యువభారతి వారి ‘కృష్ణశాస్త్రి కవితా వైభవం’ – పరిచయం

0
3

[తెలుగు సాహిత్యం పట్ల కొన్ని తరాలలో ఆసక్తి రగిలించి, ఆధునిక తరానికి వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్తూ, యువతకు ఉత్తమ సాహిత్యం ద్వారాఉత్తమ వ్యక్తిత్వాన్నివ్వాలని నిరంతరం తపించే యువభారతి సంస్థ స్థాపించి వచ్చే దసరాకు 60 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు సాహిత్యానికి, సమాజానికి యువభారతి చేసిన సేవను తెలుగు పాఠకులకు పరిచయం చేసే ఉద్దేశంతో ప్రతి ఆదివారం సంచికలో యువభారతి ప్రచురించిన పుస్తకాల పరిచయం వుంటుంది. ఈ శీర్షిక వచ్చే సంవత్సరం విజయదశమి వరకూ సాగుతుంది.]

కృష్ణశాస్త్రి కవితా వైభవం

[dropcap]ఫి[/dropcap]బ్రవరి 24వ తేది, భావకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి వర్ధంతి. ఆ సందర్భంగా, యువభారతి ప్రచురించిన ‘కృష్ణశాస్త్రి కవితా వైభవం’ గురించి పరిచయ వ్యాసం.

నవ్య కవిత్వం – క్రమ క్రమంగా భావకవిత్వం అనే పేరుతో ఆధునిక సాహిత్య చరిత్రలో వెలుగొందింది. భాషలోనూ, భావంలోనూ, వస్తు సంవరణం లోనూ, కాల్పనికతకూ, వైయక్తికానుభూతికీ, ప్రాముఖ్యాన్ని సంతరించి పెట్టింది – భావకవిత్వం. భావ విహాయసంలో విచ్చలవిడిగా కొంగ్రొత్త తలపుల రెక్కలు విచ్చుకుని ఎగిరే భావకవిని అందుకోలేని పరిస్థితి పాఠకులలో కలిగింది.

కవితకు హద్దులు లేవన్న సంగతి చాలా పాతదే అయినా, సంస్కృతంలో ఉన్న సాహిత్య శాస్త్రాలతో సంబంధం తెగిపోయిన తెలుగువాళ్ళకి, భావకవితా ధోరణి కొత్తదిగానే అనిపించింది. అందరినీ అలరించింది. ప్రణయం, దేశభక్తి, ప్రకృతి సౌందర్యం భావ కవిత్వావిర్భూతికి కారణాలైనాయి. ఒక్కొక్క భావకవి, ఒక్కొక్క భావానికి కవితా రూపాన్ని ప్రసాదించి, నేటి తెలుగు కవితకు అందాన్నీ, మార్దమాన్నీ, భావ విస్తృతినీ కలిగించినాడు.

అలాంటి భావకవులలో అగ్రేసరుడు దేవులపల్లి కృష్ణశాస్త్రి. భావకవి అంటేనే కృష్ణశాస్త్రి అన్న అభిప్రాయం ప్రాచుర్యాన్ని సంతరించుకున్నది. ఆరుద్ర గారిచేత కూనలమ్మ పదాలలో –

కొంతమందిది నవత
కొంతమందిది యువత
కృష్ణశాస్త్రిది కవిత
ఓ కూనలమ్మా..!

అని కొనియాడబడ్డ కృష్ణశాస్త్రి కేవలం కవే కాదు, సంస్కరణాభిలాషి, మానవోత్తముడైన రఘుపతి వేంకట రత్నం నాయుడుగారి శిష్యుడు. తెలుగు నాట కవితా ప్రచారం చేసిన ధన్యజీవి. తనదైన ఒక విశిష్ట కవితా రచనా పద్ధతిని సృజియించుకుని, పెంపొందించుకున్న ప్రతిభా మూర్తి. గేయనాటక కర్తగా, వక్తగా, గేయ రచయితగా, తెలుగు సాహితిని సుసంపన్నం చేసిన సాహిత్య తపోమూర్తి.

సమాజాన్ని పట్టి బంధించిన సాంఘిక నియమాలనుండి, భాషా సరస్వతిని బంధించిన సంకెళ్ళ నుండి స్వేచ్ఛను కోరుతూ కృష్ణశాస్త్రి కలం పట్టారు. నవ్య కవిత్వంలో ఆయన పెక్కు నూతనమైన పోకడలు పోయారు. స్వేచ్ఛ, దుఃఖం, ప్రేమ భావన, ఈశ్వరారాధనలు కావ్య వస్తువులుగా ఆయన ఎన్నో ఖండ కావ్యాలు రచించారు. స్వేచ్ఛ కోసం అలమటించి, మానవతకు నీరాజనం పట్టి, సౌందర్య దాహంతో తపించి, ఊర్వశీ మూర్తిని యెద నిల్పుకొని, ప్రణయంలో, ప్రకృతిలో, ఈశ్వరుని దర్శించి, ‘ప్రతి మనిషీ నడిచే దైవం’ అని నమ్మిన మహాకవి శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి.

1984 వరకు వచ్చిన దేవులపల్లి కృష్ణశాస్త్రి రచనల సంపుటాల్లో ఉన్న అందచందాలను పరిచయం చెయ్యడమే ఈ పుస్తకం లక్ష్యం. ఆ మహాకవి కవిత్వోద్యానవనంలో కొన్ని పూలు సువాసనా భరితమైనవైతే, కొన్ని రంగురంగుల పూరేకులతో, ఆకులతో మనసును లోగొనేవి. కొన్ని వంశీనాదం వినిపించే వెదురు పొదలైతే, కొన్ని కోయిల పాటలతో కవ్వించే మామిడి చెట్లు.

ప్రతి చెట్టునూ, పుట్టనూ, పువ్వునూ, రెమ్మనూ పేరు పేరునా పరిచయం చేయడం అసాధ్యమైనా, ఆ మహాకవి కవితా పరిమళాన్ని డా. కడియాల రామమోహన్ రాయ్ గారు ఈ పుస్తకం ద్వారా ‘చూపుడు వేలితో చందమామను చూపినట్లు’ సాహితీ జిజ్ఞాసువులకు చూపించారు.

క్రింద ఇవ్వబడిన link ను క్లిక్ చేసి ఈ పుస్తకాన్ని ఉచితంగానే చదువుకోండి.

https://archive.org/details/YuvaBharathi/%E0%B0%95%E0%B1%83%E0%B0%B7%E0%B1%8D%E0%B0%A3%E0%B0%B6%E0%B0%BE%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF%20%E0%B0%95%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A4%E0%B0%BE%20%E0%B0%B5%E0%B1%88%E0%B0%AD%E0%B0%B5%E0%B0%82/

లేదా క్రింద ఇవ్వబడిన QR code ను scan చేసినా ఆ పుస్తకాన్ని ఉచితంగా చదువుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here