ఎందుకీ బ్రాహ్మణద్వేషం??????

12
8

[దేశ విదేశాల్లో బ్రాహ్మణులను విలన్లుగా చిత్రీకరించడానికి జరుగుతున్న ప్రయత్నాలను నిరసిస్తూ శరచ్చంద్రిక గారు అందిస్తున్న  వ్యాసం.]

జంధ్యా మార్కులు (‘మూర్ఖులు’) ..

ఎవరు వీరు? అదేనండీ.  భారతీయ విలన్లు.  బ్రాహ్మణులు.  నిజంగా వీరు విలన్లేనా?  వీరి గురించి  నాకు తెలిసినంత మేరకు చెప్పడానికి ప్రయత్నిస్తాను.

బ్రాహ్మణులు భారతీయ విలన్లు/ హాస్య పాత్రలు:

తెలుగు రచనల్లో – బ్రాహ్మణులను పీడకులు అంటూ వ్రాసే కథలు చాలా చూస్తుంటాము. నేను ఇది వరకే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు గురించిన వ్యాసంలో ఈ విషయాన్ని ప్రస్తావించాను. గురజాడ వారి కన్యాశుల్కంలో కూడా సౌజన్యారావు పాత్ర కంటే మనల్ని ఎక్కువ ఆకర్షించేది కూతురిని ముసలి వాడికిచ్చి పెళ్లి చేసేద్దాం అనుకున్న అగ్నిహోత్రావధానులు పాత్ర. ఒక అమెరికా కవి, రచయిత తనతో ముఖపుస్తకంలో వాదించిన కొందరిని బ్రాహ్మణులని ‘జంధ్యా మార్కులు’ అని సంబోధించారు. మొన్నటికి మొన్న కేంద్ర సాహిత్య అకాడమీ మరియు ఆటా పురస్కారం వచ్చిన నవల ‘మనోధర్మపరాగం’ లో ‘ఆ మాటా, ఆ నడకా, ఆ తీరు అంతా బ్రాహ్మణుల వాలకమే! పైకి మాత్రం భలే డంబంగా ఉంటారు’ అంటూ బ్రాహ్మణుల గురించి ప్రస్తావిస్తారు రచయిత.

తెలుగు సినిమాల్లో – బ్రాహ్మణుడు అంటే పిలక, మడి, సంభావన అంటూ హాస్యధోరణిలో మాట్లాడే పాత్రలని చూస్తాము. అందరం ఎంతో గొప్పగా చెప్పుకునే మాయాబజార్ సినిమాలో ‘శర్మా/శాస్త్రీ’ అంటూ పండితులని హాస్య పాత్రల క్రింద చేసేసారు. మైకేల్ మదనకామరాజు కథలో ‘కాముడు’ అత్యంత హాస్యాన్ని పండించే పాత్ర. రాఘవేంద్రరావు కొత్త పాడురంగ మాహాత్మ్యంలో బ్రాహ్మణపాత్రలు   గంధాన్ని నాకేంత లేకి పాత్రలు.

తెలుగు రచయితలను – విశ్వనాథ సత్యనారాయణ, గొల్లపూడి మారుతీరావు గారు, శ్రీ రమణ గారి లాంటి వారి రచనలనే కాదు, వ్యక్తిగత విమర్శ చేసిన సందర్భాలు ఉన్నాయి. మా బుక్ క్లబ్ లో నేను విశ్వనాథ వారి వేయిపడగలు చదువుదామని సూచిస్తే, ఆ పుస్తకం చదవం ఇష్టం లేదని ఖచ్చితంగా చెప్పారు. మరొక సందర్భంలో Covid సమయంలో ‘నవలా స్రవంతి’ అనే కార్యక్రమంలో గొల్లపూడి వారి ‘సాయంకాలమైంది’ అనే నవల మీద విశ్లేషించారు. చాలా మంది ఆ లైవ్ చాట్ లో కొంత మంది రచయితలు గొల్లపూడి వారిని వ్యక్తిగత దూషణ కూడా చేసారు. ఈ విషయం నా ముఖపుస్తకంలో కూడా ప్రస్తావించాను.

క్రెస్తవ పాస్టర్లు – కొంత మంది పాస్టర్లు కూడా తమ తమ యూట్యూబ్ ఛానల్ లో బ్రాహ్మణులే కుల వివక్షలకు కారణం అంటూ మతబోధనలు చేయడం వింటుంటాము. బ్రాహ్మణులమతం మార్చినవాడికి ఇప్పటికీ అధికమొత్తం ముడుతుంది.

తెలుగు కళాకారుల్లో – బాలసుబ్రహ్మణ్యం, సిరివెన్నెల, కాశీనాథుని విశ్వనాథ్ లాంటి వ్యక్తులు మరణిస్తే వారిని ‘బాపన్లు’ అంటూ చనిపోయిన కళాకారులని వ్యక్తిగత దూషణలుతో కూడిన టపాలు పెట్టడం చూస్తున్నాము.

బ్రాహ్మణులంటే ఎందుకింత విలనీకరణ అనేది ఆలోచించాల్సిన విషయం.

కుల వివక్షకు కారణం కేవలం మూడువేల ఏళ్ళ క్రితం బ్రాహ్మణులు పాటించిన ఆచారాలు అనేది సామాన్యంగా వినే మాట. ప్రతీ సమాజంలో లోపాలు ఉన్నట్లే భారతీయ సమాజంలో కూడా లోపాలు ఉన్నాయి. అణచివేతలు జరిగాయి. ఇందులో దాచుకోవలసినది ఏదీ లేదు. అయితే ‘ఈ అణచివేతల విషయంలో ఎందుకు బ్రాహ్మణుల గురించే ప్రస్తావిస్తారు?’ అన్నది ప్రశ్న.

వందేళ్ళ చరిత్ర గురించి మనకి సరిగ్గా తెలియదు. 30 ఏళ్ళ క్రితం కాశ్మీరీ పండితుల గురించి సినిమా తీస్తే, నిన్న గాక మొన్న ప్రకాష్ రాజ్ లాంటి వారు ‘నాన్సెన్స్’ అనేసారు.  30 ఏళ్ళ క్రితం జరిగిన చరిత్ర గురించి మాట్లాడలేని మనం 3000 ఏళ్ళ క్రితం జరిగిన చరిత్ర గురించి ఏ విధంగా మాట్లాడగలం? Goa Inquisition లాంటివి చదివితే బ్రాహ్మణుల మీద ఎన్నో దాడులు జరిగినట్లు చరిత్ర చెప్తోంది. కశ్మీర రాజతరంగిణి చదివితే ఏ రకంగా జంధ్యాల గుట్టలను కాల్చివేశారో, దాల్ లేక్ బ్రాహ్మణుల శవాలతో నిండిందో తెలుస్తుంది.  భారతీయ చరిత్రలో ఏ అంశం మీదా సరియైన పరిశోధన జరగలేదు. అటువంటప్పుడు బ్రాహ్మణులే విలన్లు అని ఏ విధంగా అనగలము?

పోనీ బ్రాహ్మణులే కులవివక్షకి కారణం అనుకుందాం. అంటే కులవివక్ష ప్రపంచంలో ఎక్కడ జరిగినా మాట్లాడాలి కదా?  భారతదేశ రాజ్యాంగంలో ఆ వివక్ష రూపుమాపడానికి ఎన్నో చట్టాలు ఉన్నాయి. మరి పాకిస్తాన్‌లో ఉన్న హిందువుల పైన వివక్ష మాటేమిటి? దేశవిభజన జరిగాక పాకిస్తాన్‌లో దళితులైన  హిందువులు/క్రిస్టియన్లు  పారిశుధ్య కార్మికుల్లా పని చేస్తారు.  ఈ మాట న్యూయార్క్ టైమ్స్ లాంటి పత్రికలే వ్రాసాయి. ఒక్కోసారి వారి మీద దైవదూషణ జరిగిందని కఠిన శిక్షలు కూడా పడతాయి. వీటి గురించి ఏ మేధావులు మాట్లాడకపోవడం శోచనీయం.

భారతీయ సమాజంలో బ్రాహ్మణులు అంటే ఎవరు?

చరిత్ర/పురాణాల ఆధారంగా తీసుకుంటే

  • గురుకులంలో గురువు. ఉదాహరణ : చాణుక్యుడి తండ్రి చణకుడు.
  • దేశాన్ని పాలిచ్చే రాజు దగ్గర మంత్రులు/రాజా గురువులు/ఆస్థాన కవులు. ఉదాహరణ: వశిష్ఠుడు, అష్టదిగ్గజాలు.
  • వైద్యులు. ఉదాహరణ: FB లోని వ్యాసకర్త షెఫాలీ వైద్య గారి పూర్వికులు సారస్వత బ్రాహ్మణులు. గోవాలో గ్రామాలలో వైద్యం చేసేవారు అని ఆవిడ Goa Inquisition speech లో చెప్పారు..
  • గ్రామాల్లో కరణాలు.
  • ఈ రోజుల్లో బ్రాహ్మణులు అంటే గుళ్ళలో అర్చకులు లేదా వేద పండితులని మాత్రమే బ్రాహ్మణులు అంటున్నాము.

బ్రాహ్మణుడి స్వభావం ఎలా ఉండాలి?

గుడిలో అర్చకత్వం, గురుకులంలో గురువుగా, రాజా గురువుగా, వైద్యుడిగా పని చేయాలంటే ఏ వివక్షా ఉండకూడదు. సమాజంలో నిస్వార్థంగా, ధర్మం తాను ఒకరికి చెబుతూ ధర్మమార్గం చూపించే మార్గదర్శకుడిగా ఉండాలి. అంటే సమాజం బ్రాహ్మణుడి పైన ఎంత బాధ్యత పెట్టిందంటే ఎవరైనా బ్రాహ్మణకులంలో పుట్టినవాడు చిన్న తప్పు చేసినా ‘పేరుకే బ్రాహ్మణుడు’ అనే మాట సునాయాసంగా అనేస్తారు.

ఇప్పుడు బ్రాహ్మణుడు ఎవరూ? ఎలా ఉన్నారు?

భారతీయ వ్యవస్థ అంతా గుడి చుట్టూ తిరిగేది. గుడి అర్చకత్వం అనేది వారసత్వంగా ఉండేది. మాన్యాలు ఉండేవి. అటువంటి పరిస్థితిలో అర్చకత్వం చేసే వారికీ ‘ఈ గుడి నాదే’ అన్న భావం ఉంటుంది. అక్కడ ఉన్నది ఒక రాతి విగ్రహం అన్న ధోరణి ఉండదు. నిత్యం ఆ దైవసేవలో గడిపేవాడు ఆ బ్రాహ్మణుడు.

అంత మార్గదర్శకుడై వేదపండితుడైన బ్రాహ్మణుడు వెయ్యేళ్ళ Middle Eastern మరియు బ్రిటిష్ వారి colonization, దేవాదాయశాఖ ధర్మమా అని తరువాత బ్రాహ్మణుడు గుళ్ళో పళ్లెంలో వేసే నాలుగు చిల్లర నాణాలు నెలవారీ జీతం తీసుకునే మామూలు ఉద్యోగి అయ్యాడు.

ఇతర కర్మలు చేసే బ్రాహ్మణుల ఆర్థిక పరిస్థితి బాగానే ఉన్నా, ఈ సినిమాల పుణ్యమా అని పిలక పెట్టుకున్న వాడంటే అమ్మాయిలకి చులకనా భావం ఏర్పడటం వీళ్ళకి పెళ్ళిళ్ళు కావడం కూడా కష్టంగానే ఉంది. అందరి లాగే మాములు జీవితం గడిపితే చాలు, ఈ అర్చకత్వం లాంటివి ఎందుకు అన్న ధోరణిలోకి వచ్చేస్తున్నారు చాలా మంది. మగపిల్లలని ఈ వృత్తిలోకి పంపడానికి అంత సుముఖత చూపిస్తున్నట్లు అనిపించడం లేదు.

బ్రాహ్మణుడు మిగిలిన కొద్దో గొప్పో వారసత్వాన్ని వదిలేస్తాడు. అయితే నష్టం ఏమిటి?

మనస్ఫూర్తిగా పని చేసే బ్రాహ్మణుడు ఉండడు. అందువల్ల గుడికి వెళ్ళాలి అన్న ఆసక్తి కోల్పోతుంది సమాజం.

పెళ్ళిళ్ళు, ఉపనయనాలు లాంటివి ధర్మాన్ని పాటించాలి అన్న తపన లేకుండా ఆర్భాటాలతో కూడుకున్న వేడుకలయ్యాయి. తద్దినాలకి తప్ప మిగతా కార్యక్రమాలకు ఫొటోగ్రాఫర్లు event manage చేస్తారు. అవి జరిపే పురోహితుడుకి చాలా తక్కువ ప్రాధాన్యత. కార్యక్రమాలు చేసుకునేవారు ఆర్భాటాల  కోసం చేసుకుంటుంటే పురోహితుడు మాత్రం motivated గా అన్నీ జరిపించాలి అనుకోకూడదు కదా.. కొద్దో గొప్పో అలా చేసేవారున్నా రాను రాను తగ్గిపోతారు.

అంటే హైందవ ధర్మం పాటించేవారు తక్కువయిపోతారు.

వేదాలు భారతీయ వారసత్వ సంపద.

  • ఎప్పుడో ఎవరో రాజులు ఈజిప్టులో సమాధులు కట్టారు అంటే వెళ్లి చూస్తాము.
  • యూదులు kosher diet పాటిస్తారు అంటే మెచ్చుకుంటాము.
  • అమెరికాలో Amish వారు ఎవరితో కలవకుండా ప్రకృతిసిద్ధంగా జీవిస్తారు అంటే వారిని చూసేందుకు వెళ్తుంటారు.
  • ఒక పర్యాటక స్థలం UNESCO Heritage అనగానే అబ్బురంగా చూస్తాము.

ఇన్ని మెచ్చుకునే అదే  భారతీయులు  ఓ విషయం ఆలోచించారా?

పెట్టుకునే బొట్టు, కట్టుకునే చీర, చేసుకునే పండగలు రికార్డులు లేని చరిత్ర. కాదు కాదు! ఓ జీవం ఉన్న వేల సంవత్సరాల సంస్కృతి.

క్రైస్తవుడుకి బైబిల్, మహమ్మదీయుడికి ఖురాన్ ఎలాగో హిందువుకి వేదాలు అంత ముఖ్యమైనవి. భారతీయ శాస్త్రాలు ఎన్నో విషయాలు కథల రూపంలో నిక్షిప్తం చేసుకుని ఉంటాయి.  ఉదాహరణకి  అరుంధతీ  నక్షత్రం,  ధ్రువుడు, తార – చంద్రుడు లాంటి కథలు astronomy గురించి చెప్తాయి (రాజ్ వేదం గారి వీడియోలు చూడవచ్చు). అటువంటి వేదాలు  నేర్చుకోవడం అంటే మామూలు విషయం కాదు.

ఓ చేనేత కళాకారుడు కూలీ అయ్యాడు అంటూ సినిమా తీస్తే బాధపడతాము.

రైతు ఆత్మహత్య చేసుకున్నాడు అన్న వార్త వింటే అంటే కన్నీరు పెట్టుకుంటాము.

సమాజంలో అందరూ సమానమే అని చెప్పే మనం, ఒక సంస్కృతిని, దేవాలయ వ్యవస్థని నిలబెట్టాలన్న ధ్యేయంతో చిన్నతనం నుండీ ఒక క్రమశిక్షణతో 4 గంటలకే నిద్రలేచి వేదం నేర్చుకున్న బ్రాహ్మణుడు, ఆహార నియమాల్లాంటి కఠినమైన కట్టుబాట్లను ఆచరించే బ్రాహ్మణుడు గుళ్లో అర్చకుడిగా పళ్లెంలో చిల్లర నాణాలకోసం బ్రతుకుతుంటే, ఆ బ్రతుకు మీద సినిమా హాస్యం చిలకరిస్తే పొట్ట చెక్కలయ్యేట్లు నవ్వుతాం.  ఏ కుల వృత్తి మీద లేని చులకనభావం బ్రాహ్మణ కులవృత్తి పైన చూపిస్తాం. బ్రాహ్మణ భావజాలము అంటూ విషం కక్కుతాము. ప్రపంచంలో ఏ దేశంలో కూడా తమ సంస్కృతి మీద ఈ విధంగా నీరు చల్లి కనుమరుగయిపోవాలని ఆశించరు. భారతీయులం అని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి మనం.

చేయవలసిన కర్తవ్యం

గుడులు & వాటి మాన్యాలు ప్రభుత్వం హిందువులే నిర్వహించుకునేలా పోరాడాలి. హిందువులు నిర్వహించుకోలేరు అన్న వారికి చిలుకూరి బాలాజీ గుడి & అర్చక స్వామి వారు ఉదాహరణ.

అమెరికాలో గుడులన్నీ హిందువులే చక్కగా manage చేస్తున్నారు. ఇంత కంటే ఉదాహరణలు ఏముంటాయి?

అన్నిటికంటే ముఖ్యం ఏంటి అంటే బ్రాహ్మణులను నిందించిన వారిపై అట్రాసిటీ చట్టం తేవాలి.

అప్పుడు ‘బ్రాహ్మణ భావజాలం’, ‘బ్రాహ్మణికల్’ అంటూ మాట్లాడటానికి వెనుకాడతారు. ఒక్క కలం పోటు చాలు ఈ  సంస్కృతి నిలబడటానికి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here