[dropcap]ఏ[/dropcap]మైంది?
పది రోజుల క్రితమేగా
నవ్వుతూ కనిపించి
పిల్లలను, పెద్దలను
ఒడిలో పెట్టుకుని
కాయలను కొసిరి తినిపిస్తూ
ఒద్దిగ్గా, ముచ్చటగా
ఇంటికి కాపాలలా
ప్రతి ఒక్కరి చూపులకు గొడుగుగా
పెద్దముత్తైదువులా
గూడులా నీడైన
పచ్చని కాంతుల జీవకళకు
ఇప్పడేమైంది?
పొడుగ్గా, అందంగా, బొద్దుగా ఉందని
ఎవరో అన్నారు.
ఒకడేవడో వచ్చి కొలతలని కొలుచుకున్నాడు..
బారలేసి నేలతో ఏదో మాట్లాడాడు.
ఆ మరునాడే
ఏ దిష్టి తగిలిందో.. ఏ విషం పాకిందో
ఏమి విందో.. ఏమి తిందో
ఉలుకు లేదు.. పలుకు లేదు..
చేతులు వాలి
తల ఒరిగి.. రూపు మారి
నాలుక లేని మూగజీవిని
ఏ మూఢత్వం మింగేసిందో?
కొమ్మలకో రేటు, మొదలుకో రేటు కట్టి
నీడను, పచ్చదనాన్ని కోసురుగా
వేరును సహితం విలువకట్టిన
పచ్చకాగితాల కాటుకు
ఇరవై ఏళ్ళ గుండె చప్పుడు ఆరిపోయింది
కళ కళ లాడిన ఆకులు
గాలికి గలగలమని దూరమై
ఆటలకు దర్జాగా నిలచిన కొమ్మలు
నడుములిరిగి వంట చెరుకలయ్యాయి
చెట్టు కళేబరంపై డబ్బు లుకలుకలతో
పచ్చదనం సమాధిగా
ఖాళీ స్థలం కన్నీటి మడుగయింది.