జ్ఞాపకాల పందిరి-150

33
3

అపురూప రంగస్థలి..! రవీంద్ర భారతి..!!

[dropcap]మా[/dropcap] బాల్యంలో హైదరాబాద్ లోని చూడదగ్గ, మరియు అత్యంత ప్రాచుర్యం పొందిన భవనాలలో ‘రవీంద్ర భారతి’ ఒకటి. ఇప్పుడంటే హైదరాబాద్, ఫ్లైఓవర్ లతో, జనసాంధ్రతతో మూసుకుపోయింది గానీ ఒకప్పుడు నగరం నడిబొడ్డున రవీంద్ర భారతి, నిత్య కళ్యాణం పచ్చతోరణంలా, నిత్యం అనేక కార్యక్రమాలతో కళకళ లాడుతూ ఉండేది. ప్రేక్షక జనంతో కిటకిటలాడుతుండేది. నాటకాలు, నృత్యాలు, సంగీత కార్యక్రమాలు, పుస్తకావిష్కరణలు, సన్మానాలు, ఒకటేమిటి, నిత్యం సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలతో, గొప్ప కళాకేంద్రంగా విలసిల్లేది.

హైదరాబాద్ లోని రవీంద్ర భారతి సమావేశ మందిరం

సాధారణ ప్రజలు రవీంద్ర భారతి లోపలికి వెళ్ళడానికి తటపటాయించేవారు. ఒక్కోసారి నాటక పోటీలు (టికెట్టుతో, టిక్కెట్టు లేకుండా కూడా) ప్రజల అత్యంత ఆదరణ పొందేవి. నెలల తరబడి కొన్ని హిందీ నాటక ప్రదర్శనలు జరుగుతుండేవి. మిమిక్రీ, మైమ్, మాయాజాలం వంటి కార్యక్రమాలు సంవత్సరం పొడవునా ఏదోకటి జరుగుతూనే ఉండేది. ఏ రోజూ కూడా రవీంద్ర భారతి ఖాళీగా ఉన్నట్లు కనపడేది కాదు. హాలు బుక్ చేసుకోడం అంటే పెద్ద కసరత్తు క్రింద లెక్క.

2019 లో రవీంద్ర భారతి మెయిన్ హాల్ లో అప్పటి ఆరోగ్య శాఖామంత్రి గారిచే ‘వైద్య రత్న’ బిరుదు ప్రధానం.

ఎందుకోగానీ పెళ్లిళ్లకు మాత్రం అప్పట్లో ఈ హాలు అనుమతించేవారు కాదు. ఏ కార్యక్రమానికైనా, అతిథులుగా, ముఖ్య అతిథులుగా, రాజకీయ నాయకులతో పాటు, సినిమా హీరోలు, హీరోయిన్లు ఇతర ప్రముఖులు, పేరుపడ్డ కవులూ కళాకారులూ వస్తుండడం వల్ల ప్రేక్షకులకు ఏమాత్రం లోటుండేది కాదు. నగరంలో దేనితో పాటు ఒకటి రెండు వేదికలువున్నా, రవీంద్ర భారతికి ప్రత్యేకత ఉండేది. అందులో నాటకం ప్రదర్శించాలన్నా, నృత్యంలో ఆరంగేట్రం చేయాలన్నా, పుస్తకావిష్కరణ చేసుకోవాలన్నా, ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవాలన్నా గర్వంగా ఫీల్ అయ్యేవారు. అయితే అది బుక్ చేసుకోవడం అంట సులభంగా ఉండేది కాదు. చిన్న చిన్న రచయితల పుస్తకావిష్కరణలకు, సంగీతకార్యక్రమాలకు, అంత సులభంగా అది దొరికేది కాదు. అందులో ప్రవేశిస్తేనే ఏదో ఒకరకమైన గొప్ప అనుభూతి కలిగేది.

రవీంద్ర భారతి ముఖద్వారం వద్ద సాగర్ మిత్రులతో

బాల్యంలోనే, నాకు రవీంద్ర భారతిలో అనేక రకాల కార్యక్రమాలు చూసే అవకాశం కలిగింది. అందులో నాటకాలు, నృత్యాలు, కవిసమ్మేళనాలు పుస్తకావిష్కరణల్లో, బాలానందం కార్యక్రమాలు వున్నాయి. వీటితోపాటు మా గురువు గారు డా. సి. డి. రెడ్డి గారి అమ్మాయి భరతనాట్యం ఆరంగేట్రం, పాలగుమ్మి విశ్వనాథం గారు రచించి ట్యూన్ చేసి విడుదల చేసిన ‘అమ్మ దొంగా..’ పాట, ఈలపాట రఘురామయ్య గారి ‘ఈలపాట’ కచేరి – ఇలా ఎన్నో, ఎన్నెన్నో. దీనంతటికి ప్రధాన కారణం, మా పెద్దన్నయ్య కె. కె. మీనన్. ఆయన స్వయంగా రచయిత కావడం, ఆయన పనిచేసిన ఏ.జీ. ఆఫీసులోని ‘రంజని’ అనే సాహిత్య సంస్థకు అధ్యక్షుడుగా ఉండడం మూలాన, ఆయనకు వచ్చిన ‘ఫ్రీ -పాస్‌లు’ అన్నీ నా జేబులోకి చేరేవి. అన్నయ్య విజయనగర్ కాలనీ, మాసాబ్ ట్యాంక్ వంటి ప్రదేశాలలో అద్దె ఇంట్లో ఉండడం మూలాన, (నా బాల్యం ఎక్కువశాతం పెద్దన్నయ్య దగ్గరే గడిచింది) నేను అక్కడినుండి కాలినడకన కార్యక్రమాలు చూడడానికి రవీంద్ర భారతికి వెళ్లి చూసి అలాగే తిరిగి వచ్చేవాడిని. అలా చూసిన నేరెళ్ల వేణుమాధవ్ గారి మిమిక్రీ ‘బెన్‌హర్’ ఎప్పటికీ మరచిపోలేను. తర్వాతి కాలంలో ఆయన నివసిస్తున్న ప్రాంతంలోనే, నేను స్థిరనివాసం ఏర్పరచుకుంటాననీ, ఆయనతో నాకు స్నేహం ఏర్పడుతుందనీ, ఇద్దరం ఎన్నోసార్లు వేదిక పంచుకుంటామనీ కలలో కూడా ఊహించలేదు. ఉద్యోగ రీత్యా అది అలా కలిసొచ్చింది. అలాగే ఒక ఉగాదికి విశ్వనాథ సత్యనారాయణ గారు అధ్యక్షతన జరిగిన కవిసమ్మేళనం కూడా బాగా గుర్తుంది. దివాకర్ల వెంకటావధాని గారి అవధానం చూసే భాగ్యం కూడా రవీంద్ర భారతి లోనే కలిగింది నాకు. సినారె, జి వి. సుబ్రహ్మణ్యం, యశోధర రెడ్డి వంటి పెద్దలు పృచ్ఛకులుగా పాల్గొనడం నేను ఎరుగుదును. అలా రవీంద్రభారతిలో ఎన్నో కార్యక్రమాలు చూసే అదృష్టం నాకు చిన్నతనంలోనే కలిగింది.

తెలుగు ఉమ్మడి రాష్ట్రం రెండుగా విడిపోయాక, తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఒక చక్కటి నిర్ణయం తీసుకుంది. రవీంద్ర భారతిలో ముఖ్యంగా పై అంతస్తులోని మినీహాల్, సాహిత్య కార్యక్రమాలు చేసుకోవడానికి ఉచితంగా అనుమతిని ఇచ్చింది (మెయిన్ హాల్ విషయంలో నాకు అంతగా అవగాహన లేదు). దీనితో చాలామంది చిన్న/పెద్ద రచయితలు, గ్రూపులు, సంస్థలు, దీనిని చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నట్లుగా తెలుస్తున్నది. నేను ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉండడం వల్ల ఇప్పటికే చాలాసార్లు రవీంద్ర భారతిని దర్శించే అవకాశం ఏర్పడింది.

రవీంద్ర భారతి మినీ హాల్ లో మిత్రమణీ ఝాన్సీ కొప్పిశెట్టికి సన్మా నం చేస్తూ రచయిత

అయితే, ఈ మధ్య ఒక వింత అనుభవం, నాతో పాటు చాలామంది చవిచూచారు. అదేమిటంటే, ఫిబ్రవరి 9, 2023న శ్రీమతి పుట్ల హేమలత గారి స్మారక పురస్కారాల కార్యక్రమము, ‘మనోజ్ఞ సాంస్కృతిక సాహిత్య –వేదిక’ పక్షాన, ‘ముళ్ళ చినుకులు’ (సంపాదకులు, శ్రీమతి గోగులమండ అరుణ, శ్రీమతి మానస ఎండ్లూరి) కథా సంకలనం ఆవిష్కరణల కోసం రవీంద్ర భారతి మినీ హాల్ బుక్ చేశారు నిర్వాహకులు.

రచయిత్రి,కవయిత్రి,గాయని,సామాజిక,మహిళా,దళిత హక్కుల కోసం, తన కలం ద్వారా, వుపన్యాసాల ద్వారా ఆయావర్గాలను జాగృతి పరుస్తున్న మహిళామణి శ్రీమతి అరుణా గోగులమండ.(హైదరాబాద్ /ఏలూరు)

నాలాంటి అభిమానులు కొంతమందిమి సకాలంలోనే అక్కడికి చేరుకున్నాం. అయితే అప్పటికి నిర్వాహకులు ఇంకా రాలేదు. రవీంద్ర భారతి ముఖద్వారం దగ్గర నిలబడ్డ సెక్యూరిటీ వ్యక్తి ఎవరినీ పోనీయడం లేదు. శాసనసభ కార్యక్రమాలు జరుగుతుండడం మూలాన కార్యక్రమాలు అన్నీ రద్దు చేశారని చావుకబురు చెప్పినట్టు చెప్పాడు. మరి ఆ విషయం నిర్వాహకులకు కూడా తెలిసి ఉండాలి కదా! వారు ఏ మాధ్యమం ద్వారాను సమావేశం రద్దు అయిన ప్రకటన చేయలేదు. మేమంతా ఆశ్చర్యానికి, ఆవేదనకూ గురి అయ్యాము. ఎందుకైనా మంచిదని కాసేపు అక్కడే నిలబడ్డాము. కాసేపటికి నిర్వాహకులు వచ్చారు. విషయం తెలిసి వాళ్ళు కూడా అయోమయ స్థితిలో పడ్డారు.

కథకురాలిగా, సంపాదకురాలిగా, పుస్తకావిష్కరణ సందర్భంగా మాట్లాడుతున్న శ్రీమతి అరుణ గోగులమండ

లోపలికి అనుమతించకపోతే వరండాలోనైనా కార్యక్రమం నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నారు (కరెక్ట్‌గా ఆంక్షలు విధిస్తే అక్కడ కూడా కార్యక్రమం చేయనివ్వరు, అది వేరే విషయం). ఈ నేపథ్యంలో ఎందుకైనా మంచిదని, కార్యక్రమ ముఖ్య నిర్వాహకురాలు, శ్రీమతి మానస ఎండ్లూరి మరో ప్రయత్నం చేయడానికి, బుకింగ్ కార్యాలయానికి వెళ్ళింది. నవ్వుతున్న ముఖంతో తిరిగి వచ్చింది. అందరికీ సంతోషం అనిపించింది.

ఎందుకంటే అది వాయిదా వేసే కార్యక్రమం కాదు కాబట్టి (పుట్ల హేమలత గారి పుట్టిన రోజు). అందరం సంతోషించాం. నాకు పుట్ల హేమలత గారి గురించి తెలుసు కానీ, ముఖాముఖి పరిచయం లేదు, కానీ వారి భర్త గొప్ప రచయిత, కవి గేయ రచయిత ఎండ్లూరి సుధాకరగారూ, వీరి కుమార్తె శ్రీమతి మానస ఎండ్లూరి నాకు బాగా పరిచయం. అయితే ఆ రోజు నేను ఆ కార్యక్రమాలకు హాజరుకావడానికి రెండు ముఖ్య కారణాలు వున్నాయి. అవి -1) ఎండ్లూరి కుటుంబంతో పరిచయం ఉండడం, 2) పుట్ల హేమలత గారి స్మారక పురస్కారం, నాకు ఫేస్‌బుక్‌లో పరిచయం అయి ఇప్పటివరకూ చూడని శ్రీమతి అరుణ గోగులమండకు ప్రకటించడం; తప్పక హాజరుకావాలని అరుణ ఆహ్వానించడమూను. మొత్తం మీద ఆరోజు కార్యక్రమాన్ని తృప్తిగా ఎంజాయ్ చేయడమే కాక, అరుణను సన్మానించే అవకాశం కూడా రావడంతో, అన్ని రకాలుగా ఆ రోజు అనుభవం ప్రత్యేకతను సంతరించుకుంది.

పుట్ల హేమలత గారి స్మారక పురస్కారం అందుకున్న అరుణ గోగులమండకు, రచయిత పక్షాన చిరు సత్కారం

ఎప్పుడు ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో ఎవరూ చెప్పలేరు. కానీ మంచి జరిగినా, చేదు అనుభవం ఎదురొచ్చినా, అది మర్చిపోలేని అనుభవంగా మిగిలిపోతుంది. ఆ రోజు నేను ఎదుర్కొన్న అనుభవం అలాంటిదే మరి!

అనుభవాలు ఎలాంటివైనా, మన రవీంద్ర భారతి సమావేశమందిరం (రంగస్థలి) మనమంతా గర్వించదగ్గ మంచి కట్టడం. గర్వంగా చెప్పుకోదగ్గ స్థలం. అక్కడ రవీంద్ర భారతి కట్టాలనే ఆలోచన అప్పట్లో ఎవరికీ వచ్చిందోగాని, వారు అభినందనీయులు, ప్రత్యేకంగా ఎప్పటికీ గుర్తు పెట్టుకోదగ్గవారు.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here