[dropcap]చి[/dropcap]త్ర సీమారణ్యంలో క్రూర మృగాల
ఘోర సంచారం కళాపచారం
నేర కథల వ్యాఘ్రాలు,
హింస కథల సింహాలు
అపహాస్యపు జంబూకాలు
పిచ్చి గెంతుల వానరాలు
వీటి మధ్య, ఒంటి కాలిపై
ఒంటరిగా నిల్చొని చేసావు
కళా తపస్సు విశ్వనాథా..!
నీ తపో ఫలమే ఒక స్వర్ణ కమలం
ఫలము పుష్పముగా మారి
నీ పాదాల చెంత చేరింది
చేసిన కళా తపస్సు చాలనుకొని
కైలాసానికి ఏగితివా విశ్వనాథా..
నీ నటరాజ నర్తనములో
భంగిమకో కళా ఖండం
శివుని ఎదుట నీ కళా కౌశలము
చూపనెంచితివేమో కళా చక్రవర్తీ
చిత్రారణ్యమును క్రూర మృగములను
వదిలితివి గానీ, మమ్ము మరచితివి
ఓ దివ్య ఆంధ్ర సాంద్ర చిత్ర ఛత్రపతి
నీకివే మా జోహార్లు.. విశ్వనాథా..!
చిత్రాంధ్ర భోజా..!