కాజాల్లాంటి బాజాలు-121: హజ్బెండ్స్ డే కేర్..

8
3

[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

[dropcap]ఈ[/dropcap] వదిన బుర్రలో ఏమేం కొత్త ఆలోచనలు పుడతాయో కానీ అవన్నీ చెపుతూ మధ్య నన్ను బలిచేసేస్తూంటుంది. ఇదిగో ఇవాళ ఈ కొత్త ఆలోచనతో నాముందు కొచ్చింది. సాయంత్రమైపోయిందీ, ఇవాళంతా వదినతో మాట్లాడలేదూ.. హేవిటో తోచకుండా ఉందీ.. పోనీ ఒకసారి ఫోన్ చేద్దామా అనుకున్నదాన్ని మళ్ళీ నేనే మానేసేను. ఓ రోజు ఈ వదినతో మాట్లాడకపోతేనే నయం.. కాస్త మనసు తేలికపడుతుందీ.. ఎంచక్కా ఓటీటీ లో కొత్త సినిమా ఏదైనా చూద్దాం అనుకున్నాను. కానీ సినిమా మీద దృష్టి నిలవటం లేదే.. ఇంక లాభం లేదూ.. ఒక్కసారి వదినకి హలో చెప్పేస్తే కానీ మనసూరుకోదూ.. అనుకుని ఫోన్ అందుకోబోతుంటే వదిన దగ్గర్నుంచే వచ్చింది ఫోన్..

వెంటనే ఎత్తేను. నేనింకా హలో అనకముందే వదిన అందుకుంది..

“స్వర్ణా, నీ దగ్గర ఓ లక్ష ఉందా!” అంటూ.

అంత అర్జంటుగా వదినకి లక్ష అవసరమేమొచ్చిందా అనుకుంటూ..

“ఆమాత్రం అన్నయ్య దగ్గరుండదా వదినా.. నా దాకా ఎందుకూ!” అన్నాను.

“మీ అన్నయ్యకి తెలీకుండా చెయ్యాలీ పని. తెలిస్తే తొంభై అడ్లు పెడతారు. అందుకే నిన్నడుగుతున్నాను. నా దగ్గర ఓ లక్ష ఉందనుకో.. నీదగ్గర కూడా ఓ లక్ష ఉంటే మనం ఈ బిజినెస్ మొదలు పెట్టెయ్యొచ్చు..”

మళ్ళీ ఏదో కొంపమీదకి తెచ్చినట్టుంది అనుకుంటూ “ఏ బిజినెస్ వదినా!” అన్నాను.

“జరిగిందంతా చెప్తేకానీ నీకు అర్ధమవదు, మొన్న మనం పెళ్ళి నుంచి వస్తూ అనుకోలేదూ!”

నా కళ్ళముందు సీన్సన్నీ రింగులు రింగులుగా తిరుగుతూ, మొన్న మేము వెళ్ళిన పెళ్ళి దగ్గర ఆగిపోయాయి.

మామూలుగానే ఆడవాళ్ళందరం ఒక గుంపుగా చేరి కబుర్లలో పడిపోయాం. ఇంతలో “రాజీ” అంటూ పిలిచేడు రాజీ వాళ్ళాయన. టపుక్కున లేచి, చటుక్కున ఆయన ముందు నిలబడింది రాజీ.. ఏమన్నాడో ఏమో గానీ చిన్నబుచ్చుకున్న మొహంతో తిరిగివస్తూ, మళ్ళీ మేం కనిపెట్టేస్తామేమోనని రాని నవ్వుని పెదాల మీదకి తెచ్చుకుంటూ వచ్చి కూర్చుంది.

“ఏం కావాలిటే మీ ఆయనకీ..” రాజీ వాళ్లక్క అడగనే అడిగింది.

“ఏం లేదు.. ఏం లేదు.. సుముహూర్తం అవగానే వెళ్ళిపోదామంటున్నారు.. ఎవరో వస్తామని ఫోన్ చేసారుట..” అంది తడబడుతూ.

“ఇదేవిటే మీ ఆయనా.. ఎవర్నీ ఇంటికి రానీడూ.. తనెవరింటీకీ రాడూ.. ఇలా పొట్లపాదులాంటివాడేంటే!” విసుక్కుంది రాజీ వాళ్ళక్క.

ఏం మాట్లాడలేదు రాజీ. కవిత అందుకుంది..

“కొంతమందంతే.. వాళ్ళు కొత్తవాళ్లతో మాట్లాడలేరు. అదే ఆడవాళ్లమైతేనా.. మొగుడి ఫ్రెండ్ ఇంటికి అప్పుడే వెళ్ళినా సరే వాళ్ళావిడతో కలిసిపోయి, వంటింట్లోకి కూడా వెళ్ళి బోల్డు కబుర్లు చెప్పేసుకుంటారు.. మగవాళ్ళు అలా కలవరు.”

సరస్వతి అందుకుంది.. “మొన్నేమైందో తెల్సా! పండక్కి చీరలు కొనుక్కుందామని షాప్‌కి వెళ్ళేనా.. వెళ్ళిన పదినిమిషాల్నించీ ఇంకా ఎంతసేపంటూ గొడవే.. అసలు ఇంటి దగ్గరే ఇన్‌స్రక్షన్స్.. ఏం కొంటావో, ఎంతలో కొంటావో ఇక్కడే ఆలోచించుకో.. అవే చూపెట్టమనూ.. కావల్సింది తీసుకో.. అంటూ. అసలు షాప్‌కి వెళ్ళేక అలా ఎలా వచ్చేస్తాం.. కొత్తరకాలు ఏవొచ్చేయో చూడొద్దూ!”

వందన మొదలెట్టింది.. “వెళ్ళక వెళ్ళక ఎన్నో ఏళ్ళకి పాత ఫ్రెండ్స్ కలుస్తున్నారంటే సరదాగా వెళ్ళేను. అక్కడికీ తెల్లారకట్లే లేచి అన్నీ వండి పెట్టే వెళ్ళేను. ఇంక పన్నెండయిందగ్గర్నించీ ‘ఇంకా బయల్దేరలేదా’ అంటూ ఇంటి దగ్గర్నించి ఫోనూ. ఒళ్ళు మండిపోయిందనుకో. ఇంకిలా లాభంలేదని, ఫోన్ని సైలంట్ మోడ్‌లో పెట్టేసి హాండ్ బాగ్‌లో అడుక్కి పడేసేను. నాలుగు దాటాక ఇంటికెళ్ళేదారిలో ఫోన్ తీసి చూస్తే ఈయన దగ్గర్నించి ఏకంగా ఫది మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఒక్కపూట మనం బయట కెళ్ళాలంటే ఎన్ని తట్టుకోవాలో అనిపించింది.”

పార్వతక్కయ్య అందుకుంది.. “పాపం.. మొగాళ్ళనలా ఆడిపోసుకోకండర్రా.. వాళ్ళు అంత తొందరగా కొత్తవాళ్లతో కలవలేరు.”

రాజీ అక్క ఊరుకోలేదు. “వాళ్ళు కలవకపోతే సరే.. పోనీ అతను మా రాజీనైనా కాస్త బైటకి పంపొచ్చుకదా! హబ్బే.. ఇది బైటకెడితే అతనికి తోచదుట.. ఉట్టిదే.. అవన్నీ పై పై కబుర్లే.. ఇది బైటకెడితే అతనికి ఆరారగా టీలు ఎవరు అందిస్తారూ!”

వందన ఊరుకోలేదు. “మొగాళ్లందరూ అలా ఉండరు. కొంతమంది మొగుళ్ళు పెళ్ళాలని ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసికెడతారు. అక్కడ అందరితో కలిసిపోయి సరదాగా ఉంటారు. మా ఖర్మకొద్దీ మాకిలాంటి మూగిమొగుళ్ళు దొరికేరు. వాళ్ళు మాట్లాడరూ.. మమ్మల్ని మాట్లాడనివ్వరూ..”

పార్వతక్కయ్య మళ్ళీ మొగవాళ్ళని వెనకేసుకొచ్చింది. “పాపం.. వాళ్లకి ఒక్కళ్ళకీ ఇంట్లో తోచదేమో. అందుకే భార్యల వెనకాలే ఉంటారు.”

వందన అందుకుంది.. “అది నిజవే పార్వతక్కోయ్.. మా ఆయన రిటైర్ అయ్యేవరకూ నాకు తెలీలేదు. పొద్దున్న పోయి సాయంత్రం వచ్చేవారు. రిటైరయి ఇంట్లో కూర్చోడం మొదలెట్టేక ఎన్నెన్ని ఆరాలనుకున్నావూ.. ‘అన్నం ఎందుకంత మిగిలిపోయిందీ.. పనిచేసే ఆమెకి అన్ని డబ్బులెందుకూ.. ఇన్ని చీరలు డ్రైక్లీనింగ్‌కి వెయ్యాలా.. మొన్నటి మజ్జిగ ఏం చేసేవూ’ అంటూ ప్రతి చిన్నదానికీ సంజాయిషీ అడుగుతుంటే ఎంత విసుగ్గా ఉంటోందో..”

“అసలు రిటైరయ్యేక మగాళ్ళకి కాలక్షేపం లేక ఇలా తయారౌతున్నారేమో..” సందేహం వెలిబుచ్చింది పారిజాతం.

సరస్వతి ఆలోచిస్తున్నట్టు అంది.. “అసలు ఈ రిటైరయినవాళ్లకి కాలక్షేపం లేక ఇలా పెళ్ళాల్ని పట్టుకుని వేళ్ళాడుతున్నారేమో.. వాళ్లకంటూ ఏదో వ్యాపకం ఉంటే బాగుండును..”

వందన సరదాగా నవ్వుతూ, “అసలు వీళ్ళకి చిన్నపిల్లలని పెట్టినట్టు డే కేర్‌లో పెట్టేస్తే మనం హాయిగా ఉండొచ్చు. లంచ్ బాక్స్ పుచ్చుకుని పొద్దున్న పోతే సాయంత్రం వస్తారు. వాళ్లకీ హాయి.. మనకీ హాయి..”

అంతా అలా విసిగించే మొగుళ్ళమీద రకరకాల అభిప్రాయాలు వెళ్ళబోసేసుకుని ఇళ్ళకి వచ్చేసేం. తర్వాత నేనా మాటే మర్చిపోయేను. వదిన గుర్తు చేస్తే ఆ మాటలన్నీ మళ్ళీ ఇప్పుడు గుర్తొచ్చేయి..

వదిన ఫోన్ లో మళ్ళీ మాట్లాడడం మొదలుపెట్టింది.

“స్వర్ణా, పెళ్ళిలో అందరూ అనుకున్నది వింటూంటే నాకో ఆలోచన వచ్చింది..”

“ఏంటి వదినా.”

“మనకి తెలిసినవాళ్ళే, మనవాళ్ళలోనే సీనియర్ సిటిజన్స్ చాలామంది ఉన్నారు. కొంతమంది వాళ్లంతట వాళ్ళు ఏవో కాలక్షేపాలు కల్పించుకున్నా చాలామంది ఇలాగే భార్యల్ని సతాయిస్తున్నారు.. అఫ్కోర్స్.. వాళ్ళు అలా అనుకోవట్లేదనుకో.. కానీ అటు మగవాళ్లకీ, ఇటు ఆడవాళ్లకీ కూడా సుఖంగా అనిపించేలా మనం ఒక ‘హజ్బెండ్’స్ డే కేర్’ పెడితే ఎలా ఉంటుందంటావ్!”

“హేంటీ..!”

నా కళ్ళు పెద్దవయాయి.

“అంత ఆశ్చర్యం ఎందుకూ! విదేశాల్లో కొన్నిచోట్ల ఇలాంటివి ఉన్నట్టు విన్నాను. ఎందుకూ.. గూగుల్ సెర్చ్ చేస్తే తెల్సిపోతుంది.” వదిన ఉత్సాహంగా చెప్పుకుపోతోంది.

“ఇప్పటికే సిటీలో సీనియర్ సిటిజెన్స్ క్లబ్‌లు ఉన్నాయి వదినా..”

“అవి వేరు. అవి వాళ్ళు ఇష్టంగా వెళ్ళి అందులో చేరి, వాళ్లకి కావల్సిన పేకాట కానీ, చెస్ కానీ, క్యారమ్స్ కానీ ఆడుకుంటూ, పత్రికలు చదువుకుంటూ కాలక్షేపం చేసుకునేవాళ్లకి. కానీ ఇప్పుడు మనం చెప్పుకునేది.. అలా ఏం చెయ్యాలో తెలీనివాళ్లకి.. ఇలాంటివాళ్లని పిల్లలని స్కూల్‌కి పంపినట్టే పొద్దున్నే రెడీ చేసేసి, లంచ్ బాక్స్ ఇచ్చేసి, ఆటో ఎక్కించేసి ఆ కేర్ సెంటర్‌కి పంపించేస్తే ఆ సెంటర్ వాళ్ళే సాయంత్రం దాకా వాళ్ళని ఎంగేజ్ చేసి, ఆటో రాగానే ఎక్కించేసి ఇంటికి పంపేస్తారు.”

నర్సరీక్లాస్ పిల్లల్నీ, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి ప్రపంచమంతా తెలిసిన ఈ సీనియర్ సిటిజన్స్‌నీ ఒకే రాటకి కట్టేసి మాట్లాడుతున్న మా వదినకి ఏం చెప్పాలో నాకర్థం కాలేదు.

నా మౌనం అంగీకారంగా తీసుకున్న వదిన ఇంక విజృంభించేసింది.

“ప్రస్తుతం మనకి తెలిసిన రెండుమూడు లొకాలిటీల్లో మొదలుపెడదాం. ప్రస్తుతానికి టూ బెడ్రూమ్ అపార్ట్మెంట్ చాలు.. ముందు ముందు బిజినెస్ పెరిగేక ఒక ఫ్లోర్ మొత్తం తీసుకుందాం.. చిన్నపిల్లల కయితే ఆయాలని పెట్టాలి. కానీ వీళ్ళకి అలాకాదు. కాస్త పెద్ద వయసున్న మగవాళ్లని కేర్ టేకర్లుగా చూడాలి. రెగ్యులర్ చెకప్‌కి డాక్టర్‌ని ఒకళ్ళని మాట్లాడుకోవాలి. ఒక్కోదాంట్లోనూ పేక, క్యారమ్ బోర్డూ, చెస్ బోర్డూ లాంటివి పెట్టాలి. ఒక మ్యూజిక్ టీచర్ నీ, ఒక డ్రాయింగ్ టీచర్‌నీ చూడాలి..”

“వాళ్ళెందు కొదినా.. ఈ వయసులో వీళ్ళు మాటలే సరిగ్గా మాట్లాడుకోరే…ఇంక పాటలేం పాడతారూ!”

నాకు తెలీకుండానే వదిన మాటల్లో మునిగిపోయిన నేను అప్రయత్నంగానే అడిగేసేను.

వదిన నన్ను క్షమించి నవ్వినట్టు ఓ నవ్వు నవ్వింది.

“పిచ్చి స్వర్ణా.. పాపం వీళ్ళకి మటుకు ఆశలూ కోరికలూ ఉండి ఉండవూ.. చిన్నప్పుడు పాట మీద ఎంతిష్టం ఉన్నా.. బొమ్మలు గియ్యాలని ఎన్ని కలలు కన్నా, పాపం ఇన్నాళ్ళూ వాళ్ల జీవితమంతా చదువుకీ, ఉద్యోగానికే ఖర్చు పెట్టేసేరు కదా.. ఇప్పుడైనా మనం వాళ్ల కోరికని తీర్చాలి కదా!. అక్కడ అన్నీ అందుబాటులో ఉంటే ఏది కావాలంటే అది నేర్చుకుంటారు..”

నాకేవిటో అంతా గందరగోళంగా అనిపించింది. వదిన చెప్తూనే ఉంది..

“ప్రస్తుతం మీ లొకాలిటీలోనూ, మా లొకాలిటీ లోనూ మొదలెడదాం. మీ దగ్గర నువ్వు చూస్తూండు.. మా దగ్గర నేను చూస్తాను. తర్వాత డిమాండ్‌ని బట్టి సిటీలో ఎక్కడ కావాలంటే అక్కడ బ్రాంచీలు తెరిచేద్దాం..”

వదిన చెపుతున్న మాటలు నాకు అస్సలు అర్థం కావటంలేదు. పెద్ద పెద్ద ఉద్యోగాలు బాధ్యతగా చేసి, ఇంటి బాధ్యతలన్నీ సక్రమంగా నిర్వర్తించి, హమ్మయ్య అనుకుని వాళ్ళింట్లో వాళ్ళు కాలు మీద కాలు వేసుకుని కూర్చున్న ఈ సీనియర్ సిటిజన్స్ వల్ల ఈ వదినకి ఏమి కష్టం వచ్చిందో నాకు అర్థం కాలేదు. అదే మాట అడిగేను వదిన్ని..

“అందరూ మీ అయన్లా ఉండరమ్మా.. మీ అన్నయ్యలా కూడా కొందరుంటారు. ఇవన్నీ మీ అన్నయ్యలాంటి వాళ్ల కనుకో..” అంది వదిన నా మాటలకి నిష్ఠూరంగా.

“అంటే అన్నయ్యని కూడా ఇందులో చేర్చేస్తావా!” గాభరాగా అడిగేను.

“మరీ.. దాని పేరే హజ్బెండ్స్ డే కేర్ కదా..!” అంటూ నవ్వుతూ ఫోన్ పెట్టేసింది వదిన.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here