మార్పు మన(సు)తోనే మొదలు-4

0
3

[ప్రసిద్ధ రచయిత్రి డా. చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి రచించిన ‘మార్పు మన(సు)తోనే మొదలు’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము. తెలుగులో మానసిక ఆరోగ్యం కేంద్రంగా రచించిన నవల ఇది.]

[ప్రభాత్ భార్య మృగనయని తన భర్త మానసిక సమస్యల గురించి డా. గగన్‌కి చెప్తూ ఉంటుంది. త్వరితంగా ప్రమోషన్లు పొందిన ప్రభాత్‌ ఒక బ్యాంకు సర్‍ప్రెజ్‌ చెక్‌కి వెళ్తాడు. అక్కడ క్యాష్ తగ్గుతుంది. మేనేజరు, క్యాషియర్ ఏదో మాయ చేసి ప్రభాత్‌ని నమ్మిస్తారు. తర్వాత వాళ్ళిద్దరూ చేసిన మోసం ప్రభాత్‌కి తెలుస్తుంది. అప్పటి నుంచి మానసికంగా క్రుంగిపోతాడు. అందరిపై అపనమ్మకం పెంచుకుంటాడు. బూతులు తిడతాడు. విపరీత ప్రవర్తన మొదలుపెడతాడు. ఈ వివరాలన్నీ చెప్పి తన భర్తకి నయమయ్యే అవకాశం ఉందా అని గగన్‍ని అడుగుతుంది మృగనయని. తన చెల్లెలు తార స్నేహితురాలైన ఆమెకి సాయం చేయాలనుకుంటాడు గగన్. ముందు ఒకసారి ప్రభాత్‌ని చూడాలని అంటాడు. ఓ బంధువు ఇంట్లో ప్రభాత్‌ని కలుస్తాడు. అతడిని జాగ్రత్త పరిశీలిస్తాడు గగన్. ప్రభాత్ స్కిజోఫ్రేనియా అనే తీవ్ర మానసిక రోగగ్రస్థుడని అతనికి రూఢి అయింది. అందుకని మృగనయనితో చర్చింది – ప్రభాత్‌కి తెలియకుండా తినే ఆహరంలో కలిపే మందులు ఇస్తాడు. ప్రభాత్‌లో కొద్దిగా మార్పు కనిపించేసరికి మందుల మోతాదు తగ్గిస్తాడు. అయితే రెండో నెలలో ప్రభాత్‌కి సరిగ్గా మందులు ఇవ్వలేకపోతుంది మృగనయని. – ఇక చదవండి.]

[dropcap]గ[/dropcap]గన్ ఆలోచనలో పడ్డాడు. “భోజనానికి అతిథులని పిలవకుండా మేనేజ్ చేయలేరా?” అడిగాడు. “వచ్చిన వాళ్ళు చిరకాల స్నేహితులు. భోజనాలు, వగైరా హడావుళ్ళు లేకుండా ఎప్పుడూ ఉండదు, ప్చ్”, నిట్టూర్చిందామె. మళ్ళీ తనే, “అంత సన్నిహితులు కదా, పోనీ దాపరికం లేకుండా చెప్పేస్తేనో?” అంది.

గగన్ వెంటనే, “ఆ పని మాత్రం చేయద్దు చెల్లెమ్మా! ఎంత తెలిసిన వాళ్ళకైనా, మానసిక రోగాల ప్రస్తావన రాగానే ముఖంలో రంగులు మారిపోతాయి. ‘నాకు బైపాస్ సర్జరీ జరిగిం’దంటే నా కోసం ప్రార్థనలు చేసే మనుషులు, ‘ఈ మధ్య నాకు తిక్కతిక్కగా ఉంది. అందుకే మానసిక వైద్యుణ్ణి కలిసి వస్తున్నాను’, అంటే మొహం అటు తిప్పేసుకుంటారు.

అందుకని స్నేహాన్నీ, రహస్యాలని కలిపి, బాధ అనే విషాన్ని కోరి తయారుచేసుకోకండి”, అన్నాడు. ఆమె మౌనం వహించింది. ఆ మౌనం సంతాప సూచకంగా అనిపించి, ఇబ్బంది పడ్డాడు గగన్. ఈ విచిత్ర సంక్షోభంలోంచి బయటపడడానికి మంచి దారి వెతకసాగాడు.

త్వరగా మంచి ఆలోచన వచ్చి, చిటికేసి, “పోనీ ఇంకో పని చేద్దాం. మీ ఊళ్ళో మా బాచ్‌మేట్ నందన్ ఒక మల్టీస్పెషాలిటీ హాస్పిటల్లో ప్రైవేటు ప్రాక్టీసు మొదలెట్టాడు. విజిటింగ్ కార్డు ఎక్కడ పెట్టానబ్బా..”, అని కొన్ని క్షణాలపాటు ఆలోచించి, జేబులోంచి వాలెట్ తీసి, ఆ కార్డు తీసి, మృగనయనికిచ్చాడు. “అది జాగ్రత్తగా అట్టేపెట్టండి. ప్రభాత్ కళ్ళకి కనబడకుండా దాచండి.

ప్రైవేటు ఆసుపత్రి కనుక వాళ్ళు పేషంట్ల గౌరవం కాపాడడం కోసం బయట డాక్టర్ పేరు గానీ, స్పెషాలిటీ గానీ రాయరుట. నందన్‌ని ఒక న్యూరాలజిస్ట్‌గా పరిచయం చేయండి. ఈ మధ్య నీరసం ఎక్కువగా ఉంది గనుక నరాల బలహీనతకి ఏమైనా మందులు వాడాలేమో అని చెప్పి, అతని దగ్గరకి తీసుకుని వెళ్ళండి.

ఆయన ఇంజెక్షన్ ఇస్తారు. నెలకొకసారి పుచ్చుకోవాలి. మధ్యలో మందులు ఎప్పుడైనా మానెయ్యవలసిన అవసరం వస్తే, ఆ ఇంజెక్షన్ కాపు కాస్తుంది. అలా అని అసలు మందులివ్వడం మానేస్తే రిస్క్ సుమండీ! మరో విషయం – ఇక నుండీ ప్రభాత్ బాగోగులు నందన్ చూసుకుంటాడు”, అన్నాడు. “సరేనండీ. మీరు చేసిన మేలు మరువను అన్నయ్యా”, అంది మృగనయని.

***

“డాక్టర్ నందన్ సైకియాట్రిస్టు అని ఆయనకి తెలిసిపోయిందన్నయ్యా!” ఫోన్లో అరిచినంత పని చేసింది మృగనయని. గతుక్కుమన్నాడు గగన్. “ఎలాగమ్మా?” అడిగాడు ఆదుర్దాగా. “ఒక రోజు ఆయనంతటాయనే డాక్టర్ నందన్ అపాయింట్మెంట్ తీసుకుంటానని నన్ను ఫోన్ నెంబర్ అడిగారు. పరాకుగా ఉన్న నేను హాస్పిటల్ నెంబర్ చెప్పేశాను.

“నా ఎదురుగుండానే, ‘నాకివ్వాళ న్యూరాలజిస్ట్ నందన్ గారితో అపాయింట్మెంట్ ఇస్తారా?’ అని అడిగారు. వాళ్ళేమన్నారోగాని, ‘సారీ’, అని ఫోన్ పెట్టేసి, ‘నిజం చెప్పు, ఎవరి వల్ల నువ్వు నన్నీ పిచ్చిడాక్టర్ గాడి దగ్గరకు తీసుకుని వెళ్ళావ్?’ అని గద్దించారు. నాకు నోటమాట రాలేదు. ఆయన మళ్ళీ అరిచారు. ఈ మధ్యనే చనిపోయిన మా దూరపు బంధువు పేరు చెప్పి తప్పించుకున్నాను. వాళ్ళకీ, మాకూ రాకపోకలుండవు. ఇప్పుడెలాగండీ?” అని అడిగింది మృగనయని.

“ఏముంది, మళ్ళీ యథాప్రకారం ప్రతీ నెలా కలిసే ఏర్పాటు చేసుకోవాలి”, అన్నాడు గగన్. ఇదైన కొన్నాళ్ళకి మృగనయని తనే ఫోన్ చేసి, ప్రభాత్‌కి వేరే ఊరికి బదిలీ అయిందని, ఆ ఊళ్ళో రవి అనే తన చిన్ననాటి స్నేహితుడు తారసిల్లాడని, అతడు కూడా సైకియాట్రిస్టని, ఇకపై ప్రభాత్ విషయంలో అతని సహాయం తీసుకుంటుందని చెప్పింది. ప్రభాత్‌కి క్రమం తప్పకుండా మందులు అంది, రోగం నుండి ఊరట లభిస్తుందని ఆశ పడ్డాడు తను.

***

గతంలోంచి బయటకి వచ్చి, తను ఇంటికి బయలుదేరబోతున్నప్పుడు ‘చంద్రముఖి’, ఆమె అన్నయ్య వచ్చారు. అతను, “సార్, ఎందుకో తెలియదు గాని, ఈ మధ్య మా మల్లి తన విపరీత ప్రవర్తన గురించి బాధ వ్యక్తం చేస్తోంది. ఆమెతో మీరే మాటలాడండి”, అన్నాడు ఆమె అన్న. “నిజమే సార్, నన్ను చూసి అందరూ భయపడుతున్నారు. నన్ను నేనెలా మార్చుకునేది?” అడిగింది మల్లి.

“అంటే, నీ ప్రవర్తనని నువ్వు సమర్థించుకుంటావా ఎప్పుడైనా?” అడిగాడు గగన్. “ఊహూఁ. కానీ నా కోపాన్ని ఎలా నియంత్రించుకోవడం?” అడిగిందామె. “దానికి, నీకు కోపం ఎందుకు వస్తోందో తెలుసుకోవాలి”, అన్నాడు గగన్. “అదెలా మొదలైందో నాకు అంతు చిక్కట్లేదు. ఎలా అంటే.. ఎలా అంటే..” అని దిగాలుగా మొహం పెట్టుకుంది మల్లిక. “కంగారు పడకమ్మా! ఇవన్నీ కనిపెట్టడానికి పద్ధతులున్నాయి. దానికి నీ సహకారం అవసరం, మల్లికా!” అని ఆగాడు గగన్.

“సార్, తప్పకుండా! అందుకే కదా అన్నయ్యతో కలిసి మీ దగ్గరకు వచ్చాను”, అని, నవ్వుతూ అంది మల్లిక. “మీరిద్దరూ నేను బిఛాణా ఎత్తేసరికి వచ్చారు. ఎప్పుడో ఒకప్పుడు పొద్దున్నే రండి. కానీ ఒక మాట. నేను ఈమెకు ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు మరెవరూ ఉండకూడదు. ఒక్కొక్క సిట్టింగ్ కనీసం రెండు గంటలైనా అవుతుంది. నా మీద నమ్మకముంటేనే రండి”, అన్నాడు గగన్.

“సార్, మిమ్మల్ని నమ్మి వచ్చాం. ఆ ట్రీట్మెంట్ పేరు చెప్తారా?” అడిగింది మల్లిక. “హిప్నో థెరపీ. దీన్నే సరదాగా ‘రెండు రెళ్ళు ఆరు’ లోను, సీరియస్‌గా ‘అపరిచితుడు’ లోను చూపించారు. ఒక విషయం గుర్తుంచుకోమ్మా. రోగి సహకారముంటే ఎంతటి మహమ్మారినైనా నయం చేయవచ్చు. నీ జీవితం బాగు చేసుకోవాలనుకునే నీ సదుద్దేశం నాకు చాలా నచ్చింది. త్వరలోనే కలుద్దాం”, అని బయలుదేరడానికి లేచాడు గగన్.

***

తిన్నగా ప్రభాత్ ఇంటికి వెళ్ళి, కుశల ప్రశ్నల నెపంతో వివరాలు బయటికి లాగుదామనుకున్నాడు గగన్. “మనం కలుసుకుని ఓ పదేళ్ళయ్యుంటుందా, ప్రభాత్?” ప్రభాత్ కొంత సేపు ఆలోచించి, అటూ-ఇటూ చూసి, “లేదండీ, పదిహేడు సంవత్సరాల మూడు నెల్ల వారం”, జవాబిచ్చాడు ప్రభాత్. బ్యాంకులో బకాయిల వసూలు నిపుణుడు కదా! అందుకే అలా ఆలోచించి ఉంటాడులే, అనుకున్నాడు గగన్.

“ఆ బ్రహ్మ రాక్షసి నుండి విడాకులు తీసుకున్నాక గాని నా మనసు కుదుట పడలేదు సుమండీ!” అని మొదలుపెట్టి గతంలోకి వెళ్ళాడు ప్రభాత్. ‘న్యూరాలజిస్ట్’ నందన్ వృత్తాంతం దగ్గర నుండి, ఆమె స్నేహితుడు తారసిల్లడం వరకూ పూసగుచ్చినట్టు వివరాలు చెప్పాడు. వాటిలో చాలా వరకూ తనకు తెలిసిన విషయాలే! తెలియనివి ట్రీట్మెంట్‌కి పనికిరానివి.

“మాయరోగం కాకపోతే, ఒక ఆడపిల్లకి తల్లైన మనిషికి పరాయి మగాడంటే మోజేమిటో..” అని వాపోయాడు ప్రభాత్. ఉలిక్కిపడ్డాడు గగన్. మైండ్ రీడర్ అయిన అతనికి ఎక్కువ కాలం పట్టలేదు ఆ పిల్లతల్లి మృగనయని అని. అయినా తెలియనట్టు, “అరెరే, ఎవరి విషయం మాట్లాడుతున్నారు మీరు?” అని ఆదుర్దాగా అడిగాడు. “ఇంకెవరు? ఆ లేడి కళ్ళదే! ఆ పేరేమిటి, వేసే వెధవ్వేషాలేమిటి?..” అని ఇంకా నేరాలెంచబోతుంటే, గగన్, వ్యూహాత్మకంగా, “నమ్మశక్యంగా లేదే!” అన్నాడు.

“మీరామెను ఓ చెల్లెల్లాగ చూస్తారు కాబట్టి మీకు అమెలోని మంచే కనిపిస్తుంది. నేనూ ఆమె మంచిదనే అనుకున్నాను. కళ్ళారా ఆమె చేసిన పాడు పని చూశాను గనుక దాన్ని ‘బ్రహ్మ రాక్షసి’ అని తప్ప మరే విధంగానూ అనుకోలేను”, అంటూ ప్రభాత్, కళ్ళలో తిరిగిన నీళ్ళని జేబులోంచి తీసిన రుమాలుతో బయటకి రాకుండా ఆపేశాడు. ఇంకా, “దాన్ని ఏ పాడు మనుషులో కని పడేసి ఉంటారు. లేకపోతే వాళ్ళ అమ్మో, నాన్నో వెధవ పని చేస్తే పుట్టి ఉంటుంది. ఆ విషయం దాన్ని అడిగినా దానబ్బని అడిగినా ఒప్పుకోరే!” అన్నాడు అక్కసుగా.

గగన్ అలోచించాడు. స్కిజోఫ్రేనియా పేషంటుకి లేనివి ఉన్నట్టనిపిస్తాయి. వాటి గురించి చాలా నమ్మకంగా మాట్లాడుతాడు కూడా! కట్టుకున్న భార్య గురించి ఎంత జుగుప్సాకరంగా మాట్లాడాడు! ఇప్పుడు వాళ్ళ ఆవిడ సౌశీల్యం మీద నుండి దృష్టి మరల్చాలనుకున్నాడు. ఎంత బండ భాష మాట్లాడినా, తనని ప్రభాత్ నమ్ముతున్నాడన్నమాట! అందుకని, “మీకు నేనున్నాను ప్రభాత్, మీ మనసులోని బాధని నాతో పంచుకోండి”, అని ఊరడించడానికి ప్రయత్నించాడు గగన్.

“ఆ రాక్షసి, ఆ క్లాస్‌మేట్ కనిపించగానే ఉబ్బి, తబ్బిబ్బయ్యిందంటే నమ్మండి. అతన్ని ఇంటికి పిలవడాలూ, అతనికి నచ్చిన గుత్తి దొండకాయ కూర, ఉల్లిపాయ పులుసూ, నేతి అరిసెలూ చెయ్యడాలేవిఁటో! మొగుడు వెధవకి కూడా ఆ అరిసెలంటే పంచప్రాణాలని ఎందుకు గుర్తుండదో! పెళ్ళైన ఇన్నాళ్ళలో నా కోసం ఎప్పుడూ హోమ్‌ఫుడ్స్‌లో కొనుక్కునేడవడమే గాని, ఇంట్లో చేసిన పాపాన పోలేదు!..”

ప్రభాత్ చేతిని మెల్లగా నిమురుతూ, గగన్, “మరపు అన్నది మానవ సహజం కదండీ! అలాగే మార్పు కూడా – ఈ పాటికి అనామిక కొంచెం పెద్దదయ్యిందని, ట్రై చేసి వుంటుందేమో చెల్లాయి. చిన్నప్పటి స్నేహాన్ని ఇలా అపార్థం చేసుకోకూడదండీ!”

“స్నేహమా, పాడా! ఆ రవి గాడు నా కన్నా ముఖ్యమైన వాడైపోయాడు దానికి! అలాంటి దానితో కాపురం చెయ్యాల్సిన ఖర్మ నాకేవీఁ పట్టలేదు! అందుకే విడాకులిచ్చి పారేశా!” ఆక్రోశించాడు ప్రభాత్.

“మనమనుకున్నవన్నీ నిజాలు కావు కదండీ. పోనీ పెద్దవాళ్ళ చేత మాట్లాడింపజేయకపోయారా?” అన్నాడు గగన్. “ఆ టక్కులాడి ఏం మంత్రం వేసిందో గాని, మా వాళ్ళూ, వాళ్ళ వాళ్ళూ దాని సైడే వత్తాసు పలికారు.”

“ఇంకేముంది? దానికి ఎక్కడా లేని ధైర్యం వచ్చేసింది! ఎంత పొగరుగా నాకేసి చూసేదని! ఇప్పుడా పీడ విరగడైపోయింది లెండి! హమ్మయ్యా!” నిట్టూర్చాడు ప్రభాత్. “అమెకి ఇంకొక ఛాన్స్ ఇవ్వాలని అనిపించలేదా?” అడిగాడు గగన్.

“అందుకే కదా ఆమె వాడికి ప్రాముఖ్యత ఇచ్చినా దానితో పడున్నాను. తన దొంగతనం నా కంట పడి, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది. అందుకే విడాకులు తీసుకోక తప్పలేదు”, అన్నాడు ప్రభాత్. “రెడ్ హ్యాండెడ్?” ఆశ్చర్యపోయాడు గగన్.

“అవునండీ, ఒక రోజు నేను తాగే కాఫీలో విషం కలిపి, నా అడ్డు తొలగించుకోవాలని అనుకుంది గగన్ గారూ! దాని బ్యాడ్ లక్. నా కంట పడి, తన గోతిలో తానే పడింది”, అని ఒక విజేతలాంటి లుక్కు పారేశాడు ప్రభాత్. “అది విషం అని మీకు ఎలా తెలుసు? సీసీడీలో ఇచ్చినట్టు, ఏమైనా కొత్త రుచి కలపడానికి ప్రయత్నించి ఉండవచ్చుకదా!” అన్నాడు గగన్.

“అలా అయితే, ‘అరెరే నా సర్‌ప్రైజ్‌ని మీరు కనిపెట్టారు’, అని అనుండేది గాని, గుమ్మడికాయల దొంగలా ఆ కాఫీని చటుక్కున సింకులో పారబోసి, ‘ఏమీ లేదు, ఏమీ లేదు’, అని అరిగిపోయిన రికార్డులా ఎందుకు వాగుతుంది?” లా పాయింట్ లాగాడు ప్రభాత్. “సరే, పోనీ, ఆ విషాన్ని చేజిక్కించుకున్నారా?” ప్రశ్న వేశాడు గగన్.

“ఆ అలోచన నాకు గానీ, మాకు విడాకులిచ్చిన జడ్జి గారికి గానీ రాలేదండీ. అదేం విషమో తెలియదు గానీ, అది మాత్రం విషమని నా మనసు చెప్పింది. కోర్టు నమ్మి, మాకు విడాకులిచ్చింది”, అన్నాడు ప్రభాత్. “మరి అనామిక..” అని అడగబోతున్న గగన్‌ని ఆపి, “దాన్ని కన్న తల్లినే కాదనుకున్న వాణ్ణి, అదెందుకు నాకు?” అని ఎదురు ప్రశ్న వేశాడు ప్రభాత్.

“మీకు నా వయసుంటుందేమో అనుకున్నా. మీరెప్పుడు రెటైర్ అయ్యారు?” మాట మార్చాడు గగన్. “ఆ రాక్షసి చేసిన ద్రోహాన్ని మరచిపోలేక తెగ బాధపడేవాణ్ణి. నా బోటి మంచి వాడికా ఈ కష్టాలు? మీరైనా చెప్పండి.

ఈ బాధని మరచిపోలేక, నా ఉద్యోగంలో ఉండలేక, వాలంటరీ పెట్టేసుకున్నాను. మా చుట్టాల మధ్య ఉండడం ఇష్టం లేక, ఈ ఇల్లు ఎవరో అమ్మకానికి పెడుతుంటే, కొనుక్కుని, దిగానన్న మాట. నాకు మంచి రోజులు వచ్చినట్టున్నాయి, ఇటు రాగానే మీరు తారసిల్లారు!” చెప్పాడు ప్రభాత్. అతను పొంగిపోయాడు, కానీ, ఈ పొగడ్తకి మాత్రం కాదు.

“ఈ ఊరు వచ్చి, మీరు మంచి పని చేశారు. మీరిప్పుడు సింగిల్ గనుక చేయి కాల్చుకోకండి. ఈ మధ్య మీ చెల్లెలు కథలూ వగైరా తెగ రాసేస్తోంది. ఆమె రాసిన మొదటి నవలకో బహుమతి వచ్చింది లెండి! ఇంతకీ, నేను చెప్పేదేమిటంటే, తనకు కొంత ఖాళీ సమయం ఉండేటట్టు పూర్ణిమ ఓ వంట వాణ్ణి పెట్టింది. ఆమె తర్ఫీదు బాగానే ఇచ్చింది లెండి. అందుకు, మీకేం కావాలంటే అది, మీకిష్టమైన నేతి అరిసెలతో సహా, పూర్ణిమకి ఓ ఫోను కొట్టండి – తిండి పట్టండి”, అని తన జోకుకి తనే నవ్వి, “మీ మొబైల్ ఇలా ఇవ్వండి. నా నెంబరు, మీ చెల్లి నెంబరూ సేవ్ చేస్తా”, అని అడిగి తీసుకున్నాడు గగన్, అతనికేసి మెచ్చుకోలుగా చూస్తున్న ప్రభాత్ నుండి.

ఆ రెండూ ఎక్కించి, “మీ పర్మిషనుతో ఒక ఆప్ డౌన్లోడ్ చేయనా?” అని అభ్యర్థిస్తున్నట్టుగా అడిగాడు గగన్. “మీ మాట కాదంటానా?” అన్నాడు ప్రభాత్. ‘అవునులేవయ్యా, ఇప్పుడిలా అంటావు, తరువాత ఏ టాపింగ్ డివైసో పెట్టానని ఫిర్యాదు చెయ్యగలవు’, అని మనసులోనే అనుకుని, “ఇది సద్గురువు గారి ఆప్. ఆయన రోజూ చెప్పే మంచి మాటని ఇక్కడ చదవచ్చు.

సద్గురువుగారు మన చేత చేయించే గైడెడ్ ధ్యానాలు ఇదిగో, ఇక్కడ ఉన్నాయి. ఆఫ్లైన్లో కావాలంటే, ఈ మీట నొక్కాలి. చూశారా డౌన్లోడ్ అవుతున్నాయి.. రెడీ! మీకు ఎప్పుడు మనసైతే అప్పుడు మీ ఫోన్‌ని ఏరోప్లేన్ మోడ్లో పెట్టుకుని, ధ్యానం చెయ్యండి. ఇన్నాళ్ళూ ‘ధనమూలం ఇదం జగత్’ అని అనుకుని ఉంటారు. ఇప్పుడు కొద్దిగా మార్చి, ‘ధ్యానమూలం ఇదం జగత్’, అనుకోండి, ఆనందంలో తేలియాడతారు”, ముగించాడు గగన్.

“నాకు మీకన్నా శ్రేయోభిలాషి వేరెవరూ లేరు”, అని గగన్‌ని గట్టిగా కౌగిలించుకున్నాడు ప్రభాత్. అది ధృతరాష్ట్రుని కౌగిలిలా అనిపించింది గగన్‌కి. కానీ, తొణకక, బెణకక, “సారూ, నాకు ఇంటికి వెళ్ళే పర్మిషనిప్పించండి, ప్లీజ్”, అని బతిమిలాడాడు గగన్. “ఒక్క షరతు- చెల్లెమ్మ నవల నాకివ్వండి, చదువుకుంటాను”, అన్నాడు ప్రభాత్. “అంతకన్నానా?” అని కదిలాడు గగన్.

***

ఉదయం లేవగానే తాగే కాఫీ దగ్గర నుంచి, రాత్రి పడుక్కోబోయే ముందు తాగే మజ్జిగ వరకూ ప్రభాత్ చేసే అన్నపానాలన్నీ పూర్ణిమ పర్యవేక్షణలో గగన్ ఇంటి నుండే వెళ్తూండేవి. వంట వాడుండడం వల్ల పూర్ణిమ ప్రత్యేకించి శ్రమ తీసుకోకుండా నేతి అరిసెలు వగైరాలు ఏర్పాటు చేయగలిగేది. ఎప్పుడూ కూడా ప్రభాత్‌ని ఇంటికి భోజనానికి పిలువలేదు వాళ్ళు. స్కిజోఫ్రెనియా రోగులు తమ ‘కంఫర్ట్ జోన్’, దాటి రావడానికి ఇష్టపడరనే విషయం గగన్ దంపతులు ఎరుగుదురు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here