మరుగునపడ్డ మాణిక్యాలు – 32: త్రీ బిల్ బోర్డ్స్ ఔట్ సైడ్ ఎబింగ్, మిసూరి

3
3

[dropcap]ఏ [/dropcap]అమ్మాయి పైన అయినా అత్యాచారం జరిగితే అదొక భయంకర అనుభవంగా మిగిలిపోతుంది. అమ్మాయి మరణిస్తే కుటుంబంపై ఎలాంటి ప్రభావం ఉంటుందో ఊహించటం కష్టం. ‘ఆరోజు ఆమెని బయటకు పంపకుండా ఉండాల్సింది’ అని అనుకుంటారు. నరకయాతన అనుభవిస్తారు. నేరస్థులకి శిక్ష పడితే కొంత ఊరట. శిక్ష పడకపోతే అదొక క్షోభ. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసుల మీద నమ్మకం లేని ఒక తల్లి కథ ‘త్రీ బిల్ బోర్డ్స్ ఔట్ సైడ్ ఎబింగ్, మిసూరి’ (2017). బిల్ బోర్డ్స్ అంటే రోడ్ల పక్కన ప్రకటనల కోసం వాడే పెద్ద హోర్డింగులు. రచయిత, దర్శకుడు మార్టిన్ మెక్ డోనా ఒక ఊళ్ళో హోర్డింగుల మీద ఒక హత్య కేసు పోలీసులు ఛేదించలేకపోయారని ఆరోపణలతో ప్రకటనలు ఉండటం చూశాడు. దాని ప్రేరణతో అతను ఈ చిత్రకథ తయారు చేశాడు. అయితే ఇది కేవలం ఒక తల్లి వేదన గరించి తీసిన చిత్రం కాదు. మనుషులు తప్పుడు అభిప్రాయాలను ఎలా ఏర్పరచుకుంటారో చూపించే చిత్రం. ఇలా తప్పుడు అభిప్రాయాలు ఏర్పరచుకోవటానికి ఎవరూ అతీతులు కాదు. బాధితులు కూడా. ఈ చిత్రం డిస్నీ+ హాట్ స్టార్‌లో లభ్యం.

మిల్డ్రెడ్ కూతురు అత్యాచారం, హత్యకు గురవుతుంది. ఏడు నెలలు గడిచినా పోలీసులు నేరస్థులని పట్టుకోలేకపోతారు. “ఊళ్ళో ఉన్న మగవాళ్ళందరి రక్తం పరీక్ష చేసి చూడొచ్చు కదా” అంటుందామె పోలీసు అధికారి విల్లబీతో. “అది పౌరహక్కులకి వ్యతిరేకం. అయినా నేరం చేసినవాడు ఈ ఊరివాడని నమ్మకం ఏమిటి?” అంటాడతను. “అసలు పుట్టిన ప్రతి మగవాడి డీఎన్ఏ వివరాలు పోలీసులు తీసుకోవాలి. ఏదైనా అత్యాచారం జరిగితే దొరికిన డీఎన్ఏని ఆ వివరాలతో పోల్చి చూసి వాడిని చంపేయాలి” అంటుంది. ఆమెలో ఎంత కసి ఉందో మనకి తెలుస్తుంది. దానికి ఇంకో కారణం – ఆమె మాజీ భర్త ఆమెకి కొట్టేవాడు. మగవాళ్ళందరి మీద ఆమెకి కోపం.

ఆ ఊరు అమెరికాలోని మిసూరి రాష్ట్రంలో ఎబింగ్ అనే ఊరు. ఊరవతల రోడ్డు మీద మూడు హోర్డింగులు ఉంటాయి. వేరే రోడ్డు వేయటంతో ఆ రోడ్డు మీద ఎక్కువ సంచారం ఉండదు. ఆ హోర్డింగులను మిల్డ్రెడ్ అద్దెకి తీసుకుంటుంది. వాటి మీద ‘ప్రాణం పోతుండగా అత్యాచారం’, ‘అయినా ఎవర్నీ అరెస్టు చేయలేదేం?’, ‘చెప్పండి చీఫ్ విల్లబీ’ అని మూడు ప్రకటనలు పెట్టిస్తుంది. వాటిని చూసి డిక్సన్ అనే పోలీసు విల్లబీకి తెలియజేస్తాడు. విల్లబీ మిల్డ్రెడ్ దగ్గరకి వెళ్ళి తాము చేయగలిగినదంతా చేస్తున్నామని అంటాడు. “మీ పోలీసులు నల్లజాతి వారిని అనవసరంగా వేధించటం ఆపి కేసు మీద దృష్టిపెడితే ఫలితం ఉంటుంది” అంటుందామె. డిక్సన్ నల్లజాతి వారిని అకారణంగా అరెస్ట్ చేసి వేధించాడని అందరూ అనుకుంటూ ఉంటారు. విల్లబీ “నాకు క్యాన్సర్ ఉంది” అంటాడు. తెలుసంటుందామె. “తెలిసి కూడా ఆ ప్రకటనలు పెట్టించావా?” అంటాడతను. “నువ్వు చచ్చేలోగా ఏదోటి తేలాలిగా” అంటుందామె. ఆమె మనసు ఎంత బండబారిపోయిందో అనిపిస్తుంది. ఊరివారందరూ విల్లబీ మీద సానుభూతితో ఆమెని తిట్టుకుంటూ ఉంటారు. ఆమెకసలు జాలి లేదని అనుకుంటూ ఉంటారు. మరి ఆమె కూతురికి జరిగిన అన్యాయం సంగతి ఏమిటి? లోకం అలాగే ఉంటుంది. తమకి జరగనంత వరకు ఏ అన్యాయమైనా మర్చిపోతారు.

మిల్డ్రెడ్ పన్నునొప్పితో దంతవైద్యుడి దగ్గరకి వెళుతుంది. అతను విల్లబీకి సానుభూతిపరుడు. అవసరం లేకపోయినా ఆమె పన్ను తీసేయాలని అంటాడు. మత్తు ఇవ్వకుండా తీయటానికి ఉద్యుక్తుడవటంతో ఆమెకి అనుమానం వస్తుంది. ఆమె అన్నిటికీ తెగించింది. అతను సిద్ధం చేసుకున్న పరికరంతో అతని వేలు మీద గాయం చేసి వెళ్ళిపోతుంది. డాక్టరు ఫిర్యాదు చేయటంతో పోలీసులు ఆమెని అరెస్టు చేస్తారు. విల్లబీ ఆమెని ప్రశ్నిస్తాడు. ఆమె.. డాక్టరు ప్రమాదవశాత్తూ తనని తాను గాయపరచుకున్నాడని అంటుంది. ఇంతలో విల్లబీ అసంకల్పితంగా దగ్గుతాడు. అతని నోట్లో నుంచి రక్తం చింది ఆమె ముఖం మీద పడుతుంది. అతని క్యాన్సర్ ముదిరింది. అతన్ని ఆసుపత్రికి తీసుకెళుతుంటే అతను ఇతర పోలీసులతో మిల్డ్రెడ్‌ని వదిలేయమని చెబుతాడు. అతను ఆమె బాధని అర్థం చేసుకున్నాడు. ఇక్కడ ఒక విషయం మాత్రం కొంచెం అసమంజసంగా ఉంటుంది. క్యాన్సర్ ముదిరిన రోగులు మామూలుగా తిరుగుతూ ఉండటం సాధారణంగా జరగదు. సినిమా కాబట్టి కాస్త స్వతంత్రం తీసుకున్నారు.

మిల్డ్రెడ్ మిగతా కుటుంబం సంగతి ఏమిటి? ఆమె మాజీ భర్త తన కూతురు వయసున్న యువతితో ప్రేమాయణం సాగిస్తూ ఉంటాడు. అతను మాజీ పోలీసు. మిల్డ్రెడ్ కొడుకు రాబీ ఆమెతోనే ఉంటాడు. పదహారు పదిహేడేళ్ళవాడు. అక్క మరణం అతన్ని కూడా కలచివేసింది. అయితే తల్లి చేసిన పని అతనికి నచ్చదు. దానికి వేరే కారణం ఉంది. “మరచిపోదామని ప్రయత్నిస్తుంటే ‘ప్రాణం పోతుండగా అత్యాచారం’ అని పెద్ద పెద్ద అక్షరాలతో రాయించి మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చేలా చేస్తున్నావు” అని బాధపడతాడు. చనిపోయిన అమ్మాయి ఎలా ఉండేది? ఆమె తల్లితో గొడవపడుతూ ఉండేది. తల్లి కట్టుదిట్టంలో పెట్టడం ఆమెకి ఇష్టం లేదు. చనిపోయిన రోజు కూడా ఆమె తల్లితో పోట్లాడి బయటకు వెళ్లింది. అలాంటివి జన్మంతా వెంటాడే జ్ఞాపకాలు. మిల్డ్రెడ్ మాజీ భర్త ఒకరోజు వచ్చి ఆ ప్రకటనలు ఎందుకు పెట్టావని అడుగుతాడు. వాటి వలన అమ్మాయి తిరిగి రాదని అంటాడు. ఆమె అక్కసుతో అతని ప్రియురాలిని చులకన చేసి మాట్లాడుతుంది. అతను ఆమె మీద దాడి చేస్తాడు. రాబీ అడ్డుపడతాడు. పరిస్థితి కాస్త సద్దుమణిగాక మిల్డ్రెడ్ మాజీ భర్త “మన అమ్మాయి చనిపోవటానికి కొన్నిరోజుల ముందు నా దగ్గరకి వచ్చి ఉంటానని అంది. అలా చేసి ఉంటే ఈరోజు బతికి ఉండేది” అంటాడు. ఆమె ఇంకా క్రుంగిపోతుంది.

అమ్మాయి తండ్రికి కూడా బాధ ఉంది. కానీ అతను ప్రేమాయణం సాగిస్తూ ఆ బాధ మరచిపోవటానికి ప్రయత్నిస్తున్నాడు. మిల్డ్రెడ్ ఒకసారి భర్త కొడుతూ ఉంటే మద్యం మత్తులో ఉండి కూడా పిల్లలని తీసుకుని కారు నడుపుకుంటూ వెళ్ళిపోయింది. మద్యం మత్తులో ఆమె కారు నడిపిందని అతను తన కూతురికి చెబుతాడు. ఆ మాట పట్టుకుని ఆ అమ్మాయి తల్లిని “నువ్వే తప్పూ చేయనట్టు నన్ను కట్టుబాట్లలో పెడతావేంటి” అంటుంది. విడిపోయిన తలిదండ్రుల మధ్య నలిగిపోయే పిల్లలు ఇలాగే ఉంటారు. తల్లి గురించి ఉన్నవీ లేనివీ చెప్పి కొందరు తండ్రులు రెచ్చగొడుతూ ఉంటారు. తండ్రిని గురించి తప్పుడు మాటలు చెప్పే తల్లులూ ఉంటారు. ప్రేమ లేని వాతావరణంలో పిల్లలు ద్వేషంతోనే పెరుగుతారు. అయినా పిల్లల మీద తలిదండ్రులకి ప్రేమ ఉంటుంది. తల్లికి మరీను. తన కూతురిని చంపినవారిని ఎలాగైనా శిక్షించాలని ఆమె పట్టుదల. ఇంతలో విల్లబీ ఆత్మహత్య చేసుకుంటాడు. క్యాన్సర్‌తో కృశించిపోతూ తన భార్యని బాధపెట్టడం ఇష్టం లేక వెళ్ళిపోతున్నానని భార్యకి ఉత్తరం వ్రాస్తాడు.

సమాంతరంగా ఇంకో కథ నడుస్తూ ఉంటుంది. హోర్డింగులను అద్దెకిచ్చే సంస్థ నడిపేవాడు రెడ్ అనే యువకుడు. మిల్డ్రెడ్ ఒక సంవత్సరం పాటు హోర్డింగులని అద్దెకి తీసుకుంటానంటుంది. తన దగ్గరున్న చిన్న ట్రక్కు అమ్మేసి ఒక నెల అద్దె కడుతుంది. డిక్సన్ ఆమెని బెదిరిస్తే లాభం లేదని రెడ్‌ని బెదిరిస్తాడు. అతను బెదరడు. డిక్సన్ మిల్డ్రెడ్ పనిచేసే దుకాణంలో ఆమె సహోద్యోగినిని అరెస్టు చేస్తాడు. ఆమె దగ్గర గంజాయి ఉందని అభియోగం. బెయిల్ కూడా రాకుండా చేస్తాడు. ఇలా వేధిస్తే మిల్డ్రెడ్ మాట వింటుందని ఆశ. ఆమె తగ్గే రకం కాదు. తర్వాత రెడ్ మిల్డ్రెడ్ ఇచ్చిన అద్దె డిపాజిట్ మాత్రమే అని, ఆమె అద్దె త్వరగా చెల్లించాలని అంటాడు. అతన్ని ఎవరో బెదిరించారని మిల్డ్రెడ్‌కి అర్థమవుతుంది. ఎవరు అనేది మనం ఊహించుకోవాలి. అదే సమయంలో ఎవరో అజ్ఞాతవ్యక్తి ఒక నెల అద్దె పంపిస్తాడు. ఆ అజ్ఞాతవ్యక్తి విల్లబీ అని అతను తనకు వ్రాసిన ఉత్తరం ద్వారా మిల్డ్రెడ్‌కి తెలుస్తుంది! విల్లబీ మరణించటంతో డిక్సన్ కోపం కట్టెలు తెంచుకుంటుంది. రెడ్ మీద దాడి చేసి తీవ్రంగా గాయపరుస్తాడు. ఫలితంగా అతని ఉద్యోగం పోతుంది.

విల్లబీ మిల్డ్రెడ్‌కి వ్రాసిన ఉత్తరంలో మొదట ఆమె కూతురి హంతకుడిని పట్టుకోలేకపోయినందుకు క్షమాపణ చెబుతాడు. కొన్ని కేసుల్లో నేరస్థులని పట్టుకోవటం చాలా కష్టమని అంటాడు. ఆమె వేసిన ప్రకటనల పథకం అద్భుతమైన పథకమని అంటాడు. కానీ తన చావుకి అది కారణం కాదని అంటాడు. అయినా ఊరివాళ్ళు అదే కారణమని అంటారని తనకి తెలుసని కూడా అంటాడు. తాను అద్దె కట్టినది ఆమె ఎత్తుకి పై ఎత్తు వేయటానికే అని హాస్యంగా అంటాడు. అందరూ ఆమెని అసహ్యంగా చూస్తుంటే ఇంకా ఆ ప్రకటనలు అలాగే ఉండటం ఆమెకి ఇబ్బందిగా ఉంటుంది కదా. ఉంచాలా, తీయాలా అని ఆమె నిర్ణయించుకోవాలి. ఆమెకి కావలసింది తన కూతురి హంతకుడికి శిక్ష పడటం. దాని కోసం ఆమె మొత్తం ప్రపంచంతోనే పోరాడటానికి నిర్ణయించుకుంటుంది. ఈ క్రమంలో ఆమె తన కారు మీద కోపంతో కాఫీ విసిరిన స్కూలు కుర్రవాళ్ళను కొట్టడానికి కూడా వెనుకాడదు. రాబీకి ఆమె ప్రవర్తన తలవంపులుగా ఉంటుంది. అయినా ఆమె పట్టించుకోదు.

రాబీకి తన తల్లి పట్టుదల చూసి గర్వంగా కూడా ఉంటుంది. కానీ అతనికి కూడా ఎత్తిపొడుపు మాటలు తప్పవు. జరిగింది మర్చిపోవాలని అతని ప్రయత్నం. కానీ తల్లి అభిలాషని కాదనలేడు. చిత్రహింస అనుభవిస్తూ ఉంటాడు. విల్లబీ ఒక్కడే ఆమెని పూర్తిగా అర్థం చేసుకున్నాడు. అతను క్యాన్సర్ వల్లనే ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ అందరూ అందులో ఆ ప్రకటనల పాత్ర కూడా ఉందని అనుకుంటారు. అతను అద్దె కట్టినది ఆమెకి సాయం చేయటం కోసమే. ఆ విధంగా కొంత ప్ర్రాయశ్చిత్తం చేసుకున్నాడు. డిక్సన్ మాత్రం కోపంతో రగిలిపోతుంటాడు. విల్లబీ చావుకి ఆ ప్రకటనలే కారణమని అతని దృఢ అభిప్రాయం. కొందరు తప్పుడు అభిప్రాయాలు త్వరగా ఏర్పరచుకుంటారు. అలాంటివారు మారాలంటే సమయం పడుతుంది. అయినా అతను మారతాడు. మిల్డ్రెడ్ మాజీ భర్త ఆ ప్రకటనల వల్ల తన పరువు పోతుందని అనుకుంటాడు. అంతేగానీ ఒక తల్లి మనసుని అర్థం చేసుకోడు. కొందరు ఎప్పటికీ మారరు. మిల్డ్రెడ్‌కి డిక్సన్ మీద మొదటి నుంచి చెడు అభిప్రాయం ఉంది. అయితే ఆ అభిప్రాయంతో అతన్ని ప్రతిదానికీ అనుమానిస్తే ప్రయోజనం ఏమిటి? మనుషుల మనస్తత్వాలు ఇలాగే ఉంటాయి. ‘నీ సంగతి నాకు తెలుసు. నువ్వు మారవు’ అనటం ఎంతవరకు మంచిది? మారేవాళ్ళు కొందరు, మారని వాళ్ళు కొందరు. వారి మధ్య తేడా తెలుసుకోలేని వారు కూడా తప్పు చేసినట్టే కదా? ఈ అంశంతో ఈ చిత్రం ఆలోచింపజేస్తుంది. మిల్డ్రెడ్ గా నటించిన ఫ్రాన్సెస్ మెక్ డర్మండ్ కి ఉత్తమ నటి ఆస్కార్ వచ్చింది. డిక్సన్ గా నటించిన్ శామ్ రాక్వెల్ కి ఉత్తమ సహాయనటుడి ఆస్కార్ వచ్చింది.

ఈ క్రింద చిత్రకథ మరి కొంచెం ప్రస్తావించబడింది. ముగింపు ప్రస్తావించలేదు. ముగింపు ప్రస్తావించే ముందు మరో హెచ్చరిక ఉంటుంది.

విల్లబీ స్థానంలో కొత్త పోలీసు అధికారి వస్తాడు. అతను నల్లజాతివాడు. అతనే డిక్సన్‌ని ఉద్యోగం నుంచి తొలగిస్తాడు. విల్లబీ చనిపోయిన మరుసటి రోజు రాత్రి హోర్డింగులకు ఎవరో నిప్పు పెడతారు. మిల్డ్రెడ్, రాబీ అటుగా వెళుతూ చూసి మంటలు ఆర్పటానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు మిల్డ్రెడ్ పగతో రగిలిపోతుంటుంది. చనిపోయేముందు విల్లబీ డిక్సన్‌కి కూడా ఒక ఉత్తరం రాస్తాడు. అది పోలీస్ స్టేషన్‌కి వస్తుంది. డిక్సన్ ఉద్యోగం పోవటంతో అతన్ని రాత్రివేళ వచ్చి ఉత్తరం తీసుకోమంటాడు తోటి పోలీసు. డిక్సన్ ఇంకా స్టేషన్ తాళాలు తిరిగి ఇవ్వలేదు. రాత్రి అతను స్టేషన్లో ఉత్తరం చదువుతూ ఉంటాడు. ఇంతలో మిల్డ్రెడ్ వచ్చి సీసాల్లో పెట్రోలు నింపి నిప్పంటించి స్టేషన్ మీద దాడి చేస్తుంది. స్టేషన్లో ఎవరూ లేరని ఆమె అనుకుంటుంది. పోలీసులే తన ప్రకటనలను తగలబెట్టారని ఆమె గుణపాఠం చెప్పడానికి దాడి చేస్తుంది. స్టేషన్ తగలబడుతుంది. డిక్సన్ బయటపడతాడు కానీ కాలిన గాయాలు అవుతాయి. మిల్డ్రెడ్ అతన్ని చూసి చేష్టలుడిగి ఉండిపోతుంది. అతన్ని ఆసుపత్రిలో పెడతారు. అయితే మిల్డ్రెడ్‌కి ఆ దాడితో ఏ సంబంధం లేదని ఒక వ్యక్తి సాక్ష్యం చెబుతాడు. తామిద్దరూ డేట్‌కి వెళ్ళి వస్తుండగా స్టేషన్ మంటల్లో ఉండటం చూశామని అంటాడు. మిల్డ్రెడ్ కూడా అతను చెప్పినదే నిజమంటుంది.

ఆ వ్యక్తి ఒక మరుగుజ్జు. అతని పేరు జేమ్స్. అతనికి మిల్డ్రెడ్ అంటే ఇష్టం. తనతో డేట్‌కి రమ్మంటాడు. ఆమె ఒప్పుకుంటుంది. ప్రకటనల సంస్థ నియమావళి ప్రకారం ప్రకటనలకు ఏ హాని జరిగినా మళ్ళీ ఆ సంస్థే ప్రకటనలు మళ్ళీ పెట్టిస్తుంది. దాంతో ప్రకటనలు మళ్ళీ వెలుస్తాయి. మిల్డ్రెడ్ జేమ్స్‌తో డేట్‌కి వెళుతుంది. అదే సమయంలో ఆమె మాజీ భర్త తన ప్రియురాలిలో వస్తాడు. ఆమె దగ్గరకి వచ్చి “నీ ప్రకటనలు తగలబెట్టినందుకు సారీ. తాగిన మైకంలో ఏం చేస్తున్నానో తెలియలేదు” అంటాడు. మిల్డ్రెడ్ నిర్ఘాంతపోతుంది. ఆమె అంచనా తప్పింది. ప్రకటనలు తగలబెట్టింది డిక్సన్ కాదు. తొందరపాటులో ఆమె పోలీస్ స్టేషన్ తగలబెట్టింది. ఎవరి లోపాలు వారికుంటాయి. తొందరపడి ఎవరినైనా అనుమానిస్తే ఒక్కోసారి తీవ్ర పర్యవసానాలు ఉంటాయి. డిక్సన్ ప్రాణాలతో బయటపడ్డాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే మిల్డ్రెడ్ తనను తాను క్షమించుకోగలిగేదా? ఆమె కూతురికి జరిగిన అన్యాయంతో దేవుడి మీద నమ్మకాన్ని కూడా కోల్పోయింది. దాంతో ఆమె సంయమనం కూడా కోల్పోయింది. నిజమే, జరిగింది ఘోరమైన అన్యాయమే. అయితే ఫిర్యాదు చేయటం, పోలీసులకి సమాచారం ఇవ్వటమే ఆమె పని. నేరస్థులకి శిక్ష పడటం, పడకపోవటం ఆమె చేతుల్లో లేదు. అది పోలీసుల పని. అయితే చూస్తూ ఊరుకోవాలా అని కొందరు అడగొచ్చు. దేవుడి మీద భారం వేస్తే మనశ్శాంతి ఉంటుంది. చెప్పటం తేలికే. తన దాకా వస్తే కానీ ఎవరికీ తెలియదు. ఆమె మీద సానుభూతి కలగటం సహజమే. కానీ ఆమె కూడా ఆవేశంలో తప్పు చేసింది. దానికి ఆమె అంతరాత్మకి జవాబు చెప్పుకోవాలి.

విల్లబీ డిక్సన్‌కి వ్రాసిన ఉత్తరంలో అతన్ని కోపం తగ్గించుకోమని, ప్రేమగా మసులుకోమని చెబుతాడు. అలా చేస్తే ప్రశాంతంగా నేర పరిశోధన చేయవచ్చని అంటాడు. ఆ మాటలు డిక్సన్ మీద ప్రభావం చూపుతాయి. అతను రెడ్‌ని కొట్టినందుకు పశ్చాత్తాపపడతాడు. తర్వాత అతనికి మిల్డ్రెడ్‌కి సాయం చేసే అవకాశం వస్తుంది. విల్లబీ ఉత్తరంలో ఒక మాట అంటాడు. “నువ్వు ప్రేమగా మసలుకున్నంత మాత్రాన ఎవరూ నిన్ను గే అని అనుకోరు” అని. గే అంటే స్వలింగప్రియుడు. మరీ సున్నితంగా ఉంటే తాము బయటపడిపోతామని చాలామంది స్వలింగప్రియులు భావిస్తారు. అదొక మానసిక సంఘర్షణ. డిక్సన్ తండ్రి చనిపోయాక తల్లిని చూసుకుంటూ ఉంటాడు. ఆమె పరుషంగా మాట్లాడే మనిషి. కొడుకు గే అని తెలిస్తే ఆమె అతన్ని చీదరించుకుంటుంది. అందుకే అతను బయటపడడు. ఆ ఆవేదనంతా కసి రూపంలో బయటకి వస్తుంది. నల్లజాతివారి మీద అక్కసు చూపిస్తాడు. మిల్డ్రెడ్‌ని ఓడించాలని చూస్తాడు. రెడ్ మీద దాడి చేస్తాడు. అతన్ని విల్లబీ అర్థం చేసుకున్నాడు. విల్లబీ పాత్ర ఉన్నతంగా నిలిచిపోతుంది. అతను ఆత్మహత్య చేసుకున్నది కూడా తన భార్యకి కష్టం కలిగించకుండా ఉండడానికే. తాను క్యాన్సర్‌తో మంచంలో ఉండి ఆమె చేత సపర్యలు చేయించుకోవటం అతనికి ఇష్టం లేదు.

మాజీ భర్త తన ప్రకటనలను తగలబెడితే మిల్డ్రెడ్ ఊరుకుందా? అతని ప్రియురాలు “కోపానికి ప్రతిఫలం కోపమే” అని అందని అతను అంటాడు. వయసులో తనకంటే చిన్నదైన ఆమె కోపం తగ్గించుకోమని చెప్పిందంటే తాను కూడా కోపం తగ్గించుకోవాలి కదా అనే ఆలోచన మిల్డ్రెడ్‌కి వచ్చిందని అనుకోవాలి. పైగా అతను క్షమాపణ కూడా చెప్పాడు. మిల్డ్రెడ్ అతనితో “నీ ప్రియురాలిని బాగా చూసుకో” అంటుంది. తనని అతను కొట్టేవాడు. అలాంటి పరిస్థితి ఆమెకి రాకూడదని మిల్డ్రెడ్ ఆకాంక్షిస్తుంది. ఇలా ప్రతి పాత్రలోను కొంత మార్పు కనిపిస్తుంది.

ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. తెలుసుకోవద్దనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.

డిక్సన్ ఆసుపత్రి నుంచి బయటికి వచ్చాక ఒకరోజు బార్లో అతనికి ఒకతను తారసపడతాడు. అతను తన స్నేహితుడితో తాను ఒకమ్మాయిని బలాత్కరించానని గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు. డిక్సన్ బయటకి వచ్చి అతని కారు నంబరు చూసి గుర్తు పెట్టుకుంటాడు. తర్వాత అతనితో కావాలనే గొడవపడతాడు. ఈ క్రమంలో అతన్ని గోళ్ళతో రక్కడంతో అతని చర్మం ఆనవాళ్ళు డిక్సన్ గోళ్ళ కింద ఉండిపోతాయి. వాటి ఆధారంగా పోలీసులు డీఎన్ఏ పరీక్షలు చేస్తారు. ఆ పరీక్షల్లో అతనే నేరస్థుడని తేలితే కారు నంబరు ఆధారంగా అతన్ని పట్టుకోవచ్చు. మిల్డ్రెడ్‌కి ఆ విషయం చెబుతాడు డిక్సన్. ఆమె ఆ ఫలితాల కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. అయితే మిల్డ్రెడ్ కూతురిపై అత్యాచారం చేసింది అతను కాదని తేలుతుంది. మిల్డ్రెడ్ హతాశురాలవుతుంది.

క్రుంగిపోయిన డిక్సన్ ఆత్మహత్య చేసుకుందామనుకుంటాడు. అయితే అతనికో ఆలోచన వస్తుంది. బార్లో కనిపించినవాడు ఎవరో అమ్మాయిని బలాత్కరించాడనేది మాత్రం నిజం. అంటే అతను నేరం చెసినట్టే. అదే మాట మిల్డ్రెడ్‌తో ఫోన్లో చెబుతాడు. కారు నంబరు ఆధారంగా అతని అడ్రసు తెలుసుకున్నానని అంటాడు. మిల్డ్రెడ్ తాను అక్కడికి వెళతానని అంటుంది. డిక్సన్ తోడు వస్తానంటాడు. ఇద్దరూ కలిసి కారులో బయల్దేరుతారు. డిక్సన్ తన దగ్గర ఉన్న తుపాకీ వెంటతెస్తాడు. వారి ఉద్దేశం ఆ నేరస్థుడిని చంపాలని. దారిలో ఆమె “అతన్ని నిజంగానే చంపేద్దేమా?” అంటుంది. అతను “ఏమో!” అంటాడు. “చూద్దాం లే” అంటుందామె. ఇక్కడితో చిత్రం ముగుస్తుంది.

చిత్రం ముగింపు కాస్త నిరాశాజనకంగా ఉంటుంది. కానీ ఆలోచిస్తే కలియుగంలో పరిస్థితులు ఎంతగా దిగజారిపోయాయో అనిపిస్తుంది. రోగాలు, అత్యాచారాలు ఎలా పెరిగిపోయాయో మనం చూస్తూనే ఉన్నాం. ఎవరూ దోషాలకి అతీతులు కారు. తమ దోషాలని గుర్తించి పరివర్తన చెందేవారికి కాస్త ఊరట ఉంటుంది. పిల్లలను పెంచేటపుడు వారికి విలువలు నేర్పాలి. అంటే ముందు పెద్దలు తప్పులు చేయటం మానాలి. అహంకారాలు వదలాలి. లేకపోతే కలియుగం ఇలాగే ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here