[కె.ఎం. మున్షీ రచించిన ‘ది ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా’ పుస్తకాన్ని ‘నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు’ పేరిట అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]
~
[dropcap]రే[/dropcap]పు ఏమవుతుందోనని అందరం ఆందోళన చెందుతున్న సమయంలో ఈ యువ ఆఫీసరు ప్రవర్తన నాకు నచ్చలేదు. మౌనంగా ఉండలేకపోయాను. “నేను హైదరాబాదు వెళ్తున్నాను. నిన్ను నాతో వెళ్ళమని ఢిల్లీ నుంచి పంపించారు. మనమిద్దరం మన బాధ్యతలు నిర్వహిస్తున్నాము. నీకు నచ్చకపోతే నువ్వు హైదరాబాదు రావటం మానేయ్. నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి” అని అరిచాను.
మరుసటి రోజు విమానాశ్రయంలో ఆ యువ సైనికుడు వచ్చి కలిశాడు. రెండు రోజుల తరువాత అతన్ని వెనక్కి పంపించేశాను. నా అదృష్టం ఏంటంటే నా వెంట రఘుపతి లాంటి విధేయుడు, ధైర్యవంతుడు ఉన్నాడు. అతడిపై నేను ఆధారపడవచ్చు. అయితే ఆ సమయంలో ఆయన వ్యక్తిగత సమస్యలతో మానసిక సమస్యల వల్ల బాధ పడుతున్నాడు. అందుకే అతడితో జాగ్రత్తగా వ్యవహరించాల్సి వచ్చింది.
నేను ఇలాంటి విభిన్నమైన, ఒకరితో ఒకరికి పొసగని మనుషులతో చక్కగా పని చేసే వ్యవస్థను ఎలా ఏర్పాటు చేయగలిగానో దేవుడికే తెలుసు.
జాతీయ పతాకం గల ప్రత్యేక విమానంలో జనవరి అయిదు ఉదయాన హైదరాబాదు చేరాం. ‘గాంధీజీ కీ జై’ అన్న నినాదాలతో, పెద్ద సంఖ్యలో ప్రజలు, అత్యధికంగా హిందువులు, ఘనంగా, ఉత్సాహంగా హకీంపేట విమానాశ్రయంలో స్వాగతం పలికారు. హైదరాబాద్ ప్రజలు ‘ఇత్తెహాద్’ చర్యలతో భయభ్రాంతులై ఉన్నారు. యథాతథ ఒప్పందం తమను తోడేళ్ళ పాలు చేసిందన్న భావనతో ఉన్నారు. అయితే, ఏజంట్ జనరల్ నియామకం వారికి ధైర్యాన్నిచ్చింది. నిజానికి, నన్ను ఏజంట్ జనరల్‍గా నియమిస్తున్న వార్త తెలిసిన తరువాత ప్రాణాలు అరచేత పట్టుకుని పారిపోయిన హిందువులు పెద్ద సంఖ్యలో సికిందరాబాదు తిరిగి వచ్చారు.
విమానాశ్రయంలో భారత సేనలున్నాయి. సైనిక వందనం తొలిసారిగా స్వీకరించిన అనుభవం పొందాను. నేను ఎలా స్పందించానో గుర్తు లేదు. కానీ వందన స్వీకరణ నాకు అలవాటు లేదన్న విషయం అందరికీ అర్థమై ఉంటుంది. అక్కడకు వచ్చిన వారి అభ్యర్థనను మన్నించి కశ్మీరులో భారత సైన్యాల ధైర్య సాహసాలను స్మరిస్తూ కొన్ని మాటలు మాట్లాడేను. ఈ నా చిన్న ఉపన్యాసం నిజామ్ ప్రభుత్వానికి, ఇత్తెహాద్‍కూ రెచ్చగొట్టటంగా అనిపించింది.
బొలారం రెసిడెన్సీలో, నిజామ్ జండా పక్కనే భారత జాతీయ జండాను ఎగురవేశాను. అతిథులను కలిశాను. నిజామ్ ప్రభుత్వ అధికారులు, ఇత్తెహాద్ సమర్ధక నాయకులు రాకపోవటం కొట్టొచ్చినట్టుగా కనబడింది.
దాని తరువాత పత్రికా సమావేశం జరిగింది. ఇత్తెహాద్ పత్రికల ప్రతినిధులు అవమానకరంగా ప్రవర్తించారు. వారు నన్ను రెచ్చగొట్టాలని ప్రయత్నించారు. వాటిల్లో ఒక అభ్యంతరకరమైన ప్రశ్నను అత్యంత అవమానకరమైన రీతిలో అడిగారు. అది “మీరు ‘అలా హజ్రత్’ (నిజామ్)ను ‘ఘనత వహించిన ప్రభూ’ అని సంబోధిస్తారా?.” నిజామ్ స్వతంత్ర రాజ్యాధికారి కాబట్టి ఆయనను అలాగే సంబోధించాలని వారు వాదించారు. దానికి సమాధానంగా నేను “భారత ప్రభుత్వం సమాచార పత్రాలలో ఎలా సంబోధిస్తుందో, సరిగ్గా అలాగే సంబోధిస్తాను” అని సమాధానం ఇచ్చాను.
నిజానికి లాయక్ అలీకి నేను ఇవ్వాల్సిన డిన్నర్ పార్టీ, లాయక్ అలీ నాకు ఇస్తున్న పార్టీగా మారినా, పార్టీ సజావుగా గడిచింది. నన్ను ఆహ్వానిస్తూ లాయక్ అలీ ఆహ్లాదకరంగా మాట్లాడేడు. నేను మాట్లాడుతూ, హైదరాబాద్ పరిసర ప్రాంతాలు కేంద్రంగా నేను రాసిన చారిత్రక నవలను ప్రస్తావించాను. నేను ఆ నవలను మామూలుగా ప్రస్తావించాను. కానీ ఆ నవల హిందూ సామ్రాజ్యానికి సంబంధించినది కావటంతో నేను కావాలనే వారిని అవమానించేందుకు ఆ నవలని ప్రస్తావించానని కోపం వచ్చింది వారికి.
నిజామ్, అతని మంత్రిత్వ శాఖ, ఇత్తెహాద్ సభ్యులు, హైదరాబాద్‌ను ప్రత్యేక రాజ్యంగా భావిస్తూ, నా రాకను పట్టించుకోనట్టు ప్రవర్తించారు. కానీ వారు ఆ ప్రయత్నాలలో విజయవంతమైనట్టు నాకు అనిపించలేదు.
ఘనత వహించిన మహా ప్రభువు:
హైదరాబాద్ ఏజంట్ జనరల్‍గా నా ప్రథమ బాధ్యత ఏమిటంటే, ఘనత వహించిన మహా ప్రభువు, ఏడవ నిజామ్, అసఫ్‌జాహీ వంశానికి చెందిన ఏడవ రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్‌ని కలవటం.
జనవరి 9, 1948న హైదరాబాద్ ప్రధాన మంత్రి మీర్ లాయక్ అలీఖాన్‌తో కలిసి నేను నిజామ్‍ను కలిసేందుకు కింగ్ కోఠీకి వెళ్లాను. కింగ్ కోఠీ అనేది పలు దూరంగావున్న ఇళ్ళ సముదాయం. వాటిల్లో నిజామ్, అతని మహిళల సముదాయం, జనానా, అతని అరబ్బు రక్షకులు ఉంటారు. ఇళ్ళన్నిటికీ ఓ పెద్ద గోడ ఉంది. ప్రపంచంలో అత్యంత ధనికుడు, అసాధారణ వ్యక్తి అయిన నిజామ్‍ను ప్రత్యక్షంగా కలవటం కాస్త ఉత్తేజితంగా అనిపించింది.
కారు దిగుతుంటే, వంగి ఉన్న సన్నటి ముసలి వ్యక్తి వరండాలో నించుని కనిపించాడు. టర్కీ ప్రజలు ధరించే వూలుతో చేసిన శంఖు ఆకారపు టోపీ, పురుగులు తినేసిన మఫ్లరు, పాత షేర్వాణీ. బాగా నలిగిన పైజామా వేసుకుని ఉన్నాడాయన. ఈయన ఎవరో నేను ఊహించలేకపోయాను. కానీ లాయక్ అలీ వంగి, మర్యాదగా హైదరాబాద్ పద్ధతితో సలామ్ చేయడంతో ఆయన ఎవరో సందేహానికి తావు లేకుండా గ్రహించాను. నేను ఘనత వహించిన నిజామ్ సమక్షంలో నిలుచుని ఉన్నాను.
నన్ను నిజామ్ పద్ధతి ప్రకారంగా పలకరించాడు. అతని పెదవులపై అలసిపోయిన నవ్వుంది. నాతో కరచాలనం చేశాడు. మేము ఓ అశుభ్రంగావున్న గదిలోకి అడుగుపెట్టాము. గది చిందరవందరగా ఉంది. ఆ గదిలో రకరకాల విగ్రహాలు, పలు రకాలుగా అలంకృతమైన పాత్రలు ఇష్టం వచ్చినట్టు పడి ఉన్నాయి. అదో వేలం వేసే వస్తువులనుంచే గదిలా ఉంది. ఆ గదిలో వాతావరణం – డుప్లెక్స్, బుస్సీ, వెల్లస్లీ, చందూలాల్‍ల నాటి గతించిన కాలం నాటి వాతావరణాన్ని గుర్తు తెచ్ఛేదిలా ఉంది. ఆ వాతావరణం ఘనీభవించిన శిలాజాల కాలం నాటి వాతావరణంలా ఉంది. అక్కడ నేను నమ్మిన మౌలిక విలువలు, సార్వభౌమ గణతంత్ర రాజ్యాలు, ఆర్థిక సమానతలతో ఏ మాత్రం సంబంధం లేని వాతావరణం అది.
మా సంభాషణ సాధారణ అంశాల ఆధారంగా సాగింది. ప్రధానంగా అసఫ్‌జాహీ వంశ స్థాపకుడి గురించి మాట్లాడుకున్నాం. నా నవల గురించి చర్చించుకున్నాం. వాటి గురించి కాస్త సమాచారం సేకరించినట్లున్నాడు నిజామ్. భారత్‍లో పన్ను భారం గురించి తెలుసుకునేందుకు నిజామ్ కుతూహలం చూపించాడు. నేను ఎంత ఆదాయపు పన్ను కడుతున్నానన్న విషయాన్ని కూడా పరోక్షంగా ప్రశ్నించాడు. అయితే, మా అందరి మనస్సులలో మెదలుతున్న ప్రధానమైన అంశం, భారత్-హైదరాబాద్ సంబంధాల గురించి మాట్లాడకుండా అందరం జాగ్రత్త పడ్డాం. ఉండుండి హఠాత్తుగా సంబంధం లేని ప్రశ్నలు అడుగుతూ, సమాధానం కోసం ఎదురుచూడకుండా సంభాషణ కొనసాగించాడు నిజామ్. అప్పుడప్పుడు తన మాటలను తానే మెచ్చుకోవటాన్ని సూచిస్తూ తొడలను గట్టిగా చరచుకునేవాడు నిజామ్.
ఇలా నిజామ్‍తో నా మొదటి సమావేశం ముగిసింది. అతను అల్లుకున్న పేక మేడ లాంటి ఆశల భవనం సెప్టెంబరు 17న కుప్పకూలేంత వరకూ మా నడుమ జరిగిన చివరి సమావేశం కూడా ఇదే!
ప్రపంచంలో అత్యంత ధనికుడయిన నిజామ్‌ను భారత్‌లోనే కాదు, ప్రపంచంలో పలు ప్రాంతాల వారు కూడా ఓ గొప్ప పురాణ పురుషుడిలా ఆమోదిస్తారు. ఆయన పద్ధతులు, ధనం పై ప్రేమ, రాచరికపు అలవాట్ల గురించి అనంతమైన కథలు ఎక్కడయినా వినిపిస్తాయి. హైదరాబాదులోనే అలాంటి అత్యంత ఆసక్తికరమైన కథలకు కొదువ లేదు. అవన్నీ చెప్పాలని ఉన్నా, స్వీయ నియంత్రణ పాటించటం ఉత్తమం.
జీవితంలో నిజామ్ ప్రేమించేవి రెండే విషయాలు. ఒకటి డబ్బు; రెండవది అధికారం. ఈ రెంటిలో కూడా అంతులేని ప్రేమ ధనం పైనే. ఆయన దగ్గర అంతులెని ధనం ఉన్నా సరే, వారసుడిగా ఆయనకు బోలెడంత ధనం అందినా సరే, ఆయన డబ్బు విలువనూ ఎన్నడూ విస్మరించలేదు. ఆయనకు స్వకీయంగా ప్రతి సంవత్సరం అయిదు మిలియన్ రూపాయలు, రాష్ట్రం నుండి అందే ధనం, సఝ్-ఇ-ఖాస్ నుంచి అందే 25 మిలియన్ రూపాయలే కాక రాష్ట్రంలోని పలు ప్రాంతాలను స్వంత ఆస్తిగా వాడేవాడు నిజామ్.
ఇవి కాక ఆయనకు బహుమతుల రూపంలో ‘నజర్లు’ అందేవి. 1947లో, చివరి రెసిడెంట్ అన్ని రికార్డులను కాల్చి వేయగా, మిగిలిన రికార్డుల్లో నిజామ్ పుట్టిన రోజున అందిన నజర్ల జాబితా లభించింది. ఆహ్వానితుడయినా, కాకపోయినా, ఘనత వ వహించిన వారిని దర్శించుకోదలచిన ప్రతి ఒక్కడూ ఒక అష్రఫీ, బంగారు నాణెం, ఆయనను కలిసేందుకు తప్పనిసరిగా సమర్పించుకోవాల్సి వచ్చేది. ఆ కాలంలో బంగారు నాణెం విలువ రూ.124/-. ఆయన పుట్టిన రోజు నాడు పెద్ద అధికారుల నుంచి సామాన్య ఉద్యోగి వరకూ ప్రతి ఒక్కరూ నజర్లు సమర్పించుకునేవారు.
డబ్బు తెచ్చేది ఏదైనా నిజామ్‌కు ఆకర్షణీయంగా ఉండేది. డబ్బు ఖర్చు పెట్టేది ఏదయినా అనూహ్యమైన భయం కలిగించేది నిజామ్‌కు. ఆయన చాలా అరుదుగా కొత్త బట్టలు ధరించేవాడు. ఆయన ప్రయాణించేది పాతబడిన 1918 నాటి ఒక డొక్కు కారు. ఆయన ఎవరికీ ఎలాంటి మర్యాదలూ, అతిథి సత్కారాలు చేసేవాడు కాదు.
డబ్బుల కట్టలు, బంగారం, వెండి, అభరణాలు వంటివన్నీ గుట్టలు గుట్టలుగా కింగ్ కోఠీ భూగృహాల్లో, బీరువాలపై, టేబుళ్ళపై, నేలపై పడి పొర్లుతుండేవి. ఎవరైనా వీటిని ఎత్తుకుపోతారన్న భయంతో నిజామ్ స్వీయ పర్యవేక్షణలోనే ‘నజర్-ఇ-బాగ్’ను సేవకులు ఊడ్చేవారు. నేలపై పడి ఉన్న విలువైన వస్తువులపై తెల్లటి గుడ్డలను కప్పేవారు. వాటిపై పిట్టల రెట్టలు, ఎలుకల విసర్జితాలను వెదజల్లేవారు. పాతకాలం నాటి ఖజానాను డ్రాగన్లు కాపాడినట్టు నిజామ్ నజర్లను ఈ విసర్జితాలు కాపాడేవి. ఆ నేలమాళిగలోని ఎలుకలు స్నేహపూరితమైనవి. విలువైన వస్తువుల వైపు నిజామ్ ఆప్యాయంగా చూస్తూ కాఫీ తాగుతూంటే, ఎలుకలు సాసర్ లోంచి కాఫీ తాగేవని చెప్పుకుంటారు. ఈ కథ నిజమో అబద్ధమో తెలియదు కానీ చెప్పక తప్పని కథ ఇది. ఇంకో కథనం ప్రకారం తన ఖజానాను ట్రక్కుల్లో తెచ్చి, నిజామ్ తన కిటికీ బయట నిలిపేవాడట. అలా తన ప్రియమైన ఖజానాను గంటల కొద్దీ తనివితీరా చూస్తూ ఆనందించేవాడట నిజామ్.
నిజామ్ జనానా చాలా పెద్దది [1948 తరువాత ఏర్పాటు చేసిన కుటుంబ ట్రస్టులో నిజామ్ – అతని ప్రియమైన భార్య లైలా బేగమ్, అయిదుగురు కొడుకులకు, వేర్వేరు తల్లులున్న ఎనిమిది మంది కొడుకులకు, ఇద్దరు కూతుళ్ళకు, 37 మనుమలు, 15 కూతుళ్ళకు, ట్రస్టు నుంచి ధనం అందే ఏర్పాట్లు చేశాడు. తన వారసుడు, అతని తల్లి, వారసుడి చెల్లెలు, నిజామ్ భార్య ఇమామ్ జంగ్ కూతురు, ముగ్గురు పెద్ద స్థాయి లోని మహిళాలు, నిజామ్ భార్య, మరో 15 మంది ఉంపుడుగత్తెలకు (ఖావాసులు) కూడా ఈ ట్రస్ట్ నుంచి నిధులు అందుతాయి]. నిజామ్ జనానాలో రాకుమారుడు, రాకుమర్తె తల్లి ఉండేది. ఆమె నిజామ్ ఆరోగ్య వ్యవహారాలు చూసేది. ఆమె తనదైన విచిత్ర ప్రపంచంలో ఉండేది. హిందూ ధర్మం నుండి మతం మారి ఇస్లాం స్వీకరించిన మరో మహిళ ప్రత్యేక గృహంలో ఉండేది. ఇంకా మహిళలు అనేకులు వారి వారి ప్రత్యేక గదుల్లో నివసించేవారు. ఈ మహిళల స్వర్గం గురించి పలు కథలు ప్రచారంలో ఉన్నాయి. కానీ అవన్నీ మనకు అప్రస్తుతం.
కింగ్ కోఠీలో నిజామ్ కొడుకులు, కూతుళ్ళు అనేకులు నివసించేవారు. వారి ఆరోగ్యం గురించి నిజామ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవాడంటారు. ఎవరైనా కనీసం తలనొప్పి అని చెప్పేందుకు భయపడేవారట. ఎందుకంటే, తలనొప్పి సత్వరం తగ్గేందుకు వారికి అందాల్సిన ఆహారాన్ని ఆపేసేవాడట. అంతేకాదు, ఇలా ఆపేసిన ఆహారం మళ్ళీ కొన్ని కొన్ని సందర్భాలలో అంత త్వరగా అందేది కాదట.
ఇద్దరు రాజకుమారులు – బేరార్ రాకుమారుడు, ముజామ్‌జాహ్‌లు కొన్నాళ్లు తండ్రితో నివసించారు. కానీ తండ్రిపై వారు తిరుగుబాటు చేశారు. అప్పటి గవర్నర్ జనరల్ జోక్యం చేసుకుని సంధి కుదిర్చాడు. అప్పటి నుంచీ వారిద్దరూ వేరుగా నివసించటం ప్రారంభించారు. కానీ ఆర్థిక వ్యవహారాల కోసం తండ్రి పైన ఆధారపడ్డారు. వారికి నిజామ్ నుంచి అందే బోలెడంత ధనం కాక వారు వడ్డీ వ్యాపారస్థుల దగ్గర స్వేచ్ఛగా అప్పులు చేసేవారు. గ్రహాలు తమకు అనుకూలంగా ఉన్నప్పుడు తమ ధనం తమకు అందుతుందన్న ఆశతో వడ్డీ వ్యాపారులు రాకుమారులు అడగగానే అప్పులు ఇచ్చేవారు. హైదరాబాద్ భారత్‍లో విలీనమైన తరువాత ఈ వడ్డీ వ్యాపారులకు గ్రహాలు అనుకూలించాయని విన్నాను.
(సశేషం)