[dropcap]మం[/dropcap]చులో తడిసిన మల్లెలు పంచే మమతానురాగాలు..
సూర్యోదయాల నులివెచ్చని కౌగిళ్ళ కమ్మదనాలలో
కరిగి ముద్దవుతూ మురిపించే పారిజాత పుష్పాల సుగంధాల
సుమహాసాల ఆనందోత్సవాలు..
సాయంత్ర సంధ్యలలో ముగ్ధ మనోహరంగా విరిసి
అందాలెన్నో ఆత్మీయంగా పరిచయం చేస్తూ
పరిమళాల సందళ్ళ శోభతో అలరించే
చేమంతుల ప్రియమైన పలకరింపుల హాయిదనాలు..
కోవెల కొలనులో వయ్యారంగా ఉయ్యాలలూగుతూ
ఆకర్షిస్తూ అందాలెన్నో నయనాల ముందు నిలుపుతూ
సువాసనల జాతరలో ఊరేగిస్తూ కలువలు పంచే
ప్రణయ మోహనాల గమ్మత్తులు..
వెన్నెలలో చల్లని గాలి స్పర్శతో పులకరించి విరబూసి గలగలా నవ్వుతూ
హర్షాలతో సౌందర్యాలు వర్షించే గులాబీలు వెదజల్లే
పుప్పొడి సౌరభాల పరిచయాల దివ్యానుభూతులు..
ఇవేవి సాటిరావు..
నా చెలి చిరునవ్వుల సరాగాల సంబరాల వేడుకల ముందు!