సిరి ముచ్చట్లు-5

    1
    4

    [box type=’note’ fontsize=’16’] బాల్యంలోని అమాయకత్వాన్ని, అందాన్ని గుర్తు చేసి మధురస్మృతులకు మళ్ళించే చల్లా సరోజినీదేవి కబుర్లుసిరి ముచ్చట్లు” సిరీస్‌లో అయిదవ ముచ్చట. [/box]

    [dropcap]ఒ[/dropcap]కసారి సిరి క్లాస్‌లో చదివే అబ్బాయిల మధ్యన ఏదో గొడవైంది. ఆ గొడవలో ఒకబ్బాయికి కాస్త గట్టి దెబ్బలే తగిలాయి. అది బడి వదిలేసిన సమయం. అందుకని ఉపాధ్యాయులకెవరికీ విషయం తెలీదు. దెబ్బలు తిన్న అబ్బాయి  ఏడుస్తూ ఇంటికెళ్తుంటే చూసిన సిరికి చాలా జాలేసింది. “అయ్యో పాపం, రేపు క్లాస్ టీచర్‌కి చెప్పాలి ఎలాగైనా” అనుకొంది. ఇంటికెళ్ళాకా కూడా సిరికి ఆ అబ్బాయే గుర్తొచ్చాడు. మరోసారి ‘పాపం’ అనుకొంది. అప్పుడు సిరి ఏడో క్లాసు చదువుతోంది. చదువులో చాలా తెలివితేటలున్నప్పటికీ సిరి ఒక్కోసారి చాలా అమాయకురాలే.

    మరునాడు ఆ అబ్బాయి అమ్మమ్మ కూడా బడికి వచ్చింది. తన మనవడిని ఎవరు కొట్టారని నిలదీసింది. “టీచర్లంతా ఏం చేస్తున్నారు? పిల్లాడినంతలా కొడుతుంటే చోద్యం చూస్తున్నారా? ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పంతుళ్ళకు లేదా? మీ మీద నమ్మకంతోనే గదా పిల్లలని రోజంతా మీ దగ్గర వదిలేది?” అని అందరినీ హడలగొట్టిందామె. ఆ అబ్బాయికి బుగ్గలు వాచి, కుడి కన్ను దగ్గర కొంచెం కమిలింది కూడా. అందుకే ఎవ్వరూ ఆమె ధాటిని ఎదిరించలేకపోయారు. చాలాసేపు ఆమె అటుపిల్లలపైనా ఇటు టీచర్లపైనా అరిచి అరిచి బాగా అలసిపోయింది. చివరగా, “వాడసలే నోట్లో నాలుక లేనోడు. అలాంటివాడిని ఒక్కడిని చేసి అంతలా కొడ్తారా, తప్పుగాదూ?” అన్నది. తరగతి ఉపాధ్యాయుడు ఆమెకెంతగానో క్షమార్పణ చెప్పి మరోసారి ఇలాగ జరగనివ్వనని హామీ ఇచ్చాకా ఆమె కొంచెం శాంతించింది. మనుమడికి జాగ్రత్తలు చెప్పి, మిగిలిన అబ్బాయిలను హెచ్చరించి మరీ వెళ్ళిపోయింది. అంతా సద్దుమణిగింది.

    ఇంటర్‌వెల్ అయింది. తరగతిలో నుండి పిల్లలంతా బయటికెళ్ళారు. ఆ అబ్బాయి ఒక్కడే కూర్చుని ఏదో వ్రాసుకొంటున్నాడు. మెల్లగా ఆ అబ్బాయి దగ్గరకెళ్ళింది సిరి. ‘ఏంటి’ అన్నట్లుగా చూశాడా అబ్బాయి. “ఇందాక మీ అమ్మమ్మ నీకు నోట్లో నాలుక లేదన్నది కదా? అలాగ కూడా వుంటారని నాకు తెలియదు. ఒకసారి చూడ్దామనీ!” అన్నది సిరి. ఆమె అమాయకత్వానికి పక్కున నవ్వేశాడా అబ్బాయి.

    “నాకు నాలుకెందుకు లేదు? ఇదిగో చూడు” అంటూ నాలుక చాపి మరీ చూపించాడు. వింతగా చూస్తున్న సిరిని చూసి మళ్ళీ నవ్వుతూ, “నోట్లో నాలుక లేకపోతే మాటలెలా వస్తాయి అమ్మాయి?” అన్నాడు.

    ఆలోచనలో పడింది సిరి. అప్పుడే అటుగా వచ్చిన తెలుగు మాస్టారు రామచంద్రరావు ఆ అబ్బయి ద్వారా విషయం తెలుసుకొని, తానూ నవ్వేసాడు.

    “నీలాంటి వాళ్ళనే నోట్లో నాలుక లేని వాళ్ళంటారు సిరీ” అన్నారాయన.  సిగ్గుపడింది సిరి చందన.

    (మళ్ళీ కలుద్దాం)

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here