[ఇన్సూరెన్స్ నేపథ్యంగా శ్యామ్‌కుమార్ చాగల్ అందిస్తున్న పెద్ద క్రైమ్ కథ. ఇది రెండవ భాగం.]
[dropcap]అ[/dropcap]ది విని ఆమె కళ్ళలోకి చూసాడు. ఆ మాటలో ఏదో మర్మం తోచింది.
పెద్ద హాల్, పైన పెద్ద దీపపు చెమ్మ వేలాడుతూ వుంది. ఒక పక్కగా రోజ్ వుడ్ అల్మిరా, దాన్నిండా రకరకాలైన విదేశీ విస్కీ, వైన్ సీసాలు కనపడుతున్నాయి.
“ఏం తీసుకుంటారు మనోజ్” అంది విస్కీలున్న అల్మిరా పక్కన నిలబడి.
“నేను కూల్ డ్రింక్స్, లేదా పండ్ల రసాలు తీసుకుంటాను మేడం” అన్నాడు.
కిలకిలా నవ్వుతూ ముందుకు నడిచింది ప్రత్యూష. “సరే.. మనోజ్ బుద్ధిమంతుడు” అని పండ్ల రసం రెండు వెండి గ్లాసుల్లో నింపుకుని వచ్చి కూర్చుంది.
కాసేపు ఇద్దరూ మౌనంగా కూర్చున్నారు. మనోజ్ మనసంతా ఉద్విగ్నంగా, వింతగా వుంది..
“మా ప్రాపర్టీ చూసారుగా? ఎలా వుంది?” అంది సోఫాలో వెనక్కి వాలి..
“చాలా పెద్దది. బాగా విలువైంది” అన్నాడు.
“కానీ ఇవేవి నాకు ఇవ్వరు రావు గారు. ఆయనకేమైనా అయితే నా బ్రతుకు అధోగతి” అంది దిగాలుగా. ఆమె మొహంలో అందమంతా మాయమై పోయి, పాలిపోయింది..
“భార్యగా మీకే హక్కులుంటాయి కదా” అన్నాడు, మరింకేం అనాలో తెలీక.
“నా వెంట పడి చేసుకున్నారు. ఒక సంవత్సరం గడిచేసరికి నా మీద మోజు తీరిపోయింది. ఇంత పెద్ద బంగాళాలో నాది ఒంటరి బ్రతుకు. ఆయనకు నాతో మాట్లాడటం కూడా ఇష్టం లేదు.” అంది. కళ్ళలో నీరు కారటం మొదలయ్యింది..
“..ప్లీజ్ కంట్రోల్” అన్నాడు మనోజ్.
వెనక్కి సోఫాలో వొరిగి పోయి బిగ్గరగా ఏడవ సాగింది ప్రత్యూష. ఆవిడ కొంగు జారి పోయింది. లేచి కొంగు సరిగ్గా సర్ది, తన జేబులో నుండీ రుమాలు ఆవిడ చేతికిచ్చి “ప్లీజ్ తుడుచుకోండి” అన్నాడు.
కళ్ళు తుడుచుకుని, కాసేపయ్యాక సర్దుకుని కూర్చుంది ప్రత్యూష.
“ఈ పరిస్థితుల్లో దేవుడి లాగా వచ్చారు మీరు. మీరు నాకో సహాయం చేయగలరా?” అంది.
“ఏ రకంగా చేయాలి” అన్నాడు మనోజ్.
“అతడితో ఒక పది కోట్లకు పాలసీ చేసి.. నామినీగా నా పేరు రాయాలి” అంది.
“దానికసలు ఇబ్బందే లేదు” అన్నాడు
“అక్కడే అసలు ప్రాబ్లెమ్. ఆయన అస్సలు ఒప్పుకోరు” అంది.
“మరైతే కుదరదు” అన్నాడు.
“ఆయనకు తెలీకుండా చేయలేరా?” అంది అభ్యర్థనగా
“వారి సంతకాలు కావాలి” అన్నాడు.
దిగాలుగా చూసింది ప్రత్యూష.
“ఆయనకు తెలీకుండా ఏదో రకంగా సంతకాలు తీసుకోండి. మీరిప్పుడు ఆయన పనులు చూస్తుంటారుగా” అంది.
కొద్ది సేపు ఆలోచించాడు మనోజ్.
“పాలసీ చేస్తే ఏం లాభం? ఆయన చనిపోయాక వస్తాయి.” అన్నాడు
“ఇలా తాగుతూ ఉంటే ఆయన ఎన్నాళ్ళుంటారు కనక” అంది కళ్ళు పెద్దవి చేసి.
“ఆలోచిస్తా మేడం” అని లేచాడు మనోజ్.
ప్రత్యూష లేచి మనోజ్ దగ్గరగా వచ్చి నిలబడింది. మనోజ్ కళ్ళలోకి ప్రేమగా చూసి “ఎలాగైనా నాకు సహాయం చేయండి” అని వున్నట్లుండి మనోజ్ గుండెల మీద వాలి చేతులతో చుట్టేసింది. కంగారుతో దూరం జరగడానికి ప్రయత్నించాడు. వదలలేదు ప్రత్యూష.
“ప్లీజ్ మీరు దూరంగా జరిగి మాట్లాడండి” అన్నాడు ప్రత్యూష చేతులు వదిలించుకోవటానికి యత్నిస్తూ.
అంత కలగా వుంది మనోజ్‌కు. అతని గుండెల చప్పుడు హెచ్చింది. శిలలాగా అలాగే నిర్వికారంగా నిలబడి పోయాడు.
కాసేపటికి దూరం జరిగి తల వంచుకుని నిలబడింది.
“వస్తానండి” అంటూ వెనక్కి తిరిగాడు మనోజ్.
“ఈ రాత్రికి రావు గారు రారు” అంది అలాగే తలవంచుకుని.
ఆమె ఉద్దేశం గ్రహించి, కలయో, నిజమో అర్థం కాక స్తబ్ధుడైపోయాడు కాసేపు. కానీ అంతలోనే అతనిలో వివేకం మేలుకుంది.
వెంటనే వేరే ఆలోచనకు తావివ్వకుండా “గుడ్ నైట్ ప్రత్యూష గారు” అని చెప్పి మెట్లు వేగంగా దిగి తన కార్ దగ్గరకు వెళ్ళిపోయాడు.
మనోజ్ కార్ శబ్దం కాగానే టేబుల్ పైన వున్న మొబైల్ చేతుల్లోకి తీసుకుని “హలో సగం పని అయ్యింది. అయినా ఇదంతా ఎందుకు మధ్యలో” అని నవ్వింది.
అంతవరకూ ఆమె మొహంలో వున్న దుఃఖం మొత్తం ఒక్క క్షణంలో మటు మాయం అయ్యింది.
అటునుండి “మన చేతికి ఎక్కడా మన్ను అంటుకోకూడదు మరి. అందుకు. ఓకే.. జాగ్రత్త” అని వినిపించింది.
“హలో వస్తున్నావా? త్వరగా వచ్చేద్దు” అంది ప్రత్యూష కిల కిల నవ్వి.
“పది నిముషాల్లో” అటువైపు నుండీ అనగానే లైన్ కట్ చేసింది ప్రత్యూష.
మరుసటి రోజు ఉదయం లేచి కాఫీ ఎస్టేట్స్ ఆఫీస్‌కి వెళ్ళాడు మనోజ్. అతను వెళ్లేసరికి రావు బయట ఆకు పచ్చని గడ్డి మీద తెల్లని కుర్చీవేసుకుని టీ త్రాగుతూ పేపర్ చదువు తున్నాడు.
“గుడ్ మార్నింగ్ సర్” అని రావు గారిని చూసి నమస్కరించాడు మనోజ్.
“వెరీ గుడ్ మార్నింగ్ మనోజ్” అని కుర్చీ వేపు సైగ చేసాడు రావు.
“ఇప్పుడే వస్తాను సర్” అని ఆఫీస్ రూమ్ లోకి వెళ్లి అక్కడ కనిపించే ఫైల్స్‌ను, పుస్తకాలను ఒక పద్ధతిలో సర్ది పెట్టాడు.
వెనక గోడ మీదున్న దేవతా విగ్రహాలను తుడిచి శుభ్రం చేసి, అగరుబత్తీలను వెలిగించి, మెట్లు దిగి రావు ముందు వచ్చి కూర్చున్నాడు.
“సర్ ఈ రోజు మనం బ్యాంకు వెళ్లి, లోన్స్ వగైరా లెక్కలు చూసుకుని, వాటిని క్రమబద్దీకరించాలి. ముందు అది ముఖ్యం. తర్వాత మన కస్టమర్ దగ్గర కెళ్ళి మనకు రావాల్సిన బాకీల విషయం మాట్లాడి రావాలి” అన్నాడు సీరియస్‌గా.
ఒకసారి మనోజ్ కేసి కళ్ళార్పకుండా చూసి “సరే” అన్నాడు రావు.
“అన్నట్లు మనోజ్, చెప్పటం మరిచాను. అమెరికాలో చదువుతున్న మా అమ్మాయి త్వరలోనే ఇండియాకు వస్తోంది.” అన్నాడు. అతని మొహంలో ఎప్పుడూ కానరాని ఆనందం కనపడింది..
“అమ్మాయి వెనక్కి వెళ్లే వరకూ నువ్ అమ్మాయి పనులు అన్నీ చూసుకోవాలి” అన్నాడు రావు.
“అలాగే సర్.. మనం బ్యాంకుకు వెళదామా?” అని లేచాడు మనోజ్.
“ఇదుగో నీ అడ్వాన్స్ శాలరీ చెక్” అని అందించాడు రావు.
“థ్యాంక్యూ సార్” అని చెక్ తీసుకున్నాడు మనోజ్.
“ఇంకో విషయం.. రేమాండ్స్ షాప్‌కు వెళ్దాము.. ముందుగా నువ్వో రెండు బ్లేజర్స్ తీసుకో. మంచి షూస్ రెండు జతలు,నాల్గు డ్రెస్సెస్ కూడా తీసుకో. బిల్ ఆఫీస్ కడుతుంది” అంటూ జీప్ వేపు నడిచాడు.
బ్యాంకు మేనేజర్ వద్ద కూర్చుని, అన్ని పనులు పూర్తి చేసాడు మనోజ్.
మేనేజర్ ముందు నుండీ లేచి వచ్చే ముందు మేనేజర్ రావ్ చేతిని పట్టుకుని “మీకు మంచి మేనేజర్ దొరికాడు. చాల తెలివైనవాడు. మాకు ఇలాంటి కస్టమర్స్ కావాలి” అన్నాడు.
అక్కడ నుండీ తమకు రావలసిన డబ్బులకి, నలుగురు మిల్లర్స్ వద్దకు వెళ్లారు. వారందరూ, రావు గారు రావటంతో ఖంగు తిని ఇవ్వాల్సిన పైకం మొత్తానికి వెంటనే డబ్బులు ట్రాన్సఫర్ చేశారు.
మధ్యాహ్నం గెస్ట్ హౌస్‌కి వెళ్లి భోజనం చేసి తిరిగి కొందరు బాకీ పడ్డ మిల్లర్స్ వద్దకు వెళ్లారు. పంపిన వుడ్ ఎంత, డబ్బులు ఎంత రావాలి లెక్కలు చూపించాడు మనోజ్. కొందరు చెక్కులు ఇచ్చారు. మరికొందరు డబ్బులు కట్టేశారు. సాయంత్రం చాలా సమయం అయ్యింది.
అప్పుడు, రావు గారు మనోజ్ వేపు చూసి “మనం ఈ రోజు బార్‌కి వెళ్దాము మనోజ్. మనసు కాస్త ప్రశాంతంగా వుంది” అన్నాడు.
బార్ వెళ్లే వరకూ రకరకాల విషయాలు, వ్యాపార బాధలు, వ్యక్తిగత బాధలు చెప్పుకుంటూ కూర్చున్నాడు రావు.
“మీ కాలేజీ విషయాలు చెప్పండి సార్” అన్నాడు బార్లో కూర్చుని మనోజ్.
గ్లాస్‌లో విస్కీ నింపుకుని, సోడా కలిపి చేతిలో తీసుకుని మనోజ్ వేపు చూసి సంతోషంగా నవ్వి “చీర్స్” అన్నాడు రావ్.
చేతిలో ఫ్రూట్ జ్యూస్ గ్లాస్‌తో ‘చీర్స్’ అన్నాడు మనోజ్ కూడా.
ఆస్తుల లావాదేవీలు, తన చిన్నతనం, వ్యాపారంలో మెళకువలు చెప్తూ వచ్చాడు రావ్. రెండు గంటలు గడిచి పోయాయి. బార్ నుండీ బయటకు వచ్చారిద్దరూ.
“నువ్వుంటికి వెళ్ళిపో మనోజ్, బాగా ఆలస్యమై పోయింది. నేను డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తాను” అంటూ కాస్త తడబడుతూ కార్ వద్దకు వెళ్ళాడు రావ్.
అతని పరిస్థితి చూసి కార్ దగ్గరకు వెళ్లి “పర్లేదు సార్.. నే దింపి వెళ్తాను.”అన్నాడు మనోజ్.
నవ్వాడు రావు. “ఏమీ కాదయ్యా.. అంతగా అయితే దేనికైనా గుద్దేస్తా. అంతే కదా. నే పోతే సంతోషించే వాళ్ళే ఎక్కువ” అన్నాడు. బక్కపలుచగా వున్న అతడి శరీరం వణకడం మొదలు పెట్టింది.
జాలిగా చూసాడు మనోజ్ అతని వేపు. “అలా కాదు సార్ మీరు కూర్చోండి” అని, రావ్‍ను ఆప్యాయంగా పట్టుకెళ్లి పక్క సీట్‌లో కూర్చోపెట్టి కార్ స్టార్ట్ చేసాడు మనోజ్.
ఇంటి ముందు కార్ దిగి రావ్ భుజం కింద చేయి వేసి పట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్లాడు. ప్రత్యూష ఎక్కడా కనపడలేదు. పట్టుకుని నడుస్తూ మెట్లెక్కించి పైన గదిలో మెల్లిగా రావ్‍ను పడుకోబెట్టి, దుప్పటి కప్పి మెట్లు దిగి బయటకు నడిచాడు మనోజ్.
తలుపు పక్కన తెరల చాటున వున్న ప్రత్యూష ఇదంతా చూసి మెల్లిగా తన గదిలోకి వెళ్ళిపోయింది.
ఆ రోజు ఆఫీస్‌లో అడుగు పెట్టగానే వరండాలో ప్రత్యూష కూర్చొని “హలో మనోజ్” అంది.
“నమస్కారం మేడం” అన్నాడు మర్యాద పూర్వకంగా మనోజ్.
“రండి కూర్చోండి. ఇంకా రావ్ గారు లేవలేదు. పాలసీ గురించి ఆలోచించండి. మీకు వ్యాపారం అవుతుంది కదా. అది పూర్తి చేస్తే మీకు, మీరు జీవితంలో ఊహించని బహుమతి ఇస్తాను” అంది..
ఎదురుగా కుర్చీలో కూర్చొని సూటిగా ప్రత్యూషని చూసి “రావ్ గారితో మీరు మనసు విప్పి మాట్లాడి, పాలసీ చేయమని అడగొచ్చుకదా?” అన్నాడు.
నిరాశగా మొహం పెట్టి, “ఆయన నా మాట వింటే కదా” అంది. “పైగా నాకు డబ్బు మీదే ప్రేమ, తన మీద లేదు అని ఆయన గట్టి నమ్మకం” అంది.
“సరే, నేనే సార్‌తో మాట్లాడతాను.” అని వెళ్లి ఆఫీస్ రూమ్‌లో అడుగు పెట్టాడు మనోజ్.
ఒకసారి మొత్తం ఆఫీస్ అంతా చూసాడు. ఏవీ పద్ధతిలో లేవు. అడ్డంగా, నిలువుగా బుక్స్ పడవేసి వున్నాయి. అన్నీ సర్దుతూ వుండిపోయాడు.
బంట్రోతు వచ్చి మనోజ్‍ను పిలిచాడు. “అయ్యగారు మిమ్మల్ని రమ్మంటున్నారు సార్.” అన్నాడు.
చేతులు దులుపుకుని వేళ్ళాడు మనోజ్.
హాల్‌లో డైనింగ్ టేబుల్ వద్ద కూర్చున్న రావ్, మనోజ్‌ను చూసి “రా రా మనోజ్, ఈ రోజు నాతో కలిసి భోంచేద్దువు గానీ” అన్నాడు నవ్వుకుంటూ.
వాష్ బేసిన్‌లో చేతులు కడుక్కుని వెళ్లి కూర్చున్నాడు. ముందు వేపు కూర్చున్న ప్రత్యూష అసలు మనోజ్ వేపు ఏ మాత్రం చూడకుండా తిని వెళ్లి పోయింది.
“అదుగో అక్కడ దూరంగా కనపడుతున్న చిన్న ఇల్లు వుంది చూసాఫుగా, అది మా అవుట్‌హౌస్, ఒకప్పుడు ఎవరైనా అతిథులు వస్తే వుండేవారు. ప్రస్తుతానికి ఖాళీగా వుంది. నువ్వందులో ఉంటే నాకు బావుంటుంది. నాకు అందుబాటులో ఉంటే మంచిది. నీకు వంట చేసుకోవలసిన అవసరం రాదు. అన్నీ ఇక్కడ నుండే వస్తాయి. అవసరం వున్న రోజు ఇంటికి వెళ్లి రావచ్చు” అన్నాడు.
ఒక క్షణం అలోచించి “సరేనండీ” అన్నాడు మనోజ్.
రెండో రోజు తన ముఖ్యమైన వస్తువులు తీసుకుని అవుట్‌హౌస్ లోకి మారి పోయాడు. లోపలంతా కలయ తిరిగాడు. అవుట్‌హౌస్ చాలా ఖరీదుగా వుంది అనుకున్నాడు. క్రికెట్ బ్యాట్, స్టంప్స్ ఒక మూలన పెట్టి వున్నాయి. ‘ఎవరివో ఇవి?’ అనుకున్నాడు.
రెండు పూటలా కారియర్‌లో భోజనం అవుట్‌హౌస్‌కి పంపించేవారు. ఉదయం టిఫిన్, కాఫీ కూడా తీసుకుని వచ్చేవాడు బంట్రోతు.
పది గంటలకు రావ్‌ను తీసుకుని కాఫీ ఎస్టేట్స్, టేక్ మిల్‌కు వెళ్ళటం; సాయంత్రం కాగానే బార్‌కు వెళ్లి రావ్ తాగే వరకు కూర్చోవటం, తిరిగి ఇంటికి తీసుకు రావటం, ఇలా నెల గడిచి పోయింది.
రోజంతా పనితో అలసట మూలంగా అవుట్ హౌస్ వెళ్లి మంచం ఎక్కగానే నిద్రలో మునిగి పోయేవాడు మనోజ్.
ఒక రోజు త్వరగా ఇంటికి వచ్చేసాడు. సాయంత్రం గది లోకి వెళ్లి కాసేపు రెస్ట్ తీసుకుందామని సోఫాలో వెనక్కి ఒరిగి కళ్ళు మూసుకున్నాడు. అక్కడే వెంటనే అలాగే సోఫాలో నిద్ర లోకి జారిపోయాడు మనోజ్.
వున్నట్లుండి చటుక్కున నిద్ర లేచాడు మనోజ్. కళ్ళు నులుముకుని చూసాడు. గది పూర్తిగా చీకటిగా వుంది. సోఫాలో నుండీ మెల్లిగా లేచి చేతికున్న వాచీలో సమయం చూసుకున్నాడు. అర్ధరాత్రి పన్నెండు కావస్తోంది.
అలాగే చీకట్లో కిటికీ వద్ద నిలబడి ఆవలించి బయటకు చూసాడు. ‘ఎందుకు మెలకువ వచ్చింది? ఏదో చప్పుడు తనని నిద్ర లేపింది’ అనుకున్నాడు.
దూరంగా బంగాళా కనపడుతోంది. వరండాలో లైట్స్ వెలగటం లేదు. బంగాళా పై గదిలోనుండి టార్చ్ లైట్ వెలిగి ఆరిపోయినట్లనిపించి కళ్ళు చిట్లించి ఆటే చూడసాగాడు. మళ్ళీ ఒక సారి లైట్ వెలిగి ఆరిపోయింది.
ఎడమ వేపునున్న దట్టమైన చెట్ల మధ్యన ఎవరో వ్యక్తి మెల్లిగా బంగాళా వేపు కదిలాడు. అది చూడగానే కిటికీ ముందు నుండీ పక్కకు జరిగి ఆ పొదల వేపు చూసాడు మనోజ్. ఆ వ్యక్తి మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ బంగాళా పక్క వేపు వెళ్ళాడు.
అక్కడ కాస్త వెలుతురు ఉండటంతో ఆ వ్యక్తి కనపడసాగాడు.
బలిష్ఠంగా వున్న ఆ వ్యక్తి కిటికీ పైకి ఎక్కి లోనికి వెళ్ళాడు. లోనుండీ ఎవరిదో చేయి ఆ వ్యక్తిని లోనికి లాగింది.
వెంటనే ప్రత్యూషకు లేదా పోలీసులకు ఫోన్ చేద్దామని మొబైల్ దగ్గరకు పరిగెత్తాడు.
ఫోన్ చేతిలోకి తీసుకుని ప్రత్యూషకు డయల్ చేసాడు. ఫోన్‌లో చప్పుడు లేదు. ఫోన్ వేపు చూసాడు, సిగ్నల్ లేదు.
వెంటనే మూలనున్న క్రికెట్ బ్యాట్ చేతిలో తీసుకుని, లైట్స్ వెలుతురు తన మీద పడకుండా చెట్ల కింద వున్న చీకటి నీడల్లో వంగి నడుస్తూ చప్పుడు కాకుండా బంగాళా వేపు అడుగులు వేసాడు.
అడుగులో అడుగు వేస్తూ కిటికీ పక్కన వెళ్లి నిలబడ్డాడు. లోనుండీ చిన్నగా మాటలు వినపడుతూ వున్నాయి.
“ఇంకొన్ని రోజులలో మనకీ బాధలు తప్పి పోతాయి.” అంది ఒక స్త్రీ గొంతు. ఆ గొంతు ఎవరిదో అర్థం కాలేదు మనోజ్‌కు.
“నాకు ఓపిక నశిస్తూ వుంది.” అన్నాడు అతను.
“వాడిని ఇరికిచ్చేసి, మనం తప్పించుకోవచ్చు” అంది స్త్రీ గొంతు మెల్లిగా.
“జాగ్రత్త” అంది మగవాడి గొంతు.
ఆ తర్వాత మాటలు ఆగిపోయాయి. వాళ్లిద్దరూ ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారో అర్థం కాలేదు. ఇక అక్కడ ఉండటం అనవసరం అనుకున్నాడు మనోజ్. మొత్తానికి ఎవరో తెలిసిన వ్యక్తే లోనికి వెళ్ళాడు అనుకుని తిరిగి వెనక్కి చీకటిలో నడుస్తూ వెళ్ళిపోయాడు.
గదిలో నుండీ చాలా సేపు బంగాళా వేపు చూస్తూ కూర్చున్నాడు మనోజ్. రాత్రి మూడు గంటల వరకూ ఎవరూ బయటకు రాలేదు. విసుగొచ్చి వెళ్లి నిద్ర పోయాడు.
ఆ రాత్రి నాలుగు గంటల సమయంలో అదే కిటికీలో నుండీ ఆ వ్యక్తి దూకి వెనక వేపున్న వృక్షాల మధ్యలో మాయమై పోయాడు.
ఉదయం ఆలస్యంగా లేచాడు మనోజ్. రాత్రి నిద్రలేమితో కళ్ళు కాస్త ఎర్ర బారి మంటగా అనిపించింది.
బంగాళా నుండీ వచ్చిన టిఫిన్ తిని ఆఫీస్ లోనికి అడుగు పెట్టాడు. అప్పటికే అక్కడ కూర్చున్న ప్రత్యూష, మనోజ్‌ను చూసి నవ్వింది.
“ఇంకా రావు గారు నిద్ర పోతున్నారు..” అంది. ఎర్రని పట్టుచీరలో దేవతలా మెరిసి పోతూ వుంది ప్రత్యూష.
ఆమెపై నుండి కళ్ళు తిప్పుకున్నాడు మనోజ్ “గుడ్ మార్నింగ్. అప్పటి వరకూ నేను పని చేసుకుంటాను మేడం” అన్నాడు.
మనోజ్ తన అందాన్ని చూసి ముగ్ఢుడై పోతున్నాడని గ్రహించి చిన్నగా నవ్వుకుంది ప్రత్యూష.
“అది సరే మనోజ్! ఇంతకీ పాలసీ విషయం ఎం చేసావు?” అంది చాలా దగ్గరగా వచ్చి నిలబడి.
తడబడి దూరంగా జరిగి అన్నాడు “ఈ రోజు సార్‌తో మాట్లాడి చూస్తానండి.”
“నాకీ పని చేసి పెట్టావంటే, చెప్పానుగా, నీకు జీవితంలో ఊహించని బహుమతి ఇస్తాను.” అంది సమ్మోహనంగా నవ్వుతూ ఇంకాస్త మనోజ్‌కు దగ్గరగా జరిగి.
ఇంతలో రావు గారు మెట్లు దిగుతున్న చప్పుడు వినిపించి గదిలోనుండీ వెంటనే బయటకు వెళ్లిపోయింది ప్రత్యూష. వేగంగా స్పందించిన ఆమె తీరుని చూసి ఆశ్చర్య చకితుడయ్యాడు మనోజ్.
సూట్ వేసుకొచ్చిన రావ్ మనోజ్‌ను చూసి “గుడ్ మార్నింగ్ మనోజ్” అన్నాడు కాస్త నీరసంగా.
నమస్కారం చెప్పి కుర్చీలో కూర్చొని ఖాతా పుస్తకాలు ముందు పెట్టి “సార్ మీరు ఓ పది కోట్లకి జీవిత బీమా చేస్తే బావుంటుందేమో, ఎలాగూ మనం తీసుకోబోయే బ్యాంకు లోన్‌కు అవసరం” అన్నాడు.
“పోయిన ఏడాది యాబై కోట్లకి చేసాను” అన్నాడు రావ్, చుట్ట వెలిగించుకుంటూ.
అది విన్న వెంటనే షాక్‌కి గురయ్యాడు మనోజ్.
“అదుగో పైన బీరువాలో వుంది చూడు” అన్నాడు రావ్.
“అయితే మరీ మంచిది సార్.” అన్నాడు ఒకింత నిరాశకు గురయ్యి..
“బాగా గుర్తు చేసావు మనోజ్, మనమొకసారి బీమా ఆఫీస్‌కి వెళ్లాలి, ఆ పాలసీ తీసుకో” అని లేచి కార్ వేపు నడిచాడు రావ్.
ఇద్దరూ కలిసి బీమా ఆఫీస్‌లో అడుగు పెట్టారు.
“నువ్వలా కూర్చో మనోజ్, నే వెళ్లి మేనేజర్‌తో మాట్లాడి వస్తాను.” అని పాలసీ చేతిలో పట్టుకుని మేనేజర్ గది లోకి అడుగు పెట్టాడు రావ్.
రావ్ లోనికి వెళ్ళగానే, మేనేజర్ లేచి నిలబడి నమస్కారం పెట్టి ఆహ్వానించాడు. బయట నుండీ చూస్తున్న మనోజ్‌కు వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో అర్థం కాలేదు.
ఆ రోజు సాయంత్రం గదిలోకి వెళ్ళగానే మనోజ్ ఫోన్ మ్రోగసాగింది. లేపి “హలో” అన్నాడు.
“మనోజ్ నేనే, నీ గదికి వస్తున్నాను..” అంది ప్రత్యూష.
“రండి. నేనే మీకొక విషయం చెప్పాలి” అన్నాడు.
కొద్దిసేపటికి అవుట్‌హౌస్ మెట్లెక్కి లోనికి అడుగు పెట్టింది ప్రత్యూష.
సోఫాలో కూర్చొని “ఏంటి.. ఏదో విషయం అన్నావ్ మనోజ్” అంది ఓరగా చూస్తూ.
“రావు గారు యాభై కోట్లకు పాలసీ ఏనాడో చేశారు” అన్నాడు నింపాదిగా.
అది వినగానే ప్రత్యూష మొహం మీద సంతోషం, ఆశ్చర్యం కలగలిసి కళ్ళు మెరిసాయి.
“అయితే ఈ రోజు బీమా ఆఫీసుకి వెళ్లి రావ్ గారు ఆ పాలసీ గురించి మేనేజర్‌తో మాట్లాడారు.. ఏం మాట్లాడారో లోపల తెలీలేదు” అన్నాడు ప్రత్యూష కళ్ళ లోకి అనుమానంగా చూసి.
ఆ మాటతో ప్రత్యూష మొహంలో కంగారు కనిపిచింది.
ప్రత్యూష మొహం చూసాడు మనోజ్. ఆవిడ మొహంలో కంగారు కనపడుతోంది..
కాసేపు మౌనంగా కూర్చున్నాడు. ఏమీ మాట్లాడలేదు మనోజ్.
“నా జీవితం నాశనం చేసాడు. ఎన్నో కలలతో పెళ్లి చేసుకున్నాను.” అంది. ఆవిడ మొహం అసహ్యంగా అయిపోయి, అందం అంతా ఒక్కసారిగా ఎగిరి పోయింది.
లేచి నిలబడి “థాంక్స్ మనోజ్” అంది. ఈ సారి ఆవిడ కంఠంలో మాధుర్యం లేదు. మనోజ్ వేపు చూసి వెళ్లి పోయింది.
ఆ చూపులోని కాఠిన్యాన్ని చూసి ఖంగు తిన్నాడు మనోజ్.
ఆ రాత్రి టివి చూస్తూ అలాగే నిద్ర పోయాడు మనోజ్. నిద్రలో ఫోన్ మ్రోగటం వినిపించి లేచి ఫోన్ చేతుల్లోకి తీసుకుని చూసాడు. అది రావ్ నుండి. వెంటనే లేపి “హలో సార్” అన్నాడు.
“నువ్ వెంటనే బంగాళా లోకి రా.. వెంటనే” అని పెట్టేసాడు రావ్.
గబ గబా చెప్పులు వేసుకుని బంగాళా లోకి వెళ్ళాడు మనోజ్. హాల్ తలుపులు తీసి వున్నాయి.
పైన మెట్ల మీద రావ్‌ను పట్టుకుని వుంది ప్రత్యూష “వెళ్ళండి, దిగండి ఏమీ కాదు” అంటోంది.
నిలబడ లేక మెట్ల పక్కనున్న టేకు స్తంభాన్ని పట్టుకుని తూలుతున్నాడు రావ్. అతను బాగా తాగి నడిచే స్థితిలో లేడని తెలుస్తోంది. అక్కడనుండీ దొర్లుకుంటూ పడ్డాడంటే ఇక జీవితంలో లేవటం కష్టమే.
ప్రత్యూషను చూసాడు మనోజ్. ఆమె మొహం రాక్షసంగా వుంది. ఆమె ఏనాడు అలా కనపడలేదు అనుకున్నాడు.
మనోజ్ కింద నిలబడి తననే చూడటం గమనించిన ప్రత్యూష వెంటనే తేరుకుని, మొహంలో భావాలను మార్చుకుని “చూడండి మనోజ్! బాగా తాగి ఈ పరిస్థితిలో కిందకు వెళ్తా, వెళ్తా అంటున్నారు. నేనాపలేకుండా వున్నాను. సమయానికి మీరు వచ్చారు. కాస్త వచ్చి ఈయనను లోపలి తీసుకెళ్లండి” అంది. ఆమె మొహంలో ముందున్న కాఠిన్యం కనపడలేదు. గొంతులో మాధుర్యం వచ్చేసింది..
మనోజ్ ఏమీ సమాధానం చెప్పకుండా పైకి వెళ్లి రావ్‌ను మోసుకుంటూ తీసుకెళ్లి, మంచం మీద పడుకో పెట్టాడు. వెనక్కి తిరిగి చూసే సరికి ప్రత్యూష కనపడలేదు. గది తలుపులు వేసుకున్నట్లుగా చప్పుడు వినిపించింది.
రావ్ నడుము వరకూ దుప్పటి కప్పాడు.
“థ్యాంక్యూ మనోజ్” అన్నాడు రావు. అతని గొంతు నిలకడగా వుంది. తాగిన మత్తు ఎక్కడా లేదు.
విస్మయంగా చూసాడు మనోజ్.
“రేపు మనం రామనాథం అడ్వకేట్‌ని కలవాలి. గుడ్ నైట్ మనోజ్” అన్నాడు లేచి ఏ మాత్రం తూలకుండా నిలబడి.
అంత వరకూ తాగిన మైకంలో వున్న ఆయన వెంటనే మామూలుగా ఎలా అయ్యాడనే ఆశ్చర్యం నుండీ తేరుకుని “సరే సార్. మీరు జాగ్రత్త. ఏదైనా అవసరం ఉంటే మళ్ళీ ఫోన్ చేయండి.” అన్నాడు.
“నా జీవితం ఆఖరి అంకంలో వుంది. చూసావుగా నేను మెట్ల పైనుండీ పడి చావాలని నా భార్య ఎలా ప్రయత్నించిందో” అన్నాడు నిరాశగా. అతని కళ్ళలో మొదటిసారిగా నీళ్లు చూసాడు మనోజ్.
“అన్నింటికీ మిమ్మల్ని భగవంతుడే కాపాడతాడు సార్. మీరు దిగులు పడకండి.. ధైర్యంగా వుండండి. మీ కూతురు వచ్చిందంటే మీ మనసుకి బావుంటుంది. కాస్త ఓపిక పట్టండి” అన్నాడు మనోజ్.
“వచ్చే వారం అమ్మాయి వస్తుంది. నిజమే. అంతలోగా నేను అన్ని ఏర్పాట్లు చేయాలి” అని మెల్లిగా గొణుక్కున్నాడు రావ్.
బయటకు రాగానే, తన గది తలుపులు తెరచి బయట నిలబడి కన్పించింది ప్రత్యూష. కిందకు వెళుతూ ప్రత్యూషను మరోసారి చూసాడు మనోజ్. ఆమె చూపుల్లో ఎప్పుడూ కానరాని క్రూరత్వం తళుక్కుమంది.
(సశేషం)