చింతపిక్కలమ్మి చిట్టిదొర పెళ్లి చేసిందట

1
4

[గిరిజనుల సామెత ఆధారంగా ఈ కథని అందిస్తున్నారు శ్రీ వేలమూరి నాగేశ్వరరావు.]

[dropcap]ఉ[/dropcap]ప్ప అనే గిరిజన గ్రామంలో వరహాలమ్మ అనే గిరిజన స్త్రీ ఉండేది. ఆమెకు చిట్టిదొర అనే కుమారుడు. అతడు అమాయకుడు. అల్లారుముద్దుగా వాడిని పెంచింది వరహాలమ్మ. చిట్టిదొర పుట్టిన నెల రోజులకే వరహాలమ్మ మొగుడు వెంకటేశ్వర్లు చనిపోయాడు. వరహాలమ్మ ఒక గిరిజన బాలికల వసతి గృహంలో వంట మనిషికి సహాయకురాలిగా పనిచేస్తుండేది. ఆ వసతి గృహాలలో అరవై మంది ఆడపిల్లలుండేవారు. వారికి రోజూ అన్నం, కూర, చారుతో భోజనం పెడతారు. కూరలు తరగడం, చారు కోసం చింతపండు నీళ్లలో నానబెట్టడం వంటి పనులు వరహాలమ్మ చేసేది. ఆమెకు కంచం నిండా అన్నం, కూర, గిన్నెడు చారు మేట్రన్‌ తినడానికి రోజూ ఇచ్చేది. ఆ అన్నం వరహాలమ్మ చిట్టిదొరకు పెట్టి తాను తినేది. ఇంటికి వచ్చేటప్పుడు నాబెట్టిన చింతపండులోని పిక్కలు తెచ్చేది. వాటిని ఎండబెట్టి ఒక బస్తాలో దాచేది. ఇలా ఎందుకు చేస్తున్నావు అని ఇరుగు, పొరుగు వారు అడిగితే ‘చింతపిక్కలమ్మి చిట్టిదొర పెళ్లి చేస్తాన’ని బడాయిగా చెప్పేది. అందరూ ఆమె మాటలు విని నవ్వుకునేవారు.

చిట్టిదొరకు 18 ఏళ్లు వచ్చాయి. వరహాలమ్మ రెండు బస్తాల చింతపిక్కలు కూడబెట్టింది. వాటిని వారపు సంతలో ఒక వ్యాపారికి ఐదు వందల రూపాయలకు అమ్మింది. తన జీతంలో కూడబెట్టిన పదిహేను వందలు కలిపి రెండు వేలు దాటింది. పక్కనున్న గ్రామంలోని తమ బంధువుల పిల్లను చిట్టిదొరకు ఇమ్మని వారిని అడిగింది. కట్నంగా వెయ్యి రూపాయలిస్తానంది. వెయ్యి రూపాయలు పెళ్లి ఖర్చులు, పెట్టి నిరాబండరంగా పెళ్లి చేసింది. వసతి గృహం మేట్రన్‌ శాయమ్మ పెళ్లి కూతురికి చీరలు, గాజులు, పౌడరు డబ్బా, బొట్టు బిళ్లలు కానుకగా ఇచ్చింది. రాప గ్రామంలోని గిరిజనులు చిట్టిదొరకు పంచెలు, చొక్కాలు కొనిచ్చారు. విందుభోజనం తిన్నవారిని రాప గ్రామ గిరిజన స్త్రీలు తమ సాంప్రదాయ ‘థింసా’ నృత్యంతో ఆనందపరిచారు. ఆ నృత్యం చూసిన వారంతా నృత్యంలో పొల్గొన్న వారికి 116 రూపాయలు ఇచ్చి సంతృప్తి పరిచారు. చింతపిక్కలమ్మి చిట్టిదొర పెళ్లి చేసిన వరహాలమ్మ తెలివితేటలకు ముచ్చటపడ్డారు. పనికి రావని పారవేసే వాటిని పందిలంగా దాచి వాటిని అమ్మి వరహాలమ్మ చేసిన పనిని అందరూ సామెతగా చెప్పుకోవడం ప్రారంభించారు. ‘నేను గుమ్మడి పిక్కలమ్మి గున్నడు పెళ్లి చేస్తాన’ని ఒకామె గొప్పగా పెళ్లిలో ప్రకటించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here