[dropcap]జీ[/dropcap]వులలో నిర్జీవులలోని అంతరాత్మను దర్శించి ప్రదర్శించే జె. శ్యామల గారి ‘అన్నింట అంతరాత్మ’ శీర్షికలో ఈ వారం ‘తాళం’ అంతరంగం తెలుసుకుందాం.
***
సుభద్ర పెరుగు వడల కోసం పెరుగులో తాలింపు పెట్టే ప్రయత్నంలో ఉంది. ఇంతలో వెనకింటి వెంకటలక్ష్మి వచ్చి ‘మా పిల్లలొస్తే ఇవ్వండి’ అంటూ తాళం చేతులిచ్చి వెళ్లింది. వాటినందుకుని తాలింపు మాట గుర్తుకువచ్చి అలాగే వంటింట్లోకి నడిచింది. హడావిడిలో దాన్ని పోపుల డబ్బాలో ఎలా పడేసిందో పడేసింది. తర్వాత నాలుగింటికల్లా వెంకటలక్ష్మి పిల్లలొచ్చారు. సుభద్ర ‘తాళం చేతులు ఎక్కడ పెట్టానబ్బా’ అనుకుంటూ ఇల్లంతా తెగ తిరిగింది. అదంతా చూస్తుంటే ఇంటి ప్రధాన ద్వార తాళాన్నైన నాకు నవ్వాగలేదు. ఇంట్లో ఉన్న మా వాళ్లందరి వంకా చూశాను. వాళ్లూ చిరునవ్వులు చిందించారు. మళ్లీ మా చూపులు ఆమెను అనుసరించాయి.
సుభద్ర ‘ఎక్కడో భద్రంగానే పెడతాను, ముందు మీరు ఈ స్నాక్స్ తింటుండండి’ అని వాళ్లకు చేగోడీలు ఇచ్చి, టేబుళ్లు, అలమర్లు వెతకటం మొదలు పెట్టింది. ఇంతలో ధనుంజయ్ రానే వచ్చాడు. విషయం తెలిసి ‘తాళం చేతులు మనవి కూడా కావు. అవి దొరక్కపోతే వాళ్లకేం సమాధానం చెపుతావ్? అయినా అంత అజాగ్రత్తేమిటి? పేరుకు మాత్రమే సుభద్ర’ దులిపేశాడు ధనుంజయ్. ‘అక్కడికి మీకు మరుపనేదే లేనట్లు, కళ్లద్దాలు ముఖానికి తగిలించుకుని, ఎక్కడున్నాయంటూ అందర్నీ అడిగే పెద్దమనిషి మీరు. సాయం చేద్దామని ఉండదు కానీ సాధింపుకు రెడీ అయిపోతారు’ అంది సుభద్ర.
‘సరేలే కొద్దిగా కడుపు నొప్పిగా ఉందని త్వరగా ఇంటికొచ్చా. నువ్వేమన్నా చిట్కా వైద్యం చెప్తావనుకుంటే తాళంచెవి గోలొకటి’ విసుక్కున్నాడు ధనుంజయ్. ‘ముందు పోపుల డబ్బాలో జీలకర్ర తీసుకుని, కాస్త ఉప్పు కలుపుకు తినండి’ అంది సుభద్ర తాళంచెవి వెతుకుతూనే. ధనుంజయ్ వెళ్లి పోపుల డబ్బా తీసి ‘కనుగొంటిని, నేనే కనుగొంటిని’ అని రాగయుక్తంగా పాడటంతో, ‘కొంపదీసి తాళంచేతులు కాదు కదా’ అంటూ సుభద్ర పరుగున వంటింట్లోకి నడిచింది. ధనుంజయ్ చేతి సైగతో అటు చూసింది సుభద్ర. పోపుల డబ్బాలో పైనుండే మూతలో ఎర్ర మిరపకాయల మధ్య తాళంచేతులు దర్శనమివ్వడంతో ‘మీకు కడుపునొప్పి రావడం మంచిపనైంది’ అంది. ‘హా! ఎంత మాటన్నావు. నాకు కడుపునొప్పి రావటం నీకు సంతోషమా?’ కోపంగా అన్నాడు ధనుంజయ్. ‘అది కాదండీ, మీకు కడుపు నొప్పిరావటం వల్లే కదా జీలకర్ర కోసం పోపుల డబ్బా తీయవలసి వచ్చింది. లేకపోతే తాళంచెవి కోసం పోపుల డబ్బా వెతకం కదా. అందుకే అలా అన్నాను, అంతే’ అంది. ‘సంతోషించాంలే. ముందు ఆ పిల్లలకు తాళంచెవి ఇచ్చి పంపించు. లేకపోతే వాళ్లమ్మ కూడా వచ్చేస్తుందింక’ అన్నాడు ధనుంజయ్. ‘అదీ నిజమే’ అంటూ తాళంచెవి తీసుకెళ్లి వెంకటలక్ష్మి పిల్లలకిచ్చి ‘జాగ్రత్త. తోవలో పడేయకండి’ అంది. ఆ తాళంచెవి నవ్వుతూ మాకు టాటా చెప్పింది. ‘అలాగే అత్తా’ అంటూ పిల్లలు వెళ్లిపోతుంటే ‘ఆఁ.. ఆఁ.. నువ్వే చెప్పాలి జాగ్రత్త’ అంటూ జీలకర్ర నోట్లో వేసుకున్నాడు ధనుంజయ్. సుభద్ర ‘అర్జెంటుగా కాఫీ పడాలి’ అనుకుంటూ వంటింట్లోకి వెళ్లింది.
నాకు మావాళ్లతో మాట్లాడాలని మనసైంది. అంతే.. ‘ఈ సుభద్రకు రోజురోజుకు మతిమరుపు, దాన్నిమించిన అనుమానం ఎక్కువవుతున్నాయి. బయటికి వెళ్లేటప్పుడు నన్ను బిగిస్తుందా. అంతటిదో ఊరుకోదు. లాగిలాగి నన్ను చంపుతుంది. హమ్మయ్య అనుకునేంతలో ముందుకు నడిచిందల్లా మళ్ళీ వెనక్కు వచ్చి నన్ను ఒక్క గుంజుగుంజి ‘ఆఁ తాళం పడిందిలే’ అనుకుంటూ వెళుతుంది. నా బాధ ఆమెకేం అర్థమవుతుంది’ అన్నాను. వెంటనే బీరువా తాళం ‘అవునవును. ఆమె అంతే. మొన్నయితే వేరే తాళంచెవితో నన్ను గుచ్చిగుచ్చి హింసించింది. కొద్దిసేపటికి కానీ చేస్తున్న పొరపాటు ఆమెకు అర్థం కాలేదు. ఇప్పటికీ నాకింకా నొప్పిగానే ఉంది’ అంది. ‘అయ్యో!’ నేను సానుభూతి ప్రకటిస్తుండగానే, సుభద్ర, ధనుంజయ్ కాఫీ కప్పులతో వచ్చి సోఫాలో బైఠాయించారు.
‘అసలీ తాళంచెవులు ఎవరు, ఎప్పుడు కనుక్కున్నారో’ సాలోచనగా అంది సుభద్ర. ‘తొలిగా ప్రాచీన ఈజిప్టులో కొయ్యతాళాలు ఉండేవి. ఆ తర్వాత లోహపు తాళాల తయారీ మొదలైంది. క్రీస్తుపూర్వం ఆరో శతాబ్దిలో థియోడరస్ అనే ఆయన తాళం చెవిని సృష్టించాడు. పారిశ్రామిక విప్లవం తర్వాత ప్రమాణాలతో కూడిన తాళాల తయారీ మొదలైంది’ చెప్పాడు ధనుంజయ్. ‘అలాగా’ అంది సుభద్ర. మా జాతిచరిత్ర వినడం మాకూ ఆసక్తిగా, ఆనందంగా అనిపించింది.
ఇంతలో ‘అమ్మా!’ అంటూ చైత్ర వచ్చింది. ‘రా, రా! మధు ఏడి?’ అడిగింది సుభద్ర. ‘మధు ఇవాళ ఆలస్యంగా వస్తానన్నారు. ఆయన దగ్గర డూప్లికేట్ తాళం చెవి ఉందిలే’ అంది చైత్ర. ‘ఇప్పటిదాకా తాళం చెవితోనే ఇంట్లో గందరగోళం అయింది’ అంటూ ధనుంజయ్ క్లుప్తంగా జరిగింది చెప్పాడు. అది విని చైత్ర నవ్వేస్తూ ‘పెరుగు వడల పేరు వినగానే నోరూరిపోతోంది. ఏవి, నాకేవి?’ అంది. ‘తెస్తా నుండు’ అంటూ సుభద్ర లేచి వెళ్లి, పెరుగు వడల ప్లేటు తెచ్చి చైత్రకు అందించింది.
చైత్ర వాటిని తింటూనే ‘అమోఘంగా ఉన్నాయి’ అని.. ‘అయినా అమ్మా! అసలు ఇప్పుడు తాళంచెవులు ఒకరికి ఇచ్చే పనే లేకుండా కొత్త పద్ధతులొచ్చాయి’ అంది. ‘ఏంటో అవి’ అంది సుభద్ర. ‘స్మార్ట్ డోర్ లాక్స్ వచ్చాయి. ఇవి కుటుంబ సభ్యుల బయోమెట్రిక్స్‌తో పనిచేస్తాయి. ముందుగా వాళ్ల వేలిముద్రలను స్మార్ట్ డోర్ లాక్‌లో నిక్షిప్తం చేస్తారు. తాళంపై వేలిముద్ర వేయగానే తలుపులు తెరుచుకుంటాయి. అంతేకాదు, ఇవి యాప్ సాయంతో కూడా పనిచేస్తాయి. ఇంటి యజమాని ఎక్కడ నుంచయినా ఆపరేట్ చేయొచ్చు. వారు ఇంట్లో లేనప్పుడు ఎవరైనా బంధువులు వచ్చినా, స్కూల్ నుంచి పిల్లలు వచ్చినా యాప్ సాయంతోనే తాళం తీయొచ్చు. తాళం సరిగా వేయకపోతే అది హెచ్చరిస్తుంది కూడా. ఇతరులు ఎవరైనా తాళంతీసే ప్రయత్నం చేస్తే అలారం మోగుతుంది. ప్రధాన ద్వారం వరకే స్మార్ట్ లాక్‌ను పరిమితం చేయవచ్చు. వార్డ్ రోబ్‌కు కూడా బిగించుకోవచ్చు. ఇంట్లో వాడే లాకర్లకు సైతం స్మార్ట్ లాక్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కాకపోతే ధరలు వేలల్లో ఉన్నాయి. ఇవి గాక పాస్‌వర్డ్ కొడితే షట్టర్లు తెరుచుకునే తాళాలు విదేశాల్లో ఎక్కువ వాడుకలో ఉన్నాయి’ చెప్పింది.
మాజాతిలో కొత్తతరం వారి గురించి విని నేను ‘ఔరా’ అనుకుంటుంటే ‘బాగానే ఉంది, కానీ ధర అందుబాటులో లేదుగా’ అంది సుభద్ర. ‘కేరళలో సంప్రదాయగృహాలలో రెండు తలుపులుండే ప్రవేశద్వారాలకు ప్రత్యేకమైన ఇత్తడితాళం వాడతారని, వాటి పేరు ‘మణిచిత్రరాజు’ అని ఆ మధ్య ఎప్పుడో చదివా’ చెప్పాడు ధనుంజయ్. ‘భలే ఉంది పేరు’ నేననుకుంటుంటే ‘పేరే చిత్రంగా ఉంది’ అని, ‘అసలు దేవాలయాలలో తాళాలకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. తిరువనంతపురంలో పద్మనాభస్వామి ఆలయంలో ఆరు ఖజానాలకు ప్రాచీనకాలం నాటి తాళాలు ఉన్నాయి. ఆ ఉక్కు తలుపులు తెరవడం చాలా కష్టమని చెప్పారు. ‘ఎ’ గదిని ఎంతో శ్రమపడి తెరిచారు. అందులో లక్షల కోట్ల విలువచేసే బంగారం, వెండి, వజ్రాలు, దేవుళ్ల విగ్రహాలు, సింహాసనాలు కనుగొన్నారు. కానీ ‘బి’ ఖజానాను ఇప్పటికీ తెరవలేక పోతున్నారు. ప్రాచీనకాలంలో సిద్ధులు పాము మంత్రం సహితంగా ఆ ఖజానాకు తాళం వేసి ఉంటారని అంటున్నారు. ఇంకా మిస్టరీగాను ఉంది’ చెప్పింది. ‘భలే ఉందే’ అనుకున్నాను నేను.
‘అవును, నేనూ పేపర్లో చదివాను’ అంటుండగానే ‘ఏం చదివావోయ్’ అంటూ ధనుంజయ్ మిత్రుడు గోవిందరాజు, ఆ వెనుకే ఆయన భార్య రమాదేవి ప్రవేశించారు. వాళ్లు తరచు వస్తుంటారు కాబట్టి మాకు పరిచితులే.
‘రావోయ్!’ ఆహ్వానించాడు ధనుంజయ్. ‘రండి రండి’ అంది సుభద్ర. వాళ్లు కూర్చోగానే, ధనుంజయ్ ‘తాళాల గురించి మాట్లాడుకుంటుంటే తిరువనంతపురం ఖజానా తాళం ప్రస్తావన కూడా వచ్చింది’ చెప్పాడు. సుభద్ర వాళ్లకు కూడా పెరుగు వడలు తెచ్చిపెట్టింది. ‘మంచి సమయానికే వచ్చాం’ నవ్వుతూ పెరుగు వడలు అందుకున్నాడు గోవిందరాజు.
‘తాళాలంటే గుర్తుకొచ్చింది, షిర్డీ వెళ్లే దారిలో శనిసింగణాపూర్ వస్తుంది కదా. ఆ ఊళ్లో ఇళ్లకు తలుపులు, తాళాలు ఉండవు. శనీశ్వరుడు దొంగలను శిక్షిస్తాడని, ఏడేళ్లపాటు పీడిస్తాడని అక్కడి ప్రజలు నమ్ముతారు. ఆ భయంతో ఎవరూ దొంగతనాలకు పాల్పడరన్న ధీమాతో ఉంటారు’ అంది రమాదేవి ‘తాళాలు వేసినా దొంగలు పడతారని భయపడే రోజుల్లో వాళ్లు తాళం వేయకుండా ఎలా ఉంటున్నారో’ అంది సుభద్ర. మాజాతిని వాడని ఊరే ఉందని విని నాతో పాటు ఇంట్లో ఉన్న మాజాతి అంతా నివ్వెరపోయింది. ‘తాళం, దొంగలు అంటే నాకు ఇంకో సంగతి గుర్తుకొస్తోంది. మధ్యప్రదేశ్ లోని త్రిలోచన్ గౌర్ అనే ఊళ్లో ఓ డిప్యూటి కలెక్టర్ గారింట్లో ఓ రోజు రాత్రి ఓ దొంగగారు ఇంటి తాళం పగలగొట్టి మరీ లోపలకి ప్రవేశించాడు. కానీ ఇంట్లో విలువైనవేవీ దొరక్క పోవడంతో, తాళం పగలగొట్టిన కష్టమంతా వ్యర్థమైనందుకు దొంగకు చిర్రెత్తుకొచ్చింది. ‘మీ ఇంట్లో డబ్బు లేనప్పుడు తాళం వేయడం ఎందుకు కలెక్టర్?’ అంటూ ఓ ఉత్తరం రాసిపెట్టి మరీ నిష్క్రమించాడట’ నవ్వుతూ చెప్పాడు గోవిందరాజు. మా తోటితాళం మీద దాడి జరగడం మాకెంతో బాధ కలిగించింది. అదే సమయంలో దొంగగారు ఉత్తరం రాయడం నవ్వు తెప్పించింది. ‘భలే దొంగే’ అని అంతా అంటుంటే, ‘నేను మీకు మరో వింత సంగతి చెపుతాను. టర్కీలో ఇబ్రహీం యుసెల్ ఆయనకు సిగరెట్లు విపరీతంగా తాగే అలవాటు ఉందట. పదహారేళ్ల వయసునుంచే ధూమపానం అలవాటై, దాన్ని మానుకోవటం ఎలాగో అర్థంకాలేదట. అంతలో తన తండ్రి ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో చనిపోవటంతో తాను కూడా పోతానన్న భయంతో ఎలాగైనా సిగరెట్లు మానాలని తన తలకు ఒక బోను అమర్చుకుని, దానికి తాళం వేసి, ఆ తాళంచెవిని భార్యకు ఇవ్వడం మొదలు పెట్టాడట’ ముగించిది చిత్ర.
అది విని అంతా నవ్వుతూ ‘తలకు బోను, దానికి తాళం’ బాగుంది అన్నారు. నేను మాత్రం ‘మా జాతి దురలవాట్లు మానుకోవడంలో కూడా సహాయపడుతోంది’ అనుకుంటూ గర్వపడ్డాను. అంతలో ధనుంజయ్ అందుకుని ‘మీరు మౌలాలి హిల్ మీద ఉన్న దర్గా గురించి విన్నారా?’ అడిగాడు. ‘లేదు’ అన్నారంతా. ‘అయితే వినండి. హైదరాబాద్ లోనే ఉన్న మౌలాలి హిల్ ఏక శిల. మూడొందల మెట్లు ఎక్కి పైకి వెళితే దాని మీద నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన కోహ్-ఎ-మౌలాఅలీ దర్గా ఉంది. అక్కడ ఎప్పుడూ జనం ఉంటారు. దర్గాలోకి ప్రవేశిస్తే మధ్యలో ఒక లోహపు వలతోపాటు తలుపులకు వేలాడదీసిన అసంఖ్యాక తాళాలు కనిపిస్తాయి. అక్కడ తాళం వేసి, ప్రార్థనలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. కోరికలు నెరవేరిన భక్తులు తిరిగి వచ్చి తాము వేసిన తాళం తెరుస్తారు’ వివరించాడు.
‘కోరికలకు తాళం వేయడం చేతకాక ఈ తాళాల గొడవలన్నీ’ అన్నాడు గోవిందరాజు. ‘ఆహా! ఏం చెప్పారండీ. కోరికలకు తాళం’ సాగదీస్తూ రమాదేవి అనడంతో అంతా నవ్వారు. ఈ సంగతి మాకెంతో ఆశ్చర్యంగా అనిపించింది.
‘నేను ఆ మధ్య తిప్పుడు తాళం గురించి చదివా’ అంది సుభద్ర. ‘అదేమిటీ!’ అన్నారంతా ఆశ్చర్యంగా. మాక్కూడా తమాషాగా అనిపించింది. ‘అయితే వినండి. నాగర్ కర్నూల్ జిల్లాలోని పర్వతాపురం గ్రామంలో ఒకరింట్లో ఇప్పటికీ పాతకాలం నాటి తిప్పుడు తాళం వాడుతున్నారట. ఆ తాళంచెవి చాలా పెద్దగా ఉంటుందని, తాళం వేయాలన్నా, తీయాలన్నా రెండు నుంచి, మూడు నిమిషాల సమయం పడుతుందని రాశారు. ఇటువంటి తాళాలు వందేళ్ల క్రితం వాడుకలో ఉండేవట’ అంది సుభద్ర. ‘ఇంకా చెడిపోకుండా పనిచేయడం విశేషమే’ అంది రమాదేవి. నేను మా జాతి సామర్థ్యం విని గర్వంతో ఉప్పొంగాను.
అంతలో చైత్ర మాట్లాడుతూ ‘ఎవరింటికి వాళ్లు తాళం వేసుకోవడం మామూలే కానీ, ఆ మధ్య చైనాలో కోవిడ్ మహమ్మారి చెలరేగిన నేపథ్యంలో ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ఒక అపార్ట్‌మెంట్ లోని ఫ్లాట్‌కు, అందులో నివాసమున్న వారికి కోవిడ్ సోకిందన్న కారణంపై అధికారికంగా తాళాలు వేసి, వారిని బందీలను చేసింది. ఆ పైన ఆ ఫ్లాట్‌లో అగ్నిప్రమాదం సంభవించి, లోపలి మనుషులు బయటకు వచ్చే వీలులేక అగ్నికి ఆహుతైపోయారు. ఎంత విషాదం! తాళం వేయకుండా ఉంటే వారు బతికి ఉండేవారు కదా’ అంది. ‘నిజమే. ఒక్కోసారి జాగ్రత్త చర్యలు కూడా ప్రమాదాలకు కారణమవుతాయని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు’ గోవిందరాజు అన్నాడు. నేరం మాది కాకపోయినా, మేమే వారినడ్డుకున్నట్లయిందని నా మనసుకు ఎంతో విచారం అనిపించింది.
‘అన్నట్లు తిరుమలలో తాళాల గురించి తెలుసుకోదగ్గ విషయం ఒకటుంది’ సుభద్ర అనగానే, ‘చెప్పండి, చెప్పండి’ అంది రమాదేవి. సుభద్ర ‘అయితే వినండి, తిరుమలలో ధ్వజస్తంభ మండపం ఆవరణలోనే బలిపీఠానికి ఈశాన్యాన బలిపీఠం ఆకారంలోనే ఒకటిన్నర అడుగుల ఎత్తుతో ఒక శిలాపీఠం గతంలో ఉండేదట. దాన్నే క్షేత్రపాలక శిల అంటారు. తిరుమల క్షేత్రానికి పరిపాలకుడు రుద్రుడు అంటే శివుడు కావడం విశేషం. ఈ శిలే ఆలయాన్ని కాపలా కాసేది. రాత్రిపూట అర్చకులు ఇంటికి వెళ్లేటప్పుడు గుడి తాళం చెవులను ఈ శిలపై పెట్టి నమస్కరించి వెళ్లటం ఆనవాయితీ. మళ్లీ తెల్లవారి అర్చకులు వచ్చి ఆ శిలకు నమస్కరించి తాళంచెవులను తీసుకోవడం జరిగేది. అయితే ఆ తర్వాత కాలంలో కారణాంతరాల వల్ల ఆ శిలను తిరుమలకు సమీపంలోని గోగర్భం తీర్థంకు తరలించారు. ఆ శిలలోని చిన్నభాగం మాత్రమే ఇప్పుడు అక్కడ క్షేత్రపాలక శిలగా మిగిలివుంది. ప్రస్తుతం నిత్యం అర్చకులు తమ తాళాల గుత్తిని, కుంచెకోలను క్షేత్రపాలక శిలకు తాకించి నమస్కరించి ధ్వజస్తంభానికి ప్రదక్షిణ చేస్తూ వెళ్లి ఆలయ ప్రవేశం చేస్తారు. అలాగే రాత్రి ఏకాంతసేవానంతరం ఇంటికి వెళుతూ అర్చకులు తమ బీగాలను, కుంచెకోలను ఈ క్షేత్రపాలక శిలకు తాకించి నమస్కరించి వెళతారు’ వివరించింది. ‘గతంలో క్షేత్రపాలక శిల వద్దే తాళంచెవులు ఉంచడం గొప్పసంగతి. నీతి, న్యాయం, పాపభీతి ఉన్నరోజులవి. ఈ కాలంలో ఇల్లయినా, ఆలయమైనా, ఇతర ఏ కార్యాలయమైనా, పెట్టె అయినా, బ్యాగ్ అయినా భద్రతకు తాళాలు తప్పవు. తాళం చేతులను సురక్షితంగా ఉంచకపోతే ముప్పు తప్పదు’ అంది రమాదేవి. ‘నిజమే’ అన్నారంతా.
‘అవునూ! గణపతి తాళం అంటారు. అదేమిటి?’ అంది చైత్ర. వెంటనే ధనుంజయ్ నవ్వుతూ, ‘భలేదానివే. అది తలుపుల తాళం కాదు. వేదాల్లోని స్తోత్రం.
‘వికటోత్కట సుందర దంతి ముఖం
భుజగేంద్ర సుసర్ప గదాభరణమ్.. అని మొదలై
ధిక్ తకిట, ధిక్ తకిట, ధిక్ తకిట తత్తోం
ప్రమథ గురు శివ తనయ గణపతి తాళనం
గణపతి తాళనం.. గణపతి తాళనం’ అని ముగుస్తుంది’ చెప్పాడు. ‘అలాగా’ అంది చైత్ర.
‘సంగీతంలో కూడా తాళం వేస్తారు. అయితే అది పాట వేగాన్ని కొలిచే ప్రక్రియ. అంటే నిర్ణీత కాల వ్యవధిలో క్రమబద్ధమైన, లయబద్ధమైన రీతిలో వచ్చే ఒక దరువు. పాటకు రాగం, తాళం రెండూ ప్రధానమే. కీర్తనలు గానం చేసేవారు చేత్తో తాళం వేయడం చూస్తుంటాం కదా, ప్రధానంగా ధ్రువతాళం, మఠ్యతాళం, రూపకతాళం, ఏకతాళం, త్రిపుట తాళం, ఝంపై తాళం, అట తాళం అని ఏడు రకాలు ఉన్నాయి. ఇవి స్థూలంగానే. ఇంకా చెప్పాలంటే ముప్ఫయ్ అయిదు తాళాలున్నాయి’ అంది రమాదేవి. మా పేరు వేరే వాటికి కూడా ఉండటం ఇప్పుడే తెలుసుకున్నా.
‘అబ్బో! బాగానే చెప్పావే, సంగీతంలో తాళం గురించి నీకింత తెలుసా?’ ఆటపట్టిస్తూ అన్నాడు గోవిందరాజు. ‘ఎందుకు తెలీదూ. మీతో పెళ్లయింది. నా సంగీతానికే తాళం పడింది’ చిరుకోపం ప్రదర్శించింది రమాదేవి. ‘అన్నయ్య మాటలకేం గానీ భజనలు చేసే వాళ్లు కూడా ఇత్తడి కంచు తాళాలను లయబద్ధంగా మోగిస్తారు కదా’ అంది సుభద్ర. ‘అవునవును’ అన్నారంతా. ‘ఎన్ని విశేషాలు వింటున్నానో ఇవాళ’ అనుకున్నాను నేను. అంతలో ధనుంజయ్ అందుకుని ‘పోతన భాగవతంలో కూడా తాళాల ప్రస్తావన ఉంది. చిన్నికృష్ణుడు పుట్టింది చెరసాలలో కదా. దానికి తాళాలు వేసి, కాపలా ఏర్పాట్లు దిట్టంగా చేశాడు కంసుడు. మరి చిన్ని కృష్ణుణ్ని అక్కడినుంచి నందుడి ఇంటికి తరలించడమెలా? చిన్ని కృష్ణుడు మహిమ చూపనే చూపాడు.
ఆ ఘట్టాన్ని ఇలా వర్ణించారు.
అప్పుడు చప్పుడు కాకుండ దప్పుటడుగులిడుచు,
నినుప గొలుసుల మెలుసులు వీడిన దాలంబులు
మహోత్తాలుండైన బిడ్డనికి నడ్డంబుగాక కీలూడి వీడిపడ..
అంటాడు పోతన. తాళాలు వాటికవే ఊడటం ఎంత అద్భుతం!’ అన్నాడు. ‘చాలా బాగుంది’ అంతా మనస్ఫూర్తిగా మెచ్చుకున్నారు.
అంతటి గొప్ప సందర్భంలో మా పాత్ర నాకెంతో ఆనందం కలిగించగా ‘జై శ్రీకృష్ణ’ అనుకున్నాను. అంతలో మధు వచ్చాడు. ‘ఏంటి అంతా ఏదో చర్చిస్తున్నారు?’ అడిగాడు. ‘ఏంలేదు. ఏదో తాళాల ప్రస్తావన వచ్చి, దాని గురించి మాట్లాడుకుంటున్నాం’ అన్నాడు ధనుంజయ్.
‘తాళాల గురించి ఎన్నో సంగతులు చెప్పుకున్నాం. మీరు చాలా మిస్ అయ్యారు. తాళాల గురించి మీకేం తెలుసో చెప్పండి’ అంది చైత్ర.
‘నేను మిస్ అయినా మిసెస్‌వి నువ్వున్నావుగా. తలుపులకు తాళాలు వేస్తామన్నదే తెలుసు. మరొకటి మా ఆఫీసర్ గారికి పక్కతాళం వెయ్యడం తెలుసు’ మధు అనటంతో అంతా పకపకా నవ్వారు. పక్కతాళం అనే మాట ధనుంజయ్ తరచు వాడతాడు కాబట్టి అది నాకర్ధమై నేనూ నవ్వుకున్నాను. ఇంతలో సుభద్ర పెరుగు వడలు తెచ్చి అల్లుడికి అందించింది. మధు తింటుండగా ‘అయితే తాళాల గురించి మీరింకేం చెప్పలేరా?’ అడిగింది. ‘ఉండు ఓ క్షణం’ అంటూ ఓ ఆవడ లాగిం చేసి, ‘ఆఁ తాళంచెవి కీలకంగా ఉన్న కథతో సినిమాలు కూడా వచ్చాయి. హిందీలో ‘విక్టోరియా నం. 203’ గా వచ్చిన ఆ సినిమాను తెలుగులో ‘అందరూ దొంగలే’ పేరుతో తీశారు. జైలు నుంచి విడుదలైన ఇద్దరు దొంగలకి ఓ తాళం చెవి దొరకటంతో, అక్కడి నుంచి కథ స్వీట్ స్వీట్, హాట్ హాట్‌గా సాగుతుంది. ఈ సినిమాలో
చంటిబాబు ఓ బుజ్జిబాబూ..
నీ పంట పండితే నవాబూ
ఉంది తాళం ఏది బీగం లేనేలేదా జవాబూ?..
అని ఓ సరదా పాట బాగా పాపులర్ కూడా. అయితే వాళ్ల దగ్గరున్నది తాళం చెవి, తాళం ఎక్కడుందో తెలియాలి.. కానీ పాటలో ‘ఉంది తాళం ఏదీ బీగం’ అని రాశారు. అలాగే ‘పుష్పక విమానం’ సినిమా కూడా. ఈ సినిమాలో సంభాషణలుండవు. ఒక నిరుద్యోగ గ్రాడ్యుయేట్‍కి ఓ రాత్రి రోడ్డుపక్కన తాగి పడిపోయిన ధనవంతుడు కనిపిస్తాడు. నిరుద్యోగి అతడి జేబుల్లో ఖరీదైన పుష్పక్ హోటల్ సూట్ తాళంచెవి చూస్తాడు. దురాశతో ఆ ధనవంతుడిని కిడ్నాప్ చేసి, తానుండే ఆనంద్ భవన్‌కి తరలించి, అతడి దుస్తులు తాను ధరించి, పుష్పక్ హోటల్‌కి వెళ్లి విలాస జీవితం ప్రారంభిస్తాడు. కథ అనేక మలుపులు తిరిగి, చివరకు నిరుద్యోగిలో పరివర్తన కలిగి తన అసత్య జీవితానికి ముగింపు పలుకుతాడు’ చెప్పాడు.
‘భలే ఉన్నాయి కథలు’ అనుకుంటుంటే, ‘అవునవును. నువ్వు చెపుతుంటే మాకూ గుర్తుకొస్తోంది’ అన్నారు ధనుంజయ్, గోవిందరాజు.
‘మూడొచ్చింది. ఇంకా చెపుతా వినండి, తాళాల్లో ఎన్నోరకాలు. తాళంచెవి తోనే తాళం వేయడం, తీయడం ఒకరకమైతే, మరోరకం తాళం వేయడానికి తాళంచెవితో పని ఉండదు. పైనున్న తొండాన్ని నొక్కితే సరిపోతుంది. మళ్లీ తాళంచెవితో దాన్ని తీయగలం. సూట్‌కేసుల తాళాలు, బీరువా తాళాలు, బ్యాగుల తాళాలు, ఇనప్పెట్టె తాళాలు, బ్యాంకుల్లో స్ట్రాంగ్ రూమ్ తాళాలు, లాకర్ల తాళాలు, వాహనాల తాళాలు ఇలా రకరకాల తాళాలున్నాయి. ఇంకో తమాషా, తాళంచెవి, తాళం చేతులు అని రెండురకాల పదాలు వాడుతుంటారు. ఇవన్నీ గాక, రోజంతా అదేపనిగా వాగేవాళ్ల నోళ్లకు మాత్రం ఇంకా తాళాలెవరూ కనుక్కోలేదు’ అనగానే అంతా నవ్వారు.
‘ఇంకా చెప్పండి’ అంది రమాదేవి. దాంతో మధు రెట్టించిన ఉత్సాహంతో ‘తాళంచెవులను జాగ్రత్తగా ఉంచుకోవడానికి కీ చెయిన్లు, కీ పౌచ్‌లు ఉంటాయి. ప్రసిద్ధ ప్రదేశాలలో ఆ ప్రాంతానికి చెందిన బొమ్మలతో కీ చెయిన్లు అమ్ముతారు. ఇంకా రకరకాల ఆకారాల్లో వినూత్నంగా కీ చెయిన్లు దొరుకుతున్నాయి. బహుమతి వస్తువుగా కూడా కీ చెయిన్లకు గిరాకీ బాగా ఉంది. కొత్త సంవత్సరం వచ్చిన సందర్భంలో కొన్ని బ్యాంకులు, ఇతర కార్యాలయాలు తమ సంస్థ పేరుతో కూడిన కీ చెయిన్లను వినియోగదారులకు బహుమతిగా ఇస్తుంటాయి. ఇంక ధనవంతుల ఇల్లాళ్లయితే చీరె కుచ్చెళ్ల పక్కనే ఓ కళాత్మక కీ చెయిన్‌కి తాళంచెవుల గుత్తి తగిలించుకోవడం తెలిసిందే. ఆ తాళం చెవులు ఎవరి చేతిలో ఉంటే వారిదే సామ్రాజ్యం. తాళంచెవులు తన చేతికివ్వలేదని కోపంతో రగిలే కోడళ్లెందరో. కార్యాలయాల్లో కూడా బదిలీలు, పదవోన్నతుల సందర్భాలలో తాళంచెవుల అప్పగింత ఓ ప్రధానఘట్టం. కొంతమంది తాళంచెవులను రాత్రిపూట దిండుకింద పెట్టుకుని పడుకుంటారు. వేలెడంత ఉండదు కానీ ఇంటిని కాపాడుతుంది అని ఒక సామెత. నిజమే. తాళంచెవి ప్రాధాన్యం ఇంతా అంతా కాదు. అందుకే కాబోలు ఇంగ్లీషులో కీలక పాత్ర, కీలక స్థానం, కీలక వ్యక్తి అనడానికి కీ రోల్, కీ పొజిషన్, కీ పర్సన్ పదాలున్నాయి’ అనడంతో, ‘మా జాతికి ఇంత కథ ఉందా?’ అని నేను ఆశ్చర్యానందాలలో ఓలలాడుతుంటే, ‘పెరుగు వడలు బాగా పనిచేశాయి. అద్భుతంగా చెప్పారు’ చైత్ర అనడంతో అంతా నవ్వారు.
‘ఇంకో చిత్రం వినండి, మా ఆయనైతే తాళం తీశాక, తలుపుకే దాన్ని తగిలించి ఆ విషయమే మరిచి పోతారు. మళ్ళీ వేయాలనుకున్నప్పుడు దానికోసం వెదుకులాట, చివరకు అది తలుపుకే వెక్కిరిస్తూ కనిపిస్తుంది’ నవ్వాపుకుంటూ చెప్పింది రమాదేవి. వెంటనే గోవిందరాజు అందుకుని ‘నువ్వు మాత్రం, తాళము వేసితిని, గొళ్లెము మరిచితిని రకం కాదు’ అనడంతో ‘ఇంకేం, సరిపోయారు జోడీ’ అన్నాడు ధనుంజయ్. ‘ఇంక మేం వెళ్లొస్తాం’ అని గోవిందరాజు లేవడంతో, రమాదేవి కూడా లేచింది. ‘తాళం చేతులున్నాయికదా’ సుభద్ర అనడంతో గోవిందరాజు జేబు తడుముకోవడం చూసి మళ్లీ నవ్వుల సందడి. ఆ వెంటనే మధు ‘మనం కూడా బయల్దేరుదామా’ అనడంతో ‘అలాగే’ అంటూ చైత్ర లేచింది. ‘అమ్మా! నాన్నా! వెళ్లొస్తాం’ చైత్ర అంటుంటే ‘జాగ్రత్తగా వెళ్లండి. ఇల్లు చేరగానే ఫోన్ చెయ్’ అంది సుభద్ర. తలూపింది చైత్ర.
వాళ్లకు వీడ్కోలు చెప్పి, ఇద్దరూ లోపలికి వచ్చారు. ‘అలసటగా ఉంది, పడుకుంటా’ అని సుభద్ర పడకగదిలోకి వెళ్లింది. ధనుంజయ్ డైరీ ముందేసుకు కూర్చున్నాడు. నాకయితే ఇంకా మా జాతి ఆలోచనలే మదిలో తిరుగాడుతున్నాయి. ‘మానవులకు భద్రతా సేవలను అందించడం మా జాతికి గర్వకారణమే. కానీ తాళంచెవులను కాజేసేవారు, డూప్లికేట్ తాళాలతో దొంగతనాలకు పాల్పడేవారు ఎందరో. కొందరు దుర్మార్గులైతే దొంగతనాలు చేస్తూ, మా తలలు పగలగొట్టడం ఎంత దారుణం! మా గురించి ఎవరూ పాపం అనుకోరు. దొంగలు, తాళంచేతులివ్వమని ఇంటి వారిని బెదిరించినప్పుడు, వారు ఇవ్వకపోతే వారిని హింసించడం, చంపడం.. అవన్నీ చూస్తూ కూడా మేం నిస్సహాయులం కావడం అదో వేదన’ అనుకుంటుంటే ధనుంజయ్ టీవీ పెట్టడంతో నా చూపు అటు.. పాత సినిమాలో పాట నడుస్తోంది.
కారున్న మైనరు.. కాలం మారింది మైనరూ
ఇక తగ్గాలి మీ జోరూ.. మా చేతికి వచ్చాయి తాళాలు,
మా చేతికి వచ్చాయి తాళాలు.. హత్తెరె!..
ఏమని చెప్పుదు వీనుల విందు!