కొరియానం – A Journey Through Korean Cinema-53

2
3

శారదనీరదేందు

Chapter 46

[dropcap]కొ[/dropcap]రియన్లు చదువుకు మంచి ప్రాధాన్యతనిస్తారు. అచ్చు మనలాగనే.

చదవటం, రాయటం, సాధారణ అక్షరాస్యత, గణిత-విజ్ఞాన శాస్త్రాలలో దక్షిణ కొరియా అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న OECD దేశాలలో ఒకటిగా నిలుస్తోంది కనీసం మూడు దశాబ్దాలుగా. కొరియన్ విద్యావిధానం, విద్యానంతర అభివృద్ధిలో ప్రపంచంలో తొమ్మిదవ స్థానంలో ఉంది. OECD దేశాలలో ప్రపంచంలోని అత్యధిక విద్యావంతులైన కార్మిక శ్రేణులు కలిగిన దేశాల్లో కొరియా ఒకటి.

దక్షిణ కొరియా సాంకేతిక విద్యలో అత్యున్నత ప్రమాణాలకు ప్రసిద్ధి చెందింది. విద్య నేర్చుకోవటంలో వీరెంత శ్రద్ధ చూపిస్తారంటే, ఒకానొక విధంగా చెప్పాలంటే ఒక సాధారణ హైస్కూల్ విద్యార్థి తన చివరి విద్యా సంవత్సరంలోవారానికి కనీసం 100 నుంచి 125 గంటలు స్కూలు లేదా ట్యూషన్లలో గడుపుతారు. ప్రముఖ కాలేజీలలో సీట్ తెచ్చుకునేందుకు. Koreans suffer from Education Fever అనేది వారి గురించి నానుడి.

నాకు పరిచయం ఉన్న ఒక అమెరికన్ మిత్రుడు వృత్తి రీత్యా దక్షిణ కొరియా రాజధాని సోల్ నగరంలో స్థిరపడ్డాడు. ఒక కొరియన్ మహిళను వివాహం చేసుకున్నాడు. అక్కడి విద్యా విధానం, వారి obsession చూసి తన ఇద్దరు కొడుకులనూ, చదువుకునే వయసు రాగానే అమెరికాలో తన తల్లిదండ్రుల వద్దకు పంపాడు. ఈ ఒత్తిడి భరించలేరని. ప్రపంచ సాంకేతిక విద్యావ్యవస్థలలో ఈ దేశం గత మూడు దశాబ్దాలుగా స్థిరంగా అగ్రస్థానంలో ఉంది. ఎలాంటి అత్యాధునిక టెక్నాలజీ అయినా దక్షిణ కొరియాలో మొదట పరీక్షింపబడాల్సిందే.

దక్షిణ కొరియా సమాజంలో ఉన్నత విద్య అనేది చాలా సీరియస్‌గా స్వీకరించే విషయం. విద్య అనేది జీవితపు ప్రాథమిక పునాదులలో ఒకటిగా భావింపబడుతుంది. దక్షిణ కొరియా సమాజంలో ఒకరి సామాజిక ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి విద్యలో విజయం చాలా కీలకం. కాబట్టి, దక్షిణ కొరియా కుటుంబాలు ఉన్నత విద్యకు అధిక ప్రాధాన్యత నిస్తాయి.

విద్యా విషైక విజయం తరచుగా కుటుంబాలకు మరియు దక్షిణ కొరియా సమాజానికి గర్వకారణంగా ఉంటుంది. దక్షిణ కొరియన్లు విద్యను తమకు మరియు వారి కుటుంబానికి సామాజిక నిచ్చెనలో ఒక గొప్ప ప్రొపెల్లర్‌గా, దక్షిణ కొరియా మధ్యతరగతికి ఉన్నత కుటుంబాలుగా మారటానికి ఒక గేట్వేగా భావిస్తారు.

అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాల నుండి గ్రాడ్యుయేట్ అవటం అనేది అత్యంత ప్రతిష్ఠాత్మక విషయం ఆ దేశంలో. మాంఛి వైట్ కాలర్ కెరియర్లు కావాలన్నా, వివాహాల్లో ఉన్నత కుటుంబాల సాంగత్యం ఏర్పడాలన్నా, విద్యే మార్గమని చాలా మంది దక్షిణ కొరియా తల్లిదండ్రులు భావిస్తారు. పిల్లల కోసం ఎంత త్యాగం అయినా చేసి బాగా చదివించాలని తపిస్తారు.

దేశంలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన విశ్వవిద్యాలయాలలో అర్హత సాధించడానికి, నమోదు చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండటానికి వారి పిల్లలు పాఠశాలలో ఉన్నత గ్రేడ్లు పొందేలా చేయడం ద్వారా వారి పిల్లల విద్యను చురుకుగా పర్యవేక్షిస్తారు. కుటుంబ గౌరవం మరియు స్టేటస్‌ను నిలబెట్టడానికి, చాలా మంది దక్షిణ కొరియా పిల్లలు విశ్వవిద్యాలయానికి వెళ్లాలని మరియు వారి భవిష్యత్ కెరీర్ ఎంపికగా ప్రతిష్టాత్మకమైన వైట్ కాలర్ వృత్తిని స్వీకరించగలగాలని భావిస్తున్నారు.

సగటు దక్షిణ కొరియా పిల్లల జీవితం విద్య చుట్టూ తిరుగుతుంది, ఎందుకంటే విద్యాపరంగా విజయం సాధించాలనే తల్లిదండ్రుల డిమాండ్ దక్షిణ కొరియన్లలో చిన్నప్పటి నుండి లోతుగా పాతుకుపోయింది. విద్యార్థులు తమ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సహచరులు మరియు సమాజం నుండి విద్యాపరంగా విజయం సాధించడానికి విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటారు.

అధికారిక విశ్వవిద్యాలయ విద్య లేని వారు తరచుగా సామాజికంగా చిన్నచూపుకు గురవుతారు. కానీ, విశేషమేమిటంటే ఇక్కడ అన్ని దేశాల మాదిరిగానే డబ్బు ప్రాధాన్యం వహించినా, ఉన్నత విద్యావంతుల మీద సమాజంలో గొప్పగా గౌరవాదరాలు కనబరుస్తారు. కొరియన్ సినిమాలో అతి పెద్ద superstar మన Oldboy చోయ్ మిన్-సిక్ అయినా, అతనికన్నా ముందు ఆ స్థాయి దక్కించుకుని ఈమధ్య సక్సెస్ బాటలో వెనక బడిన, Hun Suk-kyu కు కొరియన్ సమాజంలో చోయ్ మిన్-సిక్ తో సమానమైన సెలబ్రిటీ స్టేటస్ ఉండటానికి కారణం అతను ఉన్నత విద్యావంతుడు కావటమే.

Most middle school students take seven lessons a day, and in addition to this usually have an early morning session that precedes regular lessons. They also have an eighth lesson specialising in an extra subject to finish the day. This, they think, will help in differentiating highly meritorious students from the others.

కొరియన్, ఇంగ్లీష్, ఆల్జీబ్రా, జ్యామెట్రీ, ఇండస్ట్రియల్ డిజైనింగ్, ఆర్కిటెక్చర్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్, మ్యూజిక్, థియేటర్ ఆర్ట్స్, సినిమా. ఇవీ ప్రస్తుతం ఎక్కువ మంది తీసుకునే సబ్జక్టులు, రాణించాలనుకునే రంగాలు. స్కూల్ లెవెల్ లోనే ఈ విషయాలకు సంబంధించిన బేసిక్స్ ఉంటాయి.

మనవైపు సెంట్రల్ సిలబస్ కన్నా స్టేట్ సిలబస్ కష్టతరంగా, high standards తో ఉండేది ఒక దశాబ్దం క్రితం. Now, it is getting watered down but the pressure is increasing on the students. కానీ, మనకన్నా, కొరియన్లు మేథమేటిక్స్‌కు ఎంత ప్రాధాన్యత ఇస్తారంటే మనవైపు ఒక 12వ తరగతి విద్యార్థి నేర్చుకునే దానికన్నా, అక్కడి పదవ తరగతి విద్యార్థులు నేర్చుకునే సబ్జక్ట్ ఎక్కువగా ఉంటుంది.

అలా పెద్ద స్థాయి విశ్వ విద్యాలయాలలో సీటు కోసం ప్రయత్నాలు ఫలించాలంటే, పిల్లలు చదవాల్సిన స్కూళ్ళు కూడా ఆ స్థాయిలోనే ఉండాలి.

అలాంటి ఒక స్కూల్ (Prestigious private school) లో విద్యార్థే మన Han Ji-woo. తండ్రి లేని అతనిని సోషల్ వెల్ఫేర్ సహాయంతో, రెక్కలు ముక్కలు చేసుకుని మరీ చదివిస్తుంటుంది అతని తల్లి మాల్-గ్యుమ్. కానీ, అన్ని సబ్జక్టులలో బాగనే రాణించే జి-వూ, మేథమేటిక్స్‌లో మాత్రం వెనుకబడతాడు.

అతను కలలు గంటున్న యూనివర్సిటీలో సీట్ రావాలంటే తన గణిత శాస్త్ర పరిఙ్ఞానాన్ని మెరుగులు దిద్దుతోవాలి. పైగా ఇప్పుడు చదువుతున్న పెద్ద స్కూల్‌లో చదువు కొనసాగించాలంటే మేథమేటిక్స్‌లో ఇతనికి వస్తున్న గ్రేడ్స్ చాలవు. ఈసారి పరీక్షలలో సరైన మార్కులు రాకపోతే అతన్ని స్కూలు నుంచీ expel చేయాల్సి ఉంటుందని, గవర్నమెంటు స్కూలులో చదవాలి అని అతని మేథమేటిక్స్ టీచర్ ప్రొఫెసర్ కిమ్ హెచ్చరిస్తాడు.

ఈ జి-వూ పాత్రలో కిమ్ డాంగ్-వి (Kim Dong-hwi) మెరిశాడు. ఇంతకు మునుపు non-starring roles లో అగుపించిన కిమ్ డాంగ్-వి కి ఈ సినిమాలో చోయ్ మిన్-సిక్ తో తెరను పంచుకోవటమే కాదు, దాదాపు సమానమైన స్క్రీన్ టైమ్ ఉన్న పాత్ర దక్కటం విశేషం. కానీ, చోయ్ లాంటి లెజండ్ ముందు నిబ్బరంగా నిలబడగలిగాడు.

Lee Hak-syeong ఈ హాక్-స్యుంగ్ ఉత్తర కొరియాలో పుట్టి పెరిగిన మేథ్స్ జీనియస్. అక్కడి oppressive వ్యవస్థను తప్పించుకునేందుకు దక్షిణ కొరియా వస్తాడు. కారణాలు తెలియవు కానీ, అతను ఒక ప్రముఖ స్కూలులో నైట్ వాచ్మన్‌గా పనిచేస్తుంటాడు. దేశంలోనే అత్యంత ప్రతిభావంతులైన మొదటి 1% విద్యార్థులు ఆ స్కూల్‌లో చదువుతుంటారు. ఎవరితో కలవకుండా, చాలా సీరియస్‌గా ఎప్పుడూ ఏదో ఆలోచనలో ఉన్నట్లు కనిపించే ఈ హాక్-స్యుంగ్‌కు ఎదురుపడటానికి కూడా విద్యార్థులు భయపడుతుంటారు.

ఈ హాక్-స్యుంగ్ అంటే జి-వూ కు ఎందుకో చెప్పలేని fascination. కారణం మాత్రం తెలియదు. అదే సమయంలో అతనంటే తెలియని బెదురు. ఈ హాక్-స్యుంగ్‌ను ఆ స్కూల్ పిల్లలు కామీ ఆఫీసర్ (commie officer) అని పిలుస్తుంటారు. ఎందుకు? అతను ఉత్తర కొరియా నుంచీ వలస వచ్చిన మనిషి కనుక. ఎన్నో చోట్ల ప్రయత్నాలు చేసి చివరికి ఈ స్కూలులో సెటిల్ అయ్యాడు.

ఒకరోజు జి-వూ ను తన స్కూల్మేట్స్ ఆల్కహాల్ తెమ్మనమని అడుగుతారు (థాంక్ గాడ్! మన తెలుగూఫుల్లా డ్రగ్స్ గురించి ఆలోచన లేనట్లుంది). తీసుకుని వచ్చే సమయంలో మనోడిని ఈ హాక్-స్యుంగ్ పట్టుకుంటాడు. తర్వాత రోజు స్కూల్ లో మేథమేటిక్స్ ప్రొఫెసర్ కిమ్ హాస్టల్ నుంచీ నెల రోజులు బైటకు గెంటుతాడు. అసలే వెల్ఫేర్ డబ్బుల మీదా, కిందా మీదా పడి తల్లి సంపాదించే డబ్బుతో చదూకుంటున్న జి-వూ కు ఇది పులి మీద పుట్ర లాంటి పరిస్థితి.

కాకపోతే తంతే బూరెల బుట్టలో పడ్డాడు అన్న చందాన ఇదీ అతనికి గొప్ప మేలు చేసింది. ఒకరోజు జి-వూ రాత్రిళ్ళు ఒక లేబ్ లో దొరుకుతాడు ఈ హాక్-స్యుంగ్‌కు. అప్పుడు అతని పరిస్థితి తెలుసుకుని, తన రూమ్‌కు తీసుకుని వెళతాడు. తెల్లవారే దాకా ఆశ్రయం ఇచ్చి ఆపైన బైటకు గెంటుతాడు. స్కూల్‌కు ఎటెండ్ అయిన జి-వూ తన హోమ్వర్క్ ను ఈ హాక్-స్యుంగ్ చేసాడని తెలుసుకుంటాడు. ప్రొఫెసర్ కిమ్ ఊహించని విధంగా మిగిలిన వారికన్నా జి-వూ నే బాగా ఆన్సర్ చేసి ఉంటాడు.

దాంతో, తను వెళ్ళి ఈ హాక్-స్యుంగ్ ను తనకు గణితం బోధించమని అడుగుతాడు. మొదట నాలుగైదు సార్లు గెంటేసి, తన జోలికి రావద్దంటాడు ఈ. కానీ, మిగిలిన విద్యార్థులు కిమ్ వద్దే ప్రైవేట్ క్లాసులు పెట్టుకున్నారని, జి-వూకు ఆ అవకాశం లేదని, ఒకవేళ పరీక్షలలో సరిగా చేయకపోతే అతన్ని ఈ స్కూల్ నుంచీ గవర్నమెంట్ స్కూల్‌కు పంపుతారని తెలుస్తుంది. జి-వూ తల్లి తన కొడుకు చదువుకుని, మంచి యూనివర్సటీలో మేధమేటిక్స్ ప్రొఫెసర్ అయితే తమ కష్టాలు తీరతాయని, సోషల్ స్టేటస్ పెరుగుతుందని ఆశపడుతుంటుంది.

ఇక మన Oldboy చోయ్ మిన్-సిక్ వేసిన ఈ హాక్-స్యుంగ్‌కు ఆరోగ్య సమస్యలుంటాయి. పగలు నిద్ర, రాత్రిళ్ళు కాపలా పని. నిద్ర పట్టక పగలు పూట నిద్ర మాత్రలు వాడటం వల్ల ఆరోగ్యం పాడవుతోందని, జాగ్రత్తలు తీసుకోవాలని చెపుతాడు డాక్టర్. ఈ హాక్-స్యుంగ్ దగ్గర ఒక తాబేలు ఉంటుంది. అప్పుడప్పుడూ దాన్ని చూస్తూ గడపటం ద్వారా ఒత్తిడి నుంచి దూరం అయ్యే ప్రయత్నం చేస్తుంటాడు. ఇలాంటి సందర్భంలో జి-వూ బాధ్యత తీసుకుంటాడు ఈ హాక్-స్యుంగ్.

ఇక్కడి దాకా సినిమా చూశాక నాకు కలిగిన ఫీలింగ్..

అంబ! నవాంబుజోజ్జ్వలకరాంబుజ! శారదచంద్రచంద్రికా
డంబరచారుమూర్తి! ప్రకటస్ఫుట భూషణ రత్నదీపికా
చుంబిత దిగ్విభాగ! శ్రుతిసూక్తవివిక్త నిజప్రభావ! భా
వాంబరవీథి విశ్రుతవిహారి! ననుం గృప జూడు భారతీ!

కవిత్రయంలో మూడవవాడైన ఎఱ్ఱన అత్యద్భుతమైన వినయశీలం గల మహాకవి. అతడు భారతీదేవిని పరమసుందరంగా ప్రార్థించిన పద్యం ఇది. మహాభారతంలో. ఎంత సుందరమైన పద్యం ఇదంటే.. పోతన అంతటి మహాకవి కూడా ఆ పద్యం సొగసుకు, అందానికి అబ్బురపడి, ఆనందపడి, అది తన భాగవత మహాకావ్యారంభంలో ప్రార్థనా శ్లోకంగా ఉండాలని కోరుకున్నాడు.

అమ్మా! భారతీ! అప్పుడప్పుడే వికసిస్తున్న పద్మపుకాంతులతో వెలిగిపోతున్న, పద్మంవంటి చేతితో అలరారుతున్నావు. శరత్కాలపు చందమామ వెన్నెలల జిలుగులవంటి మనోహరమైన ఆకృతితో మమ్ములను ఆహ్లాదపరుస్తున్నావు. నీవు ధరింపగా విస్పష్టంగా కానవస్తున్న నగలలోని రత్నాల కాంతులు దిక్కుల అంచులను సుకుమారంగా తాకుతున్నాయి. నీదయిన ప్రభావాన్ని వేదసూక్తాలు విస్పష్టంగా వివరించి మానవులకు జ్ఞానసంపదను హాయిగా అందిస్తున్నాయి. నీవు మా భావం అనే గగనవీధిలో నాదరూపంలో తెలియవస్తూ విహరిస్తూ ఉంటావు. నన్ను దయజూడు తల్లీ!

అని తాత్పర్యం.

ఒకవైపు గణిత శాస్త్ర సౌందర్యం, మరోవైపు సంగీత సౌరభం, మరోదిక్కున మానవ సంబంధాల ఔన్నత్యం ఆవిష్కరింపబడే ఈ సినిమాలో మిగిలిన కథ, విశ్లేషణ తరువాత చూద్దాం.

ఈలోగా.. ఎండాకాలం వచ్చేస్తోంది. కొత్త ఏసీలు కొన్నారా?

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here