అందంతో చెలగాటం-4

25
3

[ఇన్సూరెన్స్ నేపథ్యంగా శ్యామ్‌కుమార్ చాగల్ గారు అందిస్తున్న పెద్ద క్రైమ్ కథ. ఇది నాల్గవ, చివరి భాగం.]

ఉదయం ప్రత్యూష ఊహించినట్లుగానే తొందరగా వచ్చేసాడు మనోజ్.

వచ్చీ రాగానే ఆఫీస్‌లో కెళ్ళి కూర్చొని, టీ త్రాగుతూ అడిగాడు ‘‘..సార్ ఇంకా లేవలేదా” అని.

“ఉదయాన్నే లేచి బయటకు వెళ్లారట” అన్నాడు రాజయ్య.

మధ్యాహ్నం వరకూ ఎదురు చూసి మొబైల్ తీసుకుని రావ్ నెంబర్ కలిపాడు మనోజ్. ఫోన్ రింగ్ అవుతోంది కానీ సమాధానం లేదు.

ఒంటరిగా అంత ప్రొద్దుటే ఎటెళ్ళారబ్బా? అనుకుని కాఫీ ఎస్టేట్ నెంబర్ కలిపాడు. అక్కడ సూపర్‌వైజర్ లేపి అక్కడకు రాలేదని చెప్పాడు.

మధ్యాహ్నం తర్వాత తెల్లని కార్ వచ్చి బంగాళా ముందు ఆగింది. కిటికీలోనుండీ చూసాడు మనోజ్. నల్లని కోటు ధరించి కార్ దిగాడు అడ్వకేట్ రామనాథం. చకచకా మెట్లెక్కి మనోజ్‌ను చూసి “రావ్ గారిని కలవాలి” అన్నాడు.

“సార్ ఉదయమే బయటకు వెళ్లారు” అన్నాడు మనోజ్.

ఇంతలో ప్రత్యూష బయటకు వచ్చి ‘‘రండి రామనాథం గారు” అని తీసుకెళ్లి హాల్‌లో సోఫాలో కూర్చున్నాక అంది “చెప్పండి” అని

“పోయిన వారం రావ్ గారు వీలునామా రాశారు, ఆ విషయం గురించి వచ్చాను” అన్నాడు.

వులిక్కి పడింది ప్రత్యూష. వెంటనే తేరుకుని దర్పంగా కూర్చొని “మాకిచ్చి వెళ్ళండి” అంది.

“క్షమించాలి, అలా ఇవ్వొద్దని మాకు రావ్ గారి సూచనలు వున్నాయి. విల్లు రిజిస్ట్రేషన్ అయిపొయింది. ఆయన వస్తే చెప్పండి” అంటూ లేచాడు.

“మీకు చెందాల్సిన ఫీజు రెండు రెట్లు ఇస్తాను. ఆ వీలునామా నా కివ్వండి” అంది ఎవరూ వినకుండా మెల్లిగా.

చాలా నింపాదిగా చెప్పాడు రామనాథం “మా వృత్తి అది కాదండి.. నే వచ్చి వెళ్లానని రావ్ గారికి చెప్పండి. ఆయన ఫోన్ దొరకటం లేదు” అని వెళ్ళిపోయాడు.

ప్రత్యూషకు ఆ రెండు రోజులూ దినగండం నూరేళ్ళ ఆయుష్షు లాగా గడిచి పోయింది. రావ్ గారు ఎటు వెళ్లారో తెలీక ప్రత్యూషను చాలా సార్లు అడిగాడు మనోజ్.

రావ్ గారు కనపడక పోయేసరికి మనసు ఏదో కీడు శంకించసాగింది. లోని కొచ్చి ప్రత్యూష బయట లేదని గమనించి రావ్ గదిలోకి వెళ్లి చుట్టూ చూసాడు మనోజ్. పరుపు చెక్కు చెదరకుండా వుంది. రావ్ గారి వస్తువు లన్నీ పద్ధతిలో సర్ది ఉండటం గమనించి అనుమానంతో మంచం చుట్టూ తిరిగి కింద చూసాడు. తిరిగి బయటకు వస్తున్నప్పుడు ప్రత్యూష గదిలో నుండీ బయటకు వచ్చి మనోజ్‍ను చూసి కంగారు పడింది. “ఏంటి మనోజ్.. రావ్ గారు లేరు.. ఆ గదిలోకెందుకు వెళ్ళావ్?” అని భయంగా చూసింది.

“కొన్ని ఫైల్స్ కనపడటం లేదు మేడం” అని చెప్పి ఆఫీస్ గదిలోకి వెళ్ళిపోయాడు.

పైకెళ్ళి రావ్ గదిలోకి అడుగు పెట్టి అక్కడున్న ఫ్రిజ్ వేపు చూసింది. దాని దగ్గరకు వెళ్లి మెల్లిగా తలుపు మీద చేయి వేసింది.

“అమ్మగారు!” అన్న రాజయ్య పిలుపు విని ఉలిక్కి పడింది ప్రత్యూష. గది బయట తలుపు పక్కన నిలబడి ఫ్రిజ్ వేపే చూస్తున్నాడు రాజయ్య. అది చూసిన ప్రత్యూష గుండెలు జారిపోయాయి.

అంతలోనే తమాయించుకుని “ఏంటి రాజయ్య?” అంది.

“ఫ్రిజ్‌లో వుండే బీరు, విస్కీ బాటిల్స్ అన్నీ బయట పెట్టారు. లోపల అన్నింటిని మళ్ళీ సర్దేయమంటారా?” అన్నాడు చేతులు కట్టుకుని.

“వద్దొద్దు, అది అయ్యగారు తీశారు. అలాగే ఉండనియ్యి. నువ్.. నువ్.. నువ్ కిందకు వెళ్లి పని చూసుకో” అంది తడబడుతూ.

ప్రత్యూష కంగారు చూసి ఏమీ అర్థం కాక సరేనంటూ వెళ్ళిపోయాడు రాజయ్య.

రాజయ్య వెళ్ళగానే పెద్దగా ఊపిరి పీల్చి గుండెల మీద చేయి వేసుకుంది ప్రత్యూష. అలాగే నిలబడి ఫ్రిజ్ వేపు చూసింది. ఆమె కళ్ళలో నీరు జలజలా కారిపోసాగింది. కొంగుతో కళ్ళు తుడుచుకుని మొబైల్ తీసి విక్టర్ నెంబర్ కలిపింది.

“హలో.. అంతా ఓకేనా” అన్నాడు ఆదుర్దాగా విక్టర్.

“మనోజ్‌కు అనుమానంగా వుంది. పైగా శవాన్ని ఇంట్లో పెట్టుకుని ఉండలేక పోతున్నా. త్వరగా మన ప్లాన్ ఈ రోజు రాత్రి పూర్తి చేయటం మంచిది. నిన్న అడ్వకేట్ వచ్చి వెళ్ళాడు. అతను కూడా రావ్‌ను వెతుకుతున్నాడు. వీలునామా రాసాడట రావు.” అంది ప్రత్యూష ఏడుపు ఆపుకుంటూ.

“సరే ఈ రోజు రాత్రి పూర్తి చేద్దాం. పని వాళ్ళను తొందరగా పంపించే ఏర్పాట్లు చేసుకో” అన్నాడు విక్టర్.

“సరే” అని కళ్ళు తుడుచుకుంది..

ఆ రాత్రి పదకొండు గంటల సమయంలో కిటికీ లోనుండీ లోనికి దూకాడు విక్టర్. ఇద్దరూ కలిసి పైకెళ్ళి ఫ్రిజ్ తాళాలు తీశారు. తలుపు మెల్లిగా తీసాడు విక్టర్. రావ్ శవాన్ని చూడలేక కళ్ళు మూసుకుంది ప్రత్యూష.

రెండు చేతులతో శవాన్ని బయటకు లాగాడు విక్టర్. చేతుల్లోనుండి జారి కిందపడింది రావ్ శరీరం.

“కాస్త నువ్ కూడా సహాయం చేయాలి. చాలా బరువు” అన్నాడు ఆయాస పడుతూ విక్టర్.

రావ్ శవం వేపు చూడకుండా కాళ్ళు పట్టుకుంది ప్రత్యూష. అలాగే మోసుకుంటూ వెళ్లి మెట్లు దింపి, హాల్ నుండీ బయటకు తీసుకెళ్లి వరండాలో కింద పెట్టారు. ప్రత్యూషకు ఒంటి నిండా చమటలు పట్టాయి. వరండా, హాల్ లో లైట్స్ తీసేయటం మూలాన అంతా చీకటిగా వుంది.

చుట్టూ చూసి, రావు శవాన్ని మోసుకుంటూ వెళ్లి కార్ ముందు పక్క సీట్‌లో కూర్చో పెట్టారు.

ప్రత్యూష కళ్లలోనుండీ నీరు ఆగటం లేదు.

“మరందుకే నే చెప్పా.. మనం ఈ డబ్బులు ఆస్తి వదిలేసి ఎటైనా వెళ్లి పోదాం.” అన్నాడు నిస్సహాయంగా.

“ఏం పర్లేదు, త్వరగా వెళ్ళు” అంది కళ్ళు తుడుచుకుని.

కార్ స్టార్ట్ చేసి గేట్ బయటకు వెళ్లి పోయాడు విక్టర్. మెట్ల వద్ద నించుని రావు శవాన్ని తీసుకెళ్తున్న కార్ వేపు కాసేపు చూసి వెళ్లిపోయింది ప్రత్యూష.

ఆ సమయంలో గాఢ నిద్రలో వున్న మనోజ్ కార్ చప్పుడుతో లేచి కిటికీలో నుండీ బంగాళా వేపు చూసాడు. రావ్ గారి బెంజ్ కార్ గేట్ దాటుతూ వుంది. గబగబా మెట్లెక్కి వెళ్తున్న ప్రత్యూష కనపడింది.

‘ఈ రాత్రి రావ్ ఎటు వెళ్తున్నారు? అసలెప్పుడొచ్చారు? తన ఫోన్ ఎందుకు లేపటం లేదు!!’ అని ఆలోచిస్తూ వెళ్లి పడుకున్నాడు.

దాదాపు ఒక గంట తర్వాత విక్టర్, ఒక ఎత్తైన మలుపులో కార్ ఆపాడు. కిందకు దిగి పక్క సీట్లో ఒరిగిపోయిన శవాన్ని తలుపు తీసి బయటకు లాగి, నేల పైన లాక్కుంటూ వెళ్లి డ్రైవర్ సీట్‌లో కూర్చోపెట్టాడు. జేబులోనుండీ రుమాలు తీసి స్టీరింగ్ వీల్ మీద, కార్ తలుపుల మీద వేలి ముద్రలను తుడిచేసాడు.

తిరిగి కార్ తలుపు వేసి, సార్ట్ చేసి బయట నుండీ కారును చేతులతో తోసుకుంటూ కొండ అంచుల వరకూ తీసుకెళ్లాడు. అక్కడ చిన్న చిన్న గులక రాళ్లు టైర్ కింద అడ్డం పడి కార్ ముందుకు కదలకుండా ఆగిపోయింది. కిటికీ మీద చేయి వేసి బలంగా మొత్తం శక్తినుపయోగించి నెట్టసాగాడు.

కారు కొద్ది కొద్దిగా కదులుతూ వేగం పుంజుకుంది. అలాగే తోసుకుంటూ కార్ వెంట పరుగెత్తాడు. ఆఖరి నిముషంలో చేతులు కార్ కిటికీ మీద నుండీ తీసాడు కానీ అతని షర్ట్ అంచులు కిటికీ వద్ద చిక్కుకుని, బాలన్స్ కోల్పోయి, కార్ తో బాటు వేగంగా కొండ అంచులకు జారిపోసాగాడు. కార్ గాలిలో దూకి లోతులో వున్న పెద్ద రాళ్ళ మీదకు పడి పల్టీలు కొట్టింది. కార్ వెంబడి విక్టర్ కూడా గాలిలో ఎగిరాడు. విక్టర్ గొంతులో నుండీ పెద్ద అరుపు బయటకొచ్చి గాలిలో కలిసి పోయింది. కింద లోయలో పడ్డ కొద్ది సేపటికి కార్ మంటల్లో తగలబడి పోయింది.

***

ఆ రాత్రంతా విక్టర్‌కి కాల్ చేస్తూనే వుంది ప్రత్యూష. ఫోన్ స్విచ్ ఆఫ్ అనే వచ్చింది.

ఉదయం పోలీస్ జీప్ బంగాళా ముందు ఆగడం చూసి అలాగే నైట్ డ్రెస్‌లో చెప్పులు వేసుకుని పరుగెత్తుకుని వచ్చాడు మనోజ్. అదే సమయానికి ప్రత్యూష కూడా వచ్చి వరండాలో నిలబడింది. ఇన్‌స్పెక్టర్ రాగానే వరండాలో కూర్చోమని చూపించి “చెప్పండి దేనికి వచ్చారు” అంది.

విజిటర్ చైర్‌లో కూర్చుని తల మీద నుండీ టోపీ తీసి “మీ కార్ ఘాట్ రోడ్‌లో ప్రమాదానికి గురి అయ్యి కాలి పోయింది. రావ్ గారి బాడీ మాత్రం కార్‌కి దూరంగా కింద పొదల్లో దొరికింది. ఆ కార్ పక్కన ఎవరో యువకుడి శరీరం కాలి పోయి వుంది. అతన్ని గుర్తుపట్టలేనంతగా కాలిపోయింది బాడీ మొత్తం.” అన్నాడు ఇన్‌స్పెక్టర్.

అది వినగానే కళ్ళు బైర్లు కమ్మి కింద పడబోయి మెల్లిగా కుర్చీలో కూర్చుంది ప్రత్యూష. “మరి రావ్ గారు” అంది మెల్లిగా.

“ఆయన మరణించారు. బాడీని పోస్ట్ మార్టమ్‌కు తరలించాము. మీరెవరైనా వచ్చి ఆ ఇంకో యువకుడు ఎవరో గుర్తు పడతారేమో చూడండి. ఆయన ఇంట్లోనుండీ ఎప్పుడు వెళ్లారు, ఆయనతో ఎవరు వున్నారు వగైరా అన్ని విషయాలు మళ్ళీ వచ్చి రాసుకుంటాను” అని చెప్పి లేచాడు ఇన్‌స్పెక్టర్.

రావ్ గారి మరణ వార్త విన గానే మనోజ్ కళ్ళలో కన్నీళ్లు గిర్రున తిరగటం మొదలయ్యింది.

“ఇన్‌స్పెక్టర్ గారు, నే వస్తాను పదండి” అన్నాడు మనోజ్.

పోస్ట్ మార్టమ్ కార్యక్రమం పూర్తి చేసుకుని రావ్ శవాన్ని తీసుకుని ఇంటికి వచ్చి పూల పరుపు పై పడుకోబెట్టి, ప్రముఖులు స్నేహితులు, పని వాళ్ళు అందరూ అంజలి ఘటించి, వాహనంలో తరలించే సమయానికి రావ్ కూతురు షర్మిల కార్ లోనుండీ దిగి ఏడుస్తూ పరుగెత్తుకొచ్చింది.

షర్మిలను పట్టుకుని అందరూ సముదాయించి రావ్ పార్థివ శరీరాన్ని దహన సంస్కారాలకు తీసుకెళ్లిపోయారు.

***

పోలీస్ స్టేషన్‌లో రావ్ గారి పోస్ట్ మార్టమ్ రిపోర్ట్, ఫోరెన్సిక్ రిపోర్ట్, ఫోటోలు, పంచనామా ఫైల్ ముందు పెట్టుకుని ఆలోచనలో పడ్డాడు ఇన్‌స్పెక్టర్ రాజేష్.

“ఏంటి ఆలోచిస్తున్నావు” అన్నాడు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గౌతమ్.

“రావు చనిపోవటానికి కారణం విష ప్రయోగం అని ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ లో వుంది. అలాంటప్పుడు కార్ ప్రమాదం ఎలా? సైనైడ్ వలన మరణం సంభవిస్తే, అది నిమిషాలలో అయిపోతుంది. మరి ఆయన కార్ కొండ చరియల  దగ్గరికి ఎలా వచ్చింది. ఒక వేళ ఆయనే అక్కడి వరకూ నడుపుకుని వచ్చి అప్పుడు సైనైడ్ తిన్నట్లైతే, కార్ ఎందుకు రోడ్ దాటి కొండ మీద నుండీ కిందకు దూకింది. ఒక వేళ కార్ పడటం ప్రమాదం అనుకుంటే, సైనైడ్ ఎప్పుడు తిన్నాడు.” అంటూ తలలో వేలు పెట్టి గోక్కున్నాడు రాజేష్.

“ఇందులో ఇంకో అసలు ముఖ్యమైన విషయం మరుస్తున్నావు సుమా..” అన్నాడు గౌతమ్

ఏమిటీ అన్నట్లుగా అయోమయంగా చూసాడు రాజేష్.

“అదే అక్కడ కాలిపోయిన ఇంకొక వ్యక్తి ఎవరు అన్నది” అన్నాడు గౌతమ్ సీరియస్‌గా.

“నిజమే, వీడెవడో, కార్లో ఎందుకున్నాడో?” గొణుక్కున్నట్లుగా అన్నాడు రాజేష్.

“వాడెవడో వివరాలు తెలిస్తే గానీ, అసలు గుట్టు బయటకు రాదు” అన్నాడు గౌతమ్ సిగరెట్ వెలిగించుకుంటూ.

“రావ్ చనిపోతే ఆస్తి కూతురికి, భార్యకి సగం చెందుతుంది.” అన్నాడు రాజేష్, మీసాలు సర్దుకుంటూ.

“అన్నట్లు, రావ్ రెండో భార్యను చూస్తే నాకేదో అనుమానంగా వుంది. మంచి వయసులో వుండే అందగత్తె ఈ ముసలాడిని ఎందుకు పెళ్లాడిందో.” అన్నాడు గౌతమ్.

“నిజమే ఈవిడ పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకుంటే మంచిది. మన ఇన్వెస్టిగేటర్ ‘బెన్నీ’కి ఈ పని అప్పచెప్తా” అని లేచాడు రాజేష్.

***

చేతిలో బ్యాగ్ పట్టుకుని జీవిత బీమా కార్యాలయం లోకి అడుగు పెట్టాడు ఏజెంట్ సూరి. తన టేబుల్ మీద బ్యాగ్ పెట్టి మేనేజర్ గదిలోకి వెళ్ళాడు. మేనేజర్‌ను చూసి నమస్కారం చేసి కూర్చున్నాడు సూరి.

చూస్తున్న పేపర్లు పక్కన పెట్టి “ఏంటి సూరి బాబు విషయాలు” అన్నాడు నంబియార్ కుర్చీలో వెనక్కి వాలుతూ.

“సర్ మీకు తెలీదా? రావ్ గారు ప్రమాదంలో మరణించారట” అన్నాడు సూరి.

“అరెరే.. తెలీదు సూరి. అయితే మనకో పెద్ద క్లెయిమ్ వచ్చిందన్నమాట” అన్నాడు నంబియార్ నిట్టూర్చి.

“కానీ కొందరేమో సూసైడ్ అంటున్నారు సర్.” అన్నాడు.

“అయితే మనకు క్లెయిమ్ ఉండదు.. పాలసీ చేసిన సంవత్సరం లోగా సూసైడ్ చేసుకుంటే డబ్బులివ్వం కదా!” అన్నాడు ఉదాసీనంగా.

“ఏదీ సరిగ్గా తెలీటం లేదు సార్.”

“నెలే అయిందనుకుంటా.. ఒక రోజు రావ్ గారు వచ్చి ఈ సూసైడ్ విషయం మాట్లాడి వెళ్లారు. మర్చిపోయాను. అప్పుడు చెప్పాను. సంవత్సరం లోగా సూసైడ్ అయ్యితే డబ్బులు రావని. అది విని, వెరీ నైస్ గుడ్ అన్నాడు. ఒక వేళ ప్రమాదం అయితే ఎలా అని అడిగారు. అలాంటప్పుడు మూడు రెట్లు వస్తుంది అని చెప్పా. నవ్వేసి వెళ్లిపోయారు మరి.” అని చెప్పి మళ్ళీ తల గోక్కున్నాడు నంబియార్.

“ఆయన కార్ కొండ మీద నుండీ పడింది సార్” అన్నాడు సూరి.

“అది ప్రమాద మరణమే కదా సూరి బాబు?” అన్నాడు నంబియార్ భృకుటి ముడి వేసి.

“అవును సార్. క్లెయిమ్ వచ్చిందంటే అనుమానించాల్సి వస్తోందీ మధ్య. చూసారుగా నిన్నటి పేపర్. ఒక ఆఫీస్‌లో కొందరు కుమ్మక్కయ్యి పల్లెటూర్లో చనిపోయిన వాళ్ళ పేరుతో పాలసీలు చేయించి, మూడు సంవత్సరాలు బీమా వాయిదాలు కట్టించి ఆ తర్వాత డెత్ సర్టిఫికెట్లు సంపాదించి, డబ్బులు పంచుకున్నారు. ఆ పంపకాలలో తేడాలొచ్చి అందులో ఒకడు గొడవ చేసేసరికి అందరూ దొరికిపోయారు” అన్నాడు సూరి.

“రావ్ గారి విషయం కాస్త అనుమానంగా వుందోయ్” అని రెండు దవడలు కదిలించాడు నంబియార్.

“ఏమో సార్ పెద్ద వాళ్ళ కథలు మనకర్థం కావు” అని చెప్పి కేబిన్ బయటకు వెళ్ళాడు సూరి.

సూరి బయటకు వెళ్లి పోయిన తర్వాత కాసేపు ఆలోచించాడు నంబియార్. ఫోన్ చేతిలో తీసుకుని ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ మెహతా నెంబర్ కలిపాడు.

“హలో మెహతా.. నేను నంబియార్” అని నవ్వాడు.

అటునుండి మెహతా సమాధానం రాగానే చెప్పటం మొదలు పెట్టాడు నంబియార్.

అంతా చెప్పి ఆఖరున అన్నాడు “చాలా జాగ్రత్తగా అన్నీనిజాలు రాబట్టు. మంచి ఫీజు ఇస్తాను. ఒక వేళ ఆత్మహత్య అయితే పాలసీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. మనకు కోట్లు మిగిలి పోతాయి.” అని ఫోన్ పెట్టేసి గట్టిగా ఊపిరి పీల్చాడు నంబియార్.

***

బంగాళా పైన తన గదిలో ఏడుస్తూ కూర్చుంది ప్రత్యూష. రావ్ శవాన్ని తీసుకెళ్లిన విక్టర్ కొండ కింద కాలి ఎలా చనిపోయాడో అర్థం కావటం లేదు. అసలు కిందకు ఎందుకు పడ్డాడు. ఇప్పుడు జీవితంలో తనకెవ్వరు తోడు? తనను అంతలా ప్రేమించే మగాడు దూరం అయిన తర్వాత ఈ ఆస్తి, డబ్బులు వుండి ఏం లాభం అని అనుకుంటూ ముందు నుండీ తనను పెళ్లి చేసుకోటానికి ఎన్నో విధాలుగా బ్రతిమిలాడినా తాను ఒప్పుకోకుండా ఆస్తి, అంతస్తులు చూసుకుని రావ్‌ను చేసుకునే రోజు విక్టర్ ఆత్మహత్య చేసుకొనటానికి ప్రయత్నించటం జ్ఞాపకం వచ్చి నిట్టూర్చింది. విక్టర్ గురించి ఆలోచిస్తూ గతం లోకి జారి పోయింది.

హోటల్ అశోక రిసెప్షన్‌లో కూర్చొని. కస్టమర్ ఫోన్ లకు సమాధానం చెప్తూ వుంది ప్రత్యూష.

కౌంటర్ వద్ద నిలబడ్డ ఇద్దరు మగాళ్లు తనను కొరుక్కు తినేలా చూస్తూ వున్నారని గమనించి, నిస్సహాయంగా తన పనిలో తాను నిమగ్నమై పోయింది ప్రత్యూష. ఆకస్మికంగా తల్లిని తనను ఒంటరి చేసి చనిపోయిన తండ్రి గుర్తొచ్చి ప్రత్యూష కళ్ళు చెమ్మగిల్లాయి. బట్టల కొట్టులో పనిచేస్తూ తల్లి ఎన్ని బాధలు పడి చదివించిన సంఘటనలు కళ్ళ ముందు కదలాడాయి.

అసలు ప్రత్యూష పరిచయం అయిన మొదటి రోజు నుండీ విక్టర్ ప్రేమలో పడ్డాడు. ;ప్రత్యూష కూడా విక్టర్‌ను వివాహం చేసుకోవాలని అనుకునేది. కానీ అతని ఇంటి పరిస్థితి, ఆర్ధిక ఇబ్బందులు చూసి నిరుత్సాహానికి గురయ్యింది.

ఒక రోజు చర్చి లో ఒకరి పక్కన ఒకరు కూర్చున్నారిద్దరూ.

“నాకు స్వంత ఇల్లుంది, కార్ మెకానిక్ షెడ్‌లో వచ్చే ఆదాయంతో సంతోషంగా బ్రతుకుదాం ఉషా” అన్నాడు.

అది విని ఆలోచనలో పడింది ప్రత్యూష. ఆమె కళ్ళ ముందు విక్టర్ వుండే పాత ఇల్లు, ముసలి తల్లి తండ్రి కదిలారు. మళ్ళీ అన్నింటికీ ఎదురు చూసే జీవితం, తీరని కోరికలు, మధ్య తరగతి జీవితం మెదిలింది. తల విదిల్చి ‘నో.. ఇది కాదు తనక్కావల్సిన బ్రతుకు’ అనుకుంది.

కొన్నాళ్లకి ఓ రోజు ఆ హోటల్ లోకి అడుగు పెట్టాడు రావ్.

మేనేజర్ వెళ్లి రిసెప్షన్ వద్ద నిలబడి రిజిస్టర్‌లో వివరాలన్నీ రాసి అడ్వాన్స్ కట్టి హాల్‌లో కూర్చున్న రావ్‌ను గది వేపు తీసుకెళ్లాడు. హాల్‌లో కూర్చున్నంత సేపు ప్రత్యూష వేపే చూస్తున్నాడు రావ్. ఆమె అందం అతడిని కట్టి పడేసింది.

ఆ ఊర్లో వున్నన్ని రోజులూ ప్రత్యూష గురించే ఆలోచించసాగాడు.

ఒకరోజు ఎప్పటిలా డెస్క్ ముందు కూర్చొని పని చేసుకుంటున్న సమయంలో రావుతో బాటు వచ్చిన మేనేజర్ సుబ్బారావు ప్రత్యూష ముందు నించుని “మీకు వీలున్నప్పుడు మా సార్‌ని కలవండి. ఆయన చెప్పమన్నారు. ఇదుగో ఆయన విజిటింగ్ కార్డు” అని చెప్పి కార్డు ప్రత్యూష ముందు పెట్టాడు.

“పోలీస్ ఇన్‌స్పెక్టరు గారు వచ్చారు.” అని పనివాడు అన్న మాటతో ఉలిక్కి పడి గతం లోనుంచి బయటకు వచ్చింది ప్రత్యూష.

పోలీస్ అన్న మాటతో ప్రత్యూష గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. మొహంలో కంగారు కనపడనీయకుండా సర్దుకుని బయట హాల్‌లో కూర్చొని వున్నఇన్‌స్పెక్టర్ రాజేష్ ముందుకు వెళ్లి “చెప్పండి ఇన్‌స్పెక్టర్ గారు, ఇలా వచ్చారు?” అంది ఎలాంటి భావం మొహంలో కనపడనీయకుండా.

“రావ్ గారు ఆ రాత్రి ఒక్కరే బయటకు వెళ్ళారా? కార్ ఎవరు నడిపారు” సూటిగా ప్రత్యూష కళ్ళలోకి చూసాడు ఇన్‌స్పెక్టర్ రాజేష్.

ఆ ప్రశ్నకు ఏం చెప్పాలో అర్థం కాక తడబడింది. “ఒక్కరే వెళ్లారు” అంది.

ఆమెలో తడబాటు గమనించాడు ఇన్‌స్పెక్టర్. “మీవారితో బాటు ఇంకోక యువకుడి శవం పూర్తిగా కాలి పోయి దొరికింది. గుర్తు పట్టటానికి వీల్లేకుండా వుంది. అదెవరో మీకేమైనా తెలుసా?” ఈసారి అనుమానంగా చూసాడు.

విక్టర్ అంత భయానకంగా కాలిపోయాడన్న మాట వినగానే ప్రత్యూష గుండెల్లోనుంచీ దుఃఖం తన్నుకొచ్చింది. మనసుని అదుపు చేసుకుని, లేదన్నట్లుగా తల అడ్డంగా ఊపింది.

ప్రత్యూష మొహంలో కదులుతున్న బాధను గమనించాడు ఇన్‌స్పెక్టర్.

“రావ్ గారు ఆ రోజు మీకేదైన ముఖ్య విషయం చెప్పారా? మీకెవరి మీదైనా అనుమానం ఉందా” అడిగాడు రాజేష్.

కాసేపు ఆలోచించింది ప్రత్యూష. విక్టర్ బ్రతికి ఉంటే ముందుగా ప్లాన్ వేసుకున్నట్లుగా మనోజ్ మీద అనుమానం వచ్చేట్లుగా చేసేవారు. కానీ విక్టర్ చనిపోయాక ఇవన్నీ వృథా అనే నిర్ణయానికి వచ్చింది ప్రత్యూష.

“ఎవరి మీదా అనుమానం లేదు” అని కరాఖండిగా అంది.

ఆమె మొహంలో దృఢ నిశ్చయాన్ని చూసి ‘ఇక ఈవిడ ఏమి చెప్పదు’ అనుకుని లేచి “మీ మేనేజర్ మనోజ్ ఎక్కడ? ఒకసారి మాట్లాడాలి” అన్నాడు ఇన్‌స్పెక్టర్ రాజేష్.

ఆ మాట విని తనలో కలిగే అలజడి కనపడనీయకుండా ఇన్‌స్పెక్టర్ కేసి చూసి “అదుగో ముందు వేపున్న ఆఫీస్‌లో వున్నారు, వెళ్ళండి” అంది.

ఆఫీస్ గదిలోకి అడుగు పెట్టిన ఇన్‌స్పెక్టరును చూసి లేచి నించుని, నమస్కారం చేసి, కుర్చీ చూపించాడు మనోజ్.

కుర్చీలో కూర్చుని కాసేపు చుట్టూ చూసి “మీరెన్నాళ్ల నుండీ ఇక్కడ పని చేస్తున్నారు?” అడిగాడు ఇన్‌స్పెక్టర్ రాజేష్.

“దాదాపుగా మూడు నెలలు కావస్తోంది సార్” అన్నాడు.

“రావ్ గారికి ఆత్మహత్య చేసుకోవలసిన అవసరం ఏంటి, కారణాలు మీకేమైనా తెలుసా” అన్నాడు రాజేష్. మనోజ్ మొహంలో కలిగే భావాలను చదవటానికి యత్నిస్తూ.

“మానసికంగా ఎప్పుడూ సంతోషంగా లేరు. అవి వారి కుటుంబ విషయాలు, అంత కంటే ఎక్కువ నేను చెప్పలేను” అన్నాడు ఇబ్బందిగా కదుల్తూ.

“రావ్ గారి మరణం అనుమానాస్పదంగా వుంది. మీరు మాతో సహకరిస్తే మంచిది.” తీక్షణంగా చూస్తూ అన్నాడు రాజేష్.

“సరే అడగండి” అన్నాడు మనోజ్ నిజాయితీ ధ్వనిస్తున్న స్వరంతో.

“ఆయన చనిపోయిన రాత్రి ఏం జరిగింది. మీకు తెలిసినంత వరకూ చెప్పండి”

“అంతకు ముందు రెండు రోజులు వెళ్లారో తెలీదు. చనిపోయిన రాత్రి వచ్చి మళ్ళీ అర్ధరాత్రి వెళ్లిపోయారు.”

“ఒక్కరే వెళ్ళారా?” అడిగాడు రాజేష్

“అనుకుంటాను.. నేనూ, కారు చీకట్లో ఉండడం వల్ల లోపలెవరున్నారో కనపడలేదు.”

“ప్రత్యూష గారున్నారా కార్లో?”

“లేదు. కార్ వెళ్లి పోయాక ప్రత్యూష గారు మెట్లెక్కి లోనికి వెళ్ళటం నేను చూసాను” అన్నాడు మనోజ్.

“ఇంకా ఏమైనా వివరాలు గుర్తొస్తే నాకు ఫోన్ చేసి చెప్పండి” అని చెప్పి లేచి వెళ్ళిపోయాడు రాజేష్.

***

పోలీస్ స్టేషన్ లోకి ప్రవేశించి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గది లోకి వెళ్ళాడు ఇన్వెస్టిగేటర్ బెన్నీ.

“రా రా బెన్నీ” అని నవ్వుతూ కుర్చీ చూపించాడు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గౌతమ్.

కుర్చీలో కూర్చుని చేతిలో వున్నా పేపర్ కట్టను టేబుల్ పెట్టాడు బెన్నీ. పని విషయంలో ఏమాత్రం అజాగ్రత్తను చూపించడు బెన్నీ. సూది లాంటి చూపు, చురుకైన మస్తిష్కం అతని సొత్తు. నేర పరిశోధనలో అతన్ని మించిన వారు ఆ ప్రాంతంలో లేరనే చెప్పాలి.

గౌతమ్‌ను చూసి “మీరు అన్నట్లుగానే, రావ్ గారి మరణంలో ఎన్నో అనుమానాలున్నాయి. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆయన భార్య ప్రత్యూష. ఆవిడ పెళ్ళికి ముందుగానే పీకల లోతు ప్రేమలో మునిగింది అని తెలిసింది. ఆ ప్రేమికుడి పేరు విక్టర్. అందరూ అనుకున్నట్లుగా ఆవిడ రాజుల కుటుంబం వ్యక్తి కాదు. త్రి స్టార్ హోటల్‌లో పని చేసేది.

అరకొర సంపాదనతో బ్రతికేది. రావ్ గారు చేరదీసి వివాహం చేసుకున్నాడు. పెళ్లి అయిన తర్వాత ఆవిడ కున్న డబ్బు ఆశ చూసి రావ్ గారు నిరాశ నిస్పృహలకు గురయ్యి, తాగుడుకు బానిస అయ్యాడు. కొంత కాలం తర్వాత ఎస్టేట్ వ్యవహారాలు చూసుకోవటానికి మేనేజర్‌గా విక్టర్ వచ్చాడు. ఒక సంవత్సరం తిరిగేలోగా అతడి పద్ధతులు నచ్చక తీసేసారు రావ్ గారు.

బహుశా భార్యతో విక్టర్ కున్న తెలిసి ఉద్వాసన చెప్పాడేమో తెలీదు.” అని చెప్పి ఆగాడు బెన్నీ.

“చాలా ఆసక్తికరంగా వుంది” అన్నాడు గౌతమ్ చిన్నగా ఈల వేసి.

“ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందామని విక్టర్ వుండే ఊరికి వెళ్లాను కానీ ఈ మధ్య కొద్దీ రోజులుగా విక్టర్ కనపడటం లేదు అని తెలిసింది.” అన్నాడు.

ఆ మాట వినగానే ఉలిక్కి పడ్డాడు గౌతమ్. ముందుకి వంగి “ఎన్నాళ్లుగా కనపడటం లేదట?” అడిగాడు.

“దాదాపుగా ఒక వారం నుండీ” అన్నాడు బెన్నీ.

“ఎక్సలెంట్ వర్క్ బెన్నీ. ఎలా సేకరించేవిదంతా?” బెన్నీతో చేయి కలిపి అడిగాడు గౌతమ్.

“అది నా వృత్తి రహస్యం సార్” అని కళ్ళు చిన్నవి చేసి నవ్వాడు బెన్నీ.

వెంటనే లేచాడు గౌతమ్, పక్క టేబుల్ ముందు కూర్చున్న ఇన్‌స్పెక్టర్ రాజేష్‌ను చూసి “విక్టర్ కార్ షెడ్‌కు వెళ్లి ఎవరినైనా పనివాళ్ళను, విక్టర్ ఇంటి సభ్యులను తీసుకుని మార్చురీకి తీసుకెళ్లి, రావ్‌తో బాటు కాలిపోయిన శవాన్ని చూపించండి. అది ఖచ్చితంగా విక్టర్ దేనని నా అనుమానం, నే వెళ్లి అంత లోగా రావ్ ఎస్టేట్‌లో పని వాళ్లను పలకరించి వస్తా, అటు వేపునుండీ ఏదైనా సమాచారం దొరుకుతుందేమో చూడాలి” అని చెప్పి బయటకు నడిచాడు.

వారం పాటు ఎస్టేట్ వ్యవహారాలన్నీ దగ్గరుండీ షర్మిలకు చూపించాడు మనోజ్. పన్నెండు రోజుల పాటు జరిగిన అంతిమ సంస్కారాలన్నీ దగ్గరుండి జరిపించాడు మనోజ్.

ఆ రోజు హాల్‌లో అందరూ కూర్చుని వున్నారు. ఒక వేపు ప్రత్యూష, షర్మిల, పక్క సోఫాలో మనోజ్ కూర్చొని, ఎదురుగా అడ్వకేట్ రామనాథం కూర్చొని చదువుతున్న వీలునామా వినసాగారు.

పేపర్ చేతిలో పెట్టుకుని చెప్పసాగాడు రామనాథం “మొత్తం స్థిరాస్తి, చరాస్తిలో సగ భాగం కూతురు షర్మిలకు చెందుతుంది.” అని చెప్పి ఆగాడు.

నిరాశగా చూడసాగింది ప్రత్యూష. ఆమె మొహంలో ఎక్కడా ఇసుమంత ఆసక్తి కనపడలేదు.

తిరిగి చెప్పసాగాడు రామనాథం “మిగిలిన సగభాగం మిస్టర్ మనోజ్‌కు చెందుతుంది. అంతే కాదు షర్మిల వివాహం జరిగే వరకు వ్యాపార, ఆస్తి లావాదేవీలన్నింటికీ మనోజ్ బాధ్యత వహిస్తాడు” అని మనోజ్ వేపు చూసాడు.

ఆశ్చర్యంతో లేచి నిలబడ్డాడు మనోజ్. అతని మొహంలో సంతోషం లేదు.

“భార్య ప్రత్యూషకు రావు గారి స్వంత ఊరిలోని పాత ఇల్లు, ఆవిడ జీవనానికి నెలకు యాభై వేలు ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడున్న బంగాళాలో ఉండటానికి వీలు లేదు” అని చెప్పి “ఇక ఆస్తి పంపకాలు న్యాయపరమైన విధానంలో వచ్చే నెలలో చేస్తాను” అని లేచాడు రామనాథం.

ప్రత్యూష లేచి తన గది లోకి వెళ్లి పోతుండగా ఇన్‌స్పెక్టర్ లోనికి అడుగు పెట్టాడు.

అతన్ని చూసి అందరూ కూర్చున్నారు.

కుర్చీలో కూర్చున్న ఇన్‌స్పెక్టర్ అందరి వేపు చూసి అన్నాడు “రావు గారు ప్రమాదంలో చనిపోలేదు. విష ప్రయోగం జరిగింది. ఆత్మహత్య అని అనుమానంగా వుంది. ఎందుకంటే శరీరంలో పొటాషియం సైనైడ్ దొరికింది. అంతేకాదు ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆ సైనైడ్ సీసా అర చేతి గుప్పెటలోనే వుండి పోయింది.” అని చెప్పి అందరినీ చూసి మళ్ళీ చెప్పసాగాడు “కారుతో పాటు కాలిపోయిన ఆ యువకుడెవరో ప్రస్తుతానికి తెలియలేదు.”

ఒకసారి ప్రత్యూషను, షర్మిలను స్టేషన్‍కు వచ్చి కొన్ని పేపర్స్ మీద సంతకాలు పెట్టి వెళ్ళమని చెప్పి లేచి వెళ్లి పోయాడు ఇన్‌స్పెక్టర్.

ప్రత్యూష లోపలి వెళ్లి తన వస్తువులన్నీ అయిదు సూటుకేసుల్లో సర్దుకుని రాజయ్యను పిలిచి వాటిని కారులో పెట్టించి, అందరికీ నమస్కరించి బంగాళా మెట్లు దిగి వెళ్ళిపోయింది. అన్నీ కోల్పోయి వెళ్లిపోతున్న ప్రత్యూషను జాలిగా చూసాడు మనోజ్.

జరిగినదంతా ఒక కల లాగా చూస్తున్న మనోజ్ లేచి నిలబడి షర్మిల వేపు తిరిగి “రావు గారు నా మీద ఇంత ప్రేమ, నమ్మకం చూపినందుకు నాకు చాలా గర్వంగా వుంది. నాకెటువంటి ఆస్తులు వద్దు. మీరు తేరుకునే వరకూ మీ ఎస్టేట్ పనులన్నీ నేను చేస్తాను. నాకెప్పుడూ వచ్చే జీతం చాలు” అన్నాడు రావు గారి పటానికి నమస్కరిస్తూ.

“మిస్టర్ మనోజ్, మీరు చేసిన సహాయం నాకు తెలుసు. నాన్నగారు అన్నీ చెప్పారు. కాబట్టి ఆయన మీద గౌరవంతో మీరు తీసుకోవాలి. మా నాన్నగారు ఇంత డిప్రెషన్‌లో వున్నారని నాకేమాత్రం తెలీదు. వచ్చే రెండు సంవత్సరాల వరకూ నేను కాలేజీ లోనే వుంటాను. ఇక్కడ మీరే అన్నీ చూసుకోవాలి. మా నాన్న గారికి ఆఖరి రోజుల్లో మీరు చేసిన సహాయం నేనెప్పటికీ మరువను” అని చెప్పి మనోజ్ రెండు చేతులూ కళ్ళకద్దుకుంది షర్మిల.

కళ్ళలో నీరు తిరుగుతుండగా రావు పటానికేసి చూసి చేతులు జోడించాడు మనోజ్. అక్కడ ఆయన నవ్వుతూ చూస్తున్నాడు.

***

రావ్ కేసు ఫైల్ చేతిలో పట్టుకుని అన్ని పేజీలు వెనక ముందు తిరగేసి, దాన్ని టేబుల్ మీద పడేసాడు ఇన్‌స్పెక్టర్ రాజేష్.

“ఇంతకీ నీకేం అర్థమయ్యింది ఇందులో” అన్నాడు గౌతమ్

“అన్నీ పూర్తిగా ఆలోచిస్తే.. ఇది ఖచ్చితంగా ఆత్మహత్యే అని తెలుస్తోంది. భార్యతో విక్టర్ కున్న ప్రేమాయణం రావ్‌కు తెలిసి పోయింది, దాంతో నిరాశకు గురయిన రావ్ తాగుడుకు బానిస అయిపోయాడు. ఆవిడ చేస్తున్న పనులు చూసి, వీలునామా రాసి ఆవిడకు ఏ ఆస్తి.. డబ్బులివ్వకూడదని వీలునామా రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. కార్ కొండ ప్రాంతానికి తీసుకెళ్లి సైనైడ్ తిని కారును కిందకు దూకించాడు. రెండూ ఒకేసారి చేయటంతో చావు నుండీ తప్పించుకోకూడదని చేసిన ప్రయత్నం అది. ఆ సమయంలో భార్య ఇంట్లోనే ఉందని తేలింది. కాబట్టి ఆమె పాత్ర ఇందులో లేదు. ఇక పోతే విక్టర్ ఎటెళ్ళాడో తెలీటం లేదు. రావ్‍తో దొరికిన శవాన్ని ఎవరూ గుర్తు పట్టలేదు. ఆ వ్యక్తి ఎవరో తెలీదు.

రెండు రోజుల ముందు రావ్ ఎటెళ్ళాడో కూడా తెలిసి రాలేదు. ఏది ఏమైనా ఇది ఖచ్చితంగా ఆత్మహత్యే. ఎస్టేట్‍లో పని వాళ్ళను, మనోజ్‌ను కూడా విచారించాను, అక్కడ కూడా అనుమానాస్పదమైన విషయాలు బయటకు రాలేదు.

ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం మరణం ఆ సమయంలోనే జరిగింది. కొన్ని గంటల సమయం ఇవ్వగలదు ఆ రిపోర్ట్, కానీ ఖచ్చితంగా ఇవ్వదు.” అని చెప్పటం ఆపాడు రాజేష్.

“మరేం చేద్దాం” అన్నాడు గౌతమ్

“ఏముంది.. ఆత్మహత్యే అని రాసి కేసు మూసేయటమే” అన్నాడు రాజేష్ కుర్చీలో వెనక్కి వాలి.

“సరే మూసేయండి. పెద్ద పాలసి ఉందట ఆ ఆఫీస్ వాళ్ళు తెగ తిరిగి పోతున్నారు. వాళ్లకి రిపోర్ట్ కూడా ఇచ్చేయి. కోట్లు మిగిలాయి ఆ ఇన్సూరెన్సు కంపెనీకి” అని చెప్పి ఆ ఫైల్‌ను రాజేష్ ముందుకి తోసి, సిగరెట్ నోట్లో పెట్టుకుని లైటర్‌తో అంటించుకుని

“అర్జెంటుగా మాంచి వేడి వేడి చాయ్ తెప్పించు” అని సిగరెట్ పొగను లోపలి పీల్చాడు గౌతమ్.

(సమాప్తం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here