మార్పు మన(సు)తోనే మొదలు-5

0
3

[ప్రసిద్ధ రచయిత్రి డా. చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి రచించిన ‘మార్పు మన(సు)తోనే మొదలు’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము. తెలుగులో మానసిక ఆరోగ్యం కేంద్రంగా రచించిన నవల ఇది.]

[ప్రభాత్‌కి సరిగ్గా మందులు ఇవ్వలేకపోతుంది మృగనయని. అతిథులను ఇంటికి పిలవకుండా మేనేజ్ చేయలేరా అని అడుగుతాడు గగన్. కుదరదంటుంది మృగనయని. అంతలో ఒక ఆలోచన వచ్చి తన బాచ్‌మేట్ నందన్ కార్డు ఇచ్చి అతనికి చూపించమంటాడు. నందన్‍ ఓ న్యూరాలజిస్ట్ అని ప్రభాత్‍కి చెప్పి – అక్కడికి తీసుకెళ్ళమని, ఇక నుండీ ప్రభాత్ బాగోగులు నందన్ చూసుకుంటాడని చెప్తాడు. కొన్నాళ్ళ తరువాత మృగనయని ఫోన్ చేసి డాక్టర్ నందన్ సైకియాట్రిస్టు అని తన భర్తకి తెలిసిపోయిందని, తనని బాగా తిట్టాడని, ఏదో చెప్పి తప్పించుకున్నానని అంటుంది. కొన్ని రోజులకి మళ్ళీ ఫోన్ చేసి ప్రభాత్‌కి వేరే ఊరు బదిలీ అయిందని, అక్కడ రవి అని తన మిత్రుడు సైకియాట్రిస్టుగా ఉన్నాడని, అతని సహాయం తీసుకుంటానని చెప్తుంది. విపరీతమైన కోపం వస్తుండే మల్లిక అనే అమ్మాయికి చికిత్స చేస్తాడు గగన్. తర్వాత ఓ రోజు ప్రభాత్ ఇంటికి వెళ్ళి అతన్ని మాటల్లో పెడతాడు. మృగనయని తనని మోసం చేసిందని, తనని చంపాలని చూసిందని, అందుకే విడాకులు ఇచ్చానని చెప్తాడు ప్రభాత్. అతనికేవో మంచి మాటలు చెప్పడానికి ప్రయత్నించి, తమ ఇంటికి ఆహ్వానిస్తాడు. అతని అనుమతితో అతని ఫోన్‍లో సద్గురువు యాప్ ఇన్‌స్టాల్ చేస్తాడు. వీలున్నప్పుడు అవి వింటూ ధ్యానం చేయమంటాడు. స్కిజోఫ్రెనియా రోగులు తమ ‘కంఫర్ట్ జోన్’, దాటి రావడానికి ఇష్టపడరనే విషయం గగన్ దంపతులకి తెలుసు కాబట్టి ప్రభాత్‌ని సౌకర్యంగా ఉంచుతారు. – ఇక చదవండి.]

[dropcap]పొ[/dropcap]ద్దున్నే పని ముగించుకుని వృత్తి పనిని చెయ్యడానికి ఇంటికి తాళం పెట్టి బయల్దేరింది మల్లిక. జిల్లా మానసిక ఆరోగ్య కార్యక్రమంలో ఇప్పుడు ఆమె పనిచేస్తోంది. ఆ పరిసర ప్రాంతాల్లో ఎవరికైనా మానసిక రోగాలున్నాయేమో కనుక్కోవడం, వాళ్ళకి నచ్చజెప్పి, వాళ్ళని ఈ వైద్యానికి వచ్చేలా చేయడం ఆమె చెయ్యాల్సిన ముఖ్యమైన పని. ఆమెను ‘మానసిక సేవిక’ అంటారు. ఆ రోజు ఎండ మండిపోతున్నా, ఎక్కే గుమ్మం – దిగే గుమ్మం అయినా, ఆమెకు ఒక్క కేసుకూడా తగలలేదు. ఆశ వదులుకునే సమయానికి వెతకబోయిన తీగ కాలికి తగిలింది.

మరి కొంత సమయానికి ఆసుపత్రిలో..

మల్లిక వచ్చి నిలుచుంది. చాలా సేపయ్యింది. పేషెంట్ల హడావుడిలో పడి డాక్టర్ ఆమెను గమనించలేదు. ఆమె సాధారణంగా ఆ ఆసుపత్రిలో కనిపించదు. హడావుడి తగ్గాక, అతని దగ్గరకు వచ్చి, చిన్న గొంతుకతో, “డాక్టర్, ఒక రిటార్డేషన్ కేసు దొరికిందండీ!” అంది.

గగన్ తల పైకెత్తి, “ఈ ఊళ్ళోనా? మనకి తెలియకుండానా?” అని నమ్మలేనట్టు అడిగాడు. “వాళ్ళు వేరే చోటి నుంచి వచ్చారట”, అని, ఆ కేసుకి సంబంధించిన కాగితాలు గగన్‌కి అందించింది మల్లిక.

దయ్యం పట్టిన చంద్రముఖిలా భీకరంగా ఉండే ఆమె ఇప్పుడు మానసిక సేవిక అయిన వైనాన్ని గుర్తుతెచ్చుకున్నాడు గగన్.

***

మల్లిక హిప్నోథెరపీ మొదలుపెట్టింది. ఈ దెబ్బతో ఆదివారం పొద్దుట మన డాక్టర్ గారికి కుటుంబంతో గడిపే సమయం ఆమ్-ఫట్ అయ్యింది. మొదటి రోజు ఆమెను మెంటల్‌గా ప్రిపేర్ చేసి, తన సబ్-కాన్షస్ మైండ్ లోకి వెళ్ళి, ఏవైనా తెలియని విషయాలు తెలుస్తాయేమో చూడాలని చెప్పాడు. పారదర్శకత కోసం తన మొబైల్ లోని రికార్డర్ ఆన్ చేశాడు. “నా ఏడవ ఏట అమ్మానాన్నా గట్టిగా వాదించుకున్నారు. ఆ సంభాషణ నాకు అర్థం కాలేదు.

పిల్లలతో ప్రేమ తప్ప చూపని వాళ్ళు ఇలా పెద్దగా అరుచుకుంటుంటే నాకు భయం వేసింది. ఎవరైనా ఆనందంతో కేరింతలు కొట్టినా, నాకు భయమేస్తోంది. అన్నతో చెప్పాను. వాడు నన్ను వాళ్ళతోపాటు గట్టిగా అరవమన్నాడు. నా బాధ వాడికెలా తెలిసేది?” అని చెప్పింది మల్లిక.

సిట్టింగ్ ముగిసింది. ఆమె భయానికి కారణం తెలిసింది. కానీ, ఇంకా విషయాలు తెలుసుకోకుండా తను ట్రీట్మెంట్ మొదలెట్టలేనని అనుకున్నాడు గగన్. మళ్ళీ ఆదివారం కలుద్దామని వీడ్కోలు చెప్పి, ఇంటికొచ్చాడు.

***

మరికొన్ని వారాల సిట్టింగుల్లో మల్లిక జీవితానికి సంబంధించిన చాలా చాలా విషయాలు తెలిశాయి గగన్‌కి – మల్లికి ఇష్టమైన పుస్తకం మీద పెయింట్ పోసిన అన్నయ్యని తన్నేద్దామనిపించడం, తనకి కావాలని తక్కువ మార్కులు వేసిన టీచర్ ఉద్యోగం ఎలా పీకించాలా అని ఆలోచించడం – ఇలా కోపప్రకోపాన్ని పెంచే సంఘటనలు. ఇలా సిట్టింగులు ఎక్కువయ్యాయి గాని టర్నింగ్ పాయింట్ ఏమీ చిక్కుబడలేదు.

ఒక రోజు, గగన్ మల్లిక వాళ్ళకి ఒక పుస్తకమిచ్చాడు. అది డా॥ బ్రయాన్ వెయిస్ వ్రాసిన, ‘మెనీ లైవ్స్, మెనీ మాస్టర్స్’. “హిప్నోలో మనం ముందుకు వెళ్తున్నట్టు అనిపించడంలేదు. ఈ పుస్తకంలో ‘పాస్ట్ లైఫ్ రిగ్రెషన్’ అనే ట్రీట్మెంట్ గురించి వివరాలుంటాయి. మీకు నచ్చితే చెప్పండి. హైదరాబాద్లో నా స్నేహితుడున్నాడు – దీనిలో ఎక్స్పర్ట్. ఆయనకి సిఫారసు చేస్తాను”, అన్నాడు.

కొన్నాళ్ళకి మల్లిక అన్నయ్య, మధు, వచ్చి, “పుస్తకం చదివితే బాగానే ఉంది. మా ఇంట్లో అందరం మిమ్మల్ని నమ్ముతాం. మా చెల్లి పెళ్ళి కావలసిన పిల్ల. అలా అని తన గతం దాచం లెండి. అయినా, అమె చెప్పే గత జన్మ స్మృతులు ఆ డాక్టర్ గారు గోప్యంగా ఉంచుతారా?” అని అడిగాడు. “గోప్యంగా ఉంచుతారు కాబట్టే ఆయనకి అంత మంచి పేరుంది! తినబోయేది మీరు. రుచుల గురించి మాట్లాడే హక్కు నాకు లేదు. ఒకసారి వెళ్ళి కలవండి. నచ్చితేనే ట్రీట్మెంట్కి వెళ్ళవచ్చు”, అంటూ తన లెటర్ హెడ్ తీసి, డా॥ గోవర్ధన్‌కి ఉత్తరం వ్రాసి మధు చేతికిచ్చాడు.

***

మరి కొన్నాళ్ళకి, డా॥ గోవర్ధన్ గగన్‌కి ఫోన్ చేసి, “గగన్, మీరు పంపించిన పేషంట్ విషయం తెలిసిపోయింది, అందులోనూ రెండో సిట్టింగ్లోనే! ఒక జన్మలో తనొక ఆధ్యాత్మిక గురువునని చెప్పింది. మరో జన్మలో ఆమె ఒక రైతు కూలీనని చెప్పింది. కొన్ని జన్మల్లో మగపుట్టుక కూడా పుట్టింది.

ఇవ్వాళ్టి సిట్టింగ్‌లో ఒక జన్మలో ఆమె బొబ్బిలి యుద్ధంలో వీర స్వర్గం పొందిన ఒక సైనికుడు. మరో జన్మలో ఆమె ఒక ముసలి అనాథ. ఆదరించే నాథుడు లేక ఊరి చివరనున్న పూరిపాకలో, ఉన్న రోజు తింటూ, లేని రోజు పస్తుంటూ దీనంగా కాలం గడుపుతోందట.

ఇదిలా వుండగా, ఒక రోజు తన ఇంటి బయట ఒకే అరుపులూ, కలకలమూ అట. బయటికి వచ్చి చూస్తే, ‘సంపెయ్యండి రా దీన్ని. ఊల్లోని పిల్లలని సేతబడి సేత్తాంది.. పాపిట్టిది.. ఏసెయ్రా’, అనే అరుపులు దగ్గరపడ్డాయట. ‘నాకు తిండి లేదు గానీ నేను చేతబడి చేయలేదు’, అని అమె అన్న మాటలు ఎవరికీ వినబడలేదట.

ఈ లోగా ఒక ఇటుక ముక్క తన తలని తాకిందట. తరువాత ఒక నాపరాయి.. ఇలా ఆమెపై శిలావర్షం కురిసిందట.. ఆ బాధ, నొప్పితో ఆమె ప్రాణాలు విడిచిందట. ఆ అరుపులు, కేకలు వింటున్నప్పుడు ఆమె భయపడి, భోరుమంది. లేచిన తరువాత చాలా ఇంప్రూవ్ అయ్యింది. ట్రీట్మెంట్ మీరు చూసుకోండి. వాళ్ళతోపాటు కేస్ ఫైల్ కూడా పంపిస్తాను”, అన్నాడు.

గగన్ సంతోషించాడు. ఆమెను కోపానికీ, తద్వారా హింసాత్మక ప్రవర్తనకీ ఉసి గొల్పుతున్న అసలు కారణం తెలిసింది. ఆమె అదృష్టం బాగుంది కాబట్టి రెండో సిట్టింగ్‌కే సంగతి తెలిసింది. ఒక డాక్టర్‌గా తను హేతువాదాన్ని నమ్ముతాడు. కానీ, కొన్ని తీవ్ర రుగ్మతలకి కారణం పూర్వ జన్మ వాసనలు కూడా అవచ్చు. మరి, ఇటువంటి వింతలని హేతువాదం అర్థం చేసుకోగలదా? కాస్సేపు అలోచించి, బుఱ్ఱ వేడెక్కించుకుని, మళ్ళీ పనిలో నిమగ్నుడయ్యాడు గగన్.

***

ఓ రెండేళ్ళ తరువాత..

“నాకు సంతోషమే కానీ, మన సమాజంలో ఒక పెళ్ళి కావలసిన పిల్ల చేసే ఉద్యోగమేనా ఇది?” అని ప్రశాంతంగా అడిగాడు గగన్. “ఎందుకు చెయ్యకూడదండీ? మీరు కూడా ‘ఇదేం పిచ్చి డాక్టరీ’, అని అనుకుని ఉంటే మీ చేతుల మీదుగా నయమయ్యే భాగ్యం ఇంత మందికి ఉండేది కాదుగా!” దృఢ నిశ్చయంతో ఉన్న మధు జవాబిచ్చాడు.

“మీ చల్లని చేతుల వల్ల మామూలు మనిషినయ్యాను. మీ అంత చదువుకున్నోళ్ళం కాము గాని, ఉడతా సాయంగా ఏదైనా చిన్న పని చేస్తూ మీతోపాటే ఉంటాను డాక్టర్ గారూ!” ఆనంద బాష్పాలు కారుస్తూ అంది మల్లిక. గగన్ ఆలోచించాడు.

డి‌ఎం‌హెచ్‌పిలో డాక్టర్ ఒక్కరూ ఉంటే సరిపోదు. కనీసం ఒక కౌన్సిలర్, ఒక మానసిక సేవిక, కొందరు మానసిక నర్సులూ ఉండి తీరాలి. మన దేశంలో అన్నీ కొరతలే. చేతికందిన బంగారాన్ని కాలదన్నుకోవడమెందుకు, అని ఆలోచించి, “నువ్వు చదివిన చదువు, అదే బీయే ఒక్కదానితోనూ వెంటనే ఉద్యోగం రాదు. కొన్నాళ్ళు శిక్షణ పొంది, చేరవచ్చు”, అని ముగించాడు గగన్.

***

కర్తవ్య నిర్వహణ చేస్తున్నప్పుడు-

“డాక్టర్ గారికి మజ్జిగ తీసుకురా, పోలయ్యా! అసలే ఎండను పడి వచ్చారు!” అంది జమీందారు గారి కోడలు. ఆమె మాటల్లో అట్టహాసం కొట్టొచ్చినట్టు కనబడుతోంది. ఆప్యాయత అనేది మృగ్యం. ఏదో వాళ్ళింటి మజ్జిగ తాగడం బయట బాదంగీర్ తాగడంతో సమానమన్నట్టుంది ఆమె వాలకం. దాన్ని తాగే అదృష్టం కలిగించినందుకు గగన్ తమకు ఆజన్మాంతం ఋణపడుండాలన్నది ఆమె ఉద్దేశమేమో!

“ఊరక రారు మహానుభావులు.. ఏవిఁటీ ఇలా దయచేశారు?” అని ఆవిడన్న మాటలకి తన అలోచనల నుండి బయటకొచ్చాడు గగన్. చింత చచ్చినా పులుపు చావనట్టు, రాచరికం పోయినా, సుపీరియారిటీ కాంప్లెక్స్‌కి ఎటువంటి డిస్కౌంటూ లేదు, అని మనసులో అనుకున్నాడు గగన్. “మీ మరిది గారు..” ఇంకా చెప్పబోతుంటే అడ్డుపడి, “మా మావఁ గారు చేసిన పనికి మేమిచ్చుకొవలసిన పరిహారం”, అంది కోడలు.

“మేడమ్, జరిగినదాని గురించి చర్చించడానికి నేనెవర్ని? ఆయనకి బుద్ధి మాంద్యం, అంటే మెంటల్ రిటార్డేషన్, ఉందని మాకు సమాచారం అందింది. ఆయన ట్రీట్మెంట్ గురించి మాట్లాడడానికి వచ్చాను. ఆయనని ఒకసారి పిలుస్తారా?” అడిగాడు.

“మా మావఁ గారు పోయాక వీళ్ళు కోర్టునాశ్రయించి, ఇక్కడ తిష్ఠ వేశారు. ఆ తల్లీపిల్లలకి తిండే దండగ. ఇంకా మెడికల్ ఖర్చులు కూడానా?” విసుక్కుంది ఆవిడ. “మేడమ్, జిల్లా మానసిక ఆరోగ్య కార్యక్రమంలో పేషంట్లకి వైద్యం ఉచితం. ఇంకా, వారికి మందులు కూడా ఉచితమే. ఆయన్ని ఒకసారి పరీక్షించనిస్తే..” అని ఆగాడు గగన్.

“ఆఁ, దానికేం భాగ్యం? కానీ, మాకు కొన్ని నియమాలున్నాయి. వాటికి మీరొప్పుకుంటేనే ఆయన గారికి ట్రీట్మెంట్ చేయించవచ్చు. ఆయన మీ ఆసుపత్రికి రారు. మీరే పేలెస్‌కి రావాలి. ఆయన్ని పరీక్షించడం మా ఎదుటే జరగాలి. సరేనా?” అంది ఆ కోడలు.

“ఇన్ని చెప్పిన వారు, వారికి మందులెవరిస్తారో కూడా సెలవియ్యండి. వాళ్ళకి కొన్ని సూచనలివ్వాలి”, అన్నాడు. “సరే, వాళ్ళ తల్లి గారిని పిలిపిస్తాం”, అందావిడ. ఆ తరువాత చిన భూపతిని పరీక్షించడం, అతనికి సంబంధించిన వివరాలని వాళ్ళమ్మని అడిగి కనుక్కోవడం, ఆవిడకి మందులు ఏ మోతాదులో, ఎప్పుడెప్పుడు ఇవ్వాలో అన్నీ విశదంగా చెప్పడం వెనువెంటనే జరిగిపోయాయి.

వాళ్ళ వాలకం చూసిన గగన్, ప్రతీ పది రోజులకీ పేలెస్‌కి వెళ్ళి, చిన భూపతిని పరీక్షించి వచ్చేవాడు. మందులు క్రమం తప్పకుండా సమయానుసారం అందడం వల్ల అతని మొహం కొంచెం తేటగా కనిపించింది. అందువల్ల అతని విజిట్‌ని నెలకోసారిగా మార్చుకున్నాడు గగన్.

కొన్నాళ్ళు బాగా సాగిన ట్రీట్మెంట్‌కి చెడ్డ రోజులొచ్చాయి. చిన భూపతి తల్లి కాలం చేసింది. ఆ ఇంటిని అంటిపెట్టుకున్న నౌకర్లెవరైనా భూపతి బాధ్యత చేపడతారేమో అని ఆశ పడ్డాడు గగన్. కానీ, తన ఎదురుగానే కోడలమ్మ అందరినీ పిలిచి అడిగినా కూడా ఎవరూ ముందుకు రాలేదు. ఇదొక నాటకమని తను పసిగట్టినా, పరిష్కారం దొరకనందుకు బాధపడ్డాడు.

***

“ ‘నారు పోసినవాడే నీరు పోస్తాడ’న్న సామెత విన్నారా సార్?” అడిగింది మల్లిక. గగన్ ప్రశ్నార్థకంగా చూశాడు. “మీరు చిన భూపతి గారి గురించి మథన పడుతున్నారు కదా! మీరు అనుమతిస్తే, ఆ బాధ్యత నేను తీసుకుంటాను”, అంది మల్లిక.

గగన్ ఏదో అనేలోపే, “ఏ రోజైనా నేను వెళ్ళలేకపోతే, మా అన్నయ్య వెళ్తాడు లెండి. ఇంక మీకెటువంటి అభ్యంతరాలూ ఉండకూడదు సార్”, అంది. గగన్ చిరునవ్వుతో తన అంగీకారాన్ని వ్యక్తం చేసి, పేలెస్‌కి వెళ్ళి ఈ కొత్త ఏర్పాటు గురించి చెప్పి వచ్చాడు. అప్పుడప్పుడు అతణ్ణి చూసి, పరిస్థితిలో ఉన్న కొద్దిపాటి మెరుగుదలను గమనించాడు.

***

“సార్, నాకు కొన్నాళ్ళు సెలవిప్పిస్తారా?” అని రాబోయే కన్నీళ్ళని రెప్పల్లోనే ఆపెయ్యాలని వ్యర్థ ప్రయత్నం చేస్తోంది మల్లిక. “సెలవు సంగతి అటుంచు. ఏవిఁటీ, ఇంత డల్‌గా ఉన్నవు?” అన్నాడు గగన్. అంతే, మల్లిక కళ్ళలో నీళ్ళు వెల్లువెత్తాయి. “కారణం చెప్పమ్మా!” అన్నాడు.

“చి.. న.. భూ.. ప.. తి బాబు గారు”, అంది మల్లిక. ఇప్పుడు గగన్ కంగారు పడ్డాడు, కొంపదీసి తెలియకుండా అతను ఈమెతో అసభ్యంగా ప్రవర్తించాడా అని. “ఏం.. జరిగింది? ఏమయ్యింది?” అని గట్టిగా అడిగాడు గగన్.

“మీరనుకున్నట్టు ఏమీ లేదు సార్”, అని ఆమె మళ్ళీ ఏడుపందుకుంది. నిట్టూర్చిన గగన్, “విషయం చెప్పి ఏడిస్తే నయం”, అన్నాడు. అతను రోగులతో చాలా సహనంతో వ్యవహరిస్తాడు. ఈమెకి మానసికారోగ్యంపై అవగాహన ఉందని తెలుసు గనుక ఇలా ‘కట్టె-కొట్టె-తెచ్చె’ టైపులో వ్యవహరిస్తున్నాడేమో అని తనకే అనిపించి, మళ్ళీ అనునయంగా, “నీ బాధకి పరిష్కారం కనిపెట్టాలంటే విషయం నాకు తెలియాలి కదా!” అన్నాడు.

కాస్సేపు మౌనం తరువాత, “చిన బాబు గారిని తెగ మిస్ అవుతున్నాను సార్”, అంది మల్లిక. నిర్విణ్ణుడయ్యాడు గగన్. “అంతలోనే ఏవిఁటీ ప్రేమలు, దోమలూ? వాళ్ళు వింటే, ఏదో జమీందార్ గారి ఆస్తిపాస్తుల్లో వాటాకోసం వలేశావంటారు సుమా!” అన్నాడు.

“మీరు కూడా ఇంతేనా? నాకు మొదట్లో ఆయన మీద జాలి ఉండేది, ఇంత ఎదిగినా బుద్ధి కుశలత లేదని. మందులివ్వడానికి వెళ్ళినప్పుడు ఆయన పసిపాపలా నిష్కల్మషమైన మనసున్న వారని తెలుసుకున్నాను. రోజురోజుకీ ఆయన తన మంచితనంతో నా మనసంతా నిండిపోయారు. నిజంగా నాకు ఆయన ఆస్తి మీద కన్ను లేదు సార్”, ఘంటాపథంగా చెప్పింది మల్లిక.

“మరి, ఈ మిస్ అవడమేమిటి, రోజూ అతన్ని చూస్తూంటేను?” అడిగాడు గగన్. మల్లిక ఆ విషయం చెప్పసాగింది.

***

“కొన్నాళ్ళ క్రితం, అంటే, ఓ పదిహేను రోజుల క్రితం, కోడలమ్మ గారు, చిన బాబు గారు ఏదో మొక్కు తీర్చుకోవాలని ఓ రెండు రోజుల పాటు ఉండరనీ, మందుల క్రమం రాసియ్యమని కోరారు. నేను అలాగే రాసిచ్చాను”, అంది మల్లిక.

ఇది విన్న గగన్ పూనకమొచ్చిన వాడిలా, “చిన భూపతిని మొక్కు కోసం కాదు, ఇంట్లోంచి కిక్ ఇవ్వడానికి వేసిన పన్నాగం.. అసలే ఆ రాక్షసి కోడలికి వాళ్ళంటే కిట్టదు. ఇప్పుడా అబ్బాయిని కాపాడడానికి వాళ్ళమ్మ కూడా బతికి లేదు.. నో డౌట్, అతని ‘పీడ విరగడ’ చేయడానికి ఇదొక మాస్క్. తిరిగొచ్చాడా, చెప్పు, వచ్చాడా?” అని అరిచాడు.

“మీకెలా తెలుసు సార్, నిజమే, ఆయన ఇంకా రాలేదు”, అందామె, ఆశ్చర్యంగా. “ఆ గయ్యాళి ఏం సాకులు చెప్తోంది, అతను రాకపోవడానికి?” అడిగాడు గగన్. “ ‘చిన బాబుగారికి ఆ ఊరు ఇష్టమయ్యింది. అక్కడే ఇల్లు కట్టమని వాళ్ళన్న గారిని కోరారు. వారు ఆ పని మీదే ఉన్నారు’, అని చెప్పారండీ కోడలమ్మ గారు”, అంది మల్లిక. “ఏ ఊరో కనుక్కో”, అన్నాడు గగన్.

***

ఆ ఊరు వెళ్ళొచ్చిన మధు తెల్ల మొహం వేశాడు. ఎవరూ చిన భూపతి ఉనికినే ఎరగరటక్కడ! ఇప్పుడు గగన్ అనుమానం రూఢి అయ్యింది. కానీ, అతణ్ణి వాళ్ళు ఏం చేసుంటారో ఎవరికీ అంతుపట్టని యక్ష ప్రశ్న. మల్లిక శోక సముద్రంలో మునిగిపోయింది.

***

“మనం పోలీసు కంప్లైంట్ ఇస్తేనో?” గగన్‌ని అడిగింది మల్లిక. “ఆ జమిందార్లకి పోలీసుల దగ్గర ఆ పాటి పలుకుబడి ఉండదేమిటి?” అడిగాడు మధు. “అది కాదు విషయం. అడిగేవాళ్ళు ఉండరంటే మనుషులు ఇంకా విర్రవీగిపోతారు. ప్రయత్నిద్దాం”, అన్నాడు గగన్, మల్లిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని.

తీరా చూస్తే, ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న ఇన్‌స్పెక్టర్ గగన్ పేరు విని ఉన్నాడట. ఎలాగంటే, పనిమనిషి మంజుల వాళ్ళ వదిన ఇన్‌స్పెక్టర్ గారింట్లో పనిమనిషట. తన ఆడపడుచుని గగన్ దంపతులు గుణం చేసిన విషయం గొప్పగా చెప్పిందట. భార్య ద్వారా సంగతి తెలుసుకున్న ఇన్‌స్పెక్టర్ గగన్ గురించి సదభిప్రాయం ఏర్పరచుకున్నాడట. “డాక్టర్ గారూ, ఇలాంటి కేసుల్లో ఒత్తిళ్ళు రావచ్చు. మానవ ప్రయత్నం మనం చేస్తే, దైవం మనల్ని ఆశీర్వదిస్తారని నమ్ముదాం”, అని ముగించాడు ఇన్స్‌పెక్టర్ భరత్.

***

“డాక్టర్ గారూ, వాళ్ళు ఆ అబ్బాయి విషయం తమకేమీ తెలియదని దబాయిస్తున్నారు”, అన్నాడు ఇన్స్‌పెక్టర్ భరత్. “అదెలాగ?” అన్నాడు గగన్. “అటూ, ఇటూ తిరుగుతూ వెళ్ళిపోయి, తప్పిపోయే అలవాటు ఆ అబ్బాయికి ఉందంటున్నారు”, అన్నాడు భరత్. “నాన్సెన్స్! నా దగ్గర ఉన్న పేపర్లలో ఆ విషయం లేదే! వాళ్ళమ్మ గారు అతని గురించి ఆవిడకి తెలిసినన్ని వివరాలూ చెప్పారు. వాటి ఆధారంగా, ఏదో మత్లబు చేసుంటారని మీరు వాళ్ళని అరెస్ట్ చేయగలరా?” అడిగాడు గగన్. “వీళ్ళు పెద్ద మనుషులు. సరైన ఆధారాల్లేకుండా అరెస్ట్ చేయలేం, ఇంటరాగేషన్ మాత్రం చేయవచ్చు”, అన్నాడు భరత్.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here