[జోనరాజ విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన ద్వితీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]
స్వదేశే మంత్రిణోస్తస్య కోటభట్టోదయశ్రియోః।
సమరేషు భరస్త్యా సీచంద్రడామర లీలయోః॥
(జోనరాజ ద్వితీయ రాజతరంగిణి 402)
[dropcap]శ[/dropcap]హబుద్దీన్ పెద్ద సేనతో ఢిల్లీ సుల్తాన్‍తో తలపడ్డాడని జోనరాజు రాసినదాన్ని పర్షియన్ రచయితలు సమర్థించారు. ఎంత అశ్వదళంతో, ఎంత కాల్బలంతో ఢిల్లీపై శహబుద్దీన్ దాడి చేశాడో కూడా వీరు రాశారు. ఢిల్లీ సుల్తాన్ ఫిరోజ్ తుగ్లక్ సామ్రాజ్యంపై 50,000 అశ్వదళం, 50,000 కాల్బలంతో శహబుద్దీన్ దాడి చేశాడని పర్షియన్ రచయితలు రాశారు. సట్లెజ్ (శతద్రు) నదీ తీరాన ఢిల్లీ సేనలు, కశ్మీరు సేనల నడుమ భీకరమైన యుద్ధం జరిగిందని రాశారు. పర్షియన్ రచయితల ప్రకారం యుద్ధంలో విజేతలు లేరు. ఇద్దరూ యుద్ధ విరమణ సంధి చేసుకున్నారు. సర్‍హింద్ నుంచి కశ్మీరు నడుమ ఉన్న ప్రాంతాలపై శహబుద్దీన్ ఇష్టం వచ్చినట్లు రాజ్యం చేసుకోవచ్చని ఫిరోజ్ తుగ్లక్ ఒప్పందం చేసుకున్నాడని పర్షియన్ రచయితలు రాశారు. ఫిరోజ్ ఇద్దరు కూతుళ్ళను శహబుద్దీన్, అతని సోదరుడు కుతుబుద్దీన్‍లకు ఇచ్చి వివాహం చేశాడు. శహబుద్దీన్ కూతురు ఫిరోజ్ తుగ్లక్ భార్య అయింది. ఇద్దరూ సుల్తానులే అవటంతో పర్షియన్ రచయితలకు ఇద్దరి గొప్పతనాన్ని ప్రదర్శించటంలో కానీ, పొగడటంలో కానీ ఎలాంటి సమస్య రాలేదు. సమస్య శహబుద్దీన్ అప్సరస లాంటి అమ్మాయిని చూసి మోహించటంతో వచ్చింది. జోనరాజు వర్ణించిన ఈ సంఘటనను పర్షియన్ రచయితలు కానీ, కశ్మీరు చరిత్ర రచయితలు కానీ ప్రస్తావించలేదు.
అప్సరస లాంటి అమ్మాయి గురించి విన్న సుల్తాన్ ఆమె పొందు కోసం తపించాడు. తన వెంట ఉన్న వారి కన్ను గప్పి ఒంటరిగా, ఆమె ఉండే దేశంలో అడుగుపెట్టాడు. రెండవ మదనుడిలా ఆమెను తన చాతుర్యంతో మెప్పించాడు. ఆమె పెదిమిల నుండి అమృతాన్ని గ్రోలాడు. తన హృదయపు తృష్ణను తీర్చుకున్నాడు.
సైనికులు తమ సుల్తాన్ కనబడకపోయేసరికి కంగారు పడ్డారు. శత్రువు తమ సుల్తాన్‍ను మాయోపాయంతో చంపేసి ఉంటారని నమ్మారు. కోపంలో విచక్షణను మరచిపోయారు. ఆవేశంగా తమ సుల్తాన్ కోసం వెతకటం ఆరంభించారు. ఓ ఇంటి ముందు సుల్తాన్ గుర్రం కట్టేసి ఉండటం చూశారు. వారి ఆవేశం హద్దులు దాటింది. శత్రువు తమ సుల్తాన్‌ను చంపి ఇంటి ముందు గుర్రాన్ని కట్టేసుకున్నాడని భావించారు. ఆ ఇంటిని చుట్టుముట్టారు. కానీ ఇంట్లోంచి వారికి సింహగర్జన లాంటి స్వరం వినిపించింది. వారి ఆవేశం కరిగిపోయింది. భయం పటాపంచలయింది. తమ సుల్తాన్‌ను వారు కనుగొన్నారు. గౌరవంతో శిరసులు వంచారు.
శత్రువులను నిర్జించిన రాజ్యాలలో సుల్తాన్ శహబుద్దీన్ విజయ స్తంభాలు నెలకొల్పాడు. తన బలంతో బలిపశువులను బలి ఇచ్చినట్టు బలి ఇచ్చిన శహబుద్దీన్ విజయ స్తంభాలు నెలకొల్పాడు. కశ్మీరుకు దిగ్విజయంగా తిరిగి వచ్చిన తరువాత శహబుద్దీన్ మళ్ళీ పెద్ద ఎత్తున జైత్రయాత్రలు చేపట్టలేదు. ఈ సందర్భంగా జోనరాజు గమనార్హమైన శ్లోకం రాశాడు.
కశ్మీరు దేశ అంతర్గత వ్యవహారాల విషయంలో సుల్తాన్ కోటభట్ట, ఉదయశ్రీ వంటి మంత్రులపై ఆధారపడ్డాడు. యుద్ధ సందర్భాలలో చంద్ర, డామర, లోల వంటి వారిపై ఆధారపడ్డాడు. దేశవర్మ వంశంలో చంద్రుడి వంటి వాడు కోటశర్మ. ఈయన వైరాగ్య భావనతో సుల్తాన్ తనకు ఇచ్చిన ఐశ్వర్యాన్ని త్యజించి తపస్సుకై అరణ్యానికి వెళ్ళిపోయాడు.
సాధారణంగా సుల్తానుల పాలనలో అధికారం కోసం కుట్రలు, కుతంత్రాలు జరగటం స్వాభావికం. అందుకే సుల్తాన్ దీర్ఘకాలం జైత్రయాత్రలకు వెళ్ళే సందర్భాలలో రాజ్యాన్ని తనకు విధేయుడయి, నిజాయితీ కలవారికి అప్పగించి వెళ్ళేవాడు. అధికారంపై ఆశ లేకుండా వీరు సుల్తాన్ తిరిగి వచ్చేవరకూ రాజ్య పాలన కార్యం నిర్వహించేవారు. సుల్తాన్ సింహాసనాన్ని రక్షించేవారు. ఇలా సుల్తాన్ శహబుద్దీన్ నమ్మినబంట్లు లాంటి వారందరూ ఇస్లామేతరులే.
Although Kashmir had been under Muslim kings for over 30 years now, it appears that there was no religious intolerance exhibited on the part of the people or of the Kings. Most of the Shihab-ud-din’s army commanders,ministers and other officials were Hindus. ( Cultural and Political History of Kashmir by Bamzai)
చరిత్ర రచయితల అంచనాల ప్రకారం ఆ కాలానికి ఇంకా కశ్మీరం లోని ఇస్లామీయులలో మత చాందస భావాలు ఉన్మాదం స్థాయికి చేరలేదు. అందుకని సుల్తాన్ శహబుద్దీన్ నమ్మినబంట్లందరూ ఇస్లామేతరులే.
‘షాహమీర్’ కాలం నుంచీ కశ్మీరులోకి ఇస్లామీయుల ప్రవేశం వేగవంతమయింది. ‘షాహమీర్’ సుల్తాన్ అయిన తరువాత కూడా కశ్మీరు పాలనా విధానాన్ని ఇస్లామ్‍మయం చేయలేదు. కీలకమైన పదవులలో కశ్మీరీ పండితులు కొనసాగారు. షాహమీర్ పాలనా కాలంలో ఇస్లామీయుల సంఖ్య కశ్మీరులో తక్కువ. కాబట్టి ఇస్లామేతరులకు ఆగ్రహం కలిగినా, వారు అభద్రతా భావానికి గురయినా తనకి ముప్పు అని షాహమీర్‌కు తెలుసు. అందుకని ఆయన కశ్మీరీయులను మచ్చిక చేసుకున్నాడు. రాజు తమతో సవ్యంగా వ్యవహరించి, ఆదరిస్తున్నాడు కాబట్టి, సుల్తాన్ మెప్పు పొందేందుకు కీలకమైన స్థానాలలో ఉన్న పండితులు కశ్మీరుకు వస్తున్న ఇస్లామీ పండితులకు, మత ప్రచారకులకు రెండు చేతులా ఆహ్వానం పలికారు. ఇలా కశ్మీరులో సయ్యద్‍లు కూడా అడుగుపెట్టారు. ఖురాసన్, టర్కీతో సహా పలు ఇస్లామీ దేశాల నుండి ఇస్లామీయులు కశ్మీరు వచ్చి చేరారు. ఇలా విదేశాల నుండి వచ్చిన వారికి కశ్మీరీ పద్ధతులు తెలియవు. దాంతో కశ్మీరీలకు వీరికి నడుమ ఘర్షణలు ఆరంభమయ్యాయి. హింస, క్రౌర్యం కశ్మీరు జీవన విధానంలో వచ్చి చేరాయి.
ఈ సమయంలో టర్కీ, పర్షియా వంటి ప్రాంతాలు తైమూర్ దాడులతో సతమతమయ్యేవి. అక్కడ ఉంటున్న సయ్యద్‍లకు కశ్మీరులో భద్రత లభించింది. వారికి ప్రభుత్వ రక్షణ లభించిది కశ్మీరులో. ‘మహమ్మద్ దీన్ ఫౌక్’ రాసిన ‘హిస్టరీ ఆఫ్ కశ్మీర్’ ప్రకారం సయ్యద్ మీర్ అలీ తన సోదరులు సయ్యద్ మసూద్, సయ్యద్ యూసుఫ్ లను కశ్మీరులో సయ్యద్ లకు రక్షణ ఉంటుందేమో తెలుసుకునేందుకు పంపాడు. ఎందుకంటే సయ్యద్ లను సమూలంగా నిర్మూలించేందుకు కంకణం కట్టుకుని తైమూర్ పర్షియా, టర్కీలపై దాడులు చేస్తున్నాడు. సయ్యద్ తాజుద్దీన్‍తో కలిసి వీరు కశ్మీరు వచ్చారు. కశ్మీరులో పరిస్థితులు గమనించారు. కశ్మీరులో రాజకీయపరంగా లబ్ధి పొందాలంటే మతాన్ని ఆయుధంగా ఉపయోగించాలని గ్రహించారు. సంఖ్యాపరంగా అల్ప సంఖ్యలో ఉన్న ఇస్లామీయులు, సంఖ్యను పెంచుకుని అధిక సంఖ్యాకులు కాకపోతే ఏనాడయినా ఇస్లాం రాజ్యం ప్రమాదంలో పడుతుందని గ్రహించారు. ఇస్లాం మత ప్రచారం విస్తృతంగా చేశారు. తరువాత కాలంలో ఇస్లామీయులు సంఖ్య పెంచుకునే పనిలోనే ఉన్నారు. వారి సంఖ్య తక్కువ కావటంతో మత సూత్రాలు అమలు పరచమన్న ఒత్తిడికి శహబుద్దీన్ గురి కాలేదు. అందుకే అతని కాలంలో ఇస్లామేతరులు రాజ్యంలో కీలకమైన పదవుల్లో ఉన్నారు. సుల్తాన్ వారిపై ఆధారపడ్డాడు.
సుల్తాన్ శక్తిని ప్రదర్శించేటందుకన్నట్టు కశ్మీరాన్ని వరదలు ముంచెత్తాయి. ప్రజలు అనేక కష్టాలు పడ్డారు. నగరాలను, వృక్ష తతులను నీరు ముంచెత్తింది. నగరం మొత్తం నీటితో నిండిపోయింది. భవనాలు నీళ్ళల్లో మునిగి పోయాయి. అయినా వరదలు తగ్గలేదు. ముంచెత్తుతున్న నీటిని చూసి పర్వతాలు కన్నీరు కారుస్తున్నట్టు పర్వతాలపై నుండి జలపాతాలు జాలువారాయి. ఒక చెట్టు లేదు, ఒక సరిహద్దు లేదు, ఒక వంతెన లేదు, ఒక ఇల్లు లేదు, నీటి దారిలో ఉన్న వాటన్నిటినీ నాశనం చేస్తూ నీటి మట్టం పెరిగిపోయింది. ఎప్పుడూ ఎవరి నుంచీ ప్రాణాలు అరచేత పెట్టుకొని ఆశ్రయం తీసుకోని సుల్తాన్, పర్వతాల లోని కోటలలో తలదాచు కోవాల్సి వచ్చింది. రాజు శక్తి వల్ల తగ్గినట్టు, కొన్ని రోజులలో నీరు తగ్గిపోయింది. కానీ రాజు ఒక సురక్షితమైన పట్టణాన్ని పర్వతాలపై నిర్మించాలని నిశ్చయించాడు.
రాణి, లక్ష్మిని సంప్రదించి తన గొప్ప పేరుకు తగ్గ నగరాన్ని, శాహబుద్దీన్ పుర (ప్రస్తుతం శాబిపూర్)ను నిర్మించాడు. హిమాలయాల పాదాల వద్ద శారిక నగరాన్ని నిర్మించాడు. అలకా లాంటి ఉత్తములు నివసించే సుమేరు నగరం లాంటి నగరం అది. వితస్త, సింధు నదుల సంగమం వద్ద ‘శహబుద్దీన్ పుర’ను నిర్మించాడు. నగరం వితస్త నీటిలో ప్రతిఫలించింది. అది సిగ్గుతో నీటిలో దాక్కున్నట్లనిపించింది. ‘హరిపర్బత్’ దగ్గర తన భార్య లక్ష్మి పేరిట ఓ నగరం నిర్మించాడు. సైనికుల నివాస భవనాలు నిర్మించాడు. లోల డామర కూడా తన పేరుపై ఓ నగరం నిర్మించాడు. ఆ హార్మ్యాలు అతడి ఖ్యాతిలా అనిపించేవి. నిత్య చంచలమైన ప్రపంచం పర్వతాల రూపంలో పైకి ఎగబ్రాకుతున్నట్టు అనిపించేది. అవి స్వర్గాన్ని తాకాలని తపన పడుతున్నట్లుండేవి. ఈ పర్వతాల నీడలు నగరాలపై పడి నగరాలకు సూర్యరశ్మి అందకుండా చేసేవి.
రాణి లక్ష్మి సోదరి కూతురు లాసా. ఆమెను పెంచి పెద్ద చేసింది రాణి లక్ష్మి. కానీ, ఇప్పుడు సుల్తాన్ హృదయమనే అద్దంలో లాసా రూపం ప్రతిబింబించసాగింది. లక్ష్మి మీద గౌరవంతో సుల్తాన్ మనసుకు పగ్గాలు వేసి బంధించాడు. కానీ లాసా సౌందర్యం వల్ల కలిగిన మోహావేశపు పాశాలలో చిక్కుకున్న రాజు మనసు పగ్గాలు తెగిపోయాయి. అదృష్ట దేవత, కృష్ణుడి విగ్రహంతో కలిసి రాజు మనస్సులో నివాసం ఏర్పరుచుకున్నాయి. ఇప్పుడు లాసాకు కూడా దేవత సరసన రాజు హృదయంలో స్థానం లభించింది.
(ఇంకా ఉంది)