నీరజ్ – తీరని కోరికలకు పర్యాయం-1

0
3

(సుదర్శన్ చోప్‍డా సంపాదకత్వంలో 1976లో వెలువడిన ‘నీరజ్ – అపూరిత్ కామనావోం కా పర్యాయ్’ అనే రచనని అనువదించి అందిస్తున్నారు డా. టి.సి.వసంత.)

[dropcap]“ఎ[/dropcap]ట్లా ఉన్నావు?” నీరజ్, నీలిమని గుర్తు పట్టాడు. సహజంగా అడిగాడు. అతడు ఇది మొదటిసారి కాదు నీలిమని కలవడం. ఇక గుర్తుపట్టడం విషయానికి వస్తే చాలా కాలం తరువాత ఎంతో ఆత్మీయంగా ఏ సంకోచం లేకుండా ఉత్తరాలు రాసుకున్న ఇద్దరు స్నేహితులు (పత్ర – విత్రులు, లేఖా మిత్రులు) ప్రత్యేకమైన ఒక స్థలంలో కలుసుకోవాలని అనుకోవడం, వారిద్దరిలో ఎవరో ఒకరు, ఒకరిని చూసుకుంటే గుర్తుపట్టడం ఎంతో సహజంగానే ఉంటుంది. అంతే కాదు. సంబోధన చేసే పదాలు, పదాల స్వరం సహజంగానే ఉంటాయి.

“ఎట్లా ఉన్నావు?” సహజంగా వెలువడిన ప్రశ్నకి నీలిమ నోటి నుండి సహజంగా ఈ మాటలు వచ్చాయి –

“ఎట్లా కనిపిస్తున్నానో అట్లా..” అసలు నీలిమకి కూడా అనిపించలేదు, తాను మొదటిసారిగా నీరజ్‌ని కలిసానని. ఎన్నో సార్లు కవి సమ్మేళనాలలో వేదిక పైన ఆమె నీరజ్‍ని చూసింది. గీతాలను విన్నది. అయినా కలవడం ఇదే మొదటిసారి. కాని నిత్యం కలిసే ఆత్మీయుడిని కలిసినట్లుగా ఆమెకి అనిపించింది.

“ఇప్పుడు నీవు ఎట్లా ఉన్నావు?” ఈ ప్రశ్న మర్యాద మన్నలను నిర్వహించడానికి వేసినది ఎంత మాత్రం కాదు. కేవలం ఒక హితైషిలో ఉండే జిజ్ఞాస ఉంది. ఇంతకు ముందు అతడు ఎట్లా ఉన్నాడో ఆమెకు తెలుసు కాని ఇప్పుడు ఎట్లా ఉన్నాడో తెలుసుకోవలన్న తపన ఆమెలో కనిపిస్తోంది.

నీలిమలోని ఈ తపన నీరజ్‍కి ఎటూ తెలుసు. కాని మొదటి కలయిక వలన వచ్చే సంతోషాన్ని తగ్గించడం అతడికి ఇష్టం లేదు. అందువలన నవ్వుతూ అన్నాడు – “ఎట్లా ఉన్నావో చూస్తున్నావుగా! నీ ఎదురుకుండానే ఉన్నాను. ఇప్పుడు నీ ఎదురుకుండా వచ్చానంటే ఆరోగ్యంగా ఉన్నట్లేగా..”

తల ఎదురుకుండా కూర్చున్న చామనచాయలో అందంగా ఉన్న నీలిమని ఒకసారి తనివితీరా చూసాడు. నీరజ్ మనస్సులో ఏ మూలో తెలియని ఒక అనుభూతి కలిగింది. కాని ఈ అనుభూతి ఏ సుఖానికైనా సంబంధించిందా లేక ఏ కోరికైనా ఉందా? లేక ఏదైనా కష్టానికి సంబంధించిన బాధా? కాని మరో నిమిషంలో తనను తాను సంబాళించుకున్నాడు. “ఎట్లా అనిపిస్తోంది?” అడగనైతే అడిగాడు. కాని ఎందుకు అడిగాడో ఏ మాత్రం స్పష్టత లేదు. ఎవరిని అడిగాడో.. “ఎవరికి ఎట్లా కనిపిస్తున్నాడు? అతడికా లేక నీలిమకా? ఎట్లా అనిపిస్తోంది ఈ కలియిక?”

“?” నీలిమ ముఖంలో కూడా ప్రశ్న. కాని ఆమె మౌనంగా ఉంది.

“నా అభిప్రాయం..” నీరజ్ స్వరానికి మాటలు దొరకలేదు.

నీలిమ వెతకడంలో సహాయం చేసింది. వెతకడానికి విముక్తి నిచ్చింది – “చాలా బాగా అనిపిస్తున్నావు” ఆమె అన్నది.

“ఏమిటి?” ఏ ప్రయత్నం లేకుండా అడిగాడు.

“అంతా.. అవును అంతటా.. మనం.. మన మధ్య ఉన్న ఈ క్షణాలు.. నీలిమ స్వరంలో సువాసన..” ఫుల్‌ఫిల్డ్.. భావం వ్యక్తం అవుతున్నాయి. అనుభూతి చెందిన శబ్ద శిల్పి నీరజ్‌కి శభ్దాలు కోళ్ళలా అనిపించాయి. కుక్.. కుక్ అంటూ అనుభూతుల గింజలను ఏరుకుంటూ.. ఏ ఉపయోగం తెలియని ఎగురుతున్న మూగ ప్రాణులు.. ఆతడు ఎన్నో క్షణాలు మౌనంగా ఉన్నాడు. ఆమె వంక తదేకంగా చూస్తూ.. నీలిమ సగం ముసుకున్న కనురెప్పలు, అందమైన చెక్కిళ్ళ పైన, ఆ సంతృప్తిని తన దోసిట్లో నింపుకునే ప్రయత్నం చేస్తూ..

..ఈ క్షణంలో మౌనం ఇద్దరికీ ఆనందాన్నిస్తోంది.

..ఇంతగా మౌనం ఇద్దరికీ ఇదివరకెప్పుడు తెలియదు.

..ఇటువంటి  మౌనాన్ని వ్యక్తపరిచే ఏ పదాలను ఇప్పటి వరకు మానవుడు ఏ భాషలోను చెప్పలేకపోయాడు. మానవుడి ద్వారా తయారు చేయబడ్డ ఏ భాషా శబ్దాలలోనూ ఈ అనుభూతిని  అక్షరాలు వ్యక్తపరిచే శక్తి లేదు.

అనుభూతిని అక్షరాలా వ్యక్తపరచలేము.

కాని అక్షరాలు వ్యక్తపరచే అనుభూతిని తీసుకోగలగుతారు. అనుభూతిని తీసుకునే వాళ్ళు వ్యక్తం చేసే వాళ్ళలా, వాళ్ళ అనుభూతిని అంతే గాఢంగా అనుభూతి చెందగలగాలి, ఆ శక్తి వాళ్ళల్లో ఉండాలి.

నీరజ్ ఆలోచిస్తున్నాడు.. శబ్దాల పంక్తుల మధ్య ఉన్న భావాన్ని తెలుసుకోగలగాలి. శబ్దాల సీమను దాటి అనుభవించే శక్తి వ్యక్తిలో ఉండాలి. ఎవరిలోనైతే ఈ శక్తి ఉండదో ఆ వ్యక్తి సాహిత్యంలోని భావ ప్రకటనను అర్థం చేసుకోలేడు. రసాస్వాదన చేయలేడు.

“దేని గురించి ఆలోచిస్తున్నావు నీర్!” భావుకతతో అడిగింది నీలిమ.

“ఉఫ్!” నీరజ్ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు. “ఇప్పుడే హఠాత్తుగా నా కనిపించింది – శబ్దాలు కేవలం గొడవ (అల్లరి) లా అనిపిస్తాయి. ఒక తమాషాలా అనిపిస్తాయి. కాని భావాలు, అనుభూతులు లేని లోతైన సాగారాల వంటివి. పదాలు బత్తాసు (మిఠాయి) లాంటివి. అందువలన మనస్సులోని ఏదైనా ముఖ్యమైన విషయాన్ని పదాలలో కన్నా మౌనంగా వ్యక్తం చేస్తేనే మంచిది.”

“అందువలననే కళ గురించి ఎవరో ఇట్లా అన్నారు. మనం చూసేది కళ కాదు. దేని గురించి అయితే మాట్లాడుతామో అదే కళ.”

“నీలూ! చెప్పు.. లేక చెప్పే శక్తి లేదా?”

“ఏదైనా ఒకటేగా!”

“ఊహు! ఎంత మాత్రం కాదు. ఇది భావాలను వ్యక్తపరచగల శబ్దాల సీమ గురించి. అంతే కాని తెలిసి తెలిసి ప్రయత్నం చేసి చెప్పకుండా ఉంటడం కాదు. శబ్ద శక్తి అభివ్యక్తి గురించి మాట్లాడుతున్నాను. ఈ సందర్భంలోనే నేను మౌనం మాట ఎత్తాను. అనుభూతి ఎంత గాఢంగా ఎంత తీవ్రంగా ఉంటే, దాన్ని వ్యక్తం చేసే సమయంలోను పదాలను ఆచితూచి రాసే ఆ శక్తి.. నన్ను కథా సాహిత్యం వైపు మళ్ళించలేదు. కావ్యాన్ని రాయించింది. కావ్యంలో ఉండే విస్తారాన్ని కూడా నేను ఇష్టపడలేదు. అందుకే చిన్న – చిన్న గీతాలను, వాటి కన్నా చిన్న ముక్తక్‌లు నాలో ఉన్న తపనకి, క్షభకి, ముక్తి నిచ్చాయి.”

“ఒక ప్రశ్న అడగనా?” మధ్యలో ఆమె ప్రశ్నించింది.

అతడు ఒక్కసారిగా చలించిపోయాడు.

ఆమె అతడిని చూసి సిగ్గుపడింది. కళ్ళను కిందకు వాల్చింది.

“సారీ నీర్! నీవు చెబుతూ పో..”

“నీల్! అడుగు! నీవు ఇప్పుడే ఏదో ప్రశ్నించాలని అనుకున్నావు.” తనని తాను సంబాళించుకుంటూ అడిగాడు నీర్.

నీల్ స్వరంలో సంకోచం వ్యక్తం అవుతోంది. కనురెప్పలు కిందకే వాల్చి ఉన్నాయి – “అసలు నీలో ఈ తపన క్షోభలకి మూలకారణం తెలుసుకోవాలని ఉంది. పోనీ వదిలేసేయి. అసలు నీకు చెప్పాలని ఉందో లేదో”

“ఉఫ్!” నీర్ నిట్టూర్చాడు. “అసలు మూలం ఏమిటా నేనే తెలుసుకోగలిగితే ఎంతగా బాగుండేది. తెలుసుకుని ఉంటే ఈ బాధ నుండి విముక్తి పొందేవాడినిగా.. కాని..” మెడకి తెలియని ఏదో దెబ్బ తగిలినట్లుగా అనిపించింది. దవడలలో చలనం లేదు. కళ్ళు మూసుకుపోయాయి.

సహనుభూతితో నీల్ నీర్ వైపు చూసింది. తన దృష్టి విచిత్రంగా అతడి చెక్కిళ్ళపై నుండి జారుతున్నట్లుగా అనిపించింది. ఆమెలో పులకింత కలిగింది. ‘ఈ తపన – క్షోభ అనే ముల్లు నీకు లభించి ఉండకపోతే.. గీతాలకి నీరజ్ ఎట్లా లభిస్తాడు?’ నీల్‌కి అడగనా అని అనిపించింది.

అనిపించినా అడగలేకపోయింది.

నీర్ మాట్లాడటం మొదలు పెట్టాడు – “అసలు తెలియని ఏదో అశాంతి నన్ను ప్రతీక్షణం ఆవరించే ఉంటుంది. అసలు విలవిలలాడటం  ఈ తపన దేన్ని పొందాలనో నాకే అర్థం కాదు. పొందాల్సినదేదో, ఎక్కడుందో తెలియదు. ఈ వ్యాకులత నుండి బయటపడటానికే నేను గీతాల గర్భంలో, ఆ గుహలో తలదాచుకుంటాను.”

“ఈనాడు అసలు నీకు ఏం తక్కువైయిందని నీరజ్? – అని నీవు ప్రశ్నించవచ్చు. అవును పైపైన చూస్తే ఏదీ తక్కువ లేదు. ప్రసిద్ధి ఉంది, సమృద్ధి ఉంది. పేరు ప్రతిష్ఠలు ఉన్నాయి. ఆర్థికంగా ఏ లోటు లేదు. కాని ఇవేవీ నాకఖరలేదు. ఒకవేళ ఇవే కావాలనుకుంటే మరి నాకు ఇవి లభించాయి కదా! శాంతి ప్రాప్తించాలి కదా! అసలు నేను కోరనివి లభించాయి. కోరినవి, మనస్సుకు నచ్చింది ఏదీ దొరకలేదు. ఇదే నాలోని అశాంతి, వ్యాకులత, క్షోభ, బాధ.”

“ప్రేమ విషయంలో నీకు పెద్ద గాయం తగిలిందని అనిపిస్తోంది.”

“అవును. ఎన్నో గాయాలలో అదీ ఒక గాయం.”

నీరజ్ ముఖంలో ఉదాసీనత కనిపిస్తోంది. పెదవులపై ఒక మూలన చిరునవ్వు కనిపిస్తోంది. తన పైన తనకే వ్యంగ్యమూ! లేకపోతే తన పైన తనకే దయా!

నీలిమకి ఏదీ సరిగా తెలియలేదు.

“ఎప్పటి మాట?”

“ఈ జన్మలోనిదే కాని ఇప్పుడనిపిస్తుంది వెనక జన్మలో ఇదంతా జరిగిందని. నేను అప్పుడు హైస్కూల్లో చదివేవాడిని ఏటాలో.. ఆ అమ్మాయి పదహారేళ్ళ వయస్సులో ఉంది. లేత వయస్సులో ప్రేమ ఫలిస్తే ఎంతో మంచిది. లేకపోతే నాలాంటి భావుకుడిని పిచ్చివాడిని చేస్తుంది. ఆ అమ్మాయి నుండి విడిపోయినప్పుడు నా పరిస్థితి ఎట్లా ఉందో నాకే తెలుసు. ఆ రోజుల్లో నేను మేనత్తగారి ఇంట్లో ఉండవాడిని. మామయ్య నన్ను చదివించారు.”

“ఎందుకు?”

“మా నాన్నగారు (నీరజ్ నాన్నగారి పేరు బాబు బ్రజకిషోర్. వీళ్ళది కాయస్థ కులం) దివంగతులైనప్పుడు నాకు ఆరు సంవత్సరాలు. మా ఇల్లు – పొలం ఇటావా జిల్లాలో ఉండేవి. పురావతి మా ఊరు. కాని నాన్నగారు అక్కడిదంతా అమ్మేసి కాన్‌పూర్ స్టేట్‌కి వెళ్ళిపోయారు. ఉద్యోగం చేసేవారు. నేను, అమ్మ, చిన్న చిన్న తమ్ముళ్ళు అందరం ఉండేవాళ్ళం. మెట్రిక్ పాస్ అవ్వాలని అనుకున్నాను. ఎంతో శ్రమ పడ్డాను. నా కాళ్ళ మీద నేను నిలబడగలిగితే, పదో పరకో సంపాదిస్తే, ఇంటి వాళ్ళ కడుపు నింపగలుగుతాను. 1942లో నేను మెట్రిక్ పాస్ అయ్యాను. ఫస్ట్ డివిజన్‌లో పాస్ అయ్యాను. నాకు ఇంకా చదవాలని ఉండేది. కాని ముందు బతుకుతెరువు చూసుకోవాలిగా. వెంటనే టైపు నేర్చుకున్నాను. కచేరీలో పని దొరికింది. మిషన్‌ని అద్దెకు తెచ్చుకున్నాను. పగలంతా రెక్కలు ముక్కలు చేసుకుని అంతో ఇంతో సంపాదించే వాడిని. కాని ఈ పని కూడా ఎక్కువ రోజులు సాగలేదు. మళ్ళీ ఉద్యోగం వేటలో పడ్డాను. కాని మంచి ఉద్యోగం దొరకలేదు. ఇక ఏమీ చేయలేక సినిమాహాల్‌లో ఉన్న ఒక దుకాణంలో పని చేసాను. అక్కడ కూడా ఎక్కువ కాలం ఉండలేకపోయాను. బతుకుతెరువు ఎట్లా? నిరుద్యోగ సమస్య కృష్ణుడి విరాట్ స్వరూపంలా అనిపించింది. అక్కడి నుండి ఢిల్లీకి వెళ్ళిపోయాను. ఎన్నో ప్రయత్నాలు చేయగా అక్కడ సప్లయి ఆఫీసులో టైపిస్ట్ ఉద్యోగం వచ్చింది. జీతం 67 రూపాయలు మాత్రమే. అందులో నలభై రూపాయలు ఇంటికి పంపించేవాడిని. ఇక మిగిలిన దాంట్లో రెండు పూటలా భోజనం చేయడం కూడా కష్టమైపోయింది. కాని ఏం చేయగలను? తక్కువ ఖర్చుతో కడుపు నింపుకునే ఉపాయం దొరికింది. రెండు పూటలా రొట్టెలు తినే బదులు ఒక పూట బజారులో దొరికే పూరీలను తింటే సరిపోతుంది. ఎందుకంటే పూరీలు ఆలస్యంగా అరుగుతాయి. అందువల ఇరవై నాలుగు గంటలలో ఒక పూట అదీ మధ్యాహ్నం మాత్రమే పూరీలు తినడం మొదలుపెట్టాను. నిజంగానే నాకు తొందరగా ఆకలి వేసేది కాదు. నాకు అనుభవం అయింది. దాదాపు రెండు సంవత్సరాలు ఇట్లాగే గడిపాను. పగలంతా టైప్ మిషనుతో కుస్తీ. సాయంత్రం చదువుకోవడం, రాత్రి అలసి సొలసి పోయి నిద్రపోవడానికి ప్రయత్నాలు, మనసుకు ఎటూ మొదటే గాయం తగిలింది. శారీరికంగా కూడా అనారోగ్యం మొదలైంది. ప్రతిరోజు అది కూడా ఇరవై నాలుగు గంటలలో ఒకసారి బజారు పూరీలు తినడం వలన జ్వరం వస్తూ ఉండేది. కళ్ళు తిరిగేవి. కాని మందు మాకు ఎక్కడి నుండి తెస్తాను? తినడానికి నానా పాట్లు పడుతున్నా. ఇక మందుకి డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి. సెలవులు ఎట్లా తీసుకోగలను. జీతంలో కొంత డబ్బు కట్ చేస్తారు. జమునా నదీతీరం అవతల షాహ్‌దరా బస్తీలో ఒక మురికివాడలో ఒక గది తీసుకోవాల్సి వచ్చింది. గత్యంతరం లేదు. నరక యాతన అంటే ఏమిటో అనుభవం అయింది. అటువంటి దుర్భర పరిస్థితిలో జీవితాన్ని కొనసాగించాను. అసలు ఈ దరిద్రపు బతుకు బతికేకంటే, బతకకపోవడమే నయం అని అనిపించింది. కాని ఏం చేయగలను? బతకనూ బతకలేను. చావనూ చావలేను. బతికి ఉన్న శవాన్ని. కాకపోతే చదవడం రాయడం మాత్రం మానలేదు. నిజం చెప్పాలంటే దీని మూలంగానే ఇంకా జీవితం ఉంది అని అనిపించేది. ఇదే జీవిత లక్ష్యం అని అనుకుంటూ నిరంతరం అనేక పాట్లు పడుతూ బతికాను. మృత్యువుతో, విపరీత పరిస్థితులలో యుద్ధం చేసాను. జ్వరంతో బాధపడేవాడిని. ఆ వేడే జీవితానికి గౌరవం అని అనిపించేది. ఆ మానసిక స్థితిలో నాలో ఉన్న వ్యథ బయటికి వ్యక్తం అయ్యేది.”

“నీకు ఈ విషయం చెబితే ఎంతో ఆశ్చర్యపోతావు. అసలు నీవు నమ్మలేవు. ఇప్పటి దాకా నేను రాసిన కవితలు నేను స్వయంగా రాయలేదు.” నీరజ్ ఎదురుగా కూర్చున్న నీలూలో కలిగే ప్రతిక్రియను ఊహిస్తున్నాడు. ఒక్క క్షణం చెప్పడం ఆపేసాడు.

“అంటే..” నీలిమకి ఆశ్చర్యంగా అనిపించింది.

“మరయితే నీవు రాసిన కవితలన్నీ ఎవరు రాసారు?”

“నేను స్వయంగా రాయలేదు అంటే అర్థం నేను రాయలేదని కాదు, ఎవరో రాసారని కాదు. ఎవరో రాసి పేరు మీద అచ్చు వేయించారనీ కాదు.”

“మరయితే? “

“అర్థం ఏమిటంటే నేను ప్రయత్నం చేసి ఏదీ రాయలేదు. అభివ్యక్తికి సహజంగానే పదాలు దొరికేవి. నా కలం  పాళీ నుండి ఎటువంటి ప్రయత్నం లేకుండానే ఆ శబ్దాలు వెలువడేవి. అసలు ఎప్పుడు, ఎట్లా, కవిత అయిందో నాకే తెలియదు.”

“అంటే నీర్! నీవు చెప్పేది నీ కవితలు ‘కాన్షస్ ఎఫర్ట్’ – ‘తెలిసి చేసే ప్రయాస’ కావా?”

 “అవును..”
“మరైతే ఎవరైతే సాహిత్య – సృజనని ‘కాన్షస్ ఎఫర్ట్’ గా భావిస్తారో..?”

“నేను వేరే వాళ్ళ గురించి మాట్లాడటం లేదు. మొత్తం సాహిత్యం గురించి చెప్పడం లేదు. కేవలం కవిత్వం గురించి చెబుతున్నాను. మొత్తం కావ్య సాహిత్యం గురించి కాదు, కేవలం నీరజీయ కవిత్వం గురించి చెబుతున్నాను. నీరజ్ గీతాలు గురించి చెబుతున్నాను. ఏ కవైతే అట్లా చేస్తాడో అంటే సహజంగా రాయలేడో అతడు కవితా కామినిని బలాత్కారం చేస్తున్నట్లే అని, వేశ్యా వృత్తిని చేయిస్తున్నట్లే అని ఘంటాపదంగా చెబుతాను. పద్యం ఎప్పుడు కోమలంగా ఉంటుంది. ప్రయత్నం అనే స్పర్శ దానిని వాడిపోయేలా చేస్తుంది. గద్యం మాట వేరే.”

“అంటే గద్యాన్ని ‘కాన్షస్ ఎఫర్ట్’ అని అంటావా?”

“అనడమేమిటి? అదీ అంతే. ఒక వేళ అది అట్లా కాకపోతే గద్యం కావ్యం అవుతుంది. ఇక గద్యంగా ఉండదు. మంచి గద్య రచనను ‘కాన్షస్ ఎఫర్ట్’  అనే అనాలి. కాని మంచి కవిత్వం అంటే ‘అందమైన నిస్సహాయత’ అనే చెప్పాలి. అవును.. నీకు నాలో ఉన్న వ్యథకి, క్షోభకి మూలకారణం చెబుతున్నాను కదూ! నాకే తెలియదు ఆ కారణం. అయినా ఆనాటి నుండి ఈనాటి దాకా ‘నా జీవిత సంఘర్ష గాథ’ని చెబుతునే ఉన్నాను. నిజానికి ఇది ఎంతో వింత కదూ! ఆ మూల కారణం వైపు వేలు పెట్టి చూపిద్దామనుకున్నప్పుడల్లా ఈ ‘జీవిత సంఘర్ష గాథ’ నా ఎదురుకుండా మేఘాలు కమ్మిన ఆకాశంలో అనిపించేది. అందుకే ఒక భ్రమని కప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఈ గాథతోనే నా అసలు వ్యథకి ఎక్కడో ముడివడి ఉంటుందేమో..”

“ఉంటుందేమో.. ఏమిటి?  అక్షరాలా ఇందులో ఉంటుంది” నీలూ ఉత్సాహంతో అన్నది.

“ఏ ఆధారంతో ఇట్లా చెబుతున్నావు?” నీరజ్ నీలూని ప్రశ్నించాడు.

“వ్యక్తిలోని మానసిక వ్యథ అతడి జీవితంలో జరిగే సంఘటనలకు, సంఘర్షణకు కారణం అవుతుంది. పరిస్థితుల వలన కూడా అవుతుంది.”

“నా మేధస్సు కూడా ఇదే అంటుంది కాని ఏం చేయను? మనస్సు అంగీకరించదు. నేను ఒప్పించాలని ఎంతో ప్రయత్నం చేసాను. కాని మనస్సు ఏ మాత్రం ఒప్పుకోదు.”

“ఏం, ఎందుకు? ఎట్లాంటి తర్కం చేస్తుంది?”

“తర్కమా! మనస్సు విషయంలో తర్కమా!”

“మరయితే నీవు తర్కానికి ఆవల – ఇంకేదో సత్యం ఈ జగత్తులో ఉందంటావా?”

“తప్పకుండా ఉంది.”

“ఏమిటి?”

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here