నారద భక్తి సూత్రాలు-10

0
4

[శ్రీ శివానంద మహారాజ్ రచించిన వ్యాఖ్యానం, వ్యాసాశ్రమ శ్రీ మలయాళ స్వామివారి వ్యాఖ్యానం ఆధారంగా శ్రీమతి సంధ్యా యల్లాప్రగడ అందిస్తున్న ఆధ్యాత్మిక సుమమాలిక ‘నారద భక్తి సూత్రాలు’]

నారద భక్తి సూత్రాలు

56. గౌణీ త్రిధా గుణభేదా దార్తాదిభేదాద్వా

సత్వాది గుణభేదము వల్లను, ఆర్తాది భేదముల వల్లను, త్రిగుణాలతో ఉన్న భక్తి మూడు రకాలుగా ఉంది.

త్రిగుణాలను భక్తి మూడు రకాలు. అది సాత్విక, రాజస, తామస భక్తి.

విశుద్ధగుణభక్తి మరోటి ఉంది. అది ఆత్మజ్ఞాన స్వరూపంగా ఉంటుంది. కేవలం భగవన్మయంగా ఉంటుంది.

కేవలం పరమాత్మ ప్రీతి కోసం పూజనం చేయటం సాత్విక భక్తి.

భౌతికమైన వాంఛలతో సేవించటము రాజస భక్తి. ఇతరులకు హాని కలిగించేందుకు పూజ చెయ్యటం తామస భక్తి.

సాత్విక భక్తి స్వచ్ఛమైన ముత్యం వంటిది. సాత్విక భక్తి కలవారి హృదయం సంతోషంతో నిండి ఉంటుంది. వారు పరమానందభరితులుగా ఉంటారు. తమ భక్తి గురించి సంతోషంగా ఉంటారు.

పరమాత్మను పూర్తిగా నమ్మినవారికి మరి అడగవలసినది లేదు. ఎందుకంటే భగవంతుడే అన్నీ ఇచ్చేవాడు కాబట్టి.

‘గౌణీ’ అని ప్రారంభించినందుకు ఇందులో ఆత్మజ్ఞానభక్తిని చేర్చలేదు.

గీతలో నాలుగు రకాలైన భక్తుల గురించి చెప్పబడింది.

“చతుర్విదా భజంతే మాం జనాస్సుకృతినోఽర్జున

ఆర్తోజిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ॥

తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే।

ప్రియోహి జ్ఞానినోఽత్యర్థమహంసచ మమ ప్రియ॥” (7-16&17)

భక్తులు నాలుగు రకాలుగా విభజించబడ్డారని గీతలో భగవానుడు చెబుతున్నాడు.

వారు ఆర్తి, జిజ్ఞాసు, అర్థార్థి మరియు జ్ఞాని.

దుఃఖాలలో రక్షణ తోచక పరమాత్మమను శరణుకోరే వారు ఆర్తులు. ఇందుకు ఉదా. గజేంద్రుడు, ద్రౌపది.

తత్త్వజ్ఞానము పొందాలన్న ఇచ్ఛ కలిగి గురువును లేదా మార్గాన్ని కోరి పరమాత్మను శరణు వేడేవారు జిజ్ఞాసువు. ఉద్ధవుడు ఇందుకు ఉదాహరణగా చెప్పబడ్డాడు.

వ్యాపారంలో నష్టపడి, దొంగలచే అపహరించబడి, ద్యారిద్ర్యంతో పరమాత్మను శరణు వేడువారు అర్థార్థి.

ద్రువుడు, కుచేలుడు ఇందుకు ఉదాహరణగా చెప్పబడ్డారు.

మోక్షం కొరకు భగవంతుని చేరువారు ఉత్తములు. ధర్మార్థకాముములు ఇహలోక, పరలోక సుఖాలను మాత్రమే ఇస్తాయి.

57. ఉత్తరస్మాదుత్తరస్మాత్పూర్వ శ్రేయాయ భవతి.

వెనక వెనకు ఉన్న భక్తి కన్న ముందు ముందున్న భక్తి శ్రేయోదాయకము. తామస భక్తి కన్నా రాజస భక్తి నయము. రాజస భక్తి కన్నా సాత్త్విక భక్తి మిన్న. మోక్షం కొరకు ఉపకరిస్తుంది అని గ్రహించవలెను.

తామసిక భక్తి ఇతరులకు హాని కలిగించేది. తాంత్రకమైనది. ఇది అధమము.

డబ్బు కోసం అధికారం కోరుకునే భక్తి రాజసం. తామస భక్తి కన్నా కొద్దిగా నయం.

సాత్విక భక్తులు పరమాత్మకు దగ్గరివారు. వీరికి తామసిక రాజసిక కోరికలు ఉండవు. హృదయం స్వచ్ఛంగా ఉంటుంది.

సత్సంగము వలన, కీర్తన, భజనము, సేవ, జపం వలన ఈ భక్తి మరింతగా పెరుగుతంది.

గీతలో చెప్పిన నాలుగు రకాల భక్తులు అయిన ఆర్థులు, జిజ్ఞాసువు, అర్థకాములు, జ్ఞాని.

గీతలోనే భగవానుడు ఇలా చెబుతాడు

“సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః

ఇష్టోఽసి మే దృఢ మితి తతో వక్ష్యామి తేహితమ్॥

మన్మనా భవ మచ్చక్తో మద్యాజీ మాం నమస్కురు

మామే వైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియఽసిమే॥”

రహస్యమైనది, శ్రేష్ఠమైనది అయిన మాట – పరమాత్మ యందు చిత్తం చేర్చి భక్తి కలిగి, ఆయనను ఆరాధించి, ఆయన మీద ఆధారపడేవారికి ఆయనే అన్నీ చూసుకుంటాడు.

అనన్యభక్తి, శరణాగతి యొక్క మాహాత్మ్యము ఊహించలేనటు వంటిది.

58. అన్యస్మాత్సౌలభ్యం భక్తౌ

భగవద్ప్రాప్తి కొరకు భక్తి ఇతర సాధనముల కన్నా సులభమైనది.

యోగం, జ్ఞానము, కర్మ మార్గలన్నింటి కన్నా భక్తి ఉత్తమమైనది.

ముండకోపనిషత్తులో

“నాయమాత్మా ప్రవచనేన లభ్యో న మేధయా న బహునా శ్రుతేన।

యమేవైష వృణుతే తేన లభ్యస్తస్యైష ఆత్మా నివృణుతే తనూం స్వామ్॥” అని చెబుతారు.

ఈ ఆత్మ వేదాంత విషయాల వల్ల లభించదు.

ప్రాపంచిక మహాబుద్ధి బలంచే లభించదు.

శాస్త్ర శ్రవణముతో లభించదు. పరమాత్మ ఏ జీవుని వరిస్తాడో అటి వాని వద్ద లభిస్తుంది.

పతంజలి మహర్షి తన యోగదర్శనంలో మోక్షప్రాప్తికి ఇతర సాధనముల కన్నా తీవ్రమైన భక్తి ఉత్తమమని చెప్పారు. తీవ్రమైన భక్తి గల వారికి ఈశ్వర సాక్షాత్కారము లభిస్తాయి.

59. ప్రమాణాంతరస్యాఽనపేక్షత్వాత్స్వయం ప్రమాణత్వాత్

అర్థం: మోక్షానికి ఇతరములు అడ్డం కాబట్టి భక్తియే ప్రమాణమవుతున్నది.

ఇతరమైన వాటికి ప్రమాణము కావాలి. కాని భగవంతుని కృప పొందటానికి భక్తి ఒక్కటి చాలు.

భక్తి స్వయం ప్రమాణమైనది. వేరే ప్రమాణాలు భక్తికి అవసరం లేదు.

ప్రమాణమంటే సాక్ష్యం.

మీమాంస బట్టి ప్రమాణాలు ఆరు. అవి ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన, శబ్ద, అనుపలబ్ధి, అర్థపత్తి.

సాంఖ్యం ప్రత్యక్ష ప్రమాణాని, అనుమాన, శబ్దను మాత్రమే అంగీకరిస్తుంది.

భక్తి మార్గంలోఇవేమి అక్కర్లేదు.

ఆకలి కలిగినప్పుడు ఆకలి వేసిందని తెలుస్తుంది. దానికి ఎటు వంటి జ్ఞానుల బోధ అక్కరలేదు.

తల్లి మీద పిల్లలకు కలిగిన ప్రేమకు కూడా ఎటు వంటి ప్రమాణము చూపనక్కర్లేదు.

కాబట్టి భక్తి కూడా ఎటు వంటి ప్రమాణాల అవసరం లేక స్వయంగా తెలుసుకునేది.

‘ఈశ్వర ప్రణిధానాద్వా’ ఇతరుములెన్ని ఉన్నా ఈశ్వర భక్తి వలన నిర్వకల్ప సమాధి, భగవత్సాక్షాత్కారము జీవన్ముక్తి కలుగుతాయి.

60. శాన్తి రూపాత్పరమానందరూపాచ్చ

అర్థం: భగవంతుని మీద భక్తి పరమ శాంతిని కలగచేస్తుంది. భగవంతుని పొందటానికి, మోక్షప్రాప్తికి భక్తి ఒక్కటే సులభమని మరి ఒకటి అవసరం లేదని నారదుల వారు చెబుతున్నారు.

ఈశ్వరుడు నిత్యుడు. సర్వదేహాలలో నివసిస్తున్నాడు. అట్టి వానిని ధ్యానించటము వలన ఇక ఇతరములతో పని లేదు.

భాగవతంలో ప్రహ్లాదుడు ఇలా చెబుతాడు –

“చాలదు భూదేవత్వము, చాలదు దేవత్లమధిక శాంతత్వంబుం

జాలదు హరి మెప్పింప విశాలోద్యములారా! భక్తి చాలిన భంగిన్॥” యని.

దేవతలై పుట్టినా. బ్రాహ్మణులైనా చాలదు. శాంతత్వం చాలదు. ఒక్క భక్తి ఉన్న చాలు.

నాశము లేనటువంటి సమస్తభూతాలలో సమానం వ్యాపించిన సర్వేశ్వరుని చూడ భక్తి చాలని గీత చెబుతోంది.

కాబట్టి భక్తి ఒక్కటి చాలు పరమాత్మను చేరటానికి. ముక్తి పొందటానికి.

61. లోకహానౌ చిన్తాన కార్యా నివేదితాత్మలోక వేదత్వాత్

ఆత్మ, లోకము, వేదము ఈ మూడింటిని భక్తుడు భగవంతుని పరంగా చేసి ఉంటాడు. కాని ఏ విషయం గురించి దిగులు పడడు.

భక్తులు ఉద్రేకపరిచే విషయాలను ఆలోచనలు చెయ్యకూడదు. తన చుట్టూ జరుగుతున్న వాటి గురించి మథనపడకూడదు. కారణం తన జీవితాన్ని, ఆలోచనలనీ పరమాత్మ పరం చేశాడు కాబట్టి. సర్వాంతర్యామి అయిన పరమాత్మ తన భక్తుల బాగోగులు చూసుకుంటాడు. భక్తుడు భగవంతుని రక్షణలో ఉన్నాడు కాబట్టి అతనికి ఇబ్బంది లేదు.

ప్రపంచం గురించి తనలో బయటా వచ్చే మార్పుల గురించి భక్తుడు భయపడడు.

భగవద్గీతలో భగవానుడు ఈ విషయం గురించి ఎంతో వివరంగా చెప్పాడు.

“జాతస్య హిధ్రువో మృత్యుధ్రువం జన్మ మృతస్య చ।

తస్మాద పరిహార్యేఽర్ధే నత్వం శోచితు మర్హసి॥”

జన్మించిన వాడు మరణించినట్లుగా మరణించిన వాడు తిరిగి పుట్టక తప్పదు. అనివార్యమైన ఈ విషయాని గురించి దుఃఖించ తగదు.

శంకరులు దీని గురించే

“పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనమ్।

ఇహ సంసారే బహుదుస్తారే కృపయాఽపారే పారి మురారే॥” అని చెప్పారు.

62. న తిత్సిద్దౌ వ్యవహారో హేయః కిం తు ఫలత్యాగస్తత్సాధనం చ కార్యమేవ.

అర్థం: పరమేశ్వర కృపచే భక్తి కలిగిన లోకోపకారానికి సంబంధించిన కార్యాలు చెయ్యటం హేయమని తలవకూడదు. అయితే ఏ పని చేసినా ఫలాపేక్ష లేక చెయ్యాలి. ఇలా చెయ్యటం వలన పరమాత్మకు ఇష్టులుగా అవుతారు.

లోకవ్యవహారాలని ఆపనక్కల్లేదు భక్తి పేరుతో. లోక వ్యవహారాలు అంటే రోజూ చేసే పనులు. బాధ్యతలు.

గీతలో అదే ఇలా చెప్పాడు భగవానుడు

“సక్తాః కర్మణ్యవిద్వాం సో యథా కుర్వన్తి భారత

కుర్వా దిద్వాం స్తథాఽస క్తశ్చికీర్షుర్లోక సంగ్రహమ్॥”

అజ్ఞానులు కర్మలందు ఫలాసక్తి కలిగి కర్మలను ఆచరిస్తూ ఉంటారు.

ఆత్మజ్ఞాని భగవద్భక్తుడు ఫలాసక్తి లేక కర్మలను ఆచరిస్తూ లోకానికి మార్గదర్శి అవుతాడు.

పూర్వ కర్మల వలన భగవద్భక్తి లభిస్తుంది.

కాబట్టి భక్తుడు తాను ఆచరించ వలసిన కర్మలను నిష్కామముగా ఆచరించాలి.

63. స్త్రీ ధన నాస్తిక చరిత్రం న శ్రవణీయయ్।

భగవద్భక్తులు, వైరాగ్య పురుషులు స్త్రీ ధన, నాస్తికుల యొక్క చరిత్ర వినకపోవటం మంచిది. ఎందుకంటే ఈ మూడు ప్రపంచ వ్యామోహాన్ని కలిగిస్తాయి.

భక్తి జ్ఞాన వైరాగ్యాలు పెంచే వాటిని గురించి వినవలె.

వేదాలను ధిక్కరించేవారు పరమాత్మను ప్రశ్నించేవారు నాస్తికులు. వారికీ దూరంగా ఉండాలి.

నాస్తికులు, భేదబుద్ధి గలవారు, స్త్రీలోలత్వం గలవారికీ దూరంగా ఉండాలి. ధూర్తలకు, పాషాండులకు దూరంగా ఉండాలి.

దుస్సంగాత్యాని వదిలి వెయ్యాలి.

64. అభిమానంభాదికం త్యాజ్యమ్

అర్థం: అహంకారం దంభాచారం అసత్యాలు చెప్పటం ఇవ్వన్నీ భక్తికి శత్రువులు.

“దంభో దర్పోఽభిమానశ్చ క్రోధః పౌరుష్యమేనచ

అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపద మాసురీమ్॥” (గీత 16 – 4)

దంబము, గర్వం దురభిమానం, క్రోధం, పరుషవాక్యం మాట్లాడటం, అజ్ఞానము ఇవి అసురగుణాలు. వీరు ప్రవృత్తి మార్గం నివృత్తి మార్గం ఎరుగరు.

బాహ్యాభ్యంతర శుచి ఉండదు వీరికి. ఇట్టి వారికి దూరంగా ఉండాలి.

సత్యానికి దగ్గరగా ఉండాలి భక్తులు. సత్యం, శాంతం, దయ, భక్తి మొదలైన దైవగుణాలతో ఉంటే మోక్షం పొందుతారు. రాగ, ద్వేష, కామ, క్రోద, దంభాచారులకు నరకం తప్ప మరోటి ఉండదు.

65. తదర్పితాఖిలా చారస్సక్ కామక్రోధాభిమానాదికం తస్మిన్నేవ కరణీయమ్.

భక్తుడు తన అన్ని కర్మలు భగవంతుని పరం చేసి కామక్రోధం వంటివి వదిలివెయ్యాలి. ఒకవేళ అలా చెయ్యలేకపోతే ఆ కామక్రోధాలను భగవంతుని యందు చూపాలి.

తమ భావాలను, అంతరంగలోని కోరికలును పరమాత్మ పరం చెయ్యాలి. అలా చెయ్యటం వలన వాటిలోని దోషం పోయి అవి పవిత్రం అవుతాయి.

భక్తునికి కోపం వస్తే ఆ కోపం భగవంతుని కొరకు వాడాలి. గర్వం కలిగితే భగవంతుని లాలనకు గర్వం కలగాలి. కోరిక కలిగితే పరమాత్మను చూడటానికి కోరిక కలగాలి. లేదా ఆయన కోసం కోరిక కలగాలి. ప్రతి ఆలోచనా, ప్రతి భావము, ప్రతి కోరికా, ప్రతిదీ భగవంతుని పరం చేస్తే వాటి దోషం పోతుంది.

కామం ఆయన పరం చేసిన గోపికలు ముక్తి పొందారు.

తన కోపం ఆయన పరం చేసిన రావణుడు, తన కోపం మామూలు మానవుల మీద చూపలేదు. భగవంతుని మీదనే చూపాడు. శిశుపాలుడు తన గర్వం కృష్ణుని మీద చూపాడు.

అది ఉత్తమైన గర్వం, కోపము. కారణం వారు భగవంతుని చేతులలో ముక్తులయ్యారు కాబట్టి.

“మయ్యర్పిత మనోబుద్దిర్యో మద్భక్తస్స మై ప్రియః”

“నా యందు అర్పించబడిన మనస్సు, బుద్ధి, కర్మ గల వాడు నాకు ప్రీతికలవాడు. నన్నే పొందగలడు” అని కృష్ణుడు గీతలో (12-14) చెబుతాడు.

ముకుందమాలలో

“హేమర్త్యా! పరమం హితం శృణుత వో వక్ష్యామి సంక్షేపత

స్సంసారార్ణవ మాపదూర్మి బహుళం సమ్యక్ర్పవిశ్య స్థితాః।

నానాజ్ఞాన మనస్యా చేతసి ‘నమో నారాయణా’ యే త్యయం

మంత్రం సప్రణవం ప్రణామసహితం ప్రొవర్తయధ్వం ముహుః॥”

అర్థం- సంసార సాగరం దాటరానిది. సంభవించు కష్టాలు మీదకొచ్చే అలల వంటివి. దీని నుంచి తప్పించుకోవాలంటే నమోనారాయణా అన్న మంత్రం ప్రణవంతో చేర్చి జపించుకుంటూ ఉంటే సంసార సాగరాన్ని దాటింపవేస్తుంది.

“కాయేనా వాచా మనసేంద్రియేర్వా

బుద్ధ్యాత్మనా యత్ర్పకృతే స్స్వభావాత్

కరోమి యద్యత్స కలం పరస్మై

నారాయాయేతి సమర్పయామి॥”

మనము మన పిల్లలకు చిన్నప్పట్నించి ఇటు వంటి శ్లోకాలు నేర్పుతాము.

మనోవాక్కులతో ఇంద్రియాలతో బుద్ధి చేత ప్రకృతి స్వభావము చేత ఏ కర్మలు చేస్తున్నమో అవన్నీ పరమాత్మ అయిన నారాయణుడుకి సమర్పిస్తున్నా అని భావం.

ఈ భావం వల్ల కర్మల ఫలితాలు ఉండవు. ఇది మనస్సులో గట్టిగా తెచ్చుకోవటం భక్తుల తరించటానికి మార్గం.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here