[శ్రీ రాచకుళ్ల విశ్వరూప చారి రచించిన ‘తందనాలు’ అనే చిన్న కవితలని పాఠకులకు అందిస్తున్నాము.]
1
భయము చెరచు పనులను
కయ్యముతో విరోధము దాపురించును
వియ్యములో సమ తూకముండాలి
నెయ్యమందు కార్యం సాధించవచ్చు అలవోకగా
2
మోసం చెయ్యకు చెడిపోతావు
వీసం ఎత్తు పని చేయలేక పోయావు
రోసం ఉంటే పనిలో రాణించు
మీసం వున్న వాడివైతే పందెము గెలిచి చూపించు
3
కర్రి వాడవని దిగులు చెందేవెందుకు
కురూపి వాడవని కృంగిపోకు
మొర్రి వున్నదని బాధ చెందకుమా
మిర్రి మిర్రి చూడకు వోదార్చినందుకు
4
జానా బెత్తెడు లేవు అంత రోషమా
కూన వైవుండి అంతేసి మాటలా
కోనసీమ కుర్రాడివై ఉండి
మీన మేషాలు లెక్కించక తొందరగా నిర్ణయించు
5
కర్రలా అంత సన్నగున్నావే
చొరవ తీసుకొని పని ప్రారంభించు
బీరాలు పోక చెప్పినపని చేసేయ్
మరలా మరలా చేయి అలవాటౌతుంది
6
నివా నన్ను కబాడీలో ఓడించేది
చేవ వుంటే బరిలోకి దిగి చూపించు
లవ లేశమైనా గట్టిగా ఆడగలగాలి
కావునే నీవు గెలవ గలిగేది
7
కంటినిండా నిద్ర ఉంటేనే ఆరోగ్యం
ఒంటినిండా దుస్తులు ఉంటేనే అందం
పంటినిండా ఎనామిల్ ఉంటేనే పటుత్వం
నోటినిండా పళ్ళు ఉంటేనే అందము
8
దడ పుట్టించే ప్రశ్న పత్రాలు
కడ దాకా చదివితేనే అర్ధం తెలుస్తుంది
వడి వడిగా వ్రాస్తేనే పూర్తి అవుతుంది
తడబడితే ప్రయోజనం లేదు
9
కోతకొచ్చినూర్చిన పంట వర్షాలపాలై పాడైంది
చెంత నున్న గొడౌన్కి మార్చ లేక పోయా
చింతించి ప్రయోజన మేముంది
చేత పైసా లేకుండా అయింది
10
పొదలోని పులి ఆహరం కోసం గాండ్రించె
రొద చేస్తూ జంతువులన్నీ పారి పోయే
కదన రంగంలోకి దూకిన పులికి
వేదనే మిగిలె చివరికి