున్నారు. అడిగేవాళ్లు ఎప్పుడు చులకనేగా మా ఈ లోకానికి..!” అని వాళ్ళ అమ్మ వైపు చూసి “మా అక్కడ చూడు గుళ్లో ఎవరూ లేరు, తిరుపతమ్మ తల్లి నిండా నోట్ల దండలు వేలాడుతున్నాయి, మెల్లగా వెళ్లి నాలుగు దండాలు తెచ్చుకుందాం, ఎక్కడికైనా పారిపోదాం, మనం మంచి ఇల్లు కట్టుకుందాం, నేను బడికి పోతా.. చెప్పమ్మా.. చెప్పు! నువ్వేమంటావు” అని సూరిగాడు అనడంతోనే వాళ్ళమ్మ సూరిగాడి చెంప మీద చెల్లున కొట్టింది. దెబ్బకి అదిరిపడ్డాడు సూరిగాడు. ఇందాక నీలమ్మ కంట్లో ఉన్న ఎరుపు ఇప్పుడు సూరిగాడి చెంప మీదకి రవాణా అయింది. “జీవితాంతం అడుక్కోనైనా సరే నిన్ను పోషిస్తాను కానీ, ఆ పని మాత్రం చేయను..!” అంది. సూరిగాడు కాస్త తేరుకొని “మా.. అందులో తప్పేముంది. అది దొంగ డబ్బేనంట! ఆ మంత్రిగాడు ఎన్నో స్కాములు చేసి సంపాదించాడట! ఇందాక ఎస్సై తన కానిస్టేబుల్‌తో చెప్తుంటే విన్నాను.” అన్నాడు. “ఒకసారి దొంగతనం చేయబడ్డ డబ్బుని మళ్లీ మనం ఎలా దొంగతనం చేస్తాం రా..? అలా చేస్తే వాడికి మనకి తేడా లేదురా… అది ఎంగిలి కాబడ్డ సొమ్ము, చేయి చాచి అడగొచ్చు కానీ, చేతిలోనికి లాక్కోకూడదు” అని నీలమ్మ అక్కడనుండి కొంచెం దూరం వెళ్లి చీకట్లో ఉన్న చెట్టు కింద కూర్చుంది. అప్పటికే చంద్రుడు ఆకాశాన్ని వదిలి వెళ్ళిపోయాడు.
నెమ్మదిగా సూరిగాడు తల్లి దగ్గరకు వచ్చి ఒడిలో పడుకున్నాడు. చుట్టూ చిమ్మ చీకటి. కన్ను పొడుచుకున్నా కానరాని చీకటి. పురుగులు తమ తమ వింత శబ్దాలతో సంగీతాన్ని అవలీలగా సృష్టిస్తున్నాయి. అప్పుడే ఒక గుడ్లగూబ వచ్చి ఆ చెట్టు మీద వాలింది. వీళ్లిద్దరిని గుడ్లప్పగించి చూస్తుంది. ఎటు వీచాలో తెలియక గాలి తికమకపడుతోంది.
“మా.. మనం తెల్లారే దాకా ఇక్కడే ఉంటామా”
“మన జీవితాలు తెల్లారే దాకా మనం ఇక్కడే ఉంటాం, ఎక్కడికి పోము” అని నీలమ్మ అంటే “ఎందుకు మా.. నీకు ఈ గుడి అంటే అంత ఇష్టం” అని సూరిగాడు అడుగుతుండగా నీలమ్మ ఒక్కసారిగా ఒడిలో ఉన్న సూరిగాడిని లేపి పక్కన కూర్చోబెట్టుకుంది. చాలాసేపు ఏం మాట్లాడలేదు నీలమ్మ. నిశీధిలో ఎంత నిశ్శబ్దం ఉందో ఆమె గుండెల్లో అంత ప్రళయం ఉంది. ఉన్నట్టుండి ఆకాశంలో ఉరుములు మెరుపులు మొదలయినాయి. సన్నగా వర్షం మొదలైంది. అక్కడున్న ఆ చెట్టు.. చేతులు చాపి నీలమ్మని, సూరిగాడిని వర్షంలో తడవకుండా ఆపగలిగింది చాలాసేపు. మేఘాలన్నీ కూడబలుక్కొని తమ కోపాన్ని వర్ష రూపంలో విసర్జించాయి. నీలమ్మ, సూరిగాడు పూర్తిగా తడిసి ముద్దయ్యారు. అయినా కూడా ఎక్కడికి కదలలేదు. వర్షం పడుతూనే ఉంది. నీలమ్మ నోరు విప్పింది..
“నేను, మీ నాన్న ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. మా ఇద్దరిదీ పక్కపక్క ఊరు. నేను కూలి పనులకి వెళ్తుండే దాన్ని. మా నాన్నకి నేనొక్కదాన్నే సంతానం. మీ నాన్న ఆటోడ్రైవర్. ఒకరోజు మా ఊరు వచ్చాడు కూలీలను ఎక్కించుకోవడానికి. అందులో నేను కూడా ఉన్నాను. అలా మా ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. కూలి పనులు లేకపోయినా నన్ను చూడటానికే మీ నాన్న ఆటో ఏసుకొని మా ఊరు వచ్చేవాడు. ఈ విషయం చాలా తొందరగానే మా ఇంట్లో గ్రహించి పెళ్లికి ఏర్పాట్లు చేశారు. మీ నాన్న, నేను ఉన్నంతలోనే ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్నాం. ఏడాదికి నువ్వు పుట్టావు. ఆ తరువాత ఏడాదికి తిరుపతమ్మ పుట్టింది. మా పెళ్లి ఈ తిరుపతమ్మ గుడిలోనే జరిగింది. అందుకే ఆ తల్లి పేరే నీ చెల్లికి పెట్టాం. ప్రతి ఆదివారం ఈ తల్లికి ఒక కోడిని కోసి నైవేద్యం పెట్టి మొక్కులు తీర్చుకునే వాళ్ళం.
ఆ ఆదివారం కూడా మొక్కు తీర్చుకోవడానికి నువ్వు, నేను, మీ నాన్న, నీ చెల్లి అందరం ఆటోలో బయలుదేరాం. ఆవేళ కాస్త ఆలస్యమైంది. సూర్యుడు భగభగ మండుతున్నాడు, అప్పటికే నడి నెత్తి మీదకి వచ్చేసాడు. ఇంతలో ఒక పెద్ద శబ్దం..!
ఎదురుగా వచ్చిన ఒక పెద్ద కారు మన ఆటోని గుద్దేసి చాలా దూరం లాక్కొని పోయింది. ఆ తరువాత ఏం జరిగిందో తెలియదు. నెలరోజులు ఆసుపత్రిలో స్పృహ లేకుండా ఉన్నాను. తిరిగి వచ్చేసరికి నాకు అసలు విషయం తెలిసింది. ఆ ప్రమాదంలో మీ నాన్న, చెల్లి చనిపోయారని. నువ్వు నేను మాత్రమే మిగిలాం. బలివ్వటానికి తెచ్చిన కోడి ఏమైందో నాకు తెలియదు.
కారులో ఉన్నోళ్ళకి ఏమీ కాలేదంట. అవేవో బ్యాగులు తెరుచుకున్నాయి కాబట్టి చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారట. వాళ్లు బాగా డబ్బున్నవాళ్లంట. అందులో ఒకడు ఎమ్మెల్యే కొడుకంట. వాళ్లతో పాటు ఇద్దరు ఆడపిల్లలు కూడా ఉన్నారంట. ఆ ఆదివారం బాగా తాగేసి మన ఆటోను గుద్దారట. ఇదంతా నాకు మీ పెదనాన్న చెప్పాడు. వాళ్ళ ఆనందం మనకు దుఃఖాన్ని మిగిల్చింది. వాళ్ళ మత్తు మన జీవితాన్ని చిత్తుచిత్తు చేసింది. మన జీవితం తలకిందులైంది.
అప్పటినుండి ఈ తిరుపతమ్మ తల్లి మీద కోపం నాకు. ఆ తల్లి.. గుడిలో నుండి బయటికి వస్తే ఎందుకు ఇలా చేసావని అడుగుదామని కసి, బాధ. కానీ ఈ మహాతల్లి ఎప్పుడు ఆ నాలుగు గోడల మధ్య కూర్చొని పూజలు అందుకుంటూనే ఉంది. ఆ తల్లికి ఎన్ని మొక్కులు తీర్చాం ఎన్ని కానుకలు సమర్పించాం, ఎన్ని మూగజీవాలను బలిచ్చాం, ఎంత రక్తం చిందించాం. ఆవిడని చూడడానికే కదా బయలుదేరాం, మరి ఎందుకు ఇలా చేసింది ఆ తల్లి? అందుకే కోపం నాకు ఈ తల్లి మీద. మనం బ్రతికి ఉండటానికి ఒక్కొక్కసారి ప్రేమే కారణం కాకపోవచ్చు. కోపం కూడా మనిషిని బ్రతికిస్తుంది. అందుకే ఈ తల్లి దగ్గరే ఉంటున్నాను. ఏనాటికైనా నా ప్రశ్నలకు జవాబులు చెప్పకపోతుందా అని! నేను చచ్చేవరకు ఈ తల్లి దగ్గరే ఉంటాను. నా చావు కూడా ఈ తల్లి చూడాలా..! అదే నా చివరి కోరిక!” అని నీలమ్మ వెక్కివెక్కి ఏడుస్తుంటే, వాళ్ళ అమ్మను ఎట్టా సముదాయించాలో తెలియక సూరిగాడు దిక్కులు చూస్తున్నాడు. వర్షం వెలిసి చాలా సేపు అయింది. ఇప్పుడిప్పుడే తూర్పు దిక్కు చీకటిని తరిమికొడతా ఉంది. మెల్లగా పక్షులన్నీ రెక్కలు విదిలించుకుంటున్నాయి. గుడిలో పాటలు మొదలయినాయి. ఒక ఆవులమంద అటుగా వెళుతుంది మేత కోసం.
నెమ్మదిగా లేచి నిలబడింది నీలమ్మ. కొడుకుని నిలబెట్టి సంకలో కర్ర పెట్టి బయలుదేరింది నీలమ్మ. వెనకాలే సూరిగాడు ఉన్న ఒక్క కాలితోనే నడుచుకుంటూ పోతున్నాడు. అప్పుడు జరిగిన ప్రమాదంలో సూరిగాడికి ఒక కాలు పోయింది.
ఎందుకో ఆ రోజు నీలమ్మ, సూరిగాడు శుభ్రంగా తలస్నానం చేసి కొత్త బట్టలు కట్టుకొని గుడిలోకి వెళ్లి తిరుపతమ్మ తల్లికి దండం పెట్టుకున్నారు. “నాకు ఒక కాలు తీసేసి చాలా మంచి పని చేశావు తల్లీ, లేకపోతే ఎవరూ నాకు బిచ్చం కూడా వేసే వాళ్ళు కాదు, మా అమ్మకి ఇంత తిండి పెట్టలేక పోయేవాడిని. అందుకు నీకు వేల దండాలు” అని సూరిగాడు ఆ తిరుపతమ్మ తల్లి ముందు ఒక కాలితోనే బోర్లాపడి నమస్కరిస్తున్నాడు. ఇదంతా ఆ తిరుపతమ్మ తల్లికి వినపడలేదు. కానీ నీలమ్మ కంట్లో కన్నీరు జలపాతం అయింది. నీలమ్మ సూరిగాడిని గట్టిగా హత్తుకొని, ఎత్తుకొని బయటకు తీసుకువచ్చింది.
ఆ గుడిలో ఆ నవరాత్రులు ముగిసిన సందర్భంగా హుండీలో పడిన కానుకలను లెక్కిస్తున్నారు.
గుడి బయట కూర్చున్న బిచ్చగాళ్లు ఎవరు బొచ్చెలో ఎంత చిల్లర పడిందో మరలా మరలా లెక్క పెట్టుకుంటున్నారు.
అక్కడ ఆ తిరుపతమ్మ ఆదాయం 1,50,32,476 రూపాయలుగా లెక్క తేలింది. ఇక్కడ మాత్రం సాయంత్రం అయినా లెక్క తెమలడం లేదు.
అమ్మవారి హుండీలో వేసే నోట్లు ఏ శబ్దం చేయడం లేదు. కానీ బిచ్చగాళ్ల బొచ్చెల్లో భక్తులు వేసే చిల్లర మాత్రం బాగా శబ్దాన్ని చేస్తుంది.
అలా చేసే శబ్దాన్ని గుడిలో ఉన్న తిరుపతమ్మ తల్లి నిశ్శబ్దంగా వింటుంది.
నిశ్శబ్దంలో కూడా ఏదో శబ్దం ఉంది.