[dropcap]“నే[/dropcap]ను రెండు పెళ్లిళ్లు చేసుకున్నానంటే అది నా తప్పా. నన్ను చేసుకున్నవాడు మాత్రం మూడు పెళ్లిళ్లు చేసుకని ఊరేగుతుంటే వాడిని మాత్రం అడగరా! నా వెనకాల నన్ను గురించి నీచంగా, నా ముఖం మీద నన్ను వెక్కిరిస్తు మాట్లాడతారా. నేనేం తప్పు చేసానని. వాడు చేసింది తప్పు అయితే నా వెనకాల పడతారే ఈ మనుషులు.”
“వాడు.. నువ్వు చాలా సౌమ్యురాలువని చెప్పాడు, నీలో ఇంత తెగింపా అమ్మాయ్..”
“కాక, కూటికి గుడ్డకే కాదు బతుక్కె ఏడ్చాను. నాతో ఓ బిడ్డని కని, దాన్ని నా ఎదాన కొట్టి వాడు మాత్రం మూడో పెళ్లాంతో కులుకుతాడా. నేను నా బిడ్డ మాత్రం అందరితో మాటలు పడాలా. రక్తం ఉడకతా వుంది. నా ముందుంటే గుంతులో పొడిచి చంపేదాన్ని. కులం మతం కాని వాన్ని నమ్మి పెళ్లి చేసుకున్నానే, అందుకు నా బతుకు ఇలా చేస్తాడా. ఇప్పుడేదో నా మానాన నేను కాలువగట్టు మీద పిట్టలా బతుకుతుంటే ఇంత ఇబ్బంది పెడతాడా.”
“చూడమ్మాయ్.. వాడిప్పుడు చాలా మారాడు, దుందుడుకుతనం లేదు”
“ఏంటి మారేది.. వాడి కుక్క బుద్ధి నాకు బాగా తెలుసు, మీకు కొత్తెమో..”
“ఆ గాడిద కొడుకు నీకెలా తగిలాడమ్మా?”
“వాడు చెప్పలేదా..”
“వాడివేపు తప్పు లేదన్నట్టు చెప్పాడు లే, పోని నువ్వు చెప్పు ఏం జరిగిందో..”
“నా బతుకు అగ్గిలో బొగ్గులా తయారయ్యింది. ఏం చెప్పినా ఏం లాభం.. మా ఇంట్లో ఆచార వ్యవహారాలు, సనాతన సాంప్రదాయాలు బాగా ఎక్కువ, తెల్లగ ఎర్రగ బుర్రగ ఉన్న నన్ను రోడ్డు మీద ఎవడో చూసాడని మా నాయిన పదహారేండ్లకే నాకు పెళ్లి చేసాడు. నా మొగుడు సర్వశాస్త్రాలు ఎరిగిన పండితుడని నమ్మి ఎన్నో ఆశలతో అత్తవారింట్లో అడుగుపెట్టాను. నాలుగు రోజుల తరువాత తెలిసింది అసలు బాగోతం. ముడ్డి కడుక్కోవడం కూడా చాతగాని మతిలేని పిచ్చోడికిచ్చి నన్ను పెళ్లి చేసారని..”
“మరి నువ్వేం చేశావ్ అమ్మాయ్..”
“అక్కడ ఏముంది చేయడానికి, పదహారవ రోజు పండగ కాకుండానే పదిహేనవ రోజే మా ఇల్లు చేరాను. మళ్లీ ఆ ఇంటి ముఖం చూడలేదు. కాలక్షేపానికని చిన్న స్కూల్‌లో టీచర్‌గా చేరాను. స్కూల్‌లో దింపి, మళ్లీ తీసుకురావడానికి ఒక ఆటో మాట్లాడారు మా ఇంట్లో వాళ్ళు.
ఒక రోజు ఆటో డ్రైవర్ ఆరోగ్యం బాగాలేక ఈ దరిద్రుడు వచ్చాడు. అప్పటికి బ్రహ్మచారైన వీడు ఆ రోజు నుండి నన్ను తగులుకున్నాడు. ఆకాశంలో రంగులు చూపించాడు. మేఘాలను అరచేత్తో ఒడిసిపడతాన్నాడు. బ్రహ్మండం బద్దలైనా నువ్వే కావాలన్నాడు.
అప్పటికే ఒకసారి దెబ్బతిని వున్న నేను, మొదట్లో బెట్టుగా వున్నా తరువాత వాడి మాటల గారడికి పడిపోయాను. ఇలా మనసు మల్లెవిరిసిన సుగంధంలా సాగిపోతున్న సమయంలో ఓరోజు మనిద్దరం పెళ్లి చేసుకుందాం అన్నాడు. పర్యవసానాలు ఏమి ఆలోచించని నేను మాయలమరాఠితో బాలనాగమ్మ పోయినట్టు వీడి వెంబడిపడి పోయాను, ఊర్లన్నీ తిప్పి గుళ్లో పెళ్ళని మెడలో పసుపు తాడు కట్టాడు. అది నాపాలిట ఉరితాడవుతుందని ఆనాడు ఊహించలేదు. ఊర్లన్నీ తిరిగి కొన్నాళ్లకు మా ఊరోచ్చాం. మతం కాని దాన్ని చేసుకున్నావని వాడి ఇంటికి వాళ్ల వాళ్లు నన్ను రానివ్వలేదు. నేను చచ్చాననుకొని మా నాయిన నా ఫోటోకు దండేశాడు. ఇలా కాదని ఇదే ఊర్లో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని కాపురం పెట్టాం. మొదట్లో నాతో బాగుండేవాడు. పని కోసం స్కూల్ బస్సు డ్రైవర్‌గా చేరాడు. నేను ఇంట్లోనే ఉంటూ ఇంటిపని వంటపని చేసుకునేదాన్ని. ఒక్కోసారి ఇంటికి మాంసం తెచ్చి వండమనేవాడు. నా మడి ఆచారం అన్ని పక్కన పెట్టి అన్నీ కూరలు వండటం నేర్చుకుని చేసి పెట్టేదాన్ని. అవి నన్ను తినమని బలవంతపెట్టేవాడు. నేను వాటి జోలికి పోయేదాన్ని కాదు. వాడికి మాత్రం అన్ని రకాల మాంసాలు వండి, మళ్లీ నా మడి ఆచారం పాటించేదాన్ని. వాడి కోసం అన్ని ఇబ్బందుల్ని నవ్వూతూ భరించేదాన్ని. కాల చక్రం అలా తిరుగుతుండగానే నాకు ఆడపిల్ల పుట్టింది. మా ప్రేమకు గుర్తుగా పాపను అపురూపంగా పెంచాలనుకున్నాను. పాప ధ్యాసలో నెలలు రోజుల్లా, గంటలు నిమిషాల్లా గడిచిపోయాయి. ఆ పరిస్థితిల్లో పాపకు మొదటి సంవత్సరం పుట్టిన రోజు నాడే నా నెత్తిన పిడుగుపడింది. ఉహించని విధంగా నా జీవితాన్ని మలుపు తిప్పాడు.”
“ఏం చేసాడు అంత కాని పని..”
“ప్రిన్సిపాల్ పెళ్ళాన్ని ఎత్తుకెళ్ళాడు..”
“అవునా.. అదేలాగా, నీతో బాగానే ఉన్నాడుగా?”
“అదే వాడి కుక్క బుద్ధి. స్కూల్ బస్సు డ్రైవర్‍గా చేస్తూ ఖాళీ టైంలో అదే స్కూల్‌లో టీచర్‍గా పని చేస్తున్న ప్రిన్సిపాల్ పెళ్ళాం వెంటపడ్డాడు. ఆమె ఇద్దరు పిల్లల తల్లయుండి వీడి మాయ మాటలకు పడిపోయింది. బంగారం, డబ్బులు, ఆమె పిల్లల మెడపై గొలుసులు, చెవిపోగులు అన్నీ ఊడ్చుకొని, ఇద్దరు కలసి మా పాప మొదటి సంవత్సరం పుట్టినరోజు నాడే వుడాయించారు. ఎక్కడికి పోయారో తెలియలేదు.”
“అమ్మ బడవా రాస్కెల్.. ఇంత పని చేసాడా, ఇదంతా నాకు చెప్పనేలేదే! మరప్పుడు నీ పరిస్థితి ఏంటమ్మాయ్..?”
“తెగిన గాలిపటంలా అయ్యింది నా బతుకు, అందరికీ లోకువయ్యాను. వాడు చేసిన తప్పుకు నేను బలయ్యాను. కొన్నాళ్ళు పాపతో కలిసి ఒంటరిగా బతుకువెళ్ళదీసాను.. ఈ లోపు మా నాయిన కాలం చేసాడు. మా అమ్మకు నేను తప్ప ఎవరు దిక్కులేక నన్ను మా ఇంటికి తీసుకెళ్ళింది. దాంతో మా కులం వాళ్లందరు మా కుటుంబాన్ని వెలేసారు. వాడు పోతేపోయాడు పాపే నా లోకం అనుకున్నాను. ఇంతలో మరో ఉపద్రవం వచ్చింది.”
“మళ్ళీ ఏమైంది..”
“ప్రిన్సిపాల్ వాడి మీదే కాక నా మీద కూడా కేసు పెట్టాడు. అందరి ముందు నేను తల దించుకోవల్సి వచ్చింది. ఏం చేయాలో అర్థం కాలేదు. ప్రిన్సిపాల్ కాళ్లవేళ్ళ పడి ఆ కేసు నుండి బయటపడ్డాను. పాప భవిష్యత్ గురించే బెంగ అందుకే సమస్యలతో పోరాడటం నేర్చుకున్నాను. మళ్లీ జీవితంలో పెళ్లి అనే మాట ఉండకూడదని నిర్ణయించుకున్నాను.
డిగ్రీ చదువుతూ మంచి స్కూల్‌లో టీచర్‌గా చేరాను.
సంవత్సరం తరువాత ఉన్నట్టుండి ప్రిన్సిపాల్ పెళ్లాం మళ్లీ ఇల్లు చేరింది. ఆడపిల్లల భవిష్యత్ ఆలోచించి ప్రిన్సిపాల్ పెద్దగా రచ్చ చేయకుండానే పెళ్లాన్ని ఆదరించాడు. కుటుంబాన్ని తీసుకుని ఊరు వదిలి వెళ్లిపోయాడు. దాని మెడలో కూడా ఓ పసుపు తాడు కట్టాడని, దాని మీద కోరిక తీరి, డబ్బులు, బంగారం అయిపోగానే దాన్ని తన్ని తరిమేసాడని తరువాత తెలిసింది.
కొంతకాలం తరువాత నా దగ్గరకు చేరడానికి రాయబారం పంపాడు. మళ్లీ కలిసుందాం రమ్మన్నాడు. ఎవరెవరినో పంపించి నా మీద ఒత్తిడి చేయడానికి ప్రయత్నించాడు. తప్పైంది క్షమించమని వేడుకోలు ప్రారంభించాడు. అది కుదరక నా మెడలో తాళిబొట్టు ఉన్నంత కాలం నా మీద వాడిదే పెత్తనం అన్నాడు. కాని నా ఎదుటకు వచ్చి మాట్లాడే ధైర్యం చేయలేదు. ఎందుకంటే ప్రిన్సిపాల్ పెళ్లాన్ని ఎత్తుకెళ్లిన కేసు అలాగే ఉంది. దేనికీ నేను లొంగలేదు. పాపను మాత్రం వాడి కంట పడకుండా అన్నీ నేనే అయి పెంచాను.
ఎన్ని రకాలుగా ఒత్తిడి చేసినా వాడిని నా పంచన చేరనీయకపోవడంతో కొన్నాళ్లకు వాళ్ల మతంలోని అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని తరువాత ఇద్దరు పిల్లలు కూడా పుట్టారని తెలిసింది. నేనది ఏమాత్రం పట్టించుకోలేదు.”
“వాడు నా దగ్గర పని చేస్తాడు. ఇన్ని విషయాలు నాకు తెలియవు. నువ్వే ఒదిలేసావని చెప్పాడు. ఇప్పుడున్న పెళ్లాం పోయిందని, నిన్ను వాన్ని కలపమని నా కాళ్ల మీద పడితే వచ్చానమ్మాయ్.”
“పాప కష్టపడి చదువుకొని ఉద్యోగం సంపాదించుకొంది. ఉన్నత విలువలతో ఎదిగి తన కాళ్లపై తను నిలబడింది. అది తెలుసుకొని పాపను కలవడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నించాడు. ఇప్పుడు మా దగ్గర చేరి నా మొగుడిగా మగాడిగా పెత్తనం చెలాయించాలని చూస్తున్నాడు. అందుకే మళ్లీ రాయబారం పంపాడు. ఇప్పటి వరకు వాడి విషయాలేవి తెలియకుండా పాపను పెంచాను. అందుకే వాడి నీడ కూడా పాప మీద పడకూడదు.
నా మెడలో వాడు కట్టిన తాళి వుందని, ఇప్పటికీ ఎప్పటికీ వాడే నా మొగుడని ఫోన్లు చేసి మనుషులను పంపి నన్ను వేధిస్తున్నాడు. ఏ రోజు అయితే వాడు నా దగ్గర నుండి వెళ్లిపోయాడో ఆ రోజే వాడి జ్ఞాపకాలన్నీ నాలోనుండి తుడిచిపెట్టుకుపోయాయి.
ఇదొక్కటి మిగిలింది, ఇదిగో వాడు కట్టిన తాళి, ఉరి తాడులా ఇన్నాళ్లు నా గుండెల మీద ఈ బరువు మోసాను. ఇంక నాకా ఓపిక లేదు. వాడు కట్టిన తాళి వాడి మొఖం మీదే కొట్టండి. ఇక నుంచి వాడికి నాకు బంధం తెగిపోయింది అని చెప్పండి.
మరోసారి మా దగ్గరకు రావాలని చూస్తే నా చేతిలో వాడికి చావే..
ఇక మీరు వెళ్ళొచ్చు..”