స్థితప్రజ్ఞత

0
10

స్థితప్రజ్ఞత

స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థస్య కేశవ

స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిమ్‌ (భగవద్గీత 2-54)

[dropcap]భ[/dropcap]గవద్గీత తెలియజెప్పిన ప్రధాన విషయాల్లో ‘స్థితప్రజ్ఞత’ ఒకటి. దాని గురించి అందరికీ వచ్చినట్లే అర్జునుడికీ ఓ సందేహం వచ్చింది. ఆ సందేహాన్ని తీర్చమని శ్రీకృష్ణ పరమాత్ముణ్ని అడిగాడు. ఈ ప్రశ్న మిక్కిలి మౌలికమైనది.. “కేశవా! ఆత్మస్థయిర్యం కలిగినవాడు స్థితప్రజ్ఞుడు అనుకుంటే అతని లక్షణం ఏమిటి? అతను ఏం మాట్లాడుతాడు? ఏ విధంగా కూర్చుంటాడు? ఎలా సంచరిస్తాడు?” అని స్వామిని ప్రశ్నించాడు. అర్జునుడి సందేహమే ప్రతి వ్యక్తికీ కలుగుతుంది. ముఖ్యంగా అధికంగా పాపాలే చేసి, వాటి ఫలితాలను అనుభవిస్తూ అనేక దుఖాలకు, సమస్యలకు గురయ్యే మానవులు కలియుగ ప్రభావం నుండి కాస్తయినా తప్పించుకోవాలంటే అలవర్చుకోవాల్సిన ప్రధాన గుణాలలో స్థితప్రజ్ఞత ముఖ్యమైనది. అందుకే శ్రీ కృష్ణ భగవానుడు దీని వివరణకు ప్రాధాన్యత ఇచ్చారు.

ధనికులైనవారు ధనికులుగా, రోగులైనవారు రోగులుగా గుర్తింప పడడానికి కొన్ని ప్రత్యేక లక్షణాలు వున్నట్లే స్థితిప్రజ్ఞునకు కూడా కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. ఇందులో ముఖ్యమైనది భగవంతునిపై భక్తి భావన. అది ఉన్నవారు భగవంతుని గూర్చిన విషయాలు మాత్రమే సంభాషిస్తారు. వారు మనస్సు నుండి పుట్టే సర్వ విధ కామాలను వదిలేస్తారు. గృహస్థు సంబంధితమైన కార్యాలను పవిత్ర భావంతో, తామరాకు మీద నీటి బొట్టులా పూర్తిచేస్తారు. భౌతికమైన అంశాలపై వారికి ఎలాంటి అనురక్తి ఉండదు. ఇంద్రియపర కోరికలను మామూలుగా అణుచుకోవడం అందరికీ సాధ్యం కాదు. అయితే భగవంతుని భక్తిలో పూర్తిగా మునిగి  ప్రసాద భావంతో అంటే తనకు ఏది జరిగినా అది భగవంతుని అనుగ్రహం, సంకల్పం వలనే జరిగింది, అది తన మంచి కొరకే జరిగింది కాబట్టి  దానిని స్వీకరించడమే మంచిదన్న భావంతో జీవిస్తే అన్ని కోరికలు అప్రయత్నంగానే అణిగిపోతాయి. భగవంతుని సేవ అనే సహజస్థితిలో సదా మునిగి వుంటాడు. కష్టాలు వచ్చినప్పుడు తన గత జన్మ పాపాలకు శిక్ష అనుభవించడం తప్పదన్న భావనతో కష్టాలను స్వీకరిస్తాడు. ఆ కష్టాలను కూడా భగవత్ కరుణగా భావిస్తాడు. సుఖాలు వచ్చినప్పుడు ఆ కీర్తిని కూడా భగవంతుని కరుణ గానే భావిస్తాడు. సర్వం భగవత్ అర్పణం అని వదిలేస్తాడు. ఇంద్రియ భోగాల పట్ల ఆసక్తి లేదా అనాసక్తికి గురి కాకుండా అతీతుడై వైరాగ్య భావన అవలంబిస్తాడు.  జీవితంలో జయాపజయాలు రెండింటి యందు కూడా సమభావంతో, సదా ధీరుడై స్థిర నిశ్చయంతో నిలుస్తాడు. తనని పట్టి కుదిపేసే ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో, కృత నిశ్చయంతో, చలించని మనసుతో భగవత్ భక్తి యందే తత్పరుడై  నిలిచి వుంటాడు. మంచిచెడులు, సుఖదుఖాలు వంటి ద్వందాలకు అతీతంగా మనగగలిగేవాడే స్థితప్రజ్ఞుడని అనబడతాడు.. అతడి నిరంతరం ఆధ్యాత్మిక భక్తి అనే సమాధి స్థితి యందు నిలిచివుంటాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here