యువభారతి వారి ‘చేమకూర కవితా వైభవం’ – పరిచయం

0
4

[తెలుగు సాహిత్యం పట్ల కొన్ని తరాలలో ఆసక్తి రగిలించి, ఆధునిక తరానికి వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్తూ, యువతకు ఉత్తమ సాహిత్యం ద్వారాఉత్తమ వ్యక్తిత్వాన్నివ్వాలని నిరంతరం తపించే యువభారతి సంస్థ స్థాపించి వచ్చే దసరాకు 60 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు సాహిత్యానికి, సమాజానికి యువభారతి చేసిన సేవను తెలుగు పాఠకులకు పరిచయం చేసే ఉద్దేశంతో ప్రతి ఆదివారం సంచికలో యువభారతి ప్రచురించిన పుస్తకాల పరిచయం వుంటుంది. ఈ శీర్షిక వచ్చే సంవత్సరం విజయదశమి వరకూ సాగుతుంది.]

చేమకూర కవితా వైభవం

[dropcap]క్రీ[/dropcap]స్తు శకం పదునేడవ శతాబ్దంలో వలిసిన కావ్యకర్తలలో చేమకూర వేంకట కవి తలమానికం వంటి వాడు. ఈయన రాసిన విజయవిలాసం, సారంగధర చరిత్ర అనే, రెండు కావ్యాలలో, మొదటిదానికి బహుళ ప్రాచుర్యం, ప్రశస్తి, లభించినవి. సారంగధర చరిత్ర కూడా మంచి కావ్యాల్లో చేరినప్పటికీ, అనేక కారణాల చేత దానికి రావలసినంత పరిగణన రాలేదు.

చేమకూర వేంకట కవి రచనా సౌందర్యాన్ని ఆరాధించిన కవి. ప్రతి పద్య చమత్కృతికి ప్రసిద్ధి వహించిన విలక్షణ ప్రబంధ కర్త. శబ్దాలంకారాలనూ, అర్ధాలంకారాలనూ సార్థకంగా వాడడం, లసదావులో ఉన్న శ్లేషను తెలుగు పలుకుబడులలో కొత్త సొంపులతో సంతరించడం ఆయన కవిత్వంలో సాధించిన ప్రత్యేక గుణాలు. మాటల వొడుపులో, మాటల విరుపులలో, మాటల కదుపులో చూపించే చమత్కారాలు ప్రతి పద్య ప్రత్యక్షాలు. అందువల్లనే చేమకూర వారిదొక ప్రత్యేక మార్గం అయింది.

విద్యానగర సభా ప్రాంగణంలో మంజుల మంజీర ధ్వనుల నాట్యమాడి, కాలవశాన నిలిచిపోయిన ఆంధ్ర కవితా శారద, కొంతకాలానికి, తంజాపురి విజయభవన సభాసదనంలో అందచందాలతో అవతరించింది. కృష్ణదేవరాయలే తిరిగి రూపుగొన్నాడా అన్నట్లు ఉన్న రఘునాథ భూపాలుడు, అల్లసాని పెద్దన అచ్చున వచ్చినట్లుండే చేమకూర వేంకట రాజు, భువనవిజయమే పునర్నిర్మితమైనదా అనిపించే విజయభవనం తెలుగు సరస్వతితో బాటు తంజాపుర సీమలో తిరిగి సమకూడినాయి. దాని ఫలితంగానే వెలువడింది శృంగార రస ప్రధానమైన, అందమైన, అమరకావ్యం – విజయవిలాసం. ఆ అమరకావ్యం నుండి ఎంపిక చేసిన పద్యాలకు డా. ఎం కులశేఖర రావు గారి సుమధుర సరళ వ్యాఖ్యానం – ఈ పుస్తకం.

ఏ పద్యంలో చూసినా, ఏదో ఒక చమత్కృతి ఏదో ఒక అలంకారం, ఏదో భిన్నమైన శబ్ద విన్యాసం – చదివినవారికే అనుభవైకవేద్యం.

క్రింద ఇవ్వబడిన link ను క్లిక్ చేసి ఈ పుస్తకాన్ని ఉచితంగానే చదువుకోండి.

https://archive.org/details/YuvaBharathi/%E0%B0%9A%E0%B1%87%E0%B0%AE%E0%B0%95%E0%B1%82%E0%B0%B0%20%E0%B0%95%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A4%E0%B0%BE%20%E0%B0%B5%E0%B1%88%E0%B0%AD%E0%B0%B5%E0%B0%82/

లేదా క్రింద ఇవ్వబడిన QR code ను scan చేసినా ఆ పుస్తకాన్ని ఉచితంగా చదువుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here