పక్షుల లోకం

0
3

[dropcap]చి[/dropcap]న్నారులూ! తెల్లవారుజామునే మనందర్నీ ‘కొక్కొరకో’ అంటూ నిద్రలేపే కోడి, మనం పారవేసే ఎంగిలి మెతుకుల కోసం ‘కావు కావు’ మంటూ ఇంటి మీద ఎగిరే కాకి, చెట్ల కొమ్మలకు వేలాడేలా అద్భుతంగా ఇంజనీర్లను మించిన నైపుణ్యంతో చక్కని గూడును నిర్మించే గిజిగాడు, ఇంటి చూరులో పెట్టిన తన గూట్లోని తన పిల్లలకు ఆహారం అందించే పిచ్చుక – ఇలా మనతోపాటు సహజీవనం చేసే చాలా పక్షుల్ని మనం రోజూ చూస్తూనే ఉంటాం. కాని వాటి గురించి మనకేమి తెలియదు. ప్రపంచంలో ఎన్నిరకాల పక్షులున్నాయి? అవి ఎలా ఏర్పడ్డాయి? ఎప్పుడు పుట్టాయి? ఎలా పుట్టాయి? వాటి శాస్త్రీయ నామాలు ఏమిటి? అనే విషయాల గురించి ఈ రోజు తెలుసుకుందాం!

పక్షులు ‘కార్డేటా’ వర్గంలో ‘ఏవ్స్’ విభాగానికి చెందినవి. మీసో జోయిక్ యుగంలో సరిసృపాల నుండి పరిణామం చెందుతూ, ఎగిరే లక్షణం అలవరుచుకొని పక్షులుగా అవతరించాయి. అందుకని ‘హక్స్‌లే’ అనే శాస్త్రవేత్త వీటిని ‘పరిణితి చెందిన సరిసృపాలు’గా అభివర్ణించాడు. ఇపుడు మనకు కనిపించే పక్షులు 45 మిలియన్ సంవత్సరాల క్రితం పుట్టి అనేక మార్పులు చేర్పులు జరిగి పరిణామం చెందినటువంటివి.

ఈ విశ్వంలో 8,590 జాతుల పక్షులు నివసిస్తున్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేశారు. కోడిలాగా భూమి మీద నివసించేవి, కొంగ లాగా నీటిలో నివసించే జాతులు కొన్ని తప్ప మిగిలినవన్నీ అక్షంలో ఎగిరేవే! వీటిలో పూర్వాంగాలు రెక్కలుగా అభివృద్ధిచెంది ఆకాశంలో ఎగరడానికి ఉపయోగ పడతాయి. పక్షులు గాలిలో ఎగురుతూ, మధ్యమధ్యలో చెట్లమీద విశ్రాంతి తీసుకుంటాయి. ఆహార, ప్రత్యుత్పత్తి అవసరాల కోసం వేల మైళ్ళ దూరం ప్రయాణించి వలస వెలుతుంటాయి. మన రాష్ట్రంలోని కొల్లేటి సరస్సు ఇలాంటి వలస పక్షులకు ప్రసిద్ధి. పక్షుల ప్రయాణాల్లో ఇక్కడ పండ్లను తిని, వాటి గింజల్ని ఎక్కడో విసర్జించటం వల్ల, పూలపై వాలినప్పుడు అతుకున్న పుప్పొడి మరెక్కడో పడిపోవటం వల్ల చెట్ల వ్యాప్తికి తోడ్పడతాయి. ఈ పక్షుల గురించి చదివే శాస్త్రాన్ని ‘ఆర్నితాలజి’ అంటారు.

మరి వీటి శాస్త్రీయ నామాలు చూద్దామా! కోడిని ‘గాలాస్ గాలాస్’ అని, కాకిని ‘కార్వాస్ స్ప్లెండిస్’ అని, పిచ్చుకను ‘పాసర్ డామేస్టికస్’ అని అంటారు. జాతీయ పక్షి నెమలిని ‘పావోక్రిస్టేటస్’ అని, శాంతి చిహ్నం పావురాన్ని ‘కొలంబా లివియా’ అని, రామచిలుకను ‘సిట్టకస్’ అని, పాటలు పాడే కోయిలను ‘యకాడేనామస్ స్కోలోపేసియా’ అని పిలుస్తారు. పిల్లలూ! వీటి శాస్త్రీయ నామాలు నోరు తిరగక కష్టపెడుతున్నాయా? మనం ప్రస్తుతం కాకి, పిచ్చుక, చిలుక అని ముద్దు పేర్లతోనే పిలుచుకుందాం, సరేనా!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here